మరికొన్ని గంటలు మాత్రం !
వచ్చేస్తోంది నూతన సంవత్సరం!
అయితే ఏమిటి?
తోరణాలు కట్టాలా?
బాజాభజంత్రీలు సిద్ధం చేయాలా?
గతానికి వీడ్కోలంటూ
పలకలా స్వాగతం!
ఎందుకని? ఏమున్నది గర్వకారణం?
ఆసాంతం వ్యధా పూరితం! అంతే కదా!
ఎవరికి మిగిలింది సంతోషం?
ఎవరికి దక్కింది ప్రశాంతత?
ఎవరున్నారు నిశ్చింతగా?
మరి ఏమని పలకాలి స్వాగతం!
రెండువేల పంతొమ్మిది పోతూ పోతూ
వదిలి వెళ్ళింది అంతుబట్టని
అంటువ్యాధి నొకదాన్ని!
అదేమో --
ఒక ప్రాంతం కాదు ఒక దేశం కాదు
ఆక్రమించి యావత్ప్రపంచాన్నీ
అతలాకుతలం చేస్తూ అడ్డుఅదుపూ లేక
విహరిస్తోంది విజృంభిస్తూ విలయ తాండవం చేస్తూ
అంతం కాబోతోంది రెండువేల ఇరవై
అయినా --
ఎంతకీ దాహం తీరక దారుణాలు సృష్టిస్తూ
మనుషుల ప్రాణాల్తో ఆడుతోంది దాగుడుమూతలు!
ఎన్నో ఉత్పాతాలు చూశాం
మరెన్నో వ్యాధుల్ని కట్టడి చేశాం
కనీవినీ ఎరగని ' కరోనా'ను మాత్రం
మట్టుబెట్టలేకున్నాం !
తరిమికొట్టలేకున్నాం !
మరి ఏమని పలకాలి స్వాగతం!
ఎందుకని పలకాలి స్వాగతం!
అంతేనా ! ఓ పక్క --
మండుటెండల్తో మండిన గుండెలు !
మరోపక్క --
అతివృష్టితో అణగారిన రైతన్నల ఆశలు!
ఇంకా --
వరద బీభత్సాలు ! రోడ్డున బడ్డ కుటుంబాలు !
అదుపుతప్పిన ధరలతో బెంబేలెత్తిన జనాలు !
కుదేలైన ఆర్థిక వ్యవస్థ! సంక్షోభంలో విద్యా వ్యవస్థ !
కూటికోసం కోటి తిప్పలతో యువత !
బడులు మూతబడి ప్రశ్నార్థక మైన
బాలల బంగరు భవిత !
రోగాల పాలై రొప్పుతూ రోజుతూ
అలమటించే జనం !
మరి ఏమని పలకాలి స్వాగతం?
పలకాలి నేస్తం, పలకాలి!
ఎందుకోసమంటే --
మనం మానవులం ఆశా జీవులం
మొక్కవోని ఆత్మస్థైర్యానికి ప్రతీకలం !
అడుగేయాలి ధైర్యం కూడగట్టుకొని
అడుగేస్తూ కదలాలి ముందుకు
మనపై మనం నమ్మకముంచుకుని !
గతం గతః అనుకుందాం ఊరట పొందుదాం!
వర్తమానం వ్యర్థం చేసుకుంటే మరింత అనర్థం!
ఆశావహ దృక్పథంతో రేపటి దినం
కావాలి తేజోమయం !
అందుకోసమైనా --
చేదును దిగమింగి స్వాగతిద్దాం
మౌనంగానే నూతన సంవత్సరాన్ని 💐
చీకట్లు తొలగి వెలుగులు నిండాలని
చేద్దాం ప్రార్థనలు అందరం కూడి
సంతోషం, ప్రశాంతత, నిశ్చింత 🙂
అన్నీ అవుతాయి మన సొంతం
అందుకే --
నూతన సంవత్సరమా !
ఇదిగో నీకిదే మా స్వాగతం! 💐💐💐
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
భువి భావనలు
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
No comments:
Post a Comment