యం. ధరిత్రీ దేవి
" ఆ హైదరాబాద్ సంబంధం వాళ్లు ఇందాకా ఫోన్ చేశారే.... "
ఇంట్లోకి వస్తూ శ్రీనివాస రావు భార్యనూ, కూతుర్ని ఉద్దేశించి చెప్పాడు. అక్కడే ఉన్న ఆ ఇద్దరూ ఒకరినొకరు ఓసారి చూసుకుని విషయం ఏమిటన్నట్లు ఆయన వైపు చూశారు.
".. అదే.. కొన్ని సడలింపులు చేస్తూ, అలాగైతే మాకు ఓకే, ఆలోచించుకోండి... అని అబ్బాయి తండ్రి కాల్ చేసి చెప్పాడు. "
నెల క్రితం ఆయన కూతురు క్రాంతిని చూసుకోవడానికి పెళ్లి వారొచ్చారు . తను మెడిసిన్ చేసి, పీజీ కూడా కంప్లీట్ చేసి, సంవత్సరం క్రితమే ఓ హాస్పిటల్ లో డాక్టర్ గా జాయిన్ అయింది. ఇప్పటికి ఏడెనిమిది సంబంధాలు చూశారు. అన్నీ డాక్టర్ సంబంధాలే. కానీ ఏవీ కుదరడం లేదు. క్రాంతి మరీ గొప్ప అందంగా లేకపోయినా పరవాలేదనిపించే అందమే. చాలా విషయాల్లో వీళ్లే రాజీ పడుతున్నారు గానీ, అవతలే సమస్యగా ఉంది. అంతా ఓకే అనుకున్నాక కట్నాల దగ్గర బ్రేక్ పడుతూ విషయం ఆగిపోతోంది. ఎంతో ఖర్చు భరించి, డాక్టర్ చదువు చదివి, పైగా ఉద్యోగం కూడా చేస్తూ తిరిగి అంతలేసి కట్నాలివ్వడం, ఇంకా వాళ్ల గొంతెమ్మ కోరికలకి ఊకొట్టడం క్రాంతికి అసలు నచ్చడం లేదు.
" ఏమిటి నాన్న! ఇంత చదివినా ఇలా భర్త అనేవాడిని కొనుక్కోవాల్సిందేనా !అదీ మన స్థాయికి మించి ధార పోయాలా? వద్దు నాన్నా.. "
అంటూ వాదిస్తూ వస్తోంది. తల్లిదండ్రీ ' తప్పదమ్మా ' అని నచ్చజెబుతున్నా ఆమె మనసంగీకరించక అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఎలాగోలా నచ్చజెప్పి, నెల క్రితం ఓ సంబంధం చూడడం జరిగింది.
అతనూ డాక్టరే. హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేస్తున్నాడట. పేరు బాలగంగాధర్. క్రాంతి ని చూడగానే మామూలుగానే అతనికి నచ్చింది. క్రాంతికి అర్ధాంగీకారమే ! తర్వాతేముంది ! షరా మామూలే...
నాలుగు రోజుల తర్వాత ఇచ్చి పుచ్చుకోవడాల్ని గురించి చర్చించుకున్నారు. నలభై లక్షల కట్నం, ముప్ఫై తులాల బంగారం, అతని ఇద్దరు ఆడపడుచులకు చెరో ఇరవై వేలు లాంఛనాలు, దీనితో పాటు పెళ్లి మీరే చేయాలి అంటూ పెద్ద లిస్ట్ చదివారు.
"క్రాంతికి పిచ్చెక్కిపోయింది. ససేమిరా అంటూ తండ్రితో వాదన మొదలెట్టింది. ఈసారి ఆయన క్కూడా సబబుగా తోచక... వెంటనే నో చెప్పక ఆలోచించి చెప్తామని అప్పటికి దాటవేశాడు.
" రాను రాను ఇలా తయారయి పోతున్నారేంటి జనం! ఆలోచిస్తూ ఉంటే ఆడపిల్లల్ని పెద్దపెద్ద చదువులు చదివించడం అపరాధంలా భావించే రోజులొచ్చాయి తల్లిదండ్రులకి. ఏదో కాస్త చదివిన వాళ్ళకి వాళ్లకు దగ్గ సంబంధాలు కష్టపడకుండా కుదిరి పోతున్నాయి. బంధువుల్లో క్రాంతి ఈడు వాళ్లంతా ఎప్పుడో పెళ్లిళ్లు అయిపోయి, పిల్లల తల్లులు కూడా అయిపోయారు. ఈ పిల్లకేమో ముప్పై దాటబోతున్నాయి".
అలా వగస్తూ తల్లిదండ్రీ తల పట్టుకోవడం చూసి,వాళ్ళ మనోగతం గ్రహించిన క్రాంతికి మనసంతా వికలమై పోయింది.
తండ్రి అంతంత మాత్రం ఉద్యోగస్తుడు. రిటైర్ అయ్యే లోగా కూతురి పెళ్లి చేయాలని ఆరాట పడ్డాడు కానీ, కుదరలేదు. అక్కడికీ తను అప్పుడప్పుడూ కూడబెట్టిన డబ్బుతో రెండు చోట్ల ప్లాట్లు తీసి పెట్టాడు. అంతో ఇంతో బంగారం చేయించి ఉంచాడు. చదువులో హుషారుగా ఉంది కదా అని కూతుర్ని ప్రోత్సహిస్తూ, అనుకోని విధంగా మెడిసిన్ సీటు తెచ్చుకుంటే భారమనుకోకుండా చదివించాడు. చూస్తూ చూస్తూ డాక్టర్ చదివిన అమ్మాయికి అరకొర సంబంధం ఎలా చేయాలి, అన్నది ఆయన బాధ ! అక్కడికీ ఉన్నదంతా ఊడ్చి పెట్టి ఇద్దామనే అనుకుంటున్నాడు, కానీ డాక్టర్ పెళ్ళికొడుకులు ఆకాశం లో ఉంటున్నారు !
నెల దాటాక దాదాపు ఇక ఆ సంబంధం మీద ఆశలు వదిలేసుకున్నారు తల్లిదండ్రులిద్దరూ. ఇప్పుడు సడన్ గా ఈ ఫోన్ ! సడలింపులట ! అవేంటో మరి !
భార్యనూ, కూతుర్నీ కూర్చోబెట్టి చెప్పాడు శ్రీనివాసరావు,
" ముప్ఫై లక్షల కట్నం, పాతిక తులాల బంగారం, ఆడబిడ్డల కట్నాలలోనూ కాస్త తగ్గింపు... పెళ్లి మాత్రం మనదే నట.అదీ గ్రాండ్ గా వాళ్ళ బంధువుల్లో పలుచన కాకుండా చేయాలట ! మన అమ్మాయి వాళ్ళ అబ్బాయికి బాగా నచ్చిందట, అందుకని మళ్ళీ ఆలోచించి, ఫోన్ చేస్తున్నాం అంటూ చెప్పారాయన. అదీ విషయం..."
ముగించి ఏమంటారు, అన్నట్లు చూశాడాయన ఇద్దరి వైపు.
కుర్చీలోంచి దిగ్గున లేచింది క్రాంతి.
" నాన్నా, నాకు రెండు రోజులు టైమిస్తారా?.... "
కూతురిమాట కాదనటం ఎప్పుడూ ఆయనకు అలవాటు లేదు.
" సరేనమ్మా, నీ ఇష్టం..." అన్నాడు
వెంటనే గదిలోకెళ్ళి పెళ్లి చూపులకు ముందు వాళ్ళు పంపించిన అబ్బాయి బయోడేటా పేపర్ తీసింది క్రాంతి. ఆమె చూపు చివర్లో కాంటాక్ట్ నెంబర్ అన్న చోట ఉన్న మొబైల్ నెంబర్ మీద నిలిచింది.
*******************
పాత పేషంట్లందర్నీ ఓసారి పరామర్శించి, కొత్త పేషెంట్ల సమస్యల్ని తెలుసుకొని, పని ముగించుకుని లంచ్ టైం అవడంతో తన రూమ్ లో కొచ్చి విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాడు డాక్టర్ గంగాధర్. అంతలో ఫోన్ రింగ్ అయింది. ఏదో కొత్త నెంబర్. అన్నోన్ నెంబర్ అనుకుంటూ పట్టించుకోలేదు. కానీ ఓ నిమిషం తరువాత మళ్ళీ రింగ్ అయింది. ఎవరో తెలిసిన వాళ్లే అయి ఉంటారనుకుంటూ ఎత్తాడు.
" హలో... డాక్టర్ బాల గంగాధర్..!"
" ఎస్...."
" నేను క్రాంతి, డాక్టర్ క్రాంతి..."
క్షణం అతని భృకుటి ముడివడింది. వెంటనే స్ఫురించి,
" ఓ క్రాంతి, మీరా..!"
" అవునండీ నేనే. మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి, వీలవుతుందా?... "
" ఓ... విత్ ప్లెజర్,. చెప్పండి... ఫ్రీ గానే ఉన్నాను..."
" మీ నాన్నగారు ఫోన్ చేశారట..."
" అవును.. ఇంట్లో అంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది... "
" నేను మీకు బాగా నచ్చానన్నారట !.. కాబట్టి..."
"... అవునండీ అందుకే..."
"... ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకండి ప్లీజ్.. నేను మీకు నచ్చానంటున్నారు,.. బాగానే ఉంది.. కానీ మీరు నాకు నచ్చారో లేదో అడగాలనిపించలేదా?.. "
అప్రతిభుడయ్యాడు గంగాధర్! ఏమాత్రం ఊహించని ఈ ప్రశ్నకు క్షణకాలం నివ్వెరపోయాడు. వెంటనే తేరుకుని,
".. మీ ఇంట్లో అడిగే ఉంటారని అనుకున్నా నండీ... "
"... సారీ.. మనదేశంలో ఆడపిల్ల తండ్రులకు ఆ అలవాటు అసలు ఉండదండీ.. అబ్బాయి తరఫు వాళ్లకు నచ్చిందంటే చాలు, తెగ సంబరపడిపోయే అల్పసంతోషులు వీళ్లంతా.. "
తికమకగా, కాస్త గాభరాగా ఇంకా ఏదో భిన్నంగా అనిపించి, " ఏమిటీ అమ్మాయి ! ఇలా మాట్లాడుతోందేమిటి? " అనుకున్నాడు.
".. సారీ అండీ, ఇలా మాట్లాడుతోందేమిటీ, అనుకుంటున్నారు గదూ.."
నిటారుగా అయ్యాడతను !
".. విషయానికొస్తాను. మీరు వేరే స్టేట్లో డొనేషన్ కట్టి మెడిసిన్ చదివి, డాక్టర్ అయ్యారని చెప్పారు, పెళ్లి చూపులకు ముందు. ఇప్పుడు బాగానే ఉంటుంది సంపాదన. ఆస్తులు కూడా చాలానే ఉన్నాయన్నారు. మరెందుకండీ, ఇంతలేసి కట్నాలు కానుకలు ఆశిస్తున్నారు? మగ వాడిగా పుట్టినందుకు కట్నం తీసుకునే తీరాలా? అలా రూల్ ఏమైనా ఉందా? పైగా పెళ్లి మేమే చేసుకోవాలా? అదీ, ఘనంగా, మీ బంధువులు మెచ్చే విధంగా.ఏ, ఆ మాత్రం కూడా మీరు చేసుకో లేరా?.. ఆ ఖర్చు కూడా కాబోయే పెళ్ళామే భరించాలా?.. "
పక్కన పిడుగు పడినట్లుగా ఉలిక్కిపడ్డాడు గంగాధర్ ! ఇంత డైరెక్ట్ గా, ఇంత నిర్మొహమాటంగా ఇప్పుడు మాట్లాడుతున్న ఆ అమ్మాయి పెళ్ళిచూపుల నాడు ఎంత ఒద్దికగా కూర్చుని ఉంది ! చిత్రంగా అతనికి కోపం రాక, చిన్నగా నవ్వుకున్నాడు. ఎందుకో ఆ అమ్మాయి వైఖరి కొత్తగా ఉన్నా, లోలోపల అతనికి నచ్చిన భావన! పైగా ఇంకా ఏం చెప్తుందో వినాలన్న కుతూహలం కూడా కలిగిందతనికి !
"... నేను మీకు బాగా నచ్చినప్పుడు ఇక ఈ కట్నాల గోలేమిటి? నేనూ మీలా ఓ డాక్టర్ నే కదా, మీలానే సంపాదిస్తున్నా కదా, చదవడానికి మాకూ అయ్యుంటుంది కదా బోలెడు ఖర్చు! మగ పిల్లవాడి కైతే, పెళ్లి పేరు చెప్పి, అంతా కాబోయే వియ్యంకుల నుండి రాబట్టుకోవచ్చు. మరి ఆడపిల్లల తల్లిదండ్రుల మాటేమిటండీ?.. ఈ ఆచారాలు, సంప్రదాయాలు తీసి గట్టున పెట్టాలని మీ లాంటి వాళ్ళ కనిపించదా?... "
అసలే ఈ కట్నాల గోల అసలునచ్చదు క్రాంతికి. దానికి తోడు ఇంతకు ముందు చూసిన సంబంధాలూ దాదాపు ఇలానే ఉండడంతో ఆ అమ్మాయికి విసుగూ, చిరాకూ ముంచుకొచ్చి " అసలేం మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఇంకా అవతల ఎవరితో మాట్లాడుతున్నాను,... ఆవైపు కూడా సీరియస్ అయితే నా పరిస్థితి ఏమిటి?.. " అన్న విచక్షణ, ఆలోచన పూర్తిగా కోల్పోయిందా క్షణాల్లో ఆ అమ్మాయి !
కానీ గంగాధర్ స్వతహాగా కాస్త నెమ్మదస్తుడు. అందుకేనేమో, ఎడాపెడా వాయిస్తున్నా ఆ అమ్మాయి మాటల్ని మౌనంగా వింటూ కూర్చున్నాడు.
" బాబోయ్! పైకి కనిపించరు గానీ, పెళ్లి సమయంలో అమ్మాయిలు ఎంత అక్కసు అణిచి పెట్టుకుంటారోగదా కాబోయే మొగుడనేవాడి మీద, ఇంకా అత్తింటి వాళ్ల మీద!
అందుకే నేమొ, ఇంకా అడుగుపెట్టక ముందే అత్తారిల్లు అంటే అంత వ్యతిరేక భావన ఉంటుంది ఆడపిల్లల్లో! అనిపించిందతనికి.
" అసలే మా అమ్మకు చాదస్తమెక్కువ. ఈవిడ గనక కోడలిగా ఇంట్లో అడుగు పెడితే అత్తా కోడళ్లిద్దరికీ రోజూ ప్రచ్ఛన్న యుద్ధమే ఉండే లాగుంది, " అని కూడా అనిపించింది గంగాధర్ కు.
ఏదేమైనా కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే చూసిన తనతో ఇంత నిర్మొహమాటంగా, ఇంకా చెప్పాలంటే ఎంతో కాలంగా పరిచయమున్న వాళ్ళతో మాట్లాడినట్లు(పోట్లాడినట్లు) అంత ఫ్రీగా మాట్లాడుతోందంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా ఏదో ప్రత్యేకమే! అనుకున్నాడు లోలోపల గట్టిగా!అదే క్షణంలో ఏమైనా ఈ అమ్మాయిని వదులుకోకూడదని కూడా పించిందతనికి . అతని ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ,
"... దయతో మీరిచ్చిన సడలింపులు మాకొద్దని చెప్పాలనిపించింది. ఈ విషయం మా నాన్న తోనే మీ నాన్నగారికి చెప్పించొచ్చు. కానీ, చెప్పానుగా ఆడపిల్లల తల్లిదండ్రుల వైఖరి! పెళ్ళంటే ఆహ్లాదకరంగా, అంతా సంతోషంగా జరగాలి. నా ఉద్దేశంలో ఇష్టపూర్వకంగా, ఒత్తిడి అన్నది లేకుండా ఇచ్చిపుచ్చుకునే లా ఉండాలి కట్నకానుకలు. ఇలా బేరసారాలు నాకు నచ్చవు..."
ఆవేశం లో ఉన్న తనకి సంబంధం తప్పిపోయినా మరేం పర్వాలేదన్న ధీమా, ఇంకా, ఒకరిద్దరు ఇలా తెగించి మాట్లాడితే కొందరిలో నైనా చలనం కలగదా అన్న ఆలోచన చోటుచేసుకున్నాయి.
"... అయినా, ఒక వైపు అమ్మాయి నచ్చిందని చెప్తూ, మిగతా విషయాలన్నీ తల్లిదండ్రులకి వదిలేయడమేంటండీ మీ అబ్బాయిలు?... మీకంటూ ఓ వ్యక్తిత్వం ఉండదా ఏమిటి? అలా లేకుంటే నాకు ఓకే కాదు, ఇది చెప్పడానికే ఈ ఫోన్ కాల్ !...బై.. "
" ఆగండాగండి..."
వెంటనే ఆపాడు గంగాధర్.
" అమ్మో! ఏమిటా తొందర? అయినా మీరు చాలా ఫాస్ట్ అండీ... "
" అవునండీ, నా పేరే క్రాంతి, అంటే అర్థం తెలుస నుకుంటాను. లేకుంటే గూగుల్లో వెతకండి. కానీ, ఒకటి, మీరు మాత్రం చాలా స్లో.."
" ఎలా?.. "
" ఏమో, మీరే ఆలోచించుకోండి..."
ఫోన్ కట్ అయింది. ఫోన్ పక్కన పెట్టేసి, తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు, గంగాధర్. ఏదో కొత్తగా, భలేగా అనిపించి,
" ఎవరికీ ఇలాంటి అనుభవం ఎదురయి ఉండదనుకుంటా.." అనుకున్నాడు.
కానీ, ఆ మాటల ప్రభావమో ఏమో, మెల్లిగా అతనిలో ఆలోచన మొదలై పెదాలపై నవ్వు విరిసింది. అంతలో ఠక్కున ఏదో స్ఫురించింది.
" అవునూ, ఇంతకీ, క్రాంతి అంటే ఏమిటబ్బా... "
ముందుకు చూస్తే టేబుల్ మీద సెల్ ! వెంటనే చేతిలోకి తీసుకుని ' గూగుల్ ' లోకి వెళ్ళాడు. చూడగానే క్షణం గగుర్పాటు !
"విప్లవం "
ఆవెంటనే అతని కళ్ళు మిలమిల మెరిశాయి.
*****************************************
తెలుగు కథలు..కవితలు...వ్యాసాలు
*****************************************
కథ బాగుందండీ. అభినందనలు.
ReplyDeleteఒకటి రెండు చిన్న సూచనలు, మీరు అన్యథా భావించకపోతే.
మొదటిది ఒకచోట ప్రఛ్ఛన్నయుధ్ధం అన్నమాట వాడారు. ద్వంద్వయుధ్ధం అంటే సరిగా ఉంటుంది.
రెండవది. కథానిర్మితి బాగుంది కాని మీరు అక్కడక్కడా స్వయంగా కలుగజేసుకొనవలసిన అగత్యం లేదు. పాఠకులు ఊహించలేరనో అర్ధంచేసుకొనలేరనో ఇలా రచయితలు కథలో జొరబడటం మంచిది కాదు. కథాకాలమో సందర్భమో కారణంగా కొన్ని విషయాలు కథలో రావటం కుదరక పాత్రలను స్పష్టీకరించటం కుదరకపోతేనో, విభిన్నవిషయాలను ప్రస్తావించటానికి తగినకారణం ఉండి కథలో నేరుగా వీలుపడకపోతేనో ఇలా రచయిత కలుగజేసుకోవటం తప్పకపోవచ్చును. సాధ్యమైనంతవరకూ కథను పాత్రలే నడిపించాలి, రచయిత తెరవెనుకనే ఉండాలి. అప్పుడు పాఠకుల మెదళ్ళకు మంచిమేత. కథకు మరింత పుష్టి కూడా.
కథ నచ్చినందుకు ధన్యవాదాలు సర్. చక్కని సలహాలూ, సూచనలు మరింత చక్కగా తెలియజేశారు.అందుకోసం మరోసారి ధన్యవాదాలు 🙏
ReplyDeleteబాగా వ్రాశారండి, ధరిత్రీ దేవి గారు. విషయం పాతదే అయినా కథనం బాగుంది.
ReplyDelete/- “ పెళ్లి మాత్రం మనదే నట.” // …. ఇది మాత్రం నాకు అర్థం కాలేదు. పెళ్ళి కార్యక్రమం ఆడపిల్ల కుటుంబం వారే చెయ్యడం ఆనవాయితీ కదా. అబ్బాయి తరఫు వారు అమ్మాయి ఊరికి తరలి వెళ్ళి పెళ్ళి చేసుకుని వస్తారు. దీంట్లో ఏమయినా ప్రాంతీయ బేధాలున్నాయా? ఉదాహరణకు మీ రాయలసీమలో వేరే ఆనవాయితీయా?
ఒకటి మాత్రం సంతోషించాలండోయ్. పెళ్ళి మా ఊళ్ళో చెయ్యండి, మా బంధువులంతా ఇక్కడే ఉన్నారు అని అడగలేదు అబ్బాయి తల్లితండ్రులు. ఆశ్చర్యపోకండి ఇటీవల ఈ ధోరణి కూడా పెరుగుతోంది. అమ్మాయి వాళ్ళ ఊళ్ళోనే పెళ్ళి చెయ్యడం అనే పద్ధతి ఎందుకు పెట్టారు పెద్దలు అన్న ఆలోచన లేదు. పెళ్ళి కార్యక్రమం ఏర్పాటు చేసి నిర్వహించడానికి అమ్మాయి తల్లిదండ్రులకు బోలెడంత సహాయం కావాలి, మందీమార్బలం ఉండాలి. ఇదంతా ఆయనకు తన ఊళ్ళో పుష్కలంగా ఉంటుంది. అంతేకానీ ఆయనకు స్ధానబలం లేని వేరే ఊరికి వచ్చి ఇదంతా చెయ్యమని అమ్మాయి తండ్రిని అడగడం సమంజసం కాదు గదా. ఏదైనా పెద్ద గుడిలో చెయ్యడం వేరే సంగతి, అక్కడ ఆ గుడివారి స్కీములు ఉంటాయి కాబట్టి. దాన్ని మినహాయిస్తే పెళ్ళికూతురి ఊళ్ళో పెళ్ళి జరగడమే సరైన పద్ధతి.
ఇక్కడా అదే ఆనవాయితీ అండీ. కాకపోతే, కొన్ని సందర్భాల్లో.. ఇంట్లో మొదటి పెళ్లి( కొడుకు మొదటి సంతానమైతే) మేమే ఘనంగా చేసుకుంటామనీ... చిన్న కొడుకు అయితే ఆఖరి పెళ్లి మేమే చేస్తామనో.. మగ పెళ్లి వారే బాధ్యత తీసుకుంటుంటారు. కొందరు ఆడపెళ్లి వారి అశక్తత వల్లనో, అభ్యర్థన వల్లనో కూడా మగపెళ్ళివారే ఆ బాధ్యతను తీసుకుంటుంటారు. ఇది ఇరువైపులా అవగాహన, సర్దుబాటు...అంతే ! ఎటొచ్చి, చిక్కంతా ఎక్కడంటే... మగ పెళ్లివారు ఆధిక్యతతో తమ మాటే నెగ్గాలనడం, డిమాండ్ చేయడంతోనే! కథలో ప్రస్తావించినట్లు ఓ అమ్మాయి అంత నిష్కర్షగా, తీవ్రంగా అబ్బాయితో వాస్తవజీవితంలో మాట్లాడలేకపోవచ్చునేమో ! కానీ, వాస్తవమైతే అదే కదా !కాదంటారా !
Deleteఅవునంటాను.
Deleteఅసలు మరింత మంది అమ్మాయిలు సింపుల్ మ్యారేజ్ అయితేనే చేసుకుంటామని తెగేసి చెప్పాలి, ఆ మాట మీద నిలబడగలగాలి. రిజస్టర్డ్ పెళ్ళి మాత్రమే అని పట్టుపట్ట గలిగితే మరీ మంచిది. కానీ విచిత్రమేమిటంటే ఈ రోజుల్లో పెళ్ళి “ఘనంగా” నూ, ఆడంబరంగానూ జరగాలని అధిక శాతం అమ్మాయిలు కూడా పట్టుబడుతున్నారట. పైగా మెహందీ, సంగీత్ లాంటి ఉత్తరాది వారి వేడుకలన్నీ కూడా జరగాలంటున్నారట. వెరసి తడిసి మోపెడవుతోంది. చాలా మటుకు వ్యాపారులు, so called event managers ఎగదోస్తున్న పోకడలు ఇవన్నీ. ఇంక మారడం కష్టం.
సరిగ్గా చెప్పారండీ👌.జీవితంలో పెళ్లిరోజు ఒక్కసారే వస్తుందని ఆరోజు కోసం ఏవేవో కలలు గంటూ కోరికలు పెంచేసుకునే అమ్మాయిలు మారాలి, ఆలోచించాలి. కథలో క్రాంతి లాగా...
Deleteఅమ్మాయి ఊళ్ళోనే ఆమెకు పెండ్లి జరిపించటమూ ఊరిలోని పదిమందీ ఆవివాహానికి వచ్చి ఆశీర్వదించటమూ వెనుక
ReplyDeleteప్రధానోద్దేశం అమ్మాయి వివాహానికి తగినంతమంది సాక్ష్యం ఉండటం.
అది కూడా …. స్ధానబలంతో బాటు.
Delete