Saturday, November 6, 2021

ఆడపిల్ల.. పెళ్లికి ముందు.. ఆతర్వాత..!

                                             🌷🌷🌷🌷🌷🌷🌷
                                                భువి భావనలు🐦
                                            🌷🌷🌷🌷🌷🌷🌷               

       పాత తెలుగు సినిమాల్లో బాగా గమనిస్తే హీరోయిన్ల విషయంలో ఒక అంశం గమనించవచ్చు. అదేంటంటే... పెళ్లికి ముందు అమ్మాయి.... లంగా వోణీ, పొడుగాటి జడ, దాని చివర జడకుప్పెలు, తల్లో  ఓ బంతి పువ్వు, లేదా ఏదో ఒక పూల దండ తో చెంగు చెంగు మంటూ చెట్ల వెంటా పుట్టల వెంటా తుళ్ళుతూ, లేడి పిల్లలా  గంతులు వేస్తూ హాయిగా పాట పాడుతూ కనిపిస్తుంది.ఒకటి రెండు సీన్ల తర్వాత పెళ్లయిపోతుంది ఆ పిల్లకి.. అంతే! నెక్స్ట్ సీన్లో పెద్ద ముత్తయిదువులా నిండుగా చీర, నుదుట  కాసంత బొట్టు, చేతినిండా గాజులు, మరీ ముఖ్యంగా ఇంత  పెద్ద కొప్పు వేసుకుని పెద్ద ఆరిందాలా హుందా గా మారిపోయి కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే..... 
     ఆడపిల్ల పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్లి  తర్వాత ఎలా ఉండాలో సినిమాల్లో అప్పట్లో చూపించేవారు. అంటే పెళ్లికి ముందు పుట్టింట్లో ఎంత గారాబంగా ఉన్నా పెళ్లి తర్వాత బాధ్యతగా ఉండాలన్నది దానర్థమేమో !అప్పట్లో ఆ ట్రెండు నడిచేది ఆహార్యం విషయంలో. ఆహార్యం సరే, ఆమె జీవితం గురించిన మాటేమిటి? అసలు ఆడపిల్ల జీవితం పెళ్లికి ముందు ఉన్నట్లు పెళ్లి తర్వాత కూడా నిశ్చింతగా ఉండే అవకాశం లేదా? ఖచ్చితంగా లేదనే జవాబు వస్తుంది కాస్త ఈ ఉదాహరణలు చూస్తే  --

* రజని  డిగ్రీ పూర్తయిన వెంటనే ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా చేరింది. ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి. తన కంటూ కొన్ని అభిరుచులు, జీవితం పట్ల కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. కానీ అదృష్టమో దురదృష్టమో జాబ్ లో చేరిన కొన్ని నెలలకే పెళ్లి కుదిరిపోయింది. పెళ్లి తర్వాతా భర్త ఉన్నచోటే ఏదైనా జాబ్ వెతుక్కోవచ్చు లే అనుకున్న ఆమె ఆశ తీరే  దారిఎంత మాత్రమూ  లేదని కొద్దిరోజుల్లోనే అర్థమైపోయింది ఆమెకి. కారణం, భార్య ఉద్యోగం చేయడం భర్తకు ఇష్టం లేకపోవడం!  పైగా ఆమె అభిరుచులు అన్నింటి మీద నిరసన ప్రదర్శిస్తూ ఆమె ఆశలన్నింటి మీద నీళ్లు చల్లడం! భార్య అంటే వండి వార్చే  ఓ మర మనిషి మాత్రమే అన్న సంకుచిత స్వభావి అతను కావడం! అంతే, రజని  ఆశలన్నీ ఆవిరైపోయి జీవితం నిస్సారంగా, నిస్తేజంగా మారిపోయింది. 
* పావని ది  మరోరకం! పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయవచ్చన్నారు అత్తింటివారు. బాగానే ఉంది. కానీ నెల జీతం అంతా నయా పైసల్తో  సహా తెచ్చి వాళ్ళ చేతిలో పెడితే గానీ ఊరుకునే వారు కాదు. భర్త తల్లి మాటకు తాన తందాన అనే రకం! సంపాదిస్తున్నా, పది రూపాయలు ఖర్చు పెట్టుకునే స్వాతంత్ర్యం లేని బ్రతుకై  పోయిందిపావనిది ! పెళ్లికి ముందు ఆమె కన్న కలలన్నీ.
 కల్లలై పోయి శూన్యం మిగిలిపోయింది. 
* సమీర ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెరిగిన ఆ పిల్ల అత్తగారింటికొచ్చి ఊహించని విధంగా ఆ ఇంట్లో జీతభత్యాలు లేని ఓ పని మనిషి గా మారిపోయింది. కాలు కదిపితే కంది పోతుందేమో అన్న  చందాన పెంచుకున్న బిడ్డ ఓ అనాగరిక  కుటుంబంలో పడిఅల్లాడి పోతున్నందుకు  తల్లీ దండ్రీ  నెత్తి నోరూ  బాదుకుంటూ చింతించని  క్షణం లేదు. అల్లుడు ఉద్యోగే  కానీ తల్లిదండ్రుల మాట జవదాటడు. భార్యకు అండగా ఉండాలన్న ధ్యాస ఉండకపోగా మాటలతో హింసించే  రకం! ఫలితం! సమీర మొహంలో నవ్వు అన్నది మటు మాయమైపోయింది.
      అందరి పరిస్థితీ ఇలాగే ఉందనీ  చెప్పలేం. కొందరు అదృష్టవంతులూ  ఉంటారు. ఆ కోవకు చెందిందే కమల. 
* ఇంటర్ దాకా  చదివిన కమలకు మోహన్ తో పెళ్లయింది. అతను ఓ ప్రైవేటు యాజమాన్యంలో ఓ చిరుద్యోగి. భార్య చదువులో చురుగ్గా ఉండటం గమనించిన అతను ప్రైవేట్ గా డిగ్రీ కట్టించాడు ముందుచూపుతో. అతని ప్రోత్సాహంతో చదువు కొనసాగించిన కమల నాలుగేళ్లలో బీఈడీ కూడా పూర్తి చేసి, లక్షణంగా  ఉద్యోగంలో చేరి పోయింది. ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం ఆమె  సంసారం హాయిగా, సాఫీగా సాగిపోతోంది. ఇదంతా కేవలం భర్త సహృదయత, ఆతని అవగాహన వల్లే సాధ్యమైందని చెప్పక్కర్లేదు కదా ! 
* స్నిగ్ధ  బాగా చదువుకుంది, కానీ నోట్లో నాలుక లేని పిల్ల. పెళ్లయి, పోయి పోయి ఓ ఉమ్మడి కుటుంబం లో పడి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అత్తగారు, ఆడపడుచు, తోడికోడలు మాటలతో హింసించడం, పనంతా ఆమె నెత్తినే వేయడం, ఉన్నవీ లేనివీ కల్పించి ఆమె పై దుష్ప్రచారం చేయడం సాగించారు. అంతా భరిస్తూ  మౌనంగా రోదిస్తున్న భార్య పరిస్థితి గమనించిన భర్త కుమార్ అదును చూసి వేరింటి కాపురం పెట్టేసి, ఆమెను ఆ ఇక్కట్ల బారినుండి తప్పించేశాడు.
--- ఇలా, కమల, స్నిగ్ధ -- ఇద్దరూ పెళ్లి తర్వాతా సంతోషంగా జీవనం గడిపే అదృష్టం దక్కించుకున్నారు. అది కేవలం వారికి లభించిన భర్తల సహకారం, అవగాహన వల్ల మాత్రమే సాధ్యమైంది మరి !
    దీన్ని బట్టి చూస్తుంటే ఆడపిల్ల అదృష్టవంతురాలా లేక దురదృష్టవంతురాలా అన్నది లభించిన భర్త మీదే ఆధారపడి ఉంటుందన్నది స్పష్టమవుతున్నది. కమల, స్నిగ్ధ లాంటి అదృష్టవంతుల శాతం బహు తక్కువ అనే చెప్పాలి. అబ్బాయిలు కూడా పెళ్లికి ముందు కాబోయే భార్య గురించి ఏవేవో ఊహించుకోవడం సహజమే! వారు కోరుకున్న విధంగా కూడా జరగని వాళ్ళూ  ఉంటారు. కానీ అబ్బాయి లకున్న  సౌలభ్యాలు అమ్మాయిలకు పెళ్లి తర్వాత ఉండే అవకాశం  మన సమాజంలో పూర్వపు రోజుల్లో నే కాదు ఈ ఆధునిక రోజుల్లో కూడా ఎంత మాత్రం ఉండడం లేదంటే అతిశయోక్తేమీ కాదు. 
      అంతవరకూ పుట్టిపెరిగిన ఇల్లు, ఆ వాతావరణం, కన్న తల్లీ దండ్రీ, తోబుట్టువులు... ఈ అందర్నీ ఒక్కసారిగా వదిలేసి ఓ కొత్త ఇంటికి, కొత్త మనుషుల మధ్యకి తరలివెళ్లాల్సిఉంటుంది ఆడపిల్ల ! అక్కడ ఆ వాతావరణం, ఆ మనుషులు ఈ అమ్మాయిని సాదరంగా తమలో కలుపుకోగలిగితే అదృష్టవంతురాలే. కానీ ఏమాత్రం తేడా వచ్చినా ఆ పిల్లకు సంకటమే. దానికి తోడు కట్టుకున్న భర్త అన్నవాడు కూడా అర్ధం చేసుకోలేని మనస్తత్వం గలవాడైతే అది మరీ నరక సదృశంగా ఉంటుందా కొత్త ఇంటిలో ! 
     అదే మగవాడైతే ఉన్న చోటు నుండి ఎక్కడికీ కదలాల్సిన పనే ఉండదు. అతని ఇష్టాలు, రుచులు, అభిరుచులు, ఆశయాలు,  తన కెరీర్ గురించిన  లక్ష్యాలు ఏవీ మార్చుకోవాల్సిన  అవసరం ఎంతమాత్రమూ ఉండదు. అందుకోసం ఎవరి అనుమతీ  అవసరం లేదు ఎంచక్కా తన మనుషుల మధ్య యథాతధంగా ఉండవచ్చు. కానీ భార్యగా  ఆ ఇంట  కాలు పెట్టిన ఆడది మాత్రం అన్నీ మార్చుకోవలసి ఉంటుంది. అంతేకాదు, ఆ విధంగా తన అభిరుచుల్నీ, అనుకున్న లక్ష్యాల్నీ చంపుకుని జీవచ్ఛవంలా కేవలం కుటుంబం కోసం ఓ ప్రాణంలేని యంత్రంలా  బతకాల్సి వస్తుంది. 
    పూజ కొద్దీ పురుషుడు అంటారు, పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయింపబడతాయి  అంటారు. అదంతా ఏమోగానీ, ఆడపిల్ల జీవితం మాత్రం నుదుటి రాత ప్రకారం నడుస్తుంది అన్నది నిర్వివాదాంశమే అనిపిస్తుంది ఇలాంటివి  వింటుంటే.
     దృఢ  సంకల్పం, ఆత్మవిశ్వాసం, భర్తను ఆకట్టుకోగలిగిన  చాకచక్యం, సమస్యల్ని   సొంతంగా పరిష్కరించుకోగల నైపుణ్యం, వీటన్నింటితో పాటు పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యం -- ఇవన్నీ ఉన్న అమ్మాయిలు తమ అభిరుచుల్ని, లక్ష్యాల్ని సమాధి చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నింటినీ అధిగమించి తమకంటూ ఓ మంచి భవిష్యత్తును సృష్టించుకో గలరు. అలా నెగ్గుకొస్తున్నవాళ్ళు కూడా ప్రస్తుత సమాజంలో ఉంటున్నారు. ఎటొచ్చీ, ఆ సామర్ధ్యాలు లేకుంటేనే సమస్య!
                             🌹🌹🌹🌹🌹

.
                           







  












No comments:

Post a Comment