🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷
[ స్త్రీలకూ, గాజులకూ ఉన్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. ఎన్ని అలంకరణలుచేసుకున్నా....చేతుల నిండుగా గాజులన్నవి లేకుంటే ఆ అలంకరణ అసంపూర్ణమే! గాజులంటే ఖరీదైన బంగారుగాజుల గురించి కాదు ప్రస్తుతం నేను ప్రస్తావిస్తున్నది....అతి చవగ్గా లభ్యమయే మట్టిగాజుల ప్రాశస్త్యం గురించన్నమాట !నడుమ మట్టిగాజులుంటేనే ఆ బంగారుగాజుల అందం ఇనుమడించేది. పైగా అదో ప్రత్యేకతానూ ! అలాంటి మట్టిగాజుల్ని ఇష్టపడని ఆడవాళ్ళుంటారా !! ఆధునికత పేరుతో కొందరు యువతులు దూరం పెట్టినా....ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా కాంతులీనాల్సిందే... మెరిసిపోవాల్సిందే ! మగువల మనసులు దోచేసే ఆ మట్టిగాజులను తలచుకున్నపుడు నాలో మెదిలిన మరిన్ని మాటల ముత్యాలు...! ]
~~ యం. ధరిత్రీ దేవి~~
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦
గాజులండీ ... గాజులు...
మట్టిగాజులు..
గలగల సవ్వడుల గాజులు...
మురిపిస్తూ... మైమరపిస్తూ...
మగువల మనసులు
దోచేసే గాజులు !!
రంగురంగుల గాజులు...
రకరకాల గాజులు...
రమ్యమైన గాజులు...
రమణులకే సొంతమీగాజులు !
ముదురునీలం...ఆకాశనీలం.... ఓవంక...
పచ్చపచ్చగా ... ఆకుపచ్చగా...మరోవంక !
పసుపూఎరుపుల వర్ణమిశ్రమం !!ఇంకోవంక !
అంబరాన ఇంద్రధనుస్సు
విరిసి మెరిసిన చందాన...
ఎంత శోభాయమానం !!
పగడాలు పొదిగినట్లు...
ముత్యాలు జాలువారినట్టు...
పుప్పొడి రేణువులు వెదజల్లినట్లు.. !
కళకళలాడుతూ... కనువిందు చేస్తూ...
చుక్కలు పొదిగిన గాజులు..
చుక్కలకే ఈసు పుట్టించే గాజులు..!
చక్కనమ్మల చూపుల్లో...
చటుక్కున చిక్కుకునే గాజులు !
రంగురంగుల గాజులు..
రకరకాల గాజులు...
వన్నె తరగని గాజులు...
వనితలిష్టపడే గాజులు ....
అట్టపెట్టెల్లో ఒదిగి ఒదిగి ఉన్నా...
అద్దాల మాటున దాగినా..
అతివల దృష్టిని దాటలేవుగా !
ఆకర్షణే ఆహ్వానమైపోదా ....
ఆగగలరా ఇంతులిక ...
వాలిపోరా అంగళ్ల ముంగిట !
అందాల విందు ఆస్వాదిస్తూ
నిలువగలరా అరక్షణమైన !!
వడివడిగ అడుగిడి బేరమాడకయే
అయిపోరా సొంతదారులు !!
సరసమైన ఆ ధరలు... నిజంగా...
సంతోషానికి చిరునామాలు గదా !
సంప్రదాయానికి ప్రతీకలు...
సౌభాగ్యానికి చిహ్నాలు !!
ముత్తైదువుల, ముద్దుగుమ్మల,
ముద్దులొలికే పాపల ముంజేతుల
ముచ్చటైన అలంకారాలు !
పుట్టీపుట్టగానే అయిపోయే
హక్కుదారులు మరి ఈ పడతులు !
మరెన్నెన్ని ఉన్నా ఆభరణాలు..
నెలతలకివే కదా...
అసలైన సిరులూ సంపదలు...!!
పసిడి గాజుల నడుమ కాంతులీనుతూ
పసిడికే వన్నెలద్ది విరాజిల్లే మట్టి గాజులు !
ఏ శ్రమజీవి చెమటోడ్చి సృష్టించునో.. !
ఏ సృజనాత్మకత సజీవశిల్పమై
ఇటకేతెంచి కొలువుదీరునో .. !!
చిత్రమే ! అతివ చేతికంది
మది రంజింపజేస్తున్నవే !!
గోరింటతో పండిన అందాల చేతులు
అద్దుకొనునే... కొత్త అందాలతో
సరికొత్త సొగసులు !
పట్టుచీరల గరగరలతో...
మేళతాళాల ధ్వనితరంగాలతో...
కళకళలాడుతూ శోభిల్లు
వివాహాది శుభకార్యాలు
వెలవెల బోవా...వెలలేని
ఈ మట్టిగాజుల చిరుచిరు సవ్వడుల
సందళ్ళు వినిపించక !!
అమోఘం ! అద్భుతం !
ఆ గలగల సరిగమల సంగీతం...
వింటే చాలు మనసంతా మధురిమలు...
ఆ సౌందర్య శోభ కంటే చాలు
కళ్ళనిండా కోటికాంతులు !!.
అవి గాజులు...మట్టిగాజులు...
రంగురంగుల గాజులు...
రమ్యమైన గాజులు..
మగువల మనసులు దోచేసే గాజులు...
రమణులకే సొంతమైన గాజులు !!
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦
No comments:
Post a Comment