Wednesday, November 1, 2023

పూలమొక్క...కథ


🌹

     " ఆముక్తా, ఒక్క నిమిషం.. ఓ మొక్క కొనాలి..."
ఆటో ఆపబోతున్న ఆముక్త ఆగిపోయి, జయంతితో బయలుదేరింది. ఆ ఇద్దరూ ఆఫీసులో కొలీగ్స్. ఇద్దరి ఇళ్లూ ఒకే దారిలో కాబట్టి, రావడం, వెళ్లడం రోజూ ఒకే ఆటోలోనే. 
     పావుగంట తర్వాత, ఓ గులాబీ మొక్క కొని ఇద్దరూ ఆటో ఎక్కారు. జయంతికి మొక్కల పిచ్చి. ఇంటి కాంపౌండ్ లో ఉన్న కాస్త స్థలంలోనే రకరకాల మొక్కల్ని కుండీల్లో  పెంచుతూ ఉంటుంది. మరో పావుగంట తర్వాత రోడ్డు మీద ఇద్దరూ  ఆటో దిగారు. జయంతి తన ఇల్లు రాగానే బై  చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఆముక్త  ఇల్లు ఇంకాస్త ముందు... తనూ బై చెప్పి వెళ్ళిపోయింది. 
                  ++                ++           ++
   నెల తర్వాత.. జయంతి ఆరోజు సెలవు పెట్టింది... ఒంట్లో బాగోలేదంటూ. సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ, ఆముక్త జయంతిని చూద్దామని గేటు తీసుకుని లోపల అడుగు పెట్టింది. కాంపౌండ్ లో పది పన్నెండు తొట్లు...వాటిలో రకరకాల మొక్కలు... దర్శనమిచ్చాయి. అందులో ఒకదానిపై ఆముక్త దృష్టి.నిలిచింది. అది  నెల క్రితం జయంతి కొన్న గులాబీ మొక్కే నేమో ! ఎదుగూ బొదుగూ  లేకుండా ఉంది... పైగా ఆకులన్నీ దాదాపు రాలిపోయాయి. కానీ పచ్చగానే ఉంది. గేటు చప్పుడు విని, జయంతి బయటకు వచ్చింది.
" ఆముక్తా, నువ్వా, రా,  "
అంటూ లోపలికి తీసుకెళ్లింది. 
" ఏమీ లేదు,  ఉదయం జ్వరమన్నావు గదా... ఎలా ఉన్నావో  చూద్దామని వచ్చాను..."
అంది ఆముక్త సోఫాలో కూర్చుంటూ. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అటూఇటూ చూస్తూ... 
" ఏమిటీ, కోడలు లేదా ఇంట్లో.. !"
అడిగింది ఆముక్త. రెండు నిముషాలు పలకలేదు జయంతి. లోపలికెళ్ళి టీ పెట్టి తీసుకొచ్చింది. 
" ఏమిటోలే ఆముక్తా, ఎందుకు పెళ్లి చేశామా అనిపిస్తోంది మా వాడికి.."
జయంతి కొడుక్కి ఆరు నెలల క్రితం పెళ్లయింది. కోడలు సుమ డిగ్రీ దాకా చదువుకుంది. కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కట్నం బాగానే ముట్టిందని తనతో చెప్పింది పెళ్ళికి ముందు.  జయంతి భర్త కూడా ఇంకా సర్వీస్ లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆమె మాటలకు ఒకింత విస్తుబోతూ చూసింది ఆముక్త... 
" ఒక్కపనీ చేతగాదు...కనీసం టీ పెట్టడం కూడా రాదంటే నమ్ము..ప్రతీది పదిసార్లు చెప్పాలి. చదువొస్తే చాలనుకుంటారు అమ్మాబాబు.. పనిపాటు అక్కర్లేదా చెప్పు.. ఎలా పెంచుతారో...ఎలా పెరుగుతారో..!కోడలొచ్చినా...నా చావు నాకు తప్పట్లేదు. ఒకవైపు ఇల్లు... ఒకవైపు ఆఫీసు...జ్వరాలు రాకుండా ఉంటాయా...!"
విషయం అర్థమైంది ఆముక్తకు. 
" ఇంటిపనులు సరే... మొగుడి గురించైనా పట్టించుకుంటుందా...అన్నీ అడగాలి..చెప్పి చెప్పి చేయించుకోవాలి..ఉట్టి మొద్దు మొహమనుకో... "
చెప్పుకుంటూ పోతోంది జయంతి. 
"...మావాడికీ విసుగొచ్చిందనుకో దానితో..వెళ్లి పనులు చేయడం నేర్చుకునిరాపో...లేకుంటే అక్కడే ఉండిపో.. అంటూ పుట్టింటికి పంపేశాడు.. "
ఆముక్తకు చాలా బాధనిపించింది.ఇంతలో, లోపల గదిలో అలికిడి వినిపించి అటువేపు చూసింది. 
" ప్రదీపేలే... ఏదో పనుందంటూ ఆఫీసుకు వెళ్ళలేదు ఈవేళ... "
 అహ.. అలాగా..అనుకుని ఏదో అనబోయి, ఏమనుకుంటుందో అని మిన్నకుండిపోయింది ఆముక్త. ప్రదీప్ పెళ్లికి ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్లారు. పెళ్లికూతురు బాగా గుర్తు. తర్వాత కూడా ఒకటి రెండు సార్లు ఇంట్లో కూడా చూసింది. తనను చూసి నవ్వుతూ పలకరించింది కూడా. మల్లెపువ్వులా  ఉంటుంది.. నెమ్మదైన పిల్ల ! వీళ్లకెందుకు నచ్చడం లేదో ! ఆరు నెలలకే మొహం మొత్తిందా !! అనుకుంది..
" నెమ్మదిగా అలవాటవుతుందిలే జయంతీ.. కాస్త ఓపిక పట్టాలి..పెద్దవాళ్ళం...మనమే  సర్దుకు పోతే సరి.."
 ఓదారుస్తున్న ధోరణిలో అంది.
" ఆ... ఎంతకని ఎదురు చూస్తాం.. ఎంతకని సర్దుకుంటాం! అన్నీ  నేర్పించుకోవాలంటే అయినట్లే.!"
ఆముక్త మాటలకు అడ్డుపడింది జయంతి వెంటనే. ఇంకేమంటుంది ఆముక్త ! కొడుకు పెళ్లి చేయకముందు వరకూ అన్ని పనులూ తనే చేసుకునే ఈవిడ కోడలు రాగానే.. అత్తగారి హోదా, జులుం ప్రదర్శిస్తోంది..భేష్ ! కొడుకుల్ని గన్న తల్లుల్లారా... వర్ధిల్లండి.! అనుకుంటూ టీ తాగడం ముగించి, 
" సరే జయంతీ, నేవెళ్తా.. రేపొస్తావా ఆఫీస్ కి? "
లేస్తూ అడిగింది. 
" చూస్తాను, రాగలిగితే  వస్తా..."
అంటూ తనూ లేచి బయటికి వచ్చింది జయంతి. గేటు వైపు వెళ్లబోతూ ఓ క్షణం ఆగింది ఆముక్త. ఆమె  దృష్టి వద్దనుకున్నా వాడుపట్టిన గులాబీ మొక్కపై పడింది...అప్రయత్నంగానే నోరు తెరిచింది.
" జయంతీ..ఇది..ఆరోజు నువ్వు కొన్న గులాబీ మొక్కేనా ! ఎండిపోయిపోయినట్లుందే..! తీసేసి వేరేది నాటక పోయావా!"
" ఆమొక్కే. కానీ, ఎండిపోలేదు ఆముక్తా, దానివేళ్లు కుండీలో నిలదొక్కుకుని కొత్త ఆకులు రావడానికి కాస్త టైం పడుతుంది. ఈ పక్కనున్నవన్నీ నాటిన మొదట్లో ఇలా ఉన్నవే.. ఇప్పుడు చూడు, నిండా ఆకులతో, పూలతో ఎలా కళకళలాడుతున్నాయో.!"
పాయింట్ దొరికింది ఆముక్తకు. తల తిప్పి జయంతిని చూస్తూ, 
" కదా జయంతీ, ఏమనుకోనంటే ఓ మాట.. చనువు కొద్దీ చెప్తున్నా. నోరులేని పూల మొక్కల్ని అంత బాగా అర్థం చేసుకున్నావు.. మనసున్న మనిషి... కోడలు పిల్లను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు !"
ఎక్కడో గుచ్చుకుంది జయంతికి.
"... కొత్తగా పెళ్లయిన ఆడపిల్ల కూడా పూల మొక్క లాంటిదే జయంతీ.. పుట్టి పెరిగిన ఇంటినీ, తన వాళ్ళని అందర్నీ ఒక్కసారిగా వదిలేసి, కొత్త ఇంట్లోకి.. కొత్త మనుషుల మధ్యకి వచ్చేస్తుంది. ఎందుకని! భర్త అన్నవాడు తన వాడు అనే నమ్మకంతో... ఇక్కడి మనుషులు, ఇల్లు అలవాటు కావడానికి కాస్త సమయం పడుతుంది. ఆ  అవకాశం ఆ పిల్లకి పెద్దవాళ్లుగా మనం ఇవ్వాలి. వచ్చి రాగానే అన్నీ అందుకుని సాగాలంటే ఎలా! పెళ్లయిన కొత్తలో మనం ఎలా ఉండే వాళ్ళమో ఓసారి గుర్తు తెచ్చుకోవాలి.."
"................."
"... సారీ, ఎక్కువగా మాట్లాడాననుకుంటా.. మళ్లీ చెబుతున్నా,  చనువు తీసుకున్నందుకు క్షమించు.."
అనుకోని ఈ ప్రస్తావనకు మొహం చిట్లించుకుంది జయంతి. వెళ్లబోతూ  వెనక్కి తిరిగిన ఆముక్తకు వరండాలో నిలబడ్డ ప్రదీప్ కనిపించాడు.
" విన్నాడా ! విననీ.. మంచిదేగా..! ఏముంది! నన్ను నాలుగు తిట్టుకుంటాడు... అంతేగా...!"
అనుకుంటూ గేటు తీసుకుని వెళ్ళిపోయింది ఆముక్త. 
                 ++                ++                ++
  మరుసటి రోజు ఉదయం... తొమ్మిది గంటలు.. ప్రదీప్ టిఫిన్ ముగించి, ఆఫీసుకు బయలుదేరుతూ, చెప్పాడు తల్లితో, 
" అమ్మా, నాకు క్యారియర్ వద్దు. మధ్యాహ్నం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సాయంత్రం సుమను తీసుకుని వస్తా.. "
టిఫిన్ తింటున్న తండ్రి తలెత్తి కొడుకు వైపు చూశాడు. జయంతి నోట మాట రాక చూస్తూ ఉండిపోయింది. వాళ్ల ముఖాల్లోని హావభావాల్ని పట్టించుకోకుండా గేటు దాటాడు ప్రదీప్.
   బైక్ స్టార్ట్ చేస్తున్న అతనికి క్రితం రోజు ఆముక్త అన్న మాటలు మరోసారి గుర్తుకొచ్చాయి. రాత్రంతా నిద్ర లేక ఆలోచిస్తూనే ఉన్నాడు. పదేపదే ఆ మాటలే సుతిమెత్తని బాణాల్లా వచ్చి గుచ్చుకొంటూ అతన్ని కలవరపెట్టాయి. ఆంటీ మాటలు సూటిగా ఉన్నా, అందులో ఎంతో నిజం ఉందనిపించింది అతనికి.
   " నిజమే! సుమ చేసిన తప్పేమిటి? ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించాడు తనపట్ల ! పెళ్లికి ముందు లేని అలవాట్లన్నీ నిదానంగా నేర్చుకుంటూనే ఉంది. చివరికి తన బట్టలు కూడా తనే ఉతికి పెట్టేది. తల్లిదండ్రులకి ఆమె నిదానం నచ్చలేదు.తను కూడా అర్థం చేసుకోకుండా కోపం పెంచుకున్నాడు.
  తండ్రికి కొడుకు సంసారం పట్ల ఆందోళన లేదు. తల్లీ అదే టైపు. చక్కదిద్దాల్సిన వాళ్లు తనని మరింత రెచ్చగొట్టడం చేశారు... ఫలితం ! తామిద్దరి మధ్య దూరం ! ఎంత అవివేకంగా మారిపోయాను నేను...!"  
   తెల్లారేసరికి మబ్బులన్నీ విడిపోయి అతని మనసు తేలికగా అయిపోయి, కర్తవ్యం గుర్తొచ్చింది.. ప్రస్తుతం అదే అమలుపరుస్తున్నాడు.
  " ఏమైనా ఆముక్త ఆంటీకి కృతజ్ఞతలు. సరైన టైంలో సరైన దారికి నన్ను మళ్లించింది, " 
అనుకుంటూ బండి ముందుకు పోనిచ్చాడు.
              ++            ++               ++
  మూడు నెలల తర్వాత... ఓ సెలవు రోజున.. ఆముక్త షాపింగ్ కెళ్ళి, పనయ్యాక ఆటో కోసం రోడ్డు వారగా నిలుచుని ఉంది. వెనగ్గా ఓ బైక్ వచ్చి ఆగిన చప్పుడుకు తిరిగి చూసింది. ప్రదీప్ ! ఆ  వెనక భార్య సుమ! ఇద్దరూ బైక్ దిగి పలకరించారు ఆముక్తను. 
" ఆంటీ, మీకు చాలా థాంక్స్..."
 అంటూ, ఆరోజు తనన్న  మాటలు విన్న తర్వాత... జరిగిందంతా చెప్పాడు. ఓ క్షణం సుమ మీద దృష్టి నిలిపింది ఆముక్త. అప్పట్లో వాళ్ళింట్లో తనని చూసినప్పుడు ఆ పిల్ల మొహంలో కనిపించిన ఆందోళన ఇప్పుడు మచ్చుకైనా లేదు. ఆ కళ్ళల్లో కళ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆ నవ్వులో ఏ వెలితీ  లేదు. అదంతా భర్త ప్రదీప్ వల్లే... అని  స్పష్టంగా తెలిసిపోతోంది. ప్రదీప్ ను   ప్రశంసాపూర్వకంగా చూసింది ఆముక్త.  
" చాలా సంతోషం బాబూ.. మీ ఇద్దరినీ ఇలా హ్యాపీగా చూస్తున్నాను.."
అంది తృప్తిగా.
" ఆ  క్రెడిట్ అంతా మీదే ఆంటీ.."
 అన్నాడు ప్రదీప్ మళ్లీ.
" అయ్యో.. మంచి మాటలు చెప్తే వినేవాళ్లు, ఫాలో అయ్యే వాళ్ళు ఎందరుంటారు చెప్పు! నువ్వు పాజిటివ్ గా తీసుకున్నావు గాబట్టి...ఆ  క్రెడిట్ అంతా నీదే. పేరెంట్స్ మాటల్ని గౌరవించాలి.. నిజమే.. కానీ, అందులో ఏది మంచి,  ఏది చెడు అని కూడా పిల్లలు గ్రహించాలి. పెళ్లయాక  ప్రతి అమ్మాయి అంతవరకూ ముక్కు మొహం తెలియకపోయినా... భర్త వేలు పట్టుకుని అత్తారింట్లో అడుగుపెడుతుంది. ఎందుకు! అతను తన మనిషనీ,  అన్నివేళలా తనకు అండగా ఉంటాడనీ... ఏ కష్టం వచ్చినా ఆ భుజం తనకు ఆసరాగా ఉంటుందన్న నమ్మకంతో.. ఆమె నమ్మకాన్ని నిజం చేయడం భర్తగా అతని బాధ్యత.. అది  నీవు సంపూర్తిగా నెరవేర్చావు. అందరూ నీలాగే ఉంటే అమ్మాయిలు పెళ్లి గురించి భయపడాల్సిన పనే ఉండదు..."
అంది నవ్వుతూ. రెండు నిమిషాల తర్వాత ఇద్దరూ బై  చెప్పి బయలుదేరారు. నవ్వుతూ వెళ్తున్న ఆ  జంట ఎంతో ముచ్చటగా అనిపించింది ఆముక్తకు... 
  ఆరోజు జయంతి మాటలు విని ఎంతో బాధపడింది. అత్తమామల కరకుదనంతో, భర్త అవగాహనా రాహిత్యంతో జీవితం బలైపోయి, ఈరోజు ఇలా ఒంటరిగా మిగిలిపోయిన తనలాగే ఈ అమ్మాయీ అవబోతోందా !! అన్న తలంపు కలిగిన ఆ క్షణం గుర్తొచ్చింది ఆముక్తకు.. ఆ ఆవేదనలో తనన్న నాలుగు మాటలు ఇతనిపై అంతటి ప్రభావాన్ని చూపడం... నిజంగా తాను ఊహించని పరిణామమే ! థాంక్ గాడ్ ! సుమ మరో ఆముక్త కాకుండా సుమగానే ఉంటున్నందుకు...!! ఆముక్త పెదాలపై నవ్వు విరిసింది...ఓ లేత పూలమొక్క వాడి, ఎండిపోకుండా చెట్టుగా ఎదిగినందుకు ! ఆక్షణంలో తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు, మలుపులు మెదిలి, 
" ఈ సుమకూ,  నాకూ ఒకటే తేడా...తనకు అర్థం చేసుకోగలిగిన భర్త లభించాడు. తనకా అదృష్టం లేకపోయింది..."
నిర్లిప్తంగా ఆటో ఎక్కికూర్చుంది. ఆమె మనసులో ఓమూల చిన్న సంతృప్తి... 

                            🦋🦋🦋🦋🦋

No comments:

Post a Comment