" ఎన్నడూ అబద్దం ఆడరాదు. ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికై ఒక అబద్ధమాడితే దానికోసం మరెన్నో అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. దాంతో నీవు చేసే తప్పుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది... "
మాస్టర్ గారు పాఠం చెప్పుకుంటూ పోతున్నారు. ఇదేమీ పట్టని విక్రాంత్, ఉత్తేజ్ క్లాసులో వెనకాల కూర్చుని, డెస్క్ కిందుగా ఉంచుకున్న బొమ్మల పుస్తకం చూడడం లో లీనమై పోయారు. ఉన్నట్లుండి భుజాలమీద పడ్డ దెబ్బతో ఉలిక్కిపడి ఇద్దరూ ఒక్కసారే చటుక్కున లేచి నిలబడ్డారు. ఎదురుగా గుడ్లురుముతూ మాస్టారు! ఫలితం ! చేతులు వాచిపోయేలా దెబ్బలు తిని ఇద్దరూ బెంచీలు ఎక్కి నిలబడ్డారు. ఆ సాయంత్రం బెల్ కొట్టగానే ఇంటికివెళ్తూన్న వాళ్ళిద్దరి లోనూ ఒకటే ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఉన్నట్లుండి విక్రాంత్ అన్నాడు,
" రేయ్, ఈ మాస్టారు మంచివాడు కాదు, చూడు ఎలా కొట్టాడో! "
ఎర్రగా కమిలిన చేతులు చూపుతూ అన్నాడు. కానీ ఉత్తేజ్ మస్తిష్కంలో మరో రకపు ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి. వాడి మనసంతా ఇందాక చూసిన బొమ్మల పుస్తకంలోని హీరోయే నిండి ఉన్నాడు.
" రేయ్, విక్రాంత్, ఆ హీరో ఎంత గొప్ప పనులు చేశాడో చూసావా! హెలికాప్టర్ పై నుండి క్రిందకు జారడం, ఒక రైలు మీద నుండి మరో రైలు మీదకు దూకడం... ఓహ్ ! మనం కూడా అలాంటి పనులు చేస్తే ఎంత మజాగా ఉంటుందో కదా!.. "
ఉలిక్కిపడ్డాడువిక్రాంత్.
" మనమా !"
" అవును మనమే... ఎందుకు చేయకూడదు? సాహసకృత్యాలు చేయడంలో ఎంత థ్రిల్ ఉంటుంది !"
విక్రాంత్ మౌనం ఉత్తేజ్ను మరింత ఉత్సాహ పరిచింది.
"... ఈ బడి, చీటికి మాటికి కొట్టే ఈ మాస్టర్ లు, ఎప్పుడూ సణుగుతూ ఉండే అమ్మానాన్నలు! ఏది చేయాలన్నా సవాలక్ష ఆంక్షలు! ఆటంకాలు! వీరందరికీ దూరంగా స్వేచ్ఛగా కొంతకాలం గడిపితే ఎలా ఉంటుంది!.... "
విక్రాంత్ లేత మనసులో విషపు బీజం పడడానికి ఎంతోసేపు పట్టలేదు. సాలోచనగా అన్నాడు,
" నిజమే, బాగానే ఉంటుంది, కానీ ఎలా? "
" ఎలాగో నేను చెప్తాగా... "
వాడి భుజంపై చేయి వేస్తూ అన్నాడు ఉత్తేజ్. ఇల్లు చేరే లోగా వారిద్దరి మెదడులో ఒక చక్కటి పథకం సిద్ధమైపోయింది.
** ** ** **
అప్పుడు సమయం రాత్రి పదకొండు అవుతోంది. నిర్మానుష్యమైన ఆ వీధి గుండా ఆ ఇద్దరూ పడుతూ లేస్తూ పరిగెత్తుకుంటూ పోతున్నారు.
".... అబ్బ, ఉత్తేజ్, ఇక నావల్ల కాదు.... "
ఆయాసపడుతూ లైట్ స్తంభానికి ఆనుకుని నిలబడ్డాడు విక్రాంత్.
" రేయ్,... ఇంకెంత,... కాస్త వెళ్ళామంటే మనుషులు ఉన్న చోటికి వెళ్తాము. ప్లీజ్, పదరా.. "
అంటూ ఆ అబ్బాయి చేయి పట్టి లాక్కెళ్లాడుఉత్తేజ్.
అప్పటికది మూడో రోజు వాళ్ళిద్దరూ ఇల్లు విడిచి పెట్టి వచ్చి. రెండు రోజులు బాగా సరదాగానే గడిచాయి. కానీ మూడోరోజుసాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి ఊహించని కష్టాలు! వాళ్ళ నాన్నల జేబులోంచి కొట్టేసిన డబ్బులు అయిపోయి తినటానికి తిండి లేక అల్లాడిపోవడం అప్పుడే మొదలయింది. సరిగ్గా అప్పుడే,
పెద్దమనిషిలా కనిపిస్తున్న ఒకతను వీళ్ళ వాలకం కనిపెట్టి మెల్లిగా గుట్టంతా లాగాడు. అంతే ! వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పి, మరో మనిషి వద్దకు తీసుకెళ్లి అప్పగించాడు. లోకజ్ఞానం తెలియని ఆ అమాయక పిల్లలిద్దరికీ వెంటనే తట్టలేదు, ఆ నకిలీ పెద్దమనిషి తామిద్దర్నీ అతనికి బేరమాడి అమ్మేసాడనీ, అతను తమతో వ్యాపారం చేయనున్నాడనీ ! దానిలో భాగంగానే వాళ్ళిద్దరూ గుసగుసలాడుకున్న వైనాన్ని బట్టి తామిద్దర్నీ అంగవికలుర ను చేయబోతున్నారనీ ! ఆ ఊహ రాగానే వారి గుండె గుభేలుమంది.
ఆ రాత్రి ఎలాగో వాళ్ల కన్నుగప్పి అక్కడి నుంచి బయట పడే సరికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయింది. అక్కడ మొదలుపెట్టిన పరుగు రెండు వీధులు దాటి చివరిదాకా వచ్చే వరకూ ఇద్దరూ ఆపలేదు. ఫలితం! ఎన్నడూ లేని ఆయాసం, దడ !
కాస్త తేరుకుని నాలుగడుగులు వేశారో లేదో, ఎదురుగా బీట్ కానిస్టేబుల్ గుడ్లురుముతూ యములాడిలా వస్తూ కనిపించాడు. అంతే ! వాళ్ల పైప్రాణాలు పైనే పోయాయి.
" రేయ్, ఎవర్రా మీరు? ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు?.... "
వాళ్ళ బె దురు చూపులు చూసి, ఏదో శంకించిన అతను వాళ్ళిద్దర్నీ తిన్నగా పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లాడు.
** ** ** **
"మూడు రోజుల నుంచీ మా పిల్లల కోసం తిరగని చోటు లేదు, వాకబు చేయని ప్రదేశమూ లేదు. వీళ్ళు చేసిన పనికి సిగ్గుతో తలెత్తుకోలేకుండా ఉన్నాం సార్..."
విక్రాంత్ నాన్నగారు ఎస్. ఐ గారితో బాధగా అన్నాడు.
" ఏమైనా మీకు చాలా థ్యాంక్స్ అండీ, మా పిల్లల్ని క్షేమంగా మాకు అప్పగించారు...."
ఉత్తేజ్ నాన్న కృతజ్ఞతగా అన్నారు.
" దాందేముందిలెండి, మా డ్యూటీ మేము చేశాం. అయినా ఈ కాలం పిల్లల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలి సుమండీ! చిచ్చర పిడుగుల్లాంటి వీళ్ళ బుర్రల్లో ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు కదులుతుంటాయో చెప్పలేం..."
ఎస్సై గారు సాలోచనగా తలాడిస్తూ అన్నారు.
ఉత్తేజ్, విక్రాంత్ -- ఇద్దరూ గదిలో ఓమూల తలలు దించుకుని ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో అంతులేని పశ్చాత్తాపం తొంగిచూస్తోంది. పట్టరాని కోపంతో ఇద్దర్నీ పట్టుకొని చావబాదుతారేమో అని హడలిపోతోంటే, తద్భిన్నంగా తమ తండ్రులిద్దరూ ఇద్దరి నీ దగ్గరకు తీసుకొని హత్తుకుంటూ కన్నీటి పర్యంతం అవటం చూసేసరికి నిజంగా వాళ్ళిద్దరికీ తామెంత తప్పుపని పనిచేశారో తెలిసివచ్చింది.
సినిమాల్లో, కథల పుస్తకాల్లో చూసి, చదివి ఏవో సాహసకృత్యాలు చేయాలనుకుంటే ఇంటాబయటా ఎలా అవమానాల పాలు కావలసి వస్తుందో, అది ఎంతటి విపరీతాలకు దారితీయగలదో వాళ్లకు అనుభవపూర్వకంగా ద్యోతకమయింది. " పుస్తకాల్లోని మంచిని గ్రహించాలి. చెడును అవగాహన చేసుకొని విసర్జించాలి,"అన్న నిజం వాళ్లకు ఆ క్షణంలోనే అవగతమయింది.
💐💐💐💐💐
[పిల్లల మాసపత్రిక ' బాలమిత్ర ' లో ప్రచురితం ]
********************************
🌺భువి భావనలు 🌺
********************************
No comments:
Post a Comment