తరతమ భేదాలు, కులమత భేదాలు, ప్రాంతీయ భేదాలు,భాషా భేదాలు, ఆస్తులూ అంతస్థుల తారతమ్యాలు -- ఇవేవీ ఎరగని, పట్టించుకోని ఇంకా చెప్పాలంటే వీటన్నింటికీ అతీతమైనదే జబ్బుఅన్నది.ప్రస్తుతం ' కరోనా ' వైరస్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ !ఇది మన దేశానికి పాకి ఆరు నెలలు కూడా పూర్తి కావస్తున్నది. మొదట్లో అతిసామాన్యుల్ని ఆవహించిన ఈ వైరస్ క్రమక్రమంగా ప్రముఖులకు కూడా వ్యాపించి దాని ఉనికిని మరింత ప్రస్ఫుటంగా, బాహాటంగా ప్రపంచానికి బహిర్గతపరచింది.
అలాంటి వారిలో ముఖ్యమంత్రులూ, మంత్రులు, MLA లూ ఇంకా సినీప్రముఖులూ, క్రికెటర్లు -- ఇలా ఈ లిస్టు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీని బారినిబడి మరణించిన ప్రముఖులూ ఉన్నారు, అలాగే కోలుకుని ఇల్లు చేరినవారూ ఉన్నారు.
మొదట్లో -- అక్కడెక్కడో ఎవరికో ' కరోనా ' సోకిందట !అన్న వార్తలు విన్నవాళ్ళం రాన్రానూ ఇక్కడే, మన ఊర్లోనే మన వీధిలోనే ఫలానావాళ్ళకొచ్చిందంట ! అని వినే స్థాయికి ప్రస్తుతం ఈ మహమ్మారి మనల్ని లాక్కువచ్చి పడేసింది.
దీనికితోడు వర్షాకాలం ! ఎడతెరిపి లేని వర్షాలతో ' సీజనల్ ' వ్యాధులు ! తుమ్మినా, దగ్గినా, అతిమామూలుగా జలుబు చేసినా, స్వల్పంగా జ్వరం లాంటిదొచ్చినా 'ఆమ్మో'అని భీతిల్లాల్సిన పరిస్థితి !ఈ సీజనల్ వ్యాధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లకై ప్రభుత్వం హెచ్చరించిందని అంటున్నారుగానీ ఆ దాఖలాలేమీ వైద్యశాలల్లో కనిపిస్తున్నట్లుగా లేదు. కర్మగాలి ఏ జ్వరం బారినోబడి చూపించుకుందామంటే కూడా ఏ వైద్యులూ దగ్గరకు రానీయని దుస్థితి ! ఎవరి ప్రాణం వాళ్లకు తీపి మరి !
న్యూస్ పేపర్లలో నేమో మరో రెండు నెలల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందనే వార్తలు వెలువడుతున్నాయిగానీ, అదెంతవరకు జరిగే అవకాశం ఉందో చెప్పలేం. ఇవేమీ పట్టని కరోనా మాత్రం ఎవర్నీ వదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చుండిపోయింది.
కరోనా సోకిన ప్రముఖుల్లో సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కోలుకుని ఇల్లు చేరారు. అలాగే దర్శకుడు రాజమౌళి కుటుంబం కూడా. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంకా హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితి కూడా అదే. రెండు వారాల క్రితం వైరస్ బారినబడి హాస్పిటల్లో చేరిన ప్రముఖ గాయకుడు
S. P. బాల సుబ్రహ్మణ్యంగారి కోసం సంగీత దర్శకులు, గాయనీ గాయకులూ పాటలు పాడుతూ ప్రార్థనలు చేయడం ఎంతో బాగుంది.
ప్రముఖుల కోసమే కాక అతి సామాన్యుల కోసం కూడా ప్రార్థిస్తూ త్వరగా అందరూ కోలుకోవాలని కోరుకుందాం.
No comments:
Post a Comment