Thursday, December 7, 2023

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే..20.. 'That is your seat''

🌺
    అవి నేను ఉద్యోగంలో చేరిన తొలిరోజులు. ఉపాధ్యాయినిగా ప్రైవేట్ స్కూల్లో నాలుగైదు సంవత్సరాల అనుభవమున్నా ప్రభుత్వ పాఠశాలలో చేరడం ఇదే మొదలు. నాతో పాటు మరో నలుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. సంవత్సరం పాటు పనిచేశాక, అంతవరకూ HM గా పనిచేసినావిడ మరో చోటికి బదిలీ అయిపోయి, అనుకోని విధంగా నేను HM గా బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది. అంతా కొత్త.. ! అవటానికది ప్రాథమిక పాఠశాలే అయినా.. రకరకాల పనులు... తెలియని విషయాలెన్నో ! మండల విద్యాధికారి, తనిఖీలంటూ మరికొందరు పాఠశాలను అడపాదడపా సందర్శించేవారు. ఏవేవో రికార్డులు చెక్ చేసేవారు. అలా అలా రెండేళ్లు గడిచాయి. ఒకరోజు...
మధ్యాహ్నం పన్నెండు అవుతోంది. నా గదిలో కూర్చుని ఏవో రికార్డులు చూసుకుంటున్నాను. తలుపు వద్ద ఓ వ్యక్తి నిలబడి ఉండడం చూసి, ఎవరా  అనుకునేంతలో, 
" నేను DEO ను... "
అంటూ లోపలకొచ్చాడు. అంతకుముందోసారి ఏదో మీటింగులో ఆయన్ని చూసిన గుర్తు. వెంటనే లేచి విష్ చేసి, ముందుకు కదిలి, నేను కూర్చున్న కుర్చీ చూపించి కూర్చోమన్నాను.
" ఎందుకమ్మా? That is your seat. నీవక్కడే కూర్చోవాలి...ఇక్కడికి ఎవరొచ్చినా నీ కుర్చీ నీదే..", 
అంటూ నా ఎదురుగా టేబుల్ ముందున్న మరో కుర్చీలో కూర్చున్నారు. ఓ క్షణం అప్రతిభురాలినైపోయాన్నేను. అంతకుముందు ఏ అధికారి వచ్చినా బరబరా వచ్చి దర్జాగా HM కుర్చీలో కూర్చోవడమే తెలుసు నాకు. నేనే కాదు...ఏ HM అయినా అలాగే తన కుర్చీ ఆఫర్ చేసేవారు.వాళ్ళూ నిరభ్యంతరంగా కూర్చునేవారు.
   ఈయన ఓ జిల్లా విద్యాశాఖాధికారి అయివుండీ ఏమాత్రం అహం అన్నది లేక ఓ చిన్న పాఠశాల ప్రధానోపాధ్యాయినికి ఎంతో గౌరవం ఇవ్వడం ఆశ్చర్యం గొలిపింది...అంతేకాదు...ఆ మాట నాలో ఏదో తెలీని ధైర్యాన్ని నింపింది. అంతవరకూ బెరుకుబెరుగ్గా ఎవరితో ఏ తంటా వస్తుందో అన్నట్లుగా డ్యూటీ చేస్తున్న నాకు ఓ కొత్త పాఠం నేర్చుకున్నట్లయింది. అప్పట్నుంచీ చిన్నచిన్న వాటికీ భయపడడం బాగా తగ్గించుకున్నాను. సమస్య ఏదైనా, ఎలాంటిదైనా సరే...ఎదురైనపుడు వెంటనే భయానికీ, ఆందోళనకీ లోనవక స్థిమితంగా ఆలోచించడం అలవడింది. అది భవిష్యత్కాలంలో నాకు ఎంతగానో ఉపయోగపడింది కూడా !! 
   ఆతర్వాత ఎన్నో సంవత్సరాలు పనిచేసినా, ఇప్పుడు రిటైరై ఇంతకాలం గడిచినా...ఆ DEO గారు, ఆయనన్న ఆ మాట "That is your seat " అన్నది ఇప్పటికీ ఇంకా నాకు గుర్తున్నాయంటే...అది వారి ఉన్నతమైన సంస్కారం...పై అధికారినన్న దర్పం ఏ కోశానా లేని ఆ వైఖరి !!
    ఉద్యోగవిరమణ జరిగి మనిషికీ, మెదడుకీ కాస్త తీరికచిక్కి, గతంలోకి తొంగిచూసుకుంటూ ఉంటే ... అప్పుడప్పుడూ     ఇలా ఒక్కో జ్ఞాపకం నిద్ర లేచి పలకరించిపోతూ ఉంటుంది. ఆ DEO గారు నాకు మళ్ళీ కనిపించిందిలేదు. పాఠశాలలోని తరగతి గదులన్నీ ఒకసారి విజిట్ చేస్తూ కొద్ది నిమిషాలపాటు సాగిన పయనం ! అయినా ...ఈరోజిలా రాయాలనిపించిందంటే...ఆ అధికారి అన్న ఆ ఒక్కమాట...That is your seat.. 
     కొందరు వ్యక్తులు యధాలాపంగా అన్న కొన్ని మాటలు మనం సరైన కోణంలోంచి చూస్తే...అవి  చక్కటి  సందేశాలే కాదు...మార్గదర్శకాలూ అవుతాయి.
******************************************
  





No comments:

Post a Comment