Thursday, November 9, 2023

పండుగ సంతోషంగా జరుపుకుందాం...

                                            ~~ యం.ధరిత్రీదేవి~~

        🌷దీపావళి శుభాకాంక్షలు 🌷


   🌷 దీపావళి పండుగ పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ. మరీ ముఖ్యంగా పిల్లలు ఎంతగానో కోరుకుంటారు. ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కూడా. ఎందుకంటే టపాకాయలు కాల్చవచ్చని...కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు...ఇలారకరకాలు. అబ్బాయిలైతే... టపాకాయలు చాలా ఇష్టపడతారు. అమ్మాయిలైతే వాటికి కాస్త దూరమనే చెప్పాలి. వాళ్ళకి ఇంట్లో అమ్మలతో, అక్కలతో కలిసి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం ఇష్టం. 

     నరక చతుర్దశి, దీపావళి...ఈ రెండు రోజులూ సాయంత్రమవగానే ఈ దీపాల సందడి మొదలౌతుంది. అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్న వేళ ప్రమిదల్ని ఇంటిముంగిట వరుసల్లో అమర్చి చూస్తే...ఆ అలంకరణ, ఆ వెలుగుల దివ్వెలు కన్నులపండుగగా కన్పిస్తూ మురిపిస్తాయి. ఆ పిదప అసలైన కార్యక్రమం...కాకరపూలు, చిచ్చుబుడ్లు కాల్చడం మొదలౌతుంది. కాకరపూలు అందరికీ ఇష్టమైనవి, భయం లేకుండా కాల్చగలిగేవి. చిచ్చుబుడ్లు మెల్లిగా మొదలై పైకి ఎగసి వెలుగుల పూలు రాల్చడం చూసి తీరాల్సిందే. రాకెట్లు ఆకాశంలోకి దూసుకుపోతుంటాయి. చిన్నతనంలో ఇలాంటివి నేనూ ఎంజాయ్ చేశాను. ఇప్పుడైతే ప్రమిదలు వెలిగించడం ప్రతిసారీ ఆనవాయితీగా మారింది. ఈ వెలుగుల పండగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..!
  కాకపోతే... అంతా బాగుంటుంది కానీ, చెవులు చిల్లులు పడేలా పెద్ద పెద్ద శబ్దాలు చేసే ఆ ఆటం బాంబులు అంటే నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. కొందరైతే అర్ధరాత్రయినా కాలుస్తూనే ఉంటారు. పండగ సరదాగా గడిచిపోవాలి గానీ... అందరూ విసుక్కునేలా, భయంగొలిపేలా ఉండకూడదు కదా!
  పైగా... వీటిని కాల్చేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి కూడా.. లేకపోతే కాకరపువ్వొత్తులు కాల్చినా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎంతైనా ఉంది. చివరగా,  మరొక్క  విషయం.. ఒకప్పుడు ఈ టపాకాయలు కాల్చే  సంస్కృతి దీపావళి పండుగకు మాత్రమే పరిమితమై ఉండేది. దీపావళి అంటే దీపాల పండగ..టపాకాయలు కాల్చే పండగ..  అంతే.. కానీ ఇప్పుడు... అదేమిటో! ఇదీ, అదీ అని లేకుండా సందర్భం ఏదైనా సరే, కాల్చేస్తున్నారు. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, అన్ని రకాల ఊరేగింపులకు, అన్నింటికీ...! వాళ్ల సంతోషాన్ని ప్రదర్శించడానికి !! అవసరమా... అనిపిస్తూ ఉంటుంది. కొండొకచో...( క్షమించాలి) శవయాత్రల్లో  కూడా...!
    అన్నింటినీ మించి వాటి వల్ల వెలువడే పొగ.. ప్రమాదకరమై వాతావరణ కాలుష్యానికి కారణభూతమవుతోంది.ఇది అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది.  అతి ఎప్పుడూ అనర్ధదాయకం కనుక ఓ పద్ధతిగా,  మితంగా కాల్చడమన్నది గమనించవలసిన విషయం.
   ఏదేమైనా, పండుగను పండుగలా,  ప్రమాదాలు దరిజేరకుండా జరుపుకుందాం... అందరికీ దీపావళి శుభాకాంక్షలు.💐

🎆🎇🎆🎇🎆🎇🎆🎇🎆🎇🎆🎇🎆🎇🎆🎇🎆🎇

No comments:

Post a Comment