Saturday, August 29, 2020

అప్పట్లో దూరదర్శన్..... అదో అడ్మిరేషన్ !

  ఆదివారం. టీవీలో ఇటీవలే విడుదలైన కొత్త సినిమా త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల' అల వైకుంఠపురములో'  వస్తోంది. ఇంటిల్లిపాదిమీ చూస్తూ కథలో లీనమై ఉన్నాం. ఠక్కున బ్రేక్ వచ్చేసింది. హుష్, అనుకుంటూ స్టవ్ మీద పెట్టిన కర్రీ హఠాత్తుగా గుర్తొచ్చి వంటింట్లోకి పరుగు తీశాను. దాదాపు మాడిపోయే దశలో ఉంది. అమ్మయ్య ! అనుకుని కలియబెడ్తూ ఓ క్షణం అలా గతం లోకి వెళ్ళిపోయాను. ఈ కూరలు, అన్నాలూ మాడిపోవటాలు ఇప్పటివా !
   దాదాపునలభై, నలభై అయిదేళ్ల క్రితం అనుకుంటా, హైదరాబాదులో మా బంధువుల ఇంట్లో మొట్టమొదటిసారి ఈ దూరదర్శన్, అదేనండీ, టీవీ-- చూశాను. అదో  బ్లాక్ అండ్ వైట్ టీవీ. సాయంత్రం5.30 కి NTR, జమున నటించిన పాత తెలుగు సినిమా' రాము ' అప్పుడు అందులో నేను చూసిన మొట్టమొదటి టీవీ సినిమా! ఆ తర్వాత మరో ఏడెనిమిదేళ్ళకు కర్నూల్లో మా పొరుగింటాయన ఓ చిన్న ( portable )టీవీ, బ్లాక్ అండ్ వైట్ దే తీసుకొచ్చారు. చుట్టుపక్కల నాలుగైదు ఇళ్లవాళ్లమంతా పోగై చూసాము. అప్పటికి చాలా అరుదుగా అక్కడక్కడా కొందరిళ్లలో ప్రత్యక్షమయ్యాయి టీవీ లన్నవి. అంతే ! ఉన్నట్లుండి 
ఓ ప్రభంజనంలా వ్యాపించి చూస్తుండగానే చాలా ఇళ్లలో కొలువుదీరి పోయాయి.అప్పట్లో టీవీ లేని వాళ్లంతా ఉన్నవాళ్ళింటికి చేరుకుని ఇష్టమైన సీరియళ్లు, సినిమాలూ చూస్తూ ఆ ఇంటినో మినీ థియేటర్ చేసేవాళ్ళు. అలా అలా ఈ హవా కొన్నేళ్లు సాగాక బ్లాక్ &వైట్ టీవీ లు వైదొలగి కలర్ టీవీ లు దాని స్థానాన్ని ఆక్రమించేశాయి. వాటికలవాటు పడ్డ జనం ఇక బ్లాక్ &వైట్ బొమ్మలు చూస్తారా !అనతికాలంలోనే  కలర్ టీవీ తన మాయాజాలంతో ప్రతి ఇంటినీ శోభాయమానం చేసేసింది. అది మొదలు! రకరకాల మోడల్స్, సైజులు ఒకదాన్ని మించి ఒకటి పుట్టుకొచ్చి జనం వేలంవెర్రిగా కొనేయడం మొదలెట్టేశారు. ఒకేసారి కొనలేని వాళ్ళు వాయిదాల్లో కొనే వెసులుబాటు కూడా ఇచ్చేశారు కంపెనీ వాళ్ళు. కలర్ టీవీ లు మొదట్లో ఖరీదు ఎక్కువైనా పోటీ ఎక్కువైపోయి రాను రాను ధరలు తగ్గిపోయి ప్రతి వారికి అందుబాటులోకి వచ్చేశాయి. క్రమేపీ పాత తరం వాళ్లందరినీ ఎంతో మురిపించిన రేడియో అన్నది మూల పడిపోయి అనూహ్యంగా టీవీ అందరికీ ప్రియమై పోయింది!
    దూరదర్శన్ ప్రవేశించిన కొత్తల్లో ఒకే ఒక ఛానల్ వచ్చేది. పగలంతా జాతీయ కార్యక్రమాలు -- హిందీ సీరియల్స్, ఇంగ్లీష్ న్యూస్-- సాయంత్రం5.30 నుండి మాత్రమే తెలుగు ప్రసారాలు మొదలయ్యేవి. ఇక సందడే సందడి! ఇది తెలియనిదెవరికి లెండి ! ఆ సమయానికంతా పనులన్నీ ముగించుకొని గృహిణులు, పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ టీవీ ముందు కూర్చునే వారు. మరీ ముఖ్యంగా శని ఆదివారాలు. శనివారం తెలుగు సినిమా, ఆదివారం హిందీ సినిమా! హిందీ కార్యక్రమాల పుణ్యమాని ఆ రోజుల్లో హిందీ సీరియల్స్, హిందీ సినిమాలు చూడడానికి బాగా అలవాటు పడిపోయాను నేను.
   బ్లాక్ అండ్ వైట్ టీవీ హవా బాగా కొనసాగుతున్న రోజుల్లోనే ఉదయం  9 గంటల కనుకుంటా,  రామానంద్ సాగర్ హిందీ 'రామాయణం' మొదలైంది అప్పటివరకూ మనతెలుగు హేమాహేమీలు, ఉద్దండులు నటించిన ఎన్నో పౌరాణిక సినీ కళాఖండాలు చూసి ఉన్నా, టీవీ లో చూడ్డం -- అదీ ఇంట్లో కూర్చుని! ఆ అనుభూతి పొందని వారు బహుశా ఉండరనే నా అభిప్రాయం. ఆ తర్వాత వచ్చిన హిందీ' మహాభారతం' కూడా దాదాపు అదే స్థాయిలో కొనసాగింది. ఈ రెండింటి గురించి అంతా చాలా గొప్పగా చెప్పుకునేవారు అప్పట్లో. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సీరియల్స్ వస్తున్నప్పుడు అలా వీధి లోకి తొంగి చూసా మంటే వీధులన్నీ నిర్మానుష్యంగా, అతి నిశ్శబ్దంగా కనిపించేవి అంటే ఊహించు కోవచ్చు, ప్రతి ఇంట్లో జనాలంతా ఎంతగా టీవీ లకు అతుక్కుపోయి ఉండేవారో !
   తెలుగు సీరియల్స్ వారానికి ఒక్కసారి అదీ కేవలం పదమూడు ఎపిసోడ్స్ మాత్రమే ఉండేవి. ప్రతి రోజు ఒక సీరియల్ తప్పనిసరిగా ఉండేది. ప్రతి శుక్రవారం వచ్చే' చిత్రలహరి' కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేవాళ్లంతా కేవలం అరగంట కోసం!నెలకో, రెణ్ణెల్లకో ఓ సారి ' చిత్ర మాల' అని వస్తుండేది. 5, 6 భాషల చిత్రాలనుండి ఒక్కో పాట ప్రసారం చేసేవారు. సోమవారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఈ కార్యక్రమం వస్తుండేది. అందులో మన తెలుగు పాట ఒకటి. ఆరోజు ఏ పాట వస్తుందోనన్న ఆసక్తితో చూసే వాళ్ళు కొందరు! అదో విచిత్రమైన ఆనందం!
   ఇక, ప్రస్తుతానికొస్తే -- ఇష్టమైన దేదైనా మితంగానే ఉండాలంటారు. లడ్డు ఇష్టమని ప్రతిరోజు పదే పదే అవే తింటే ఏదో ఒక రోజు మొహంమొత్తి పోయి అవంటేనే మొహం తిప్పుకునే దుస్థితి దాపురిస్తుంది. అలాగే అయ్యిందేమో అనిపిస్తుంది ప్రస్తుతం టీవీ కార్యక్రమాలు చూస్తోంటే ! 
   కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన ఛానల్స్ -- ప్రతీ రోజూ లెక్కలేనన్ని సినిమాలు ! వందలకొద్దీ తెలుగు, హిందీ పాటలు !జీళ్ల పాకంలా సాగదీస్తూ సహనాన్ని పరీక్షించే సీరియల్స్ ! వీటికి తోడు పోటాపోటీగా వార్తా ఛానల్స్ !రియాలిటీ షోస్ !ఓహ్ ! మనిషన్నవాడు ఇవన్నీ చూడాలంటే అయ్యేపనేనా !మొదట్లో మితంగా ఉండేవి గాబట్టి అన్నింటి కోసం ఎదురుచూస్తూ ఆనందించేవాళ్ళం. ఇప్పుడు !ఇక చెప్పేదేముంది? 
  ఏదైనా కొత్తలో నవ్యత, నాణ్యత దేనికైనా సహజం. అందుకే అదో అడ్మిరేషన్ అన్నా ! అలాగే కొత్త వింత పాత రోత ! కొత్త నీరు వచ్చేకొద్దీ పాత నీరు కొట్టుకొని పోవడం అత్యంత సహజం. ప్రచార సాధనాలంటూ లేని రోజుల్లో రేడియో వచ్చింది. టీవీ వచ్చి దాన్ని తల దన్నేసింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వచ్చి టీవీ నీ  అధిగమించేస్తోంది. మనం ఎక్కడికెళ్లినా ప్రపంచమంతా మన అరచేతిలోనే ఉన్న ఫీలింగ్ తెప్పిస్తోంది మరి ! 
  కొంతకాలం క్రితం వంట చేసే ప్రాసెస్ లో పప్పు స్టవ్ మీద పెట్టి, అది ఉడికేలోగా కాస్త టీవీ చూద్దామనుకుని అందులో ఇమ్మర్స్ అయిపోయి, వంట కాస్తా మాడగొట్టేసే వాళ్ళు కొందరు మా ఆడవాళ్లు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లో ఏ వీడియో నో చూస్తూ అడపా దడపా నాలుక్కరుచుకుంటున్నారు !
ఇలాంటి అనుభవం ఇంట్లో వంట చేసే వాళ్లకు కనీసం ఒక్కటైనా ఉండితీరుతుందా లేదా? అలా లేని మహిళామణి ఎవరైనా ఉంటే నాకు చెప్పండి ప్లీజ్ ! 
   నేను వర్క్ చేసే రోజుల్లో స్టాఫ్ రూమ్ లో ఓసారి మహిళా ఉపాధ్యాయుల మధ్య ఈ టాపిక్ వచ్చింది. అందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్తూ ఈ విషయం లో ఏకీభవించారు. 
  మొత్తానికి కాలం గడిచే కొద్దీ AIDS అయితే మారుతున్నాయి గానీ వంటింటి అనుభవాలు COMMON గానే ఉంటున్నాయి. ఔనంటారా, కాదంటారా?  

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మళ్ళీ కలుసుకుందాం !
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
   

1 comment: