Tuesday, December 22, 2020

చట్టాలను చేసి లాభమేమి....?

 చట్టం తీసుకొచ్చాం
 ఇక నిశ్చింత మీ సొంతం
 అన్నది ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం!
 వరకట్నం పుచ్చుకుంటే నేరం 
 ఇచ్చుకుంటే అంతకన్నా నేరం !
 అంటూ చేసేశారు చట్టం
 ఆగిందా? ఇస్తూనే ఉన్నారు
 పుచ్చుకుంటూనే ఉన్నారు!
 అంతా చాటుమాటు వ్యవహారం!
 వరకట్న హత్యలు, ఆత్మహత్యలు
 అదనపు కట్నమంటూ గృహహింసలు !
 ఎన్నో ఎన్నెన్నో ఘోరాలు !
 నిత్యం జరుగుతున్నా 
 ఏదీ? ఎక్కడ? చట్టం? 

 నిర్భయ చట్టం, దిశ చట్టం!
 ఆడపిల్లలపై అత్యాచారాలు 
హత్యచారాలు ఆగడానికట  !
 ఆగిపోయాయా? లేదే? 
 ఏదీ?  ఎక్కడ? చట్టం? 
 దినం దినం దినపత్రికల్లో దర్శనమిచ్చే
 వివిధ ఘటనల సమాహారమే ప్రత్యక్ష సాక్ష్యం !

 ఉరిశిక్షలు, జీవిత ఖైదులు 
 బహిరంగ మరణ శిక్షలు, ఎన్  కౌంటర్లు !
 పరిష్కారమంటూ ఘోషిస్తున్నారంతా !
 సత్వర న్యాయం జరగాలంటూ 
 ఉద్యమిస్తున్నాయి మహిళా సంఘాలన్నీ!
 మరోపక్క -- 
 బాధితులకు పరిహారమంటూ రాజకీయాలు!
 ఇవన్నీ తాత్కాలిక ఊరడింపు ప్రయత్నాలు
 కంటి తుడుపు చర్యలూ మాత్రమే నన్నది
 జగమెరిగిన సత్యం !
 మనిషి' మైండ్ సెట్ ' మారితే గానీ 
 సమాజం మారదన్న కఠోరసత్యం గ్రహించాలి గానీ 
 చట్టాల వల్ల జరిగేదీ ఒరిగేదీ 
 ఏమీ లేదన్నది గత చరిత్ర
 చేస్తూనే ఉన్నది తేటతెల్లం మరి!
 అయినా --
 మృగం లాంటి మనిషికి మనసొకటా? 
 అది మారి సరైన దారిని ఆలోచించడమా ? 

**************************************
                * భువి భావనలు *
**************************************

No comments:

Post a Comment