Thursday, December 14, 2023

ఇంద్రధనుస్సు...The Rainbow...ONE

<><><><><><><><><><><><><><><><><><><
                       🌈ఇంద్రధనుస్సు 🦃
                         🥀---The Rainbow 🦋
           ***అంబరాన హరివిల్లు సప్తవర్ణ శోభితం 
                   అదృశ్యహస్తం అద్భుతవిన్యాసం🐦
<><><><><><><><><><><><><><><><><><><
🌷
 ఇంద్రధనుస్సులో ఎన్నోరంగులుంటాయి.ఒక్కోరంగుదీ ఒక్కో ప్రత్యేకత...ఒక్కో అందం.అలాగే సాహిత్యంలో కూడా వివిధ ప్రక్రియలు...కథ, కవిత, వ్యాసం, పద్యం,నాటకం,గేయం,శ్లోకం,సుభాషితం..ఇంకా.. సామెతలు, హాస్య సంభాషణలు పదవినోదాలూ,పజిల్స్..అలా...అలా...ఎన్నో..
ఎన్నెన్నో .. వైవిధ్యమైన అంశాలు చోటుచేసుకుని అలరిస్తూ మనసుకు ఆహ్లాదాన్నీ, విజ్ఞానాన్నీ, వినోదాన్నీ అందిస్తూ ఉంటాయి.    
   ఈ ఇంద్రధనుస్సులో...నేను అక్కడక్కడా చదివినవీ, నాకు తెలిసినవీ, ఇంకా నా సొంత ఆలోచనలతో రూపు దిద్దుకున్నవీ...దర్శనమిస్తాయి🙏
=====================================
అంబరాన హరివిల్లు అదిగో...🌈
అక్షరాల విరిజల్లు ఇదిగో...📝

ఇందులో...                                  
*  సుభాషితం...వాగ్భూషణం           
*  చిన్నకథ    ....అందని ద్రాక్ష.. 
*  స్ఫూర్తి...the greatest fault..
*  మనసు పలికిందిలా..మల్లెలివి..
*  చిన్నారి పజిల్స్🤷‍♀️👷తమాషా వాక్యాలు 
*  😄😀 🤗🤭       
మరిన్ని...
                                ----సమర్పణ : యం.ధరిత్రీ దేవి 
===============================                          *  🌷 సుభాషితం 

     కేయూరాన విభూషయంతి పురుషం 
     హారాన చంద్రోజ్జ్వలా: 
     న స్నానం న విలేపనం న కుసుమం 
     నాలంకృతా మూర్ధజా:
     వాణ్యేకా సమలంకరోతి పురుషం 
     యాసంస్కృతా ధార్యతే 
     క్షీయంతే ఖలు భూషణాని సతతం 
     వాగ్భూషణం భూషణం 👌
    
 👉 భుజకీర్తులు, మెడలో మెరిసే హారాలు, కురులకు సొగసైన అలంకారాలు, పుష్పమాలలూ, పన్నీటి స్నానాలు... ఇవేవీ  మనిషికి  అసలైన అలంకారాలు కావు. వినయం, చక్కటి సంస్కారం, మృదువైన మాటలు... ఇవే మనిషికి ఆభరణాలు. మిగిలినవన్నీ నశించిపోతాయి. మృదువుగా మాట్లాడే మంచి మాట మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది. కాబట్టి ఎవరికైనా వాక్కు అనే భూషణమే అసలైన భూషణం. మనిషికి అదే అసలైన ఆభరణం...అలంకారం. 
   భర్తృహరి నీతి శతకం లోనిది ఈ శ్లోకం. ఏ ఆభరణమూ ఇవ్వలేని విలువ మనిషికి మంచి మాట ఇస్తుంది... ఎంత చక్కని మాట!!
         గూగుల్ లో ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంది ఈ శ్లోకం. ముఖ్యంగా, మొదట్లో 'కేయూరాణి న విభూషయంతి' అని ఉంది. 'కేయూరాన విభూషయంతి'అని మరికొన్ని చోట్ల ఉంది.   . అలాగే మరికొన్ని పదాలూ...! ఇందులోని భావం నచ్చి పొందుపరిచాను. ( ఇదే శ్లోకం మరి కాస్త వివరంగా ఇదే బ్లాగులో 'వాగ్భూషణం భూషణం' అన్న పేరుతో 7.8.2020 న  రాశాను. )
======================================
                        *  చిన్న కథ ✍️

      ✴️ అందని ద్రాక్ష పండ్లు పుల్లన... ఈ కథ తెలియని వారుండరు, ఆ తరం నుండి ఈ తరం వరకూ... అందులో నక్క... దాని ఆలోచనా  సరళి ఎలా మారి పోతుందో తెలుసుగా...! ఈ క్రింది భార్యాభర్తల సంభాషణ చూడండి... ఏమైనా పోలికలు కనిపిస్తాయేమో!!
                            #         #         #
" ఏమే,ఇలారా.. పేరయ్య గారొక సంబంధం చెప్పారు. అబ్బాయి ఇంజనీరట. లక్ష పైగానే జీతం. ఒడ్డు, పొడుగూ, అందం చందం, ఆస్తి అంతస్తు అన్నీ బ్రహ్మాండంగా  ఉన్నాయి.ఒక్కడే కొడుకట !అక్కచెల్లెళ్లెవరూ లేరట ! లక్షలు కాదు కోట్ల ఆస్తి.. సరే చూద్దాం అన్నాను... ఏమంటావ్..."
కృష్ణారావు భార్య కాంతంతో ఎంతో ఉత్సాహంగా చెప్పాడు. ఉబ్బి తబ్బిబ్బయిపోయింది కాంతం.
" మరే... ఆడబిడ్డల జంజాటం  ఉండదు. అత్తమామల దగ్గర ఉండే అవసరం లేదు. హాయిగా ఇద్దరే...! లక్షల్లో జీతం. ఎంత అదృష్టం! ఇదే కుదుర్చుకుందామండీ. కట్నం ఎంతైనా సరే ఇద్దాం. ఖర్చు ఎంతైనా సరే.."
ఇద్దరూ అప్పుడే ఆ సంబంధం కుదిరిపోయిందన్నంత సంబరపడిపోయారు.
                ***           ***             ***
" ఛ ఛ! ఎలాంటి మనుషులు! అమ్మాయి నలుపట! పొట్టిగా ఉందట! తన పక్కన బాగుండదన్నాడట ! ఫోటో చూసినప్పుడు తెలీలేదా అతగాడికి!!"
కృష్ణారావు ఇంతెత్తు  ఎగిరి పడ్డాడు భార్య దగ్గర... పేరయ్య చెప్పిన వార్త చెప్తూ. 
"...అయినా, బోడి సంబంధం. పోతే పోయిందిలే... అయినా,వాడు  మాత్రం పెద్ద అందగాడా ఏంటి! చప్పిడిముక్కు...కళలేని మొహం..తోలు ఎర్రగా ఉంటేసరా !   ఇక ఉద్యోగం.. సాఫ్ట్వేర్ వాళ్ళ ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటివి కాదూ ! ఎంచక్కా గవర్నమెంట్ జాబ్ అయితే ఢోకా  ఉండదు..."
"ఔనౌను... అయినా, ఒక్కడే కొడుకన్నారు.ఆ గారాల  కొడుకును మనమూ, మన పిల్లా భరించలేములెండి. ఎంతసేపూ తల్లి కొంగు పట్టుకునే ఉండే బాపతు కాదూ... ఇలాంటి కొడుకులు ! లక్షణంగా ఇద్దరో ముగ్గురో కొడుకులు ఉండే సంబంధం చూసుకుందాం, "
వంత పాడింది కాంతం.
" అంతే అంతే. పేరయ్యకు చెప్తా, అలాంటి సంబంధం ఏదైనా ఉంటే చూడమని...అయినా ఏదో అనుకున్నాం గానీ ఏవో  లొసుగులున్నాయంటలే వాడిలో.."
కృష్ణారావు చెప్పులేసుకుంటూ బయటపడ్డాడు. 'అందని ద్రాక్ష పండ్లు పుల్లన...అన్న చందాన లేరూ వీళ్ళు !! 
====================================
                          *  స్ఫూర్తి 👌

👉  గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా.... దాన్ని చేరుకునే                 మార్గం  మాత్రం నీ పాదాల క్రింది నుంచే 
       మొదలవుతుంది.
👉   ప్రయత్నం చేసి ఓడిపో... కానీ... 
       ప్రయత్నం చేయడంలో  ఓడిపోకు.    
👉   The greatest fault is to think 
       that you are faultless.
=====================================
               *   మనసు పలికిందిలా ✍️
               🎶🎻🎺🎼🎸🎺🎷🎸🎶

                             * మల్లెలివి...
✴️
పగలంతా సడిసేయని మౌనం... 
రాత్రికి ముగ్ధమోహన సౌందర్యం...
మెల్లగా...మెల్లమెల్లగా విరిసి విరిసి 
విచ్చుకుంటూ వెదజల్లే సుగంధం... 
పరిమళభరితం...మదినిండా ప్రమోదం...
మల్లెలివి..మైమరపించే 
శ్వేత వర్ణకుసుమాలివి...
గుదిగుచ్చిన మాలగ మారితే 
మగువ సిగకు సింగారం...
గుడిని జేరిందా... జన్మే ధన్యం !!🐦
=================================
                  * చిన్నారి పజిల్స్ 🧛🕵️‍

✴️ ( 'ఈనాడు' హాయ్!బుజ్జి'  లో ప్రచురితం ) ✍️

---- ఇలాంటివి సరదాగా ప్రయత్నించండి 🙂

=================================
                 🤗😄😁😃😀
( అక్కడక్కడా  మ్యాగజైన్స్ లో చదివిన జోక్స్, కార్టూన్స్ బాగా నవ్వు తెప్పిస్తుంటాయి.  అందులో కొన్ని...)  
🤗
ఇద్దరు మిత్రులు వాళ్ళ పనివాళ్ల గురించి మాట్లాడుకుంటున్నారు. 
" మా నౌకరు ఉట్టి దద్దమ్మ", ఒకతను చెప్పాడు. 
" మావాడు అంతకంటే చవట, " మరొకతను అన్నాడు. 
  ఎవరు ఎంత మూర్ఖులో పరీక్షిద్దామనుకున్నారు ఇద్దరూ.
  మొదటాయన తన పనివాణ్ణి పిలిచి, 
" ఈ పది రూపాయలు తీసుకెళ్లి టీవీ కొనుక్కునిరాపో.. "
  అన్నాడు. అలాగే అతని మిత్రుడు తన పని వాడిని            పిలిచి, 
" వెంటనే వెళ్లి, నేను ఆఫీసులో ఉన్నానో  లేదో కనుక్కొని     రా..." అని పురమాయించాడు. ఇద్దరు పనివాళ్ళు      తలలూపి వెళ్లారు. దారిలో ఒకరితో ఒకరు ఇలా   చెప్పుకున్నారు.
" ఇవాళ మంగళవారం. మా సారుకు  మంగళవారం నాడు  దుకాణాలు మూసి ఉంటాయని కూడా తెలీదు పాపం..!"
 అన్నాడొకడు. 
" మా బాసు ఒట్టి సోమరిపోతు. ఆయనే ఆఫీసుకు ఫోన్  చేసి తాను అక్కడ ఉన్నాడో  లేదో కనుక్కోవచ్చుగా..."
రెండోవాడి తెలివిది !!ఎవరెంత మూర్ఖులో తెలిసిందిగా !
 🤗
ప్రిన్సిపల్ తన విద్యార్థులతో చెబుతున్నాడు.
" మరేం పరవాలేదు.  కొత్త ల్యాబుకు ఉపకరణాలు కొనడానికి అవసరమైన నిధులు మన దగ్గరున్నాయి..."  
" మరేంటి సార్ ప్రాబ్లెమ్ !"
అడిగాడో విద్యార్థి. 
" కాకపోతే, అవి ఇంకా మీ జేబుల్లోనే ఉన్నాయి... "
😛
తెలుగు టీచర్ : "ఎద్దు, ఆవు గడ్డి మేస్తున్నారు", ఈ వాక్యాన్ని సరిచేయండి. 
ఓ విద్యార్థి : ఆవు, ఎద్దు గడ్డి మేస్తున్నారు. 
టీచర్ : అదెలా? 
విద్యార్థి : లేడీస్ ఫస్ట్ !
====================================
                 👉   *  మరిన్ని ...

🍀 ఊరట :
        ప్రపంచకప్ చేజారిపోయి, కొండంత ఆశ ఆవిరైపోయి భారత క్రికెట్ టీమ్ తల్లడిల్లుతున్న క్షణాన...మన ప్రధాని మోడీగారు డ్రెస్సింగ్ రూములో కెళ్ళి వారిని అక్కున జేర్చుకుని ఊరడించారట ! ఎంతటి ఉపశమనం ! 
" ప్రపంచకప్ ఆటలో మీ ప్రతిభ, పట్టుదల గణనీయమైనవి.గొప్ప ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేసిన మీకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాం"
 అంటూ భుజం తట్టి, ప్రశంసలు కురిపించారట..!!👍
🍀 రివర్స్ :
  సాధారణంగా ఎక్కడైనా కోడళ్ళు ఆధునికంగా  (modern) ఉంటారు. అత్తగార్లేమో కాస్త సంప్రదాయబద్ధంగా ఉంటూ ఉంటారు. అవునా,  కాదా! కానీ, ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో పరిస్థితి తద్భిన్నంగా ఉందని ఓ వార్త వెలువడింది. అత్తగారేమో జీన్స్ వేస్తుందట! కోడలికేమో చీరలు కట్టడమే ఇష్టమట! పెళ్లయి అత్తగారింట అడుగు పెట్టాక... ఆ అత్తగారు  కోడల్ని జీన్స్ వేసుకోవాలంటూ ఒకటే ఒత్తిడి తెచ్చిందట! కోడలేమో పల్లెటూరి నుండి వచ్చిన కారణంగా ససేమిరా  అందట! ఆఖరికి అత్త ఒత్తిడి తట్టుకోలేక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిందట ఆ కోడలు పిల్ల!
~~ కొసమెరుపు : ఆ అమ్మాయి భర్తతో విషయం చెప్పుకొని వాపోతే...ఆ మగడు తిరిగి  తననే కొడుతున్నాడని ఆ కోడలు  ఫిర్యాదు 🤔
🍀 మానవత్వం మంటగలిసిన వేళ :
మానవతాదృక్పథంతో ఇస్తున్న ప్రభుత్వ ఉద్యోగం కోసం జులాయిగా తిరుగుతున్న ఓ కొడుకు ప్రభుత్వ ఉద్యోగి అయిన అతని తండ్రి మరణిస్తే... ఆ ఉద్యోగం తనకు వస్తుందని... కిరాయి హంతకులను పెట్టి తండ్రి పై కాల్పులు జరిపించాడట!! అదలాగుంటే....
🍀 మానవత్వం పరిమళించినవేళ :
తండ్రి జైలు పాలయ్యాడు. తల్లేమో అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండిపోయింది.వాళ్ళ నలుగురు పిల్లల్ని మహిళా పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారు. ముందుగా వారికి ఆహారం అందించారు, కానీ..వారిలో ఓ నాలుగు నెలల పసికందు ఆకలి ఎలా తీర్చాలో తెలియలేదు వాళ్లకు!అప్పుడు ఎం. ఎ.ఆర్య అనే తొమ్మిది నెలల పసిబిడ్డకు తల్లి అయిన ఓ మహిళా పోలీసు వెంటనే ఆ బిడ్డను అక్కున జేర్చుకుని తన పాలు పట్టించి ఆకలి తీర్చి, ఆ బిడ్డ ఏడుపు ఆపిందట!!కొచ్చిన్ లో జరిగిందట  ఈ సంఘటన !
రెండూ హృదయాన్ని కదిలించేవే ! ఒకటి బాధతో...ఒకటి కరుణతో..!🤔
                     --------------------------
<><><><><><><><><><><><><><><><><><><
          🌷  అందరికీ ధన్యవాదాలు 🌷
                 🙏  మళ్ళీ కలుద్దాం 🙏
<><><><><><><><><><><><><><><><><>
      


 

2 comments:

  1. హాయిగా పార్కులో ఫ్రెండ్స్ తో కబుర్లాడుకున్నంత తృప్తిగా ఉంది బ్లాగును చదూతూంటే

    ReplyDelete
  2. బ్లాగు నచ్చినందుకు చాలా సంతోషమండీ. Thank you very much for your comment also.

    ReplyDelete