Tuesday, December 8, 2020

ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలి?

      నిర్భయ చట్టం వచ్చింది. దిశ చట్టం వచ్చింది. స్త్రీలపై అకృత్యాలు ఆగిపోయాయా? నిర్భయ ఘటన లో నేరస్తులకు ఉరి శిక్షలు విధించారు. దిశకు జరిగిన అన్యాయానికి పోలీసులే ఎన్కౌంటర్ చేసి దోషుల్ని హతమార్చారు. అయినా భయపడుతున్నారా? లేదే! ఏం చేస్తే ఈ దారుణకాండలకు అడ్డుకట్ట పడుతుంది? ఇదిలా ఉంచితే -- ఇటీవల జరిగిన అమానవీయ అకృత్యం ఒళ్ళు జలదరించేలా చేసేసిందందర్నీ !

   నవంబరు14, శనివారం. దీపావళి పర్వదినం. జనమంతా సంబరాల్లో మునిగితేలుతున్న శుభ ఘడియల్లో జరిగిన హీనాతి హీనమైన దుస్సంఘటన! ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ కు సమీపాన ఘటంపూర్ అనే చోట--- ఓ ఏడేళ్ల బాలిక హత్యకు గురయింది. దాని పూర్వాపరాలు --- పరశురాం, సునయన దంపతులకు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం పెళ్లి అయిందట. కానీ సంతానం లేదు. ఓ బాలిక గుండె, కాలేయం తింటే పిల్లలు పుడతారని ఓ తాంత్రికుడు చెప్తే ఆ పని కోసం 20 సంవత్సరాల వయస్సున్న వాళ్ళ బంధువుల అబ్బాయిని కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చి పురమాయించారట ! అతను మరో స్నేహితున్ని  ( 30 సంవత్సరాలు ) తోడు తీసుకుని ఏడు సంవత్సరాల వయసున్న ఆ దంపతుల పక్కింటి పాపను చాక్లెట్ల ఆశ చూపించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, ఇద్దరూ కలిసి కత్తితో గొంతు కోసి చంపేసారట ! దానికి ముందు ఆ నీచులు ఆ పసి దానిపై అత్యాచారం కూడా చేశారట! ఆ తర్వాత అవయవాలు కత్తితో పెకలించి, గుండె, కాలేయం పాలితిన్ కవర్లలో ఉంచి, మిగతా వాటిని అక్కడే పొలంలో కుక్కల కోసం విసిరేశారంట ! ఈ దారుణ కృత్యానికి ముందు అక్కడున్నఓ కాళీ మందిరం వద్ద తాంత్రిక పూజలు నిర్వహించారని వార్త ! అటు పిమ్మట గుండె, కాలేయం ఆ దంపతులకిస్తే వాళ్లు తిన్నారట ! 

    ఎంత హేయమైన చర్య! అసలు మనుషులా వీళ్ళు? ప్రతిరోజు తమ ఇంటి ముందు అమాయకంగా ఆట్లాడుకునే ఓ పసిపిల్లను హతమార్చడానికి వీళ్ళ మనసెలా ఒప్పింది? అలా చేసి సంతానం పొందితే రేపు ఆ పిల్లకు ఇదే గతి పడ్తే.... అన్న ఆలోచన ఆ అధములకు తట్టలేదా? వాళ్లు చెప్తే మాత్రం -- ఏమాత్రం సంకోచించక సమ్మతించారంటే -- ఎలాంటి కిరాతకులు వాళ్ళు ! ఎటువంటి చోట పుట్టి, ఎలాంటి వాతావరణంలో పెరిగి ఇలా తయారయ్యి ఉంటారు! 

  ఈ దుష్ట కార్యానికి నాంది పలికిన అతన్ని, అవయవాలు తిన్న వారిని, హంతకులు ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారట. ఎందుకు? ఏళ్లకు ఏళ్లే పడుతుంది విచారణకు!

   ఇలాంటి హంతకులు ఒకటి ఆలోచించాలి. ఈ దుస్థితి తమ ఇంట్లో తమ తల్లికీ, చెల్లికి, భార్యకు ఇంకా కూతురికీ వస్తే తమ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న తమకు తాము వేసుకుంటే కాస్తయినా వెనుకాడుతారేమో? అయినా మన పిచ్చి గానీ -- అంతటి విజ్ఞత, విలువలతో కూడిన జీవనశైలి వాళ్లకు ఉంటే ఇంతటి ఘోరాలు ఎందుకు జరుగుతాయి? 

  ఇంతకీ--- ఇలాంటి నరాధములకు ఎలాంటి శిక్షలు వేయాలి? ఏం చేస్తే ఆ తల్లిదండ్రుల కడుపుకోత, బాధ తీరుతాయి? 

*************************************************

                    🌷భువి భావనలు 🌷

*************************************************      

     

 

3 comments:

  1. e matladalo artham kaledu ilanti vallu inka samajam lo chala mandi unnaru

    ReplyDelete
  2. ఇలాంటి ఘటనలు మూఢనమ్మకాలకు పరాకాష్ట అనవచ్చు.

    ReplyDelete