Saturday, December 11, 2021

గాడి తప్పితే..... !


    చిన్నతనంలో చుట్టుపక్కల పిల్లలతో కలిసి హాయిగా గంతులువేస్తూ, పరుగులు పెడుతూ ఆడుకోవడం మహా ఇష్టంగా ఉండే విషయమే  ఎవరికైనా.. స్కూల్ నుండి సాయంత్రం రావడం ఆలస్యం, ఇక అదే పనిగా ఉండేది పిల్లలకి. 
--- ఇదంతా  నలభై, యాభై సంవత్సరాల క్రితం మాట! 
  అప్పట్లో మరో ఇతర వ్యాపకం అంటూ ఏదీ  ఉండేది కాదు మరి !నా  హైస్కూల్ విద్య ప్రారంభమయ్యేసరికి అక్కడక్కడా కొన్ని ఇళ్లలో రేడియో ప్రత్యక్షమైంది. అదో అద్భుతం ఆ రోజుల్లో !ఆ వయసు పిల్లలకి, ఇంకా పెద్దలకి కూడా కాలక్షేపం దొరికింది. 
    మరో పది సంవత్సరాలు గడిచేసరికి టీవీ అన్నది ఆవిర్భవించింది.  అది జనాల్లోకి చొచ్చుకుని రావడానికీ, ప్రతీ ఇంట్లో తిష్ట వేయడానికీ మరో పదేళ్లు పట్టింది. అది మరో అద్భుతం ! అంతవరకూ మాట మాత్రమే వినిపించేది కాస్తా, మాట్లాడే మనుషులు కూడా దర్శనమివ్వడం! ఆహా ! ఎంత విచిత్రం !అనుకున్నారు జనాలంతా. అందుకేనేమో, రామాయణ మహాభారతాలు సినిమాలుగా కోకొల్లలుగా వచ్చినా టీవీ రామాయణ మహాభారతాల్ని పడీ  పడీ చూశారు అంతా! 
   మెల్లిగా  రేడియో స్థానం,ప్రాబల్యం  తగ్గిపోయి ప్రతి ఇంటా బ్లాక్ అండ్ వైట్ టీవీ కొలువుదీరి పోయింది! ఆ ముచ్చట కొంతకాలం కొనసాగాక, కలర్ టీవీ పుట్టుకొచ్చి,  కొత్త వింత పాత రోత అన్నట్లు, బ్లాక్  అండ్ వైట్ టీవీ  కాస్తా మూలకు నెట్టివేయబడింది.అంతే ! అంతా రంగులమయం! అంతవరకూ ఒకే ఒక్క  ఛానల్ తో సరిపెట్టుకునే జనాలకు కన్నుల పండుగ అయింది. బోల్డన్ని చానల్స్! పుట్టుకొచ్చి, పాటలే పాటలు, సినిమాలే  సినిమాలు! అంతేనా, కార్యక్రమాల లిస్టు రాసుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత అవుతుంది మరి!  దాంతో సినిమాల కోసం థియేటర్లకు పరుగులు తీసే జనాభా తగ్గుముఖం పట్టిందంటే ఒప్పుకొనే  తీరాలి.
   రేడియో ఒక అద్భుతం, టీవీ అంతకన్నా అద్భుతం! అంతటితో ఆగిందా! టెక్నాలజీ రోజురోజుకీ పెరిగి పెరిగి... సెల్ ఫోన్ లు  వచ్చేశాయ్. అంతక్రితం ఎక్కడో ఒకచోట ల్యాండ్ ఫోన్స్ ఉండే పరిస్థితి పోయి, ప్రతివారి చేతిలోకీ ఓ ఆభరణంలా సెల్ ఫోన్ వచ్చేసింది. ఎవరు ఎప్పుడు ఎక్కడున్నా ఎవరితోనైనా మాట్లాడే సౌలభ్యం వచ్చేసింది అందరికీ.
    సరే, ఇకనైనా ఫుల్ స్టాప్ పడిందా ! స్మార్ట్ ఫోన్ అవతరించింది ! ఇంకేముంది, అరచేతిలోనే సమస్త విశ్వదర్శనం ! రేడియో, టీవీలో... నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ఆయా కార్యక్రమాలు వినగలం, చూడగలం. కానీ ఈ స్మార్ట్ ఫోన్లో -- ఏది కావలిస్తే అది, ఎప్పుడు  కావలిస్తే అప్పుడు చూసుకునే  సౌలభ్యం, వద్దు అనుకుంటే అప్పటికి ఆపడం, కావాలనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ నుండి' కంటిన్యూ' చేయడం ! ఆహా ! సాంకేతికతా ! నీకు జోహార్ ! అనుకున్నారంతా మళ్లీ!
🌷  * యూట్యూబ్, పేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్..
...ఇలా ఎన్నో..ఎన్నెన్నో.. ! వాడుకున్న వారికి వాడుకున్నంత !
అంతెందుకు, ఇలా ఆర్టికల్స్ అన్నవి ఆన్లైన్ లో రాయాలన్నా, మన ఆలోచనలు నలుగురితో పంచుకోవాలనుకున్నా అరచేతిలో ఇమిడిపోయి చకచకా ఎవరికి వారే టైపు చేసుకుంటూపోయే ఓ అద్భుతమైన ప్రింటింగ్ మెషిన్ కూడా !  
* అంతే కాదు, ఎక్కడో ఖండాతరాలలో ఉన్న ఆప్తులను ఎదురెదురుగా చూస్తూ మాట్లాడుకోవడం!
*  ఇంకా ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో పొందే సౌలభ్యం. 
*  ఇంటినుంచి కదలకుండా ఆన్లైన్ లో షాపింగ్ లూ, బిల్లులు చెల్లించడాలూనూ ! 
---- ఒకటా, రెండా... లెక్కలేనన్ని సౌకర్యాలు ! ఉదాహరించినవి కొన్ని మాత్రమే !సరే,  ఇంతవరకూ టెక్నాలజీ పరుగు ప్రగతి పథంలో దూసుకుపోవడం హర్షణీయం. సదా అభిలషణీయం కూడా..
కానీ --- ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. అనూహ్యంగా పెరిగిపోయిన ఈ సాంకేతికత మానవాళికి ఎంత ఉపయోగకారిగా ఉంటున్నదో అంత ప్రమాదకారిగా కూడా అయి కూర్చోవడం అత్యంత బాధాకరంగా పరిణమించిందన్నది కూడా పచ్చి నిజం ! 
*  చేతిలో ఉంది కదాని దుర్వినియోగం చేయడం, సైబర్ నేరాలకు పాల్పడడం, అమాయకుల్ని ఉచ్చు లోకి లాగడం, ఎన్నెన్నో మోసాలకు దారులు వెతకడం...నిత్యం చూస్తున్నాం. ఇది అందరికీ విదితమే. 
*  మరోవైపు.. యువతే గాదు.. చిన్న పిల్లలు సైతం వీటివల్ల చెడు మార్గాల్ని అనుసరిస్తూ  విపరీత ప్రవర్తనలకు లోనుకావడం! అశ్లీల వీడియోలు చూడ్డమనే వ్యసనానికి బానిసలై చిన్నపిల్లల్ని' 'బలిచేయడం'!
*  మైనర్ బాలికలతో'నీలి ' చిత్రాలు తీసి వాటితో కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారని  ఇటీవలి వార్త !
*  ఇంకా.. స్త్రీల పై లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ చేయడాలూ... వీటికి కొదువే లేదు. 
 ఇలా చెప్పుకుంటూ పోతే, ఇంకా వెలుగులోకి వస్తున్నవి చాలానే ఉన్నాయి.--- ఇదంతా సాంకేతికను దుర్వినియోగం చేయడం కాదా !
---  ఇది నాణేనికి మరో వైపు !  ఏదైనా హద్దుల్లో ఉంటేనే మంచిగా, పద్ధతిగా ఉంటుంది. సాంకేతికత ప్రగతి పథంలో నడవాలి తప్ప పెడదారిలో కాదు. అది 
గాడి తప్పితే పెను ప్రమాదమే అని వర్తమానంలో జరుగుతున్న ఎన్నో విపరీత పోకడలు నిత్యం రుజువు చేస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తు సమాజాన్ని ఊహించలేం..!!
     సాంకేతికత అన్నది అభివృద్ధికి సోపానం. అత్యవసరం కూడా.  సదా ఆహ్వానం పలకాల్సిందే. కానీ, దుర్వినియోగం తగదు. నేర ప్రవృత్తి నివారించాలి. నిర్మూలించే దిశగా ప్రయత్నాలు  జరగాలి. 
                           🌹🌹🌹🌹🌹
         


 

  


 

No comments:

Post a Comment