ఆమధ్య బంధువులింట్లో పెళ్లికి వెళ్ళాము. అక్కడ వధూవరుల తాలూకు వాళ్ళు "మీ పద్ధతులు బాగా లేవంటే మీవే అసలు బాగా లేవు " అంటూ రుసరుసలాడ్డం, చిర్రుబుర్రులాడుతూ మూతులు ముడుచుకోవడం , ఇదంతా అక్కడి ఆహూతులు చోద్యంగా తిలకించడం చూసి ఏమిటో చాలా బాధగా అనిపించింది.
నూరేళ్లు కలిసి జీవించాల్సిన కొత్తజంట ఆ ఆనందక్షణాల్లో ఇలాంటివి చూస్తుంటే వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? కనీసం ఆ పెద్ద వాళ్ళకి అందరూ చూస్తున్నారన్న ఇంగితమైనా ఉండాలి కదా !
అసలు ఈ పద్ధతులన్నవి ఎలా మొదలైఉంటాయి? పూర్వం ఆయా కాలాల్ని బట్టి తదనుగుణంగాపెద్దలు ఏర్పరుచుకున్నవి అయి ఉంటాయి. ఇప్పుడు ఏళ్ళు గడిచిపోయినా ఇంకా అలనాటి ఆచారాల్ని పట్టుకు వేళ్ళాడుతుంటే ఎలా? ఇంతకీ గొడవకి కారణం వింటే చాలా సిల్లీగా అనిపించింది.
పెళ్ళి కుమారుడికి పెట్టాల్సిన వెండి తట్ట, చెంబు పెళ్లిమాటలు అంటేకట్నకానుకలు మాట్లాడుకున్నరోజు ఒప్పుకున్నంత బరువు లేవట! ఈ పాయింట్ లేవనెత్తింది ముందుగా వరుడి పినతల్లి! అంతవరకూ ఆ విషయం పెద్దగా పట్టించుకోనివరుడి తల్లి 'నిజమే సుమీ'అనుకుని రుసరుసలాడుతూ వెళ్లి, వధువు తల్లి మీదకు గయ్యిమని లేచింది. అంతే! రసాభాస మొదలు!
అంతవరకూ సిగ్గులమొగ్గగా ఉన్న పెళ్లికూతురు పాపం ఈ తతంగం చెవినిబడి ఆ పిల్ల ముఖం కాస్తా చిన్నబోయింది. పక్కనున్న పెళ్లికొడుకు మాత్రం చిద్విలాసంగా తనకేమీ పట్టనట్లు, నాకు సంబంధించినది కాదన్న ధోరణిలో పురోహితుడి వైపు చూస్తున్నాడు, " తాళి కట్టనా, మాననా " అన్నట్టు!
చివరాఖరికి విషయం మగవాళ్ళ దాకా వెళ్లి, తర్జనభర్జనల తర్వాత ఏదో సర్దుబాటు చేసుకుని సైలెంట్ అయిపోయి, ' తతంగం' కాస్తా అయింద నిపించారు. అంతవరకూ ఉత్కంఠగా ఉన్న ఆహూతులంతా ఓ నిట్టూర్పు విడిచి, కుర్చీల్లో చతికిల పడ్డారు. నలుగురితో పాటు మేమూ ! ఈ పద్ధతులు అవసరమా! అనిపించి అక్షింతలు జల్లేసి బయట పడ్డాము.
పద్ధతులంటే గుర్తొస్తోంది, మా బంధుగణంలో ఒకావిడ ఉంది. ఈ పద్ధతుల గురించిన వివరాలు, విశేషాలూ ఆవిడకు కొట్టినపిండి. ఎవరికైనా ఏదైనా సందేహముంటే వెంటనేఆవిణ్ణి కలుస్తుంటారు. ఆచార వ్యవహారాల గురించి నిక్కచ్చిగా చెప్ప లేని వాళ్లకు వాళ్ల తరఫున ఈవిడే వకాల్తా పుచ్చుకొని ఏకరువు పెడుతూ అజమాయిషీ కూడా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.
ఇంకొందరుంటారు, వాళ్ల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, " మా ఇంటికొస్తే మాకేం తెస్తారు? మీ ఇంటికొస్తే మాకేం ఇస్తారు? " అనే రకం అన్నమాట! వీళ్ళు ఎలా ఉంటారంటే ఎంతసేపూ వాళ్లకు పెట్టవలసినవీ, ఇవ్వాల్సినవీ, అవతలివాళ్ళు పాటించాల్సినవీ మాత్రమే చెప్తారు, రాబట్టుకుంటారు గానీ తిరిగి వాళ్లకు ఇచ్చే పద్ధతుల గురించి మాత్రం ప్రస్తావించరు. అడిగితే, " మాకా పద్ధతులు లేవమ్మా" అంటూ సింపుల్ గా, ఇంకా నిర్మొహమాటంగా అనేసి తప్పించుకుంటుంటారు.కానుకలన్నవి పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి కదా! అలాంటి వాళ్ళని ఏమంటాం చెప్పండి!
ఇలా పద్ధతుల గురించీ, వాటి కథా కమామీషు గురించి చెప్పుకుంటూ పోతే బోలెడుంటాయి రాయడానికి! ఏది ఏమైనా ఎవరినీ నొప్పించని విధంగా ఉండే పద్ధతులు, సంతోషాన్ని మిగిల్చే పద్ధతులు ఎప్పటికీ మంచివే. అలా కాకపోతేనే సమస్య !!
********************************
🌺భువి భావనలు 🌺
********************************
No comments:
Post a Comment