Tuesday, October 20, 2020

ఆదివారం ఎంతో ఇష్టం.. ఎందుకంత ఇష్టం?

    ఆదివారం అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఎందుకని? వారంలో ఏ రోజుకూ లేని ప్రత్యేకత ఆదివారానికే ఉంది గనక! వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండీ పెద్దల దాకా ఎంతగానో ఎదురు చూస్తుంటారు ఈ రోజు కోసం. ఆరు రోజుల శ్రమ అనంతరం దొరికే ఆటవిడుపు కదా! ఇంతకీ అందరూ ఎరిగినదే అయినా ఆదివారం అన్నది ఎవరెవరికి ఎలా ఇష్టమైనదో చూద్దాం. 

* పిల్లలకు-- ప్రతీ ఉదయం నిద్రమత్తు వీడకనే త్వరగా లేవాలి. తయారవ్వాలి. బోలెడు పుస్తకాల మోత. హడావుడిగా తినడం. పరుగులు తీయడం. అక్కడేమో వరుసగా పాఠాల మోత. బుర్ర కెక్కినా ఎక్కక పోయినా క్లాసులో కూర్చోవడం అయితే తప్పనిసరి! అంతేనా! టీచర్లతో చీవాట్లు, అప్పుడప్పుడు తన్నులు, ఇంకా హోం వర్క్ లు ! తలబొప్పి కడుతుంది. ఆరు రోజుల ఈ కష్టానికి ఒకరోజు బ్రేక్! అదే ఆదివారం! ఎంచక్కా నిదానంగా నిద్రలే వచ్చు. తీరిగ్గా స్నానపానాదులు. టీవీలో ఇష్టమైనవి చూడడాలూ. వీడియో గేమ్స్ ఆట్లాడుకోడాలు. ఫ్రెండ్స్ తో ఆటలు ! ఇవన్నీ ఉంటాయి కాబట్టే మరి పిల్లలకు ఆదివారం వస్తోందంటే అంత హుషార్!  అంతటి హుషారూ సోమవారం ఉదయానికి నీరు గారి పోతుంది అనుకోండి, అది వేరే సంగతి! 

* ఇక-- ఇంట్లో ఇల్లాళ్లకు. ఇంట్లో ఉంటారన్న మాటే గానీ వాళ్లకు తీరికనేది ఉండేది ఎక్కడ? తెల్లారగట్ల లేవాలి, భర్తకూ, పిల్లలకు టిఫిన్లు, భోజనాలు సిద్ధం చేయాలి. చిన్నపిల్లలయితే వాళ్లనూ రెడీ చేయాలి. రొప్పుతూ రోజుతూ అన్నీ అమర్చి వాళ్లను బయటికి సాగనంపేసరికి వాళ్ల తల ప్రాణాలు తోకకొచ్చేస్తాయి. మరి వీళ్లూ ఆదివారం కోసం ఎదురు చూస్తారు అనడంలో వింతేముంది? ఆ రోజైతే ఇంత ఉరుకులాట, టెన్షన్ అన్నది ఉండదు వాళ్ళకి. 

* ఇంటికే పరిమితమయ్యే గృహిణుల పరిస్థితే ఇలా ఉంటే ఇక ఉద్యోగినుల గురించి వేరే చెప్పాలా! రేపు ఉదయం టిఫిన్ నుండి మధ్యాహ్నం క్యారియర్, ఇంకా ఇంకా వగైరా వగైరా అన్నీ ముందురోజే ఆలోచించి సిద్ధం చేసుకోకపోతే అంతే సంగతులు! అందరికీ అన్నీ చూస్తూ తనకు తాను కూడా టైం లోపల రెడీ అవ్వాల్సిన పరిస్థితి వాళ్లది, ఇవన్నీ ప్రణాళిక ప్రకారం చేయలేకపోయారా, మరుసటి రోజు గమ్యస్థానం సమయానికి చేరడం దుర్లభమే ! ఆరు రోజుల ఈ ప్రయాస అనంతరం ఒక్కరోజు విశ్రాంతికై ఎదురు చూడడం అత్యాశ ఏమీ కాదు కదా! కొందరైతే కొన్ని పనులు ఆదివారానికి బదలాయిస్తూ ఉంటారు. బట్టలు ఉతుక్కోవడం, స్పెషల్స్ వండుకోవడం లాంటివన్నమాట! మిగతా రోజుల్లో కుదరదు కదా మరి! 

* ఆడవాళ్ళ సంగతి అలా ఉంటే మరి మగవాళ్ల సంగతేమిటి? వీళ్ళ పని కాస్తలో కాస్త నయం. ఎందుకంటే, వంటింటి డ్యూటీలుండవు కాబట్టి! నూటికొక్క శాతం పురుషులు వంటింట్లో భార్యలకు సహాయపడటం, పిల్లల్ని రెడీ చేయడం లాంటివి చేస్తారేమో గానీ ఎక్కువ శాతం మాత్రం వాటికి దూరంగానే ఉంటారు. ఇలా అంటే మాకు బయట బోలెడు పనులు ఉంటాయి, అవి మీ ఆడవాళ్లు చేయలేనివి అంటుంటారు. వాళ్ల కోణంలో అదీ నిజమే. మిగతా ఆరు రోజులూ ఉద్యోగ బాధ్యతలతో సతమత మయ్యే వీళ్ళు ఆదివారం నాడేకాస్త రిలాక్స్ అవటానికి ఆస్కారం. అందుకే వాళ్లు కూడా ఆరోజు కై కచ్చితంగా ఎదురుచూస్తుంటారు. 

* ఉద్యోగస్తులే కాదు, ఇతర పనులు అంటే వ్యాపారాలు చేసేవారు, ఇతర వ్యాపకాల తో బిజీగా ఉండేవారు కూడా ఆదివారం అన్నీ బంద్ చేసేసి విశ్రాంతి కోరుకుంటారు. 

* ఇంకా-- కూలీ పనులు చేసేవారూ, భవన నిర్మాణ కార్మికులు ఆరు రోజులు మాత్రమే పని చేసి ఆదివారం సెలవు పుచ్చుకుంటూ ఉంటారు. 

 ఆదివారం( సెలవు దినం అని కూడా అనవచ్చు ) అందరికీ అందించే చిన్ని చిన్ని ఆనందాలు---

* శరీరానికీ, మెదడుకూ కాస్త విశ్రాంతి. 

* రొటీన్ గా తీసుకునే దానికంటే కాస్త స్పెషల్ గా ఉండే ఫుడ్! 

* పిల్లలతో ఏ పార్క్ కో, సినిమాకో వెళ్లి సరదాగా గడిపే అవకాశం. ( కరోనా పుణ్యమాని సినిమా వైభోగం ప్రస్తుతం బంద్ అయిందనుకోండి! )

* ఇవేవీ లేకపోయినా ఇంట్లోనే అంతా కలిసి హాయిగా ఓ పూట కాలక్షేపం చేసే సదవకాశం. 

😊 ఈ దేహం రీఛార్జ్ అయి మళ్లీ సక్రమంగా, హుషారుగా పని చేయాలంటే దానికి విశ్రాంతి అన్నది చాలా చాలా అవసరం. ఆ విశ్రాంతి కోసమే ఈ' ఆదివారం'. అందుకే ఆరోజంటే అందరికీ అంత ఇష్టం మరి!!🙂

************************************************

                        🌷భువి భావనలు 🌷

************************************************

7 comments:

  1. బాగుందండి. ఆదివారం అంటే అందరికీ ఇష్టమే. అయితే పిల్లలు ఇంకా పెరుగుతూ, భర్త ఇంకా రిటైరవ్వని కుటుంబంలో ... ఇల్లాలు ఉద్యోగం చేస్తుండక పోయినప్పటికీ ఆమెకు ఆదివారం నాడు కూడా మరీ అంత తీరికేమీ దొరకదని నా పరిశీలన.

    ReplyDelete
  2. ... బట్టలుతకడం, ఇల్లు క్లీనింగ్ లాంటి పనులు ఆరోజుకు పెట్టుకుని పని ఇంకా ఎక్కువ చేసుకుంటారు కూడా. కాకపోతే ఓ రకమైన holiday mood.మిగతా రోజుల్లో ఉండే ఉరుకులూ పరుగులూ, ఇంకా టెన్షన్ ఆరోజుండవు కదా అన్నది నా అభిప్రాయం. 🙏👃

    ReplyDelete
    Replies
    1. // “ పని ఇంకా ఎక్కువ చేసుకుంటారు కూడా.” //

      హ్హ హ్హ, చాలా కరక్ట్ గా చెప్పారు. దాంతో ఎదురు చూసిన తీరిక కాస్తా తెలియకుండానే ఫట్ 🙂.

      Delete
  3. L R S R :

    అలసిన వారందరికి అలంకారప్రాయంగా అందాల హరివిల్లు ఆనందాల ఆదివారము.

    Tensions free day Sunday

    Refreshing day Sun day

    ReplyDelete
    Replies
    1. అలసిన దేహానికి దివ్యౌషధం ఆదివారం 🙂

      Delete
  4. Ladie's Specialday Sunday

    It is Children's Cheers day

    And Gent's joyful day with ther families

    Finally to say, It is a planning day for the next week

    ReplyDelete