అలనాటి ' ఆకాశవాణి ' జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటున్నకొద్దీ నిధిలోంచి బయట పడుతున్న వజ్ర వైడూర్యాల్లాగా ఎన్నెన్నో మరపురాని కార్యక్రమాలు ముందుకొచ్చి నిలుస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఈరోజు నేను ప్రస్తావించదలచుకున్న అంశం ఆ తరం వాళ్ళలో ఎంతోమందికి సుపరిచితమైన ఉదయం పూట ఓ కార్యక్రమానికి ముందుగా వచ్చే ఓ సుమధురమైన శ్లోకం! అది ' సంస్కృత పాఠం ' అన్న ఓ కార్యక్రమం. కార్యక్రమం ప్రారంభంలో ఈ శ్లోకం రేడియో ఉన్న ప్రతీ ఇంట్లో ప్రతిధ్వనించేది. దీని గురించి ఎందరో ఎన్ని సార్లో ప్రస్తావిస్తూ వారి అభిప్రాయాలు, జ్ఞాపకాలు వ్యక్తపరచినా ఎప్పటికప్పుడు కొత్త దనాన్ని సంతరించుకొని సరికొత్తగానే దర్శనమిస్తుంది. అంతటి గొప్పతనం సొంతం చేసుకున్న గణనీయమైన శ్లోకమిది. కాలాలతో ఏమాత్రం నిమిత్తం లేక అన్ని తరాలకూ చక్కటి సందేశాన్నిచ్చే సుభాషితాన్ని ఇముడ్చుకున్న ఆ శ్లోకం ----
కేయూరా న విభూషయంతి పురుషం
హారా న చంద్రోజ్జ్వలా :
న స్నానం న విలేపనం న కుసుమం
నా లంకృతా మూర్ధజా :
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా
సంస్కృతాధార్యతే
క్షీయంతే ఖలు భూషణాని సతతం
వాగ్భూషణం భూషణం ||
రాగయుక్తంగానూ, మరింత భావయుక్తంగానూ సాగిపోయే ఈ శ్లోకం కొందరు గాయనీగాయకులు కలిసి మాధుర్యం ఉట్టిపడేలా ఆలపించారు. ఏమాత్రం సంగీతాసక్తి లేనివారిని సైతం ఓ క్షణం అలా నిలువరించేలా చేసే ఈ వీనుల విందైన శ్లోకపఠనం ఆరోజుల్లో నన్నెంతగానో ఆకర్షించేది. అప్పట్లో దీని భావమైతే అవగతమయ్యేది కాదు గానీ చివరి రెండు పదాలు ఇట్టే హత్తుకుపోయేవి. అవే ' వాగ్భూషణం భూషణం '
పదే పదే వినడం మూలాన ఆ రాగమైతే సుపరిచితమయిపోయింది గానీ శ్లోకంలో మిగతా పదాలు గుర్తు ఉండేవి కావు. చాలా సంవత్సరాల తర్వాత అందుకోసమై ప్రయత్నించి నాలుగైదు చోట్ల ఆ శ్లోకం చూడగలిగాను. కానీ కొన్ని పదాలు, ఇంకా ఒత్తులు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉండి ఏది తప్పో ఏది ఒప్పో తెలియని పరిస్థితి! చివరకు ఓ చోట శ్లోకం కింద ప్రతి పదార్థం ఇవ్వడంతో తృప్తి జెంది, అదే సరైనదని తలచి రాయడం మొదలెట్టాను. ఇది భర్తృహరి ' నీతి శతకం' సుభాషితాల్లోనిది.
భుజకీర్తులు, చంద్రహారాలు, మణిపూసలు లాంటి ఆభరణాలు, పన్నీటి స్నానాలు, చందన లేపనాలు, పుష్పాలు, నిగారింపుతో కూడిన కేశాలు--- ఇవేవీ మనిషిని( వ్యక్తిని ) అలంకరించలేవు. ఎందుకంటే ఆభరణాలు శోభను కోల్పోతాయి, పూలు వాడిపోతాయి. కానీ చెక్కుచెదరక ఎప్పుడూ మనతో ఉండే చక్కటి సంస్కారంతో కూడిన మాటలే మనిషికి నిజమైన ఆభరణాలు! అలంకారాలు !
ఇదీ శ్లోకం సారాంశం. మాట తీరే మనిషికి అలంకారమన్న మహత్తర సందేశాన్ని అందించే విలక్షణమైన శ్లోకం.
ఇంతకీ, మాట తీరు అంటే ఏమిటి? ఎలా ఉండాలి?
మాట్లాడటం ఓ కళ! మృదుమధురంగా ఎదుటివారినీ, వినేవాళ్ళనీ ఆకట్టుకునేలా మాట్లాడటమన్నది మనిషికి చాలా అవసరం. కొట్టినట్టుగా, పుల్ల విరిచినట్లుగా మాట్లాడడం అభిలషణీయం కాదు. కొందరు ఆధిపత్య ధోరణిలో తీవ్రస్థాయిలో మాట్లాడుతూ' నా మాట తీరే ఇంత ' అంటుంటారు. మరికొందరు' నేను కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతా ' అంటుంటారు. మనం మాట్లాడే తీరే మనకు మిత్రుల్ని, శత్రువుల్నీ తెచ్చిపెడుతుంది. ఆ తీరే కొన్ని సందర్భాల్లో మిత్రుల్ని శత్రువులుగా మార్చే ప్రమాదమూ లేకపోలేదు.
మనతో ఎదుటివారు ఏ విధంగా మాట్లాడితే బాధ పడతామో అలాగే ఏ విధంగా మాట్లాడితే సంతోష పడతామో మనం గుర్తించగలిగితే చాలు-- సున్నితంగా, సంస్కారయుతంగా మాట్లాడే పద్ధతి ఎలా ఉండాలో స్వయానా మనకే అవగతమవుతుంది. సున్నితంగా చెప్పే మాటలు మొండి వైఖరి గల వారిలోనూ మార్పుతేగలవు. తీవ్రంగా మందలించడం, కటువుగా మాట్లాడటం వల్ల పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం ఉంటుంది. ఆభరణం లాంటి వాక్కు యొక్క ప్రాధాన్యత అందరం గుర్తించడం చాలా అవసరం.
ఈ సందర్భంగా ఓ చిన్న పిట్ట కథ చెప్పాలనిపిస్తోంది. అందరికీ తెలిసిందే.
ఒకాయన తన స్వగ్రామం వదిలి మరో ఊరిలో స్థిరపడాలనుకుని ఓసారి ఆ వూరు చూద్దామని బయలుదేరాడట. ఊర్లో ప్రవేశిస్తూ ఉండగా పొలిమేరలో అతనికి ఓ పెద్దాయన ఎదురుగా వచ్చాడట. అప్పుడు ఆయన్ని ఇతను ఓ ప్రశ్న అడిగాడట.
" అయ్యా, నేనీఊరిలో ఉండాలనుకుంటున్నాను, ఈ ఊరు మంచిదేనా?.. "
దానికాయన వెంటనే,
" బాబూ, నీ నోరు మంచిదేనా? " అన్నాట్ట !
అదీ సంగతి! మన పెద్దలు ఏనాడో చెప్పారు, " నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని !"
కాబట్టి శ్లోకంలోని భావాన్ని గ్రహించి మాట తీరే మనిషికి అలంకారమని తదనుగుణంగా మనల్ని మనం సంస్కరించు కోవడం ఎంతో ఉత్తమం.
🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷
ఆకాశవాణిలో శ్రీ కేశవపంతుల నరసింహ శాస్త్రి గారు ఎంతోకాలం నిర్వహించిన సంస్కృత పాఠాలు కార్యక్రమం ఆరంభంలో వస్తుండేది ఈ శ్లోకం. చాలా వినసొంపుగా ఉండేది శ్లోకాన్ని చదివే తీరు.
ReplyDeleteచక్కటి సుభాషితాన్ని మరోసారి గుర్తు చేశారు. అలాగే పైన చివర్లో మీరు చెప్పిన పొట్టికథ కూడా చాలా అర్థవంతంగా ఉంది. ధన్యవాదాలు.
భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
ReplyDeleteభూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలు గావు,పురుషుని భూషితు జేయుఁ బవిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియుంచు నన్నియున్
కేయూరా అనే భర్తృహరి శ్లోకానికి ఏనుగులక్ష్మణకవి తెనుగుసేత పైపద్యం .
ఇప్పటికీ ఎందరికో గుర్తున్నదంటే శ్లోకం గొప్పతనం అది.శాస్త్రి గారి పేరు తెలియజేసారు సంతోషం. పొట్టి కథ నచ్చినందుకు కూడా. ధన్యవాదాలు సర్, నమస్తే
Deleteధన్యవాదాలు సర్, నమస్తే
ReplyDeleteరేడియో లో ప్రోగ్రాం ఫాలో కాకపోయినా, ఆ శ్లోకం వినేవాడినండి. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteThank you very much 👃
ReplyDelete