Friday, August 14, 2020

కరోనా వచ్చింది... కాలం మారింది....

    నిజంగా కాలమెంతగా మారిపోయింది ! అనూహ్యంగా ఇలాంటి పరిస్థితి ఎదురయిందేమిటి?  ఔరా ! కరోనా !ఎంతపని చేసేసింది ! ఈ మహమ్మారి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రంగాన్నీ కుదిపేసి వ్యవస్థ నంతటినీ అతలాకుతలం చేసి పారేసింది. నిజమే కదా, కలలోనైనా ఏనాడైనా ఊహించామా, అడుగు బయట పెడితే చాలు ఇలా మాస్క్ తగిలించుకోవాల్సివస్తుందని!దూరదూరంగా ఉండి పోవాల్సొస్తుందని !అనుక్షణం భయంభయంగా కాలం వెళ్లదీయాల్సొస్తుందని !
   దీనివల్ల అనూహ్యమైన మార్పులుసంతరించుకున్న వాటిల్లో విద్యా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఎన్నడైనా ఇలా జరిగిందా, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరపకుండానే ప్రతీ విద్యార్థినీ పాస్ చేసేసి పై తరగతికి ప్రమోట్ చేసేయడమన్నది !ఇదీ కరోనా మహిమ! అదలా ఉంటే ప్రస్తుతం అన్ని స్థాయిలలోనూ ఆన్లైన్ విద్య ప్రవేశపెట్టడం! పాఠశాలలూ, కళాశాలలూ తెరవకపోవడం! నామమాత్రంగా తెరచినా బోధనా సిబ్బంది వంతుల వారీగా హాజరవడం! ఇదంతా విద్యావ్యవస్థకు అశనిపాతం లాంటిదే మరి ! ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం చెప్తేనే అది సరైన బోధన అనిపించుకుంటుంది. అలా ముఖాముఖీ బోధించినా అర్థం చేసుకోలేని విద్యార్థులుండే పరిస్థితి! పదే పదే చెప్పినా విషయం బుర్రకెక్కని మంద బుద్దులూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఆన్లైన్ పాఠాలు ఎంతవరకు ఉపయోగపడతాయో అంచనా వేయలేము. అదీ రోజులో కొద్దిసేపే. తల్లిదండ్రులకు పిల్లలను స్థిరంగా కూర్చోబెట్టడం కత్తి మీద సామే! విద్యావంతులైన వారు పిల్లలకు కాస్తో కూస్తో పాఠాలు విశదీకరించగలరు. వాళ్లలో కూడా అన్ని సబ్జెక్టులపై ప్రావీణ్యం ఉంటుందా, అంటే అనుమానమే! పైగా" పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదనట్లు" ఇంట్లో అమ్మ నాన్నల మాటవిని నేర్చుకునే వాళ్ళు ఎందరు ఉంటారు? 
   పైగా దీనికోసం ప్రతీ విద్యార్థికీ స్మార్ట్ ఫోన్ తప్పనిసరి! మునుపు చూడొద్దన్న వాళ్లే ఇప్పుడు తప్పదంటున్నారు మరి ! అది ఎక్కువ సేపు వాడితే కళ్ళకు మంచిది కాదనీ దాని బదులు లాప్టాప్ వాడితే మంచిదనీ మరోపక్క చెబుతున్నారు. కానీ ఇవి ఎందరికి అందుబాటులో ఉండగలవు! అదీ ప్రశ్నే !
   ఏది ప్రవేశపెట్టినా ప్లస్ లూ, మైనస్ లు తప్పనిసరిగా ఉంటాయి. ఈ పరిస్థితి చూస్తోంటే దాదాపు ముప్ఫై సంవత్సరాల క్రితం విద్యాశాఖ ప్రవేశపెట్టి అమలుపరచాలనుకున్న ఓ పథకంగుర్తొస్తోంది. అప్పట్లో కొన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్ని ఎంపిక చేసుకుని వాటికిTV, VCP ఇచ్చారు. విద్యార్థుల్ని TV ఉండే గదిలో కూర్చోబెట్టి, అప్పుడు నిర్దేశించబడ్డ ఓ సమయంలో వచ్చే పాఠ్యాంశ బోధన వీడియోల్ని చూపించేవారు. ఇదేమిటో అన్న ఆసక్తితో పిల్లలు రెండు నిమిషాలపాటు చూశాక ఇక అంతే! అందరూ చూడడం మానేసి మాటలు, అల్లరీ ! అయినా, TV లో సినిమాలు, సినిమా పాటలు, ఇంకా సీరియల్సు చూడమంటే గుడ్లప్పగించీ, చెవులు రిక్కించీ చూస్తారు గానీ, పాఠాలు విన మంటే వింటారుటండీ ! అనుకునేవాళ్లంతా ! అనుకున్నట్లే ఈ పథకం కాస్తా నీరుగారిపోయి కొద్దికాలానికే ప్రభుత్వ ఆదేశాల మేరకుటీవీలు, vcp లు తిరిగి మండల కార్యాలయాల్లో అప్పగించేయడం జరిగింది. పైగా ఆ ఉపకరణాల బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యులపైనే ఉంటంవల్ల శెలవు దినాల్లో వాటి సంరక్షణ బాధ్యత, దొంగల బారినుండి వాటిని కాపాడుకోవడం లాంటి సమస్యలతో పాటు మరికొన్ని చిన్ని చిన్ని చిరు చేదు అనుభవాలు కూడా వాళ్ళ ఖాతాల్లో ఉన్నాయంటే నమ్మాలి మరి !ఇదంతా విమర్శించే ధోరణి లో చెప్పడం లేదు, కొన్నింటి అమలు లో ఆచరణకు సంబంధించి సమస్యలు  (practical problems) ఎదురవుతాయని చెప్పడమే నా ఉద్దేశ్యం. 
   వీటిల్లో TV బోధన అన్నది ప్రయోగాత్మకం. Online బోధన అన్నది అనివార్యం. వీటిని ఒకదాంతో మరొక దాన్ని పోల్చడం కూడా సరికాదు. పైగా, ప్రభుత్వం కూడా ఎంతో ఆలోచించి, ఎందర్నో సంప్రదించి ఈ విధానం 




. ఎందుకంటే ముందు మనుషుల ప్రాణం, ఆరోగ్యం, క్షేమం ముఖ్యం!ఆ తర్వాతే చదువులూ, ఇంకా ఏవైనాగానీ. 
ఏదిఏమైనా, పరిస్థితుల కనుగుణంగా మార్పును స్వాగతించాల్సిందే. 
   ఈ ప్రయత్నం విజయవంతం కావాలని మనసారా కోరుకుందాం !అలాగే వచ్చే విద్యాసంవత్సరమన్నా విద్యార్థులతో, ఉపాధ్యాయులతో కళకళలాడుతూ మునుపటి వైభవం సంతరించుకుంటుందని ఆశిద్దాం!అలాగే కరోనా మహమ్మారి కూడా అంతరించిపోయి మళ్ళీ జనజీవనం 'నార్మల్ 'అయిపోవాలనీ ప్రతీ ఒక్కరం ప్రార్థిద్దాం !
   ఇప్పటికే కరోనాకు వ్యాక్సిన్ సిద్ధమైనదని మూడ్రోజుల క్రితం రష్యా ప్రకటించేసింది. ఇంకా మిగతా దేశాల నుండీ ఈ తీయని కబురు కోసం చూద్దాం !

1 comment:

  1. Let’s hope healthy world and safe world.Today I really miss the teacher’s day.

    ReplyDelete