Sunday, December 10, 2023

' దేవుడు లేనిదెక్కడ !

🐦 🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

దేవుడెక్కడ ? అసలున్నాడా ? 
ఉంటే ఎక్కడున్నాడు ? 
గుళ్ళూ గోపురాలు తిరిగాను...
పుణ్యక్షేత్రాలెన్నో  దర్శించాను... 
పండితులను ప్రశ్నించాను... 
పామరులతో ముచ్చటించాను... 
ఆస్తికులందర్నీ  ఆశగా చూశాను... 
ఎక్కడా జవాబు లేదు... !
ఇంతకీ---
దేవుడెక్కడ ? అసలున్నాడా ? 
ఉంటే ఎక్కడున్నాడు ? 
ఇంటి దారి పట్టాను విసిగి వేసారి.. 
ఆగుతూ ఆగుతూ..సాగుతూ సాగుతూ.. 
చూశాను అటూ ఇటూ ఓసారి... 
బీటలు వారిన భూమి !
పైనేమో మబ్బులు కమ్మిన ఆకాశం !
ఉన్నట్టుండి రాలిందో చల్లటి చినుకు !!
చూస్తున్నా... చూస్తూనే ఉన్నా...
చిరుజల్లు కాస్తా అయింది జడివాన !
పులకించిపోయింది పుడమి తల్లి...!
ఆపై ----
రోజుల వ్యవధిలో నేలతల్లి ఒడిని
చిన్ని చిన్ని మొలకలు !! 
పచ్చగా.. పచ్చపచ్చగా...! 
బీడు కాస్తా..  అయింది నేడు సస్యశ్యామలం !
అంతే ! ఎన్నో ఏళ్ల నా నిరీక్షణ
ఫలించెనో  ఏమో ! అయ్యాడు ప్రత్యక్షం
హఠాత్తుగా నా ముందు 'దేవుడు' !
'వానదేవుడు' !!
గాలికి తలలూపుతూ నులి వెచ్చని
సూర్యకిరణాల స్పర్శ అనుభవిస్తూ...
కనులవిందుగా దర్శనమిస్తూ.. పంట పొలాలు !
ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు మరో దేవుడు !
'సూర్య భగవానుడు' !
అదిగో !! కోతకొచ్చాయి పండిన పంటలు! 
రైతన్న కళ్ళలో కోటి కాంతులు !!
ఆరుగాలం శ్రమకు అందిన ప్రతిఫలాలు !
కళ్ళెదురుగా నిండైన ధాన్య రాశులు !
మళ్లీ ప్రత్యక్షం ! 
'అన్నదాత'గా మరో దేవుడు!
కనిపించే దేవుడు !!
మట్టి పిసుక్కునే ఆ మనిషే లేకుంటే...
మనిషికి మెతుకన్నదే లేదు కదా !
మరి ---
ఆ మట్టి 'మనిషి'.... 
దేవుడు కాక మరేమిటి ? 
కరిగాయి కంటిపొరలు... 
విడివడ్డాయి సందేహాలు...
గర్భ గుడిలో లేడు దేవుడు...
అంతటా ఉన్నాడు..! ఇక్కడా.. అక్కడా.. 
నా చుట్టూ.. నన్నావరించి...!
ఆపదలో నన్నాదుకునే ప్రతీ మనిషిలో.. 
పొరుగు వాడికి సాయమందించే క్షణాన...
స్వయానా నాలో.. నిండి ఉండేది..
దర్శనమిచ్చేదీ దైవత్వమే...!
నాలోనే కొలువై ఉన్న 'దేవుణ్ణి' 
గుర్తించజాలక... ఎక్కడెక్కడో తిరిగిన 
నా అజ్ఞానం పటాపంచలై..  
అయ్యిందొక్కసారిగా జ్ఞానోదయం !!
వెన్వెంటనే ---
నాలోనూ... నా ప్రశ్నలోనూ  మార్పు...!
'దేవుడెక్కడ?' కాదు...
'దేవుడు లేనిదెక్కడ?' అని !!
 చీకటి ముసిరిన నా మదిని
 వెలుగులు ప్రసరించి... గ్రహించాను 
 వెల లేని జీవిత సత్యాన్ని !! 🙏

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦




2 comments:

  1. ఆపదలో ఉండి, దేవుడా నీవే దిక్కు అని ప్రార్థించిన వాడికి సాయం చేసే మనిషే దేవుడు.

    ReplyDelete
  2. కరెక్ట్ అండీ. దేవుడే దిగి రానవసరంలేదు. మనిషి రూపంలో అందే సాయం ఆ దేవుడిదే. ఆ మనిషే దేవుడు.

    ReplyDelete