ముక్కుపచ్చలారని పసిపాపల్లోనూ
ఆడతనాన్ని వెతికే నీచనికృష్టులు !
తల్లి వయసు ఆడదాని లోనూ
అమ్మను చూడలేని కామాంధులు!
అడుగడుగునా పుట్టుకొచ్చి
అరాచకంగా మారిపోయి మచ్చపడ్డ
సమాజం ప్రస్తుతం మనది !
వయోబేధాలు, వావి వరుసలు
ఎరుగని మానవమృగాలు !
విలువలు మరిచి వీధి వీధినీ
విచ్చలవిడిగా విహరిస్తూ
పడతులకూ, పసిపాపలకేగాదు
స్త్రీజాతి మొత్తానికే రక్షణ లేదని
నిరూపిస్తున్న నిత్యం జరుగుతున్న అకృత్యాలు!
మృగాలతో పోలిస్తే మృగాలు సైతం
సిగ్గుతో తల దించుకునే దారుణ ఉదంతాలు !
భారతదేశం పవిత్రతకు మారుపేరన్న
పరదేశీయుల ప్రగాఢ నమ్మకం
నానాటికీ దిగజార్చుతూ
పెచ్చరిల్లుతున్న పైశాచికకాండలు !
ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తూ నిలదీస్తున్నాయి
చట్టాలకు వెరవని, శిక్షలకు లొంగని
కరడు గట్టిన క్రూర మానవుల
ఈ మారణకాండలు భరించాల్సిందేనా?
భరించి సహించాల్సిందేనా?
ఎప్పటికైనా మారునా ఈ మనుషుల నైజాలు !
అసలొస్తాయా మారే ఆ రోజులు !
నేడు ----
ఆక్రోశిస్తున్న ప్రతీ అంతరంగం అడుగుతున్న
జవాబు దొరకని ప్రశ్న ఇది !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🌹భువి భావనలు 🌹
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
No comments:
Post a Comment