Friday, November 17, 2023

కాలుష్యం...తగ్గేదెలా !

☘️🍀☘️🍀☘️🍀☘️🍀🌿🍀🌿🍀🌿🍀☘️🍀☘️🍀

   ప్రస్తుతం...మన రాజధానీ  నగరమైన ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందన్న వార్త వింటున్నాం.. దానికి కారణమేమిటి ? చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలు కాల్చేస్తూ ఉండటం వల్ల ఆ కలుషిత గాలి వ్యాపించి ఢిల్లీ దాకా పాకి అక్కడ కాలుష్యం పేరుకు పోతూ అనారోగ్యానికి కారణభూతమవుతోందట ! మరి నిర్మూలన ఎలా? కృత్రిమ వర్షాలు కురిపించడం ఒక మార్గమనీ దానికి ఖర్చు చాలా అవుతుందని అంటున్నారు. అక్కడి స్కూళ్లకు కొద్దిరోజులు సెలవులు ప్రకటించారు. అలా ఎంత కాలం! తీవ్ర ప్రయత్నాల తదుపరి కాస్త అదుపులోకి వచ్చిందనుకునే లోగా దీపావళి పండగ వచ్చి టపాకాయల ఉధృతితో పరిస్థితి మొదటికొచ్చిందని వాపోతున్నారు. 
  ఢిల్లీ దాకా ఎందుకు ! చిన్న చిన్న పట్టణాల్లో కూడా మొన్న జరిగిన దీపావళి పండుగ సందర్భంగా కాల్చిన టపాసుల వల్ల ఒకేసారి వాయు కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయిందని వార్తలు వెలుపడ్డాయి. ఇందువల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులూ వాయు కాలుష్యం, శబ్దకాలుష్యాల బారినిబడి  మరింత అస్వస్థతకు గురి అవుతున్నారు.
  ఇప్పటికే రకరకాల వ్యర్థాల వల్ల వాతావరణ కాలుష్యం, పరిసరాల కాలుష్యం పరిమితిని దాటి పెరిగిపోయింది. అందులో కొన్నింటిని నివారించడం మన చేతుల్లోని పనే... అందులో అతి  ముఖ్యమైనది ఈ టపాకాయలు కాల్చడమన్నది.. ఏదైనా పరిమితి దాటితే అంతే కదా..! సరదా మితిమీరి తమతో పాటు చుట్టుపక్కల అందరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని తెలుసుకోకపోతే ఎలా ! ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కాస్తో కూస్తో అలవర్చుకోవాలి. మన తాత్కాలిక సరదా దీర్ఘకాలంలో అందరితో పాటు మనకూ చేటు తెస్తుందన్న విచక్షణ అందరిలో రావాలి.. ముఖ్యంగా యువతలో...! చేటు కలిగించే సంప్రదాయాలు, సరదాలూ తగ్గించుకుంటే కొన్ని సమస్యలు వాటంతటవే సమసి పోతాయి కదా... 

       🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

No comments:

Post a Comment