Thursday, December 16, 2021

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే..2.. పసి మనసులు.. పసిడి మనసులే.. !

🌺
      పసితనం ఎంత కల్మష రహితం ! ఆ చిరునవ్వుల్లో ఎంత స్వచ్ఛత ! కల్లాకపటం ఎరుగని ఆ చూపులు వారికే సొంతమనుకుంటా. ఏనాడో చెప్పాడో సినీకవి--
     "  పుట్టినపుడు మనిషి మనసు తెరచి ఉండునూ 
        ఆ పురిటికందు మనసులో దైవముండునూ 
        మాయ మర్మమేమి లేని బాలలందరూ
        ఈ భూమి పైన వెలసిన పుణ్య మూర్తులే
        పిల్లలూ దేవుడూ చల్లనివారే
        కల్లకపటమెరుగనీ కరుణామయులే "
--- అని 
     అక్షరాలా నిజం ! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నా ఉద్యోగ జీవితం ప్రారంభమైనది ఓ ప్రాథమిక పాఠశాల స్థాయి పిల్లలకు బోధించడం తోనే. చదువు పూర్తయిన వెంటనే ఒకటవ తరగతి విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు బోధించే  చక్కటి అవకాశం నాకు లభించింది. మొదట్లో ఇంత చిన్న పిల్లలకు ఎలా పాఠాలు చెప్పాలి, అసలు వీళ్లకు అ ఆ లు, గుణింతాలు ఎలా నేర్పాలి రా దేవుడా, అని ఫీలయినా, కొద్ది రోజుల్లోనే ఆ అభిప్రాయం నాలో తుడిచిపెట్టుకుపోయింది. కాస్త దగ్గరకు తీస్తే చాలు, టీచర్ ను  అల్లుకుపోయే సున్నిత మనస్కులు ఆ వయసు పిల్లలంతా ! 
   ఓ  విద్యాధికారి అప్పట్లో స్కూల్ ను సందర్శించి, ఆ సందర్భంగా ఓ మాటన్నారు, 
First class teachers are 'first class👌 ' teachers అని --  
 ఒకటో తరగతి బోధించే ఉపాధ్యాయులు ప్రధమ శ్రేణికి చెందిన ఉపాధ్యాయులనీ వారిని చిన్న చూపు చూడడం, తక్కువగా అంచనా వేయడం తగదనీ  అన్నారు. అభివృద్ధి చెందిన అగ్రదేశాల్లో ఎలిమెంటరీస్కూల్ టీచర్లకు కళాశాల అధ్యాపకుల కంటే లభించే గౌరవం సముచితంగా ఉంటుందని ఆ సందర్భంగా అందరికీ చెప్పారు.
    ఇక -- చిన్న పిల్లలే కదా అని వాళ్లను తక్కువగా అంచనా వేశామంటే పప్పులో కాలేసినట్టే నండోయ్ ! టీచర్ ను నఖశిఖ పర్యంతం నిశితంగా గమనించడంలో వాళ్ళు దిట్టలు సుమండీ! టీచర్ ఈ రోజు ఏ చీర కట్టుకుందీ, సార్ ఈరోజు ఏ డ్రెస్ తో వచ్చాడు -- దగ్గర్నుండీ వాళ్ళ ప్రతీ  కదలికనూ ఆ చిన్నారులు గమనించడం నా అనుభవంలో చవి చూశాను.మరొక్క  విషయం... గురువుల్ని అభిమానించడం లో, ఇష్టపడడం లో వారికి వారే సాటి!
   వాళ్లకి టీచర్ ఏది చెప్తే అది రైటు. అంతే! ఏదైనా ఒక పదం సరిగ్గా పలకకపోతే ఇంట్లో అమ్మో, నాన్నో--
" అలా కాదమ్మా, తప్పు,  ఇలా పలకాలి" అంటే
" పోమ్మా, నీకేం తెలీదు, మా టీచర్ ఇలాగే చెప్పింది "
 అనే గడుగ్గాయిలు  వాళ్ళు. అంటే, టీచర్ మీద అంత నమ్మకం అన్నమాట! అందుకే బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం కూడా అప్పట్లో నేను గ్రహించాను. ఎందుకంటే--- ఆ లేత వయసులో సమాచారం తప్పుగా వాళ్లకు చేరిందంటే అది వాళ్ల మెదడులో అలాగే స్థిరంగా నిలిచి పోతుంది మరి ! అది  చెరిగిపోవడమూ అంత సులభం కాదు.
   ప్రభుత్వ ఉపాధ్యాయినిగా చేరాక ఓ చిన్న గ్రామంలో కొంత కాలం పాటు పని చేశాన్నేను. అక్కడ సాయంత్రం బడి వదలగానే 4, 5 తరగతుల పిల్లలు టీచర్ల బ్యాగులు చటుక్కున లాక్కుని వాళ్ల భుజాలకు తగిలించుకుని మా ముందు నడుస్తూ, బస్సు దాకా వచ్చి, మమ్మల్ని ఎక్కించాక  గానీ వెనుదిరిగే వారు కాదు. వాళ్ళకదో  ఆనందం! 
    ఈ అమాయకత్వం, కల్లాకపటం లేనితనం, గురువుల పట్ల ప్రేమాభిమానాలు ప్రాథమిక విద్య ముగిసేదాకా మాత్రమే ఉంటాయనేది కూడా నిజంగా నిజం! హై స్కూల్ పిల్లలు ఇలాంటి వాటికి దూరంగా ఉండే వాళ్ళు. వయసు పెరుగుతోంది కదా, కాస్త  మొహమాటం, భేషజం వచ్చి చేరడం మొదలవుతుంద న్నమాట !
    అలాగే, అంతవరకూ బుద్ధిగా ఉన్న పిల్లలు మెల్లి మెల్లిగా క్లాసులో అల్లరి చేయడం కూడా నేర్చేసుకుంటారు. బాగా గమనిస్తే, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, హై స్కూల్ విద్యార్థులకు ఈ తేడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వయసు ప్రభావం మరి ! క్రమంగా వారిలో పసితనపు  ఛాయలు తొలగిపోతూ ఆ స్థానంలో ఒకలాంటి గడుసుదనం, ఆరిందాతనం అలా అలా ఇంకా ఎన్నెన్నో వచ్చి చేరిపోతాయి! ఫలితంగా -- లోకం పోకడ వంట బట్టి వాళ్లూ మామూలు మనుషుల కేటగిరీలోకి వచ్చేస్తారు ! 
      " వయసు పెరిగి  ఈసు కలిగి మదము హెచ్చితే 
         అంత మనిషిలోని దేవుడే మాయమగునులే "

--- అలాగన్నమాట ! అది అత్యంత సహజం కూడా. వారికి తగినట్లుగా బోధించే ఉపాధ్యాయులు కూడా మారాల్సి వస్తుంది, తప్పదు ! దండించడం, క్రమశిక్షణ తెలియజేయడం, కాస్త రిజర్వుడు గా ఉండటం... ఇలా ఎన్నో వీళ్ళు కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న, నేర్చుకున్న విషయాలే !
     నేను పనిచేసిన ప్రతీచోటా ఓ' బెస్ట్ బ్యాచ్' తప్పనిసరిగా ఉండేది. ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా చేస్తున్న రోజుల్లో అలాంటి ఓ బెస్ట్ బ్యాచ్ ఒకటి ఉండేది. ఆ బ్యాచ్ పిల్లలు ఐదవ తరగతి పూర్తయి పాఠశాల వదలి వెళుతున్న సందర్భంగా చిన్న పార్టీలాంటిది చేసుకుని  ఉపాధ్యాయులందరితో ఓ గ్రూప్ ఫోటో తీయించు కోవడం జరిగింది. వారి కోరిక మేరకు ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించి ఆఫీస్ రూమ్ లో తగిలించాను. చాలా సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఆ స్కూలుకు వెళ్ళినప్పుడు, అదే రూమ్ లో గోడకున్న ఆ ఫోటో చూసి ఎంత సంతోషించానో ! కొన్ని జ్ఞాపకాలను ఫోటోల్లో బంధించడం ఎంత మంచి ప్రక్రియో కదా అనిపించింది నాకప్పుడు!
   ఏదిఏమైనా... అప్పుడప్పుడూ ఆనాటి పసి పిల్లలు పెద్దలై, జీవితంలో సెటిలై పోయి.. అనుకోకుండా ఏ దారిలోనో, లేదా ఇంకా ఏదో సందర్భంలో కలిసి అలనాటి ముచ్చట్లు నాతో ప్రస్తావించినప్పుడు కలిగే అనుభూతి, ఆనందం ఎంతో మధురం!సుమధురం !!😊🙂😊

                  🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺














No comments:

Post a Comment