Wednesday, September 9, 2020

తప్పెవరిది? కన్నబిడ్డలు బలిపశువులా?..... ఓ విశ్లేషణ

    గాఢ నిద్ర నుండి ఒక్కసారిగా దిగ్గున లేచాను. ఏవేవో గట్టి గట్టిగా అరుపులు !  ఓ క్షణం తర్వాత విషయం అవగతమై నన్ను నేను సంభాళించుకున్నాను. ఇది మా పక్కింట్లో తరచుగా జరిగే బాగోతమే. అత్త మామ, భర్త, ఇద్దరు పిల్లలు, ఓ మరిది, అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి చిచ్చు రేపి పోయే ఓ ఆడపడుచు! ఇదీ ఆ కుటుంబం. ఆ ఇంటి కేంద్రబిందువు ఇంటి కోడలు వరలక్ష్మి. కేంద్ర బిందువు అంటున్నాగానీ అది పేరుకు మాత్రమే. ఆ ఇంట్లో చీపురు పుల్ల కున్నంత విలువ కూడా ఆమెకు ఉండదంటే నమ్మాలి మరి! అత్తారింట్లో అడుగుపెట్టి పదేళ్ళు గడిచినా, ఇద్దరు పిల్లల తల్లి అయినాఆ అభాగ్యురాలికి ఆవగింజంత స్థానమైనా అక్కడ దగ్గర లేదన్నది వాస్తవం. పక్కనే కాబట్టి అడపాదడపా చూస్తుంటానామెని. అసలామెకు నోట్లో నాలుకన్నది ఉందా అన్నది నా అనుమానం. 
  ఈ ఇంట్లో నేను పులిని సుమా అన్నట్లు ఎప్పుడూ గంభీరంగా, యమ సీరియస్ గా ఉండే మామగారు, గయ్యాలి తనం లో ఆరితేరిన అత్తగారు, సంపాదించి తెచ్చి పోస్తున్నానన్న అహంభావంతో భర్త గారు, వయసులో ఎంతో చిన్నవాడయినా విచక్షణ అనేది లేక వదిన మీద పెత్తనం చెలాయించే మరిది మహాశయుడు -- ఇది చాలదన్నట్లు నెలకోసారన్నా పుట్టింటిని సందర్శించి ఓ రాయి విసిరిపొయే ఆడపడుచు! వీళ్ళందరితోనెట్టుకుంటూ ఇన్నేళ్ళుగా ఆ ఇంట్లో సర్దుకుంటూ ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆ ఇల్లాలు ఎవరంటే వరలక్ష్మి. ఐదారేళ్లుగా చూస్తున్నాను, మొదట్లో అరుపులు, చీవాట్లు భరించే ఆ అమాయకురాలు రాను రాను భర్త చేతిలో దెబ్బలు కూడా భరించే స్థాయికి దిగజారిపోయింది, అదీ అందరి ముందూ. ఇంత జరుగుతున్నా ఆమె నోరువిప్పిన సందర్భాలు నేను వినలేదు. 
  తను అప్పుడప్పుడూ సాయంత్రం నేను ఇంటికి వచ్చేటప్పుడు బయట ఊడుస్తూ కనిపించేది. అప్రయత్నంగానే గమనించేదాన్ని, ఆ మొహం లో జీవం గానీ, కళ్ళల్లో కళ అన్నదిగానీ కాగడా పెట్టి వెతికినా కనబడలేదు నాకు, ఎలాగోలాఈ బ్రతుకీడవాలి అన్న భావంతప్ప. అడగాలనిపించేది కానీ ఆమె ఒంటరిగా ఉండే అవకాశం దొరికేది కాదు. ఎదురింటి గిరిజ ద్వారా ఓసారి తెలిసింది, ఆమెకు పుట్టిల్లుంది కానీ పెళ్లయిన తర్వాత ఆడపిల్ల పట్ల తమ బాధ్యత తీరిపోయిందనుకునే బాపతు వాళ్ళు. చావైనా బ్రతుకైనా అక్కడే అని సర్ది చెప్పి పంపుతారట ఆంటీ అంటూ మెల్లిగా చెప్పుకొచ్చింది గిరిజ నాతో. 
  ఇంట్లో ఆడది ఎంత చాకిరి అయినా భరిస్తుంది, తన ఇల్లు, తన సంసారం, తన వాళ్ళు అనుకుంటుంది కాబట్టి. కానీ ఇలా నరకయాతన పెట్టే మనుషులున్నప్పుడు ఎంతని, ఎంతకాలమని భరిస్తుంది? 
  ఈ మధ్య ఈ గృహహింస వరలక్ష్మికి మరీ మితిమీరిందనిపిస్తోంది. సమయం సందర్భం అన్నది లేక చాలా తరచుగా ఇలా జరుగుతోంది మరి!
                         ********
    రెండు రోజులు గడిచాయి. ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలయి ఉంటుంది. ఉన్నట్టుండి బయట హాహాకారాలు, అరుపులు, ఇంకా ఏడుపులు ! నిద్ర మత్తు వదిలించుకుని గబగబా తలుపులు తెరిచేశాను. పక్కింటి ముందు అప్పటికే చాలామంది గుమికూడి ఉన్నారు. విషయం బోధ పడేసరికి నా గుండె ఒక్కసారిగా దడదడ లాడింది. 
  వరలక్ష్మి! ఉరేసుకుంది ! అర్ధరాత్రి ఎప్పుడు జరిగిందో ఏమో! ఎవరూ గమనించ లేదట! తీరా చూస్తే.... నిర్జీవంగా! కాస్త ధైర్యం చేసి ముందుకు కదిలి చూశాను. శవాన్ని దించి తీసుకొచ్చి ఇంటిముందు పడుకోబెట్టారు. ఎనిమిదేళ్ల కొడుకు. ఆరేళ్ల పాప బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఓ మూల నిల్చుని ఉన్నారు. అమ్మ కి ఏమైందో, ఎందుకు అలా బయట పడుకోబెట్టారో కూడా అర్థం కాని వయసు వాళ్ళది! నా మనసంతా కకావికలమై పోయింది. తర్వాతి తతంగం తలుచుకుంటే..... పోలీసులు, పోస్టుమార్టంలు, -- అవతలివాళ్ళు కలగ జేసుకుంటే కేసులు, కోర్టులు! 
    అసలెందుకిలా? ఈ ఉదంతంలో తప్పెవరిది?  బాధ్యులెవరు? 
* తమ ఇంటికి వచ్చిన కోడల్ని ఇంటి మనిషిగా భావించలేని అత్తమామలా? 
* భార్య అనేది తన జీవిత భాగస్వామి అనీ, కష్టసుఖాల్లో తోడు నీడగా ఉండడానికి వచ్చిన తన మనిషనీ గుర్తించని, ఆమెను ప్రేమించి, గౌరవించడం తన ధర్మమన్న ఇంగితం ఏమాత్రం లేని భర్త అన్న వాడా? 
* లేక కూతురు ఓ నరకంలో కొట్టుమిట్టాడుతోందని తెలిసినా ఉదాసీనంగా ఉండిపోయిన తల్లిదండ్రులా? 
 ఇవన్నీ అటుంచితే--
* పరిస్థితికి తగినట్లు తనను తాను మార్చుకోలేని వరలక్ష్మి అసమర్థతా? 
 పెళ్లయి సంవత్సరం దాటిన వాళ్లు, ఇంకా  మూడు నాలుగేళ్లు దాటిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం గురించి వింటున్నాం. కొన్ని సందర్భాల్లో తమతో పాటు పిల్లల్ని కూడా బలి పెడుతున్న సంఘటనలు వింటున్నాము మరీ ఘోరంగా. 
ఈ ఉదంతాన్ని విశ్లేషిస్తే---
 పది సంవత్సరాల వైవాహిక జీవితంలో ఆ ఇంట్లో ఏ కాస్త పట్టు కూడా సంపాదించ లేని వరలక్ష్మి!
 భర్తపై ఇసుమంత హక్కు కూడా సాధించడం అటుంచి అతని దౌష్ట్యాన్ని అడుగడుగున భరించడం!
 ఆమె కాస్తోకూస్తో చదువుకున్నదని విన్నాను. అయినా, అక్షరం ముక్క కూడా రాని, డెబ్భయికి చేరువలో ఉన్న అత్తగారి ఆగడం పదేళ్లు గడిచినా భరిస్తూ రావడం!
 తనకన్నా చిన్నవాళ్లయిన ఆడపడుచు, మరదులను అడ్డుకోలేక పోవడం!
--- ఇవన్నీ వరలక్ష్మి బలహీనతలు దీనికి కారణం ఆమె అతి మంచితనం అనడం కంటే అతి మెతకదనం అనడం సరి అయినది. మనలో ఆదినుండి ఓ మాట ప్రముఖంగా వినిపిస్తోనే ఉంది కదా, " మెత్తని వాళ్ళను చూస్తే మొత్త బుద్ధి అవుతుందట" అని ! అణిగిమణిగి ఉంటే ఇంకా ఇంకా అణగదొక్కాలనే చూస్తారు ఎలాంటివారైనా. నోరులేని సాధు జంతువైన పిల్లి కూడా తనను గదిలో బంధించి కొడితే తిరగబడి మీద బడి రక్కుతుందట ! మరి వరలక్ష్మి నోరున్న మనిషైనా ఇంత నరకం భరించాల్సిన అవసరం ఏమిటి?  బయటపడితే సమాజం చిన్నచూపు చూస్తుందనా? పరువు కోసమా? 
  ఈమె చాలా మంచిది, సహనం చాలా ఎక్కువ -- ఈ సర్టిఫికెట్లు వద్దు. ఆత్మాభిమానం, ఆత్మరక్షణ ముఖ్యం. ఊసరవెల్లి లాంటి నోరులేని జంతువులే పరిసరాలకు, పరిస్థితులకు తగినట్లు రంగులు మారుస్తాయే ! అన్నీ ఉండి విజ్ఞత గల మనిషి ఆ పని ఎందుకు చేయకూడదు? 
  ఇందులో వరలక్ష్మి కి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆత్మగౌరవం దెబ్బతిని, ఒత్తిడి భరించలేని దుస్థితి తీవ్రమై ఈ దారుణానికి పాల్పడింది అన్పిస్తోంది.
 ఆర్థికంగా ఆదుకోవాల్సిన స్థితి కాదు ఆమెది, కేవలం మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కావాలి. ఎవరిస్తారు?  ఇచ్చినా ఎంతకాలం ఇస్తారు?  
  తనకు తానే నిలవ రించుకుని ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి. చెప్పడం ఈజీ అంటున్నారా? నిజమే కానీ, చావు పరిష్కారం కాదు. ఆ ధైర్యం బ్రతకడానికి చూపించాలని నా అభిప్రాయం. 
  ఇంతకీ--- వరలక్ష్మి చచ్చిపోయి తను మాత్రం బతికిపోయింది. ఇప్పుడు, ఈ  భూమ్మీదకి తెచ్చి వదలిన ఈ ఇద్దరు పసివాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్లు బలిపశువులేనా? 
---- ఈ విశ్లేషణకు ముగింపు వాక్యం నా అభిప్రాయం ప్రకారం-- ఆ కాలం, ఈ కాలం అని కాదు-- ఏ కాలమైనా సరే అమ్మాయిలు మానసికంగా బలవంతులై ( strong ) ఉండాలి అని! అలాగని ఆడవాళ్ళంతా గంప గయ్యాళులుగా మారిపొమ్మని కాదు నా ఉద్దేశం, పరిస్థితిని బట్టి మారటం అత్యవసరం అంటున్నాను.
" ఈ జీవితం నాది, మరి ఎవరిదో కాదు" అన్న స్థిరాభిప్రాయం వారిలో ఉండితీరాలి. లేకపోతే వీధికో వరలక్ష్మి తయారుకావడం తథ్యం !

( స్త్రీలపై నానాటికీ పెరుగుతున్న దౌష్ట్యం చూస్తూ, చదువుతూ కలిగిన స్పందనతో )

 అందరి అత్తింటివారూ ఇలాగే ఉంటారని కాదు. కోడలిని కూతురులా చూసుకుంటూ, ఆమెను తమ కుటుంబ పరువు ప్రతిష్టగా భావించే గొప్ప సంస్కారయుతమైన కుటుంబాలూ ఉంటున్నాయి. వదినల్ని ఎంతో గౌరవించే మరుదులు, ఆడపడుచులూ ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక నమస్సులు  🙏🙏🙏

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
                    🌺🌺' భువి ' భావనలు 🌺🌺
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

4 comments:

  1. ఒకప్పుడు తప్పంతా అమ్మవారి - ఆడపిల్లల్ని వాళ్ళు పెంచే విధానం లోపభూయిష్టంగా ఉండేది. ఇప్పుడు తప్పు అమ్మాయిలదే - అనవసరమైన భయాలతో దెబ్బతింటున్నారు కొందరు. కాలుమారుతోందని అప్పుడు చాలామంది అమ్మాయిలు గుర్తించలేకపోయారు.కాలంమారింది భయపడటం పొరపాటు అని కొందరు అమ్మాయిలు గుర్తించలేకపోయారు న్నారు.

    ReplyDelete
    Replies
    1. ఈ మార్పు చాలదు సర్. ఇంకా మారాలి.

      < అసలెందుకిలా? ఈ ఉదంతంలో తప్పెవరిది? బాధ్యులెవరు?
      * తమ ఇంటికి వచ్చిన కోడల్ని ఇంటి మనిషిగా భావించలేని అత్తమామలా?
      * భార్య అనేది తన జీవిత భాగస్వామి అనీ, కష్టసుఖాల్లో తోడు నీడగా ఉండడానికి వచ్చిన తన మనిషనీ గుర్తించని, ఆమెను ప్రేమించి, గౌరవించడం తన ధర్మమన్న ఇంగితం ఏమాత్రం లేని భర్త అన్న వాడా?
      * లేక కూతురు ఓ నరకంలో కొట్టుమిట్టాడుతోందని తెలిసినా ఉదాసీనంగా ఉండిపోయిన తల్లిదండ్రులా?
      ఇవన్నీ అటుంచితే--
      * పరిస్థితికి తగినట్లు తనను తాను మార్చుకోలేని వరలక్ష్మి అసమర్థతా? >

      ఈ వ్యాసం లేదా కథలో వ్రాసిన విధంగా ఈ ప్రశ్నలన్నింటి చోట్లా ఇంకా... ఇంకా.... మారాలి.

      Delete
    2. Thank you very much sir for visiting my blog. 🙏👃

      Delete
  2. నిజమే, బాగా చెప్పారు. Thank you 👌

    ReplyDelete