Wednesday, August 19, 2020

మనసా, చలించకే.... !

      ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. గదిలో లైటు వెలుగుతూ కనిపించింది. ఒక్క క్షణం నేను ఎక్కడున్నానో అర్థం కాలేదు. కళ్ళు నులుముకుంటూ పక్కకు చూసాను. రాజమ్మ అమ్మను పొదివి పట్టుకుని ఏదో టాబ్లెట్ మింగిస్తోంది. అప్పుడు అర్థమైంది, అమ్మకు దగ్గు, ఆయాసంతో సీరియస్ అయిపోయి నిన్న రాత్రి నర్సింగ్ హోమ్ లో చేర్చాము. అమ్మకు తోడుగా రాజమ్మ ఇక్కడ ఉంటానంది, కానీ ఆమెనొక్కత్తినే అమ్మ దగ్గరుంచడం ఇష్టం లేక నేనూ ఉండిపోయాను. 
   అమ్మకు రెండు మూడు సంవత్సరాలుగా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఉద్యోగరీత్యా అమ్మ దగ్గరే ఉండడం నాకుకుదరదు. నా వద్దకు వచ్చి ఉండమంటే తను వినదు. సొంత ఊరు, సొంత ఇల్లు విడిచి ఎక్కడికీ రానంటుంది. నాన్న పోయి ఏడెనిమిది సంవత్సరాలవుతోంది. ఇంట్లో ఇప్పుడు అమ్మ ఒక్కతే ఉంటోంది. ఇకపోతే, నా ఇల్లు, నా పిల్లలు, నా సంసారం, పైగా ఉద్యోగ బాధ్యతలు. వీటన్నింటితో సతమతమయ్యే నేను ఎప్పుడో గానీ అమ్మ దగ్గరకు రావడానికి కుదరదు. ఫోన్లలో క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా, అయిదారు నెలలకోసారైనా ఇలా వచ్చి వెళ్తే గానీ మనసు కుదుట పడదు మరి!
   ఇకపోతే రాజమ్మ ! తను మా ఇంట్లో పనిమనిషిగా చేరి చాలా ఏళ్లే అవుతోంది. ఇంట్లో ఆమె చేయని పనంటూ ఉండదు. ఇంటి పనులన్నింటితో పాటు బట్టలు ఉతకడమే కాక అడపాదడపా అమ్మకు చేత కానప్పుడు వంట పని చూడ్డం, ఇలా మంచం పట్టినప్పుడు ఆమెకు సేవలు చేయడం వరకూ కాదనకుండా అన్నీ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడూ అలాగే హాస్పిటల్ కు వచ్చింది. 
    రాజమ్మ అమ్మకు టాబ్లెట్ మింగించి, పడుకోబెట్టి లైట్ తీసేసింది. మంచానికి ఒక పక్కగా కింద పరుచుకున్న ఒక పాత దుప్పటి మీద నడుం వాల్చింది. రాజమ్మ ను చూస్తుంటే నాకు ఏమిటో గా అనిపించింది. అమ్మకు తోడుగా నేనిక్కడ పడుకోవడం వృధా అనుకున్నానోక్షణం. తనకు కావలసినవన్నీ రాజమ్మే చూస్తోంది. నేను చేస్తున్నది ఏమిటిక్కడ? డబల్ రూమ్ తీసుకుని అందులో నున్న మరో మంచం మీద హాయిగా పడుకుని, ఎక్కడున్నానో కూడా తెలియనంత గాఢంగా నిద్ర పోయాను. ఒక్క క్షణం సిగ్గనిపించించింది నాకు. 
   పాపం, రాజమ్మ అమ్మకు ఎంత సేవ చేస్తోంది! రాత్రంతా మేలుకొనే ఉంది. డాక్టర్ ఇచ్చిన మందులన్నీ వేళ తప్పకుండా వేసుకునేలా చూస్తోంది. ఆమె మీద ఒక్కసారిగా జాలి పుట్టుకొచ్చి, మనసంతా ఆర్ద్రతతో నిండిపోయింది. ఇంత చేస్తున్న రాజమ్మకు మేమిస్తున్నదేమిటి? ఇంటి చాకిరీ అంతా చేసి మిగిలిన అన్నం, కూరలు పట్టుకెళుతుంది. ఇంకా రెండు మూడు ఇళ్లలో పనిచేసి ఆ డబ్బుతో ఉన్న ఒక్కగానొక్క కొడుకును చదివించుకుంటోంది. చాలీచాలని తిండితో, ఒంటి నిండా సరైన బట్ట కూడా లేక ఎంత అవస్థ పడుతోంది! ఈ ఆలోచన రాగానే రాజమ్మ వైపు పరికించి చూశాను. చిరిగిపోయిన చీరను అక్కడ అక్కడా ముళ్ళు వేసుకుంది. కొన్నిచోట్ల దారంతో కుట్టుకుంది. ఎటూ వీలుగాని చోట అలాగే వదిలేసింది. రంగు వెలిసిపోయిన రవికె ! కడుపులో దేవి నట్లయింది. ఛీ ! ఇంత చాకిరీ చేయించుకుంటూ ఈ రాజమ్మకు మేమేం చేస్తున్నాం? ఒక్కసారిగా నిశ్చయించుకున్నాను. సెలవు అయిపోయి నేను వెళ్లే లోగా రాజమ్మకు నా చీర ల్లో ఓ రెండు ఆమె కట్ట దగినవి ఇచ్చి వెళ్ళాలి. రెండు మూడేళ్ళుగా కడుతున్నాను కాబట్టి కొత్తగా ఉన్నా అవి ఇచ్చేయడానికి నాకు అంత బాధగా అనిపించలేదు. ఇంటికెళ్లగానే అమ్మ తో కూడా ఒక మాట చెప్పి, వెంటనే రాజమ్మకిచ్చేయాలి అనుకున్నాను. ఆ తర్వాత నిద్ర పట్టడానికి నాకు ఎంతో సమయం పట్టలేదు. 
  నాలుగు రోజుల తర్వాత ఇల్లు చేరాము. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు రాజమ్మ అమ్మను కంటికి రెప్పలా చూసుకుంది. ఆమెపట్ల నేనొక నిర్ణయం తీసుకున్నాక ఆమె గురించీ, ఆమె చేస్తున్న సేవల గురించీ ఆలోచించడం మానేశాను, ఎలాగూ ఆమెకు ప్రతిఫలం ముట్ట చెప్పబోతున్నాను గనక. ఇంటికి రాగానే అమ్మతో నా ఆలోచన చెప్పాలనుకున్నాను. కానీ మిగతా పనుల ఒత్తిడిలో కుదరలేదు. రాజమ్మ పని మామూలుగానే ఉంది ఎప్పటిలా. ఎలాగైతేనేం, చివరికి ఓ రాత్రి అమ్మతో చెప్పానా సంగతి. అమ్మ విస్మయంగా నావేపు ఓ చూపు చూసి, " అదేమిటే! అది చేసిందేమిటి? నాలుగు దినాలు ఆసుపత్రిలో ఉన్నందుకు ముప్పూటలా దాని తిండి ఖర్చు భరించాము. నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో నేనొక్కర్తినే. నా ఒక్క దానికి ఎంతపని ఉంటుందని? అప్పుడు కూడా దానికి ఇంట్లో పొయ్యి వెలిగించకుండా మన ఇంట్లో నుండే పెట్టి పంపిస్తూఉంటానాయే, నేను అంత చేస్తే అది నాకామాత్రం చేయలేదా! ఆ పాటి దానికి నిక్షేపంలాంటి చీరలిస్తానంటావా !" అంటూ నా వైపు కొరకొరా చూసింది. 
   నాకు ఒక్క క్షణం ఏమనాలో తోచలేదు. ఆ రాత్రి భోంచేసిన తర్వాత ఆలోచిస్తూ పడుకున్నాను. 
" నిజమే! అమ్మ ఏమి రాజమ్మ తో ఊరికే చేయించుకోవడం లేదు. దానికి తగ్గ ప్రతిఫలం ముట్టజెబుతూనే ఉంది. ఇప్పుడామె ప్రత్యేకంగా చేసిందేముంది? ఎప్పుడు చేసేదేగా, ఆ మాత్రానికి చీరలు, సారెలూ ఇవ్వడం దేనికి? అనిపించింది. అంత బహుమానం అక్కర్లేకుండా ఏదో ఓ రెండు జాకెట్ గుడ్డలు ఇచ్చేస్తే  సరిపోతుంది, కుట్టించుకుంటుంది, " అనుకున్నాను. అంతే! అమ్మ చెప్పింది సబబుగానే తోచింది నాకు. 
  మర్నాడు నా దగ్గరున్న రవికగుడ్డలు ఓ రెండు తీసి, నా సూట్ కేస్ మీద పెట్టాను, రాజమ్మ ఇంటికి వెళ్లేటప్పుడు ఇవ్వవచ్చుననుకుని. ఏదో ఓ పని మీద గదిలోకి వెళ్ళిన అమ్మ, 
" విశాలీ, ఇదేమిటి, ఇవిక్కడ సూట్కేస్ మీద పెట్టావు, లోపల పెట్టేసుకోక? " అనడిగేసింది. 
 నేను నాన్చుతూ విషయం చెప్పాను. అంతే! కస్సుమంటూ మళ్లీ మొదలెట్టింది. 
" బాగానే ఉంది వరస, దీనికి లాగా నువ్వు నేర్పి వెళ్తే, ఇదిక పనిచేస్తుందా? చీటికీమాటికీ అవి ఇవి అడిగి నా ప్రాణం తీస్తుంది. ఈ పనోళ్లకు మనమై ఇట్లా నేర్పించి నట్లు అవుతుంది. ", అంటూ నా మీద విసుక్కుంటూ వెళ్ళిపోయింది. నా మనసంతా అదోలా అయిపోయింది. ఏమిటి, అమ్మ ఇలాగంటుంది? తన కష్టంలో అంతో ఇంతో సేవ చేసిన మనిషికి మనం కట్టి విడిచిన ఓ బట్ట ఇవ్వడానికి ఇంతగా సాధిస్తుందేమిటి ! ఒక్కోసారి అనవసరంగా ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటాం, ఏ అవసరం లేకున్నా. అలాంటిది ఓ పేదరాలికి అందునా ఇంటి సేవకురాలికి నేనివ్వాలనుకున్నది ఏపాటి? ఒక్కసారిగా అమ్మ మీద కోపం ముంచుకొచ్చేసింది. కానీ, చిన్నప్పట్నుంచీ ఆమెనెదిరించి, ఆమెకు వ్యతిరేకంగా ఏ చిన్న పనీ చేసి ఎరగని కారణంగా గట్టిగా చెప్పలేక, అలాగని ఆమెకు తెలియకుండా ఈ దానం చేయలేక సతమతమై పోతున్నాను. అంతే! ఆ తర్వాత ఇక ఏమాలోచించడానికీ నాకు మనస్కరించక మెదడంతా మొద్దుబారిపోయింది. 
                        **********
   నా సెలవు అయిపోవచ్చింది. వెళ్ళవలసిన రోజు దగ్గర పడుతోంది. రాజమ్మను చూస్తోంటే నా ఆరాటం అధికమవుతోంది. నేను అనుకున్నది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? అమ్మ మాటలకు మరీ ఇంతగా లొంగిపోయానేమిటి? నాలో చెప్పలేని వెళితి ఏర్పడిపోయింది. లాభం లేదు, ఏదో ఒకటి చేసెయ్యాలి.
   ఎలాగైతేనేమి, నా ప్రయాణం రోజు రానే వచ్చింది. ఆ రోజు పది గంటల బండికి వెళ్లాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాను. అమ్మ నాకు జాగ్రత్తలు చెప్పసాగింది. ట్రైన్ లో ఒంటరిగా ప్రయాణం కాబట్టి ఇది మామూలే ఎప్పుడూ. నా అంత కనిపించే ఆడపిల్లలకు కాలేజీలో పాఠాలు చెబుతున్నా అమ్మ నన్నింకా పసిపిల్లలాగే జమకడుతుంది. అమ్మ చెప్పే వాటి కంతా తలాడిస్తూన్నాను కానీ నా మనసంతా రాజమ్మ కోసమే ఎదురు చూస్తోంది. ఆరోజెందుకో తను ఇంకా రాలేదు. రోజు తెల్లారేసరికే వచ్చేది. ఆ మాటే అమ్మతో అంటే, " వస్తుందిలే తీరిగ్గా, దాంతో ఇప్పుడేమిటి నీకు పని? " అని ఎదురు ప్రశ్నించింది.
  ఇక రాజమ్మ ప్రసక్తి ఎత్తడం సుతరామూ మంచిది కాదనిపించింది. అంతే! క్షణాల్లో నేనో స్థిర నిర్ణయానికొచ్చేసాను. తొమ్మిది కావొస్తోంది. అన్నీ సర్దుకుని సూట్కేసు బయట పెట్టాను. ఈలోగా అమ్మ దేనికోసమో లోపలికి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే రాజమ్మ వస్తూ కనిపించింది. నేనిక ఆలస్యం చేయదలచుకోలేదు. రాజమ్మ దగ్గరకు రాగానే, " ఊరు వెళ్తున్నాను రాజమ్మ, అమ్మను జాగ్రత్తగా చూసుకో, " అంటూ పర్సులో నుంచిఅయిదు వందల నోట్లు నాలుగు తీసి ఆమె చేతిలో పెట్టి మెల్లిగా అన్నాను, " ఏమిటో, నా సంతోషం రాజమ్మ, ఇది అమ్మకు చెప్పాల్సిన పని లేదు,... "
 రాజమ్మ గాబరాగా, " ఇదేంటమ్మా, వద్దు తల్లీ... " అంటూ మొహమాట పడిపోతూ తిరిగి ఇవ్వబోయింది. 
" పర్వాలేదు ఉంచు,  " అంటూ నోట్లను ఆమె చేతిలో అదిమిపెట్టి మరో వైపు తిరిగి ఇంట్లోకి చూస్తూ అమ్మను కేకేశాను. గత కొద్ది రోజులుగా నాలో రేగుతున్న అలజడి ఒక్కసారిగా సద్దుమణిగింది. అమ్మ రాగానే, రాజమ్మ సూట్ కేస్ తీసుకుంది. ఇద్దరూ కలిసి రోడ్డు దాకా వచ్చి, నన్ను ఆటో ఎక్కించారు. వెళ్తున్న ఆటోలోంచి ఓసారి వెనక్కి చూశాను. ఇద్దరూ చేతులూపుతూ కనిపించారు. నీళ్ళు నిండిన రాజమ్మ కళ్ళలో ఏదో భావం! నాకు మాత్రమే అర్థమయ్యేలా!
                              **********
   రైలు వేగం పుంజుకుంది. దాంతో నా ఆలోచనలు కూడా పరుగు పెట్టాయి. ఆ ఇద్దరి గురించి ఆలోచిస్తున్న నాకు అకస్మాత్తుగా ఓ పౌరాణిక గాధ లోని సంఘటన స్పురించింది. మహాభారతంలో గొప్ప దాతగా ప్రసిద్ధిగాంచిన కర్ణుడు ఎడమ చేతి నుండి కుడి చేతికి బంగారు పాత్ర మార్చి దానం చేసే లోగా ఎక్కడ తన మనసు మారిపోతుందోననే అనుమానంతో, ఎడమచేత్తో దానం చేయకూడదని తెలిసి కూడా ఆ చేత్తోనే యాచకుడికి ఆ పాత్ర దానం చేశాడట! కర్ణుడంతటి గొప్ప దాతకే తప్పలేదు ఈ చిత్తచాంచల్యానికి లొంగిపోవడం ! ఇక నేనెంత! అనిపించింది. 
    హాస్పిటల్లో నేను అనుకున్న వెంటనేరాజమ్మకు చీరలిచ్చి ఉంటే సరిపోయేది. కానీ, కొన్నిరోజుల అనంతరం ఇంటికి రావడం, అమ్మ అడ్డుపుల్లలు వేయడం -- ఇలాంటి అవాంతరాలతో నా నిర్ణయం సడలిపోవడం ! ప్చ్ ! నిజంగా ఈ మనసనేది ఎంత విచిత్రమైనది ! ఒకసారి ఉన్నట్లు మరోసారి ఉండదెందుకని?  
   ఏదేమైనా, నేను చేయాలనుకున్నది చేసేశాను. అందుకేనేమో ప్రస్తుతం మబ్బు విడిన ఆకాశం లా నా మనసంతా తృప్తితో నిండిపోయింది. మదిలో సుళ్ళు తిరిగే ఆలోచనల్ని వెనక్కి నెట్టేస్తూ రైలు ముందుకు సాగింది. 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

2 comments:

  1. LRSR:
    పేద వాళ్లలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించడము గొప్పమనసున్న వాళ్ళకే చెల్లుతుంది.

    శ్రమ జీవుల పట్ల జాలి ప్రేమ కలిగిఉండే మానవత్వంగల మనుషులే మహనీయులు

    ReplyDelete