నిజమే కదా ! జయాపజయాలన్నవి మన చేతుల్లో ఉండవన్నది ఎంతైనా నిజం. కాకపోతే...ఎవరైనా, ఎప్పుడైనా చేయవలసింది...కృషిని నమ్ముకుని పట్టుదలతో పోరాడడమే...! ఫలితం ఆ తర్వాతే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రపంచకప్ నిన్నటిదినం మనవాళ్ల చేజారిపోయి ఆస్ట్రేలియాను వరించింది. ఓ అద్భుత అవకాశం తృటిలో అనూహ్యంగా అదృశ్యమై అంతులేని నిరాశలో కూరుకుపోయేలా చేసేసింది.
ఆశ్చర్యమేమంటే...ఎవరూ జట్టును నిందించలేదు. అవహేళన చేయలేదు. కారణం తెలిసిందే... అంతవరకూ అజేయంగా పది మ్యాచ్ లు గెలిచి, అందరికీ ఎంతో సంతోషాన్ని అందించిన ప్రతిభావంతమైన జట్టిది. అందరూ జగత్ జెట్టీలే ! రోహిత్ సారధ్యాన్ని తప్పు పట్టలేము. విరాట్ కోహ్లీ...సచిన్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టేశాడు. షమీ సరేసరి...! వికెట్ వీరుడయ్యాడు. మిగతా వాళ్ళనీ తీసిపారేయలేం. అంత సాధించిన జట్టు ఫైనల్ లో కూడా ఆషామాషీగా ఆడలేదు. అయినా...విధి బలీయం...అవతల కంగారూలు విజృంభించడం ఊహలకందని పరిణామమే !!
స్టేడియంలో అలుముకున్న నిశ్శబ్దం ప్రత్యర్థులకు సంతృప్తి నిచ్చిందట ! బాధాకరంగా ఉంది ఈ వ్యాఖ్య. ఏదిఏమైనా...రోహిత్ సేనది పేలవమైన ఆట అనలేము. టైం కలిసిరాలేదనుకుందాం. అయినా, ఇప్పుడు విమర్శనాస్త్రాలు కాదు...సాంత్వనవచనాలు పలకాలి. అంతకుముందు వారు గెలిచిన మ్యాచ్ లు మననం చేసుకుందాం. మనసారా అభినందిద్దాం. ఇంకా ఉత్సాహపరుద్దాం...ఎందుకంటే, పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు గనుక !అపజయాలు విజయానికి మెట్లు... అన్న సంగతి మరువరాదు...Better luck next time...
****************
No comments:
Post a Comment