Sunday, December 17, 2023

ఇంద్రభవనం !!

    " హైమా, మీ బావగారిది రెండు చేతులా ఆర్జించే ఉద్యోగం. వద్దంటే వచ్చి పడ్తున్న డబ్బు ! ఏంచేసుకోవాలో తోచక రెండంతస్థుల భవనం కట్టేశాడు. అది చూసి నువ్వు మీ అక్కతో నిన్ను పోల్చుకుంటూ ఫీలయిపోతున్నావేంటి ! నా జీతం గురించి నీకు బాగా తెలుసు. అయినా వస్తున్న దాంట్లోనే హ్యాపీగా ఉంటున్నాం కదా ..."
" అది కాదండీ... "
 భార్య మాట వినిపించుకోకుండా, 
"... చిన్న వయసులోనే మనం సొంత ఇల్లు కట్టుకోగలిగాం. ఎంతమందికి సాధ్యమవుతుంది చెప్పు! మూడు సెంట్లలో  అయినా చక్కగా అన్ని వసతులూ  ఉన్నాయి మనకు. లేనిపోని గొప్పలకు పోయి అప్పులపాలవుదామంటావా  చెప్పు!... "
 అన్నాడు ప్రసాదరావు. 
 హైమావతి, ప్రభావతి సొంత అక్కాచెల్లెళ్ళు. రెండు  రోజుల క్రితం ప్రభావతి వాళ్ళ గృహప్రవేశానికి వెళ్లొచ్చారు హైమావతి దంపతులు.ఐదున్నర సెంట్లలో డ్యూప్లెక్స్  బిల్డింగ్... చాలా ఆడంబరంగా కట్టారు. ఆ వైభోగం..అదీ... చూసేసరికి... హైమావతికి కళ్ళు తిరిగాయి. 
     అంతేకాదు... రెణ్ణెల్ల  క్రితం తన చిన్ననాటి స్నేహితురాలు శశిరేఖ కూడా తన గృహప్రవేశానికి పిలిచింది. అదీ  అంతే!  ఇంద్ర భవనాన్ని తలదన్నేలా ఉంది. ఈ రెండూ... హైమావతిలో తీవ్ర అసంతృప్తిని రేపాయి. అంతే ! అప్పట్నుంచీ.... భర్త దగ్గర ఒకటే నస! సణుగుడు !! 
" మనమూ అలాంటి ఇల్లు కట్టుకోవాలి.. ఇది చాలా చిన్నదిగా  ఉంది.. ఓల్డ్ ఫ్యాషన్ కూడా..."
అంటూ !
 " ఊరుకోండి,  మీరు మరీ చెప్తారు.. వాళ్లు లోన్ తీసుకునే  కట్టారట! అక్క చెప్పింది. మనమూ  అలాగే చేద్దాం. శశిరేఖ కూడా అంతే... చిన్నప్పట్నుంచీ  చూస్తున్నా దాన్ని... "
" ........... "
"... ఎలాగూ  మనకు ఇంటి స్థలం రెడీగానే ఉంది. ఏముంది.. నెల నెలా ఇంత చెల్లించుకోవచ్చు.. "
భర్త మాటలకు అడ్డుతగులుతూ తేలిగ్గా అనేసింది హైమావతి. 
" ఓహో, అదన్నమాట నీ  భరోసా! అది రేపటి అవసరాల కోసమంటూ తీసిపెట్టాను. నీకూ  తెలుసు. అయినా స్థలం ఉంటే చాలా... కట్టాలి కదా! ఓ వైపు పెరుగుతున్న పిల్లలు ! వాళ్ల చదువులు.. మిగతా ఖర్చులు! ఏ మాత్రం ఆలోచన అన్నది లేకుండా మాట్లాడకు. లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి ఎలా తీరుద్దామనుకుంటున్నావు !..... "
 భార్య నోటికి తాళం వేసే ప్రయత్నం చేశాడు వర ప్రసాదు. రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది హైమావతి. అలా అలా ఈ సంభాషణ మరో నెల దాకా కొనసాగుతూనే ఉంది. చివరికి దిక్కు తోచని వర ప్రసాదు భార్య పంతానికి తలొగ్గక తప్పలేదు. 
" సరే... చూస్తాను... లోన్ ఎంతవరకు వస్తుందో కనుక్కుంటాను... ఆ ప్రయత్నాల్లోనే ఉంటానులే.. ఇంక సణుగుడు  ఆపు... "
అన్నాడో ఉదయాన ! భర్త నోటి నుండి ఆ మాట వెలువడేసరికి... అప్పుడే ఇల్లు కట్టుకున్నంతగా సంబరపడిపోయింది హైమావతి.
                **            **             **
    సాయంత్రం టీవీ చూస్తోంది హైమావతి.... భర్త, పిల్లలతో కలిసి. ఏ న్యూస్ ఛానల్ చూసినా.. ముంచెత్తుతున్న వర్షాలు.... వరదలు.. కాంక్రీట్ బిల్డింగుల్లోకి సైతం నీళ్లు దూసుకు వచ్చేసి, అతలాకుతలం చేసేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల గుడిసెలయితే దారుణం ! పై భాగం మాత్రం కనిపిస్తోంది.
     వారం రోజులుగా ఇవే దృశ్యాలు అంతటా. హైమావతి గుండె బరువెక్కి పోతోంది అదంతా చూస్తూ ఉంటే.
" దేవుడా, వీళ్ళ పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం ఎంతకాలమని పునరావాసం కల్పిస్తుంది? తిరిగి వాళ్లు సొంతగూటికి చేరాల్సిందే కదా... ఆ గుడిసెలు ఇంకెన్నాళ్లకు మామూలు స్థితికొస్తాయి ! వాళ్ళ జీవితాలు మళ్ళీ ఎప్పుడు గాడిలో పడతాయి ! అంతర్మధనం ప్రారంభమైంది ఆమెలో ! ఒకసారి తన ఇల్లు పరకాయించి చూసుకుంది. ఎత్తైన ప్రదేశంలో చక్కగా కట్టుకున్న రాతి  కట్టడం. చిన్నదే గానీ... చూడముచ్చటగా ఉంది. చుట్టూ అంతా తమ స్థాయికి తగ్గ వారే.
     భర్త పొదుపరితనంతో, ముందుచూపుతో ముప్ఫయి సంవత్సరాల వయసు లోపలే సొంతంగా ఏర్పరచుకున్న అందాల బొమ్మరిల్లు అది ! దీన్ని వదిలేసి ఎక్కడికో పరుగులు తీయాలనుకుంటోంది తను ! అంతేకాదు.. భర్త సహనానికీ పరీక్ష పెడుతోంది. ఇప్పటివరకూ చీకూ చింతా లేకుండా సాగిపోతోంది జీవన రధం...ఇకపై...!   సన్నగా అలజడి మొదలైంది హైమావతిలో.
    మరి ఈ గుడిసెవాసుల  పరిస్థితి ఏమిటి ?  మరోవైపు కోట్లు వెచ్చించి  అంత గొప్పగా కట్టుకున్న ఇళ్లలోకి కూడా ప్రవాహంలా వచ్చేస్తోందే  నీరు !! వారం నుండీ కలత నిద్రే దిక్కవుతోంది ఆమెకు.
               **              **           **
 " హైమా,  హైమా..లే.. ఈ వార్త  చూడు.."
 హడావుడిగా లేపాడు వరప్రసాద్. ఇంకా తెల్లారలేదు. భర్త కంగారు చూసి నిద్ర మత్తు ఎగిరిపోయి పేపర్ చూసింది హైమావతి. ఆమె బావ గారి ఫోటో ! దానికి సంబంధించిన న్యూస్ ! గబగబా చదివేసింది. అవినీతి ఆరోపణలతో ఆయన ఇంటిని సోదా చేశారట ! అక్రమార్జన అంతా బయటపడిందట !.... ఇంకా చాలా చాలా రాశారు...
' దేవుడా!'
కళ్ళు తేలేసింది హైమావతి. మధ్యాహ్నం దాకా  కోలుకోలేక అన్యమనస్కంగానే వంట పూర్తి చేసింది. ఏమిటో ! మనసంతా దిగులుగా, గాభరాగా అనిపించింది. మెల్లిగా వెళ్లి, రెండు నిమిషాలపాటు కళ్ళు మూసుకుని అలా పడుకుండిపోయింది. వెంటనే ఓ స్థిరనిశ్చయానికొచ్చి లేచి ఫోన్ అందుకుంది.
" ఏవండీ, ఎక్కడున్నారు? "
" ఆఫీసులో.ఆ...హైమా, లోన్ కోసం కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాయి. ఇక సబ్మిట్ చేయడమే. ఓ గంటలో  పనయిపోతుంది..."
" వద్దండీ.. ఏ లోన్ వద్దు. మీరు ఆ ప్రయత్నం మానేయండి.."
" అదేంటీ, అంతా రెడీ అయ్యాక.... !"
" మరేమీ  పర్వాలేదు. మనకున్న ఇల్లు చాలు. ఏ ఇంద్రభవనమూ అక్కర్లేదు.  మనకొద్దు.." 
 క్షణం విస్తుబోయినా.... వరప్రసాద్ కు విషయం వెంటనే బోధపడింది. అతని పెదవులపై చిన్నగా నవ్వు!!

******************************************


       

2 comments:

  1. కథ బాగుంది, సమకాలీనంగా ఉంది.
    ఈ కథ ఇదివరలో వ్రాసారని అనిపిస్తోందే 🤔🤔 ?

    ReplyDelete
  2. ధన్యవాదాలండీ 🙂

    ReplyDelete