Tuesday, February 21, 2023

"ఈ మందులు వాడండి... నెల తర్వాత రండి... "... కథ

🌷

    క్లినిక్ కి కాస్త ఎడంగా బైక్ ఆపి, భార్య వైదేహితో పాటు ముందుకు నడిచాడు మోహన్ రావు. ఆరోజు సోమవారం అయినందువల్లేమో పేషెంట్లు చాలామంది కూర్చుని ఉన్నారు.  ఫోన్లోనే అపాయింట్మెంట్ తీసుకోవడం మేలయింది అనుకున్నారిద్దరూ. టోకెన్ నెంబర్ ఆరే కాబట్టి త్వరగానే వెళ్లొచ్చు అనుకుంటూ ఓ పక్కగా చైర్స్ లో కూర్చున్నారిద్దరూ. డాక్టర్ మాత్రం ఇంకా రాలేదు. ఏమిటో.. ! బయట బోర్డు మీదేమో సాయంత్రం 6:00 నుండి అని రాసి ఉంటుంది... వచ్చేదేమో.... ఏడున్నరకు...! 
    మోహన్ రావు ఓ గవర్నమెంట్ ఆఫీస్ లో మంచి హోదా గలిగిన ఉద్యోగమే చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. మంచి లొకాలిటీలో పెద్ద ఇల్లు... రెండంతస్తులది కట్టుకున్నాడు. కింద రెంట్    కి ఇచ్చేసి, పైన ఫ్యామిలీతో ఉంటున్నాడు. ఫ్యామిలీ అంటే.. తనూ  తన వైఫ్ అంతే... పిల్లలు ఇద్దరూ   సెటిల్ అయిపోయారు. పెన్షన్ బాగానే వస్తుంది. ఇంక కొదవేముంది ! ఇద్దరూ మలిదశలోో చక్కగా ఎంజాయ్ చేస్తూూ గడిపేస్తూ ఉన్నారు. కానీ... ఈమధ్య కొంతకాలంగా, మోహన్ రావు ఓకే గానీ... వైదేహే పాపం వయసుతో పాటు వచ్చిన కొన్ని అనారోగ్యాలతో ఇబ్బందిి పడుతోంది.
   దాదాపు రెండు నెలల నుండీ కడుపులో ఏదో అసౌకర్యం.. మలబద్ధకం... దాంతో కళ్ళు తిరగడం...! ఓ నెల దాకా చూసింది, అదే తగ్గుతుంది లే అని.!మరో నెలా చూసింది.  ఇక లాభం లేదనుకుని, రెండు రోజులు ఆలోచించి ఇదిగో ఇలా ఈ  డాక్టర్ అనుభవజ్ఞుడని తెలుసుకొని భర్తతోపాటు బయలుదేరింది. 
ఇంతలో అందరూ లేచి నిలబడ్డం చూసి, వీళ్ళిద్దరూ కూడా లేచారు. కారు లోంచి దిగి చకచకా మెట్లెక్కి  లోనికి దూరిపోయాడు  డాక్టర్. రెండు మూడు నిమిషాలయ్యాక పిలవడం మొదలైంది. ఈలోగా మరికొందరొచ్చారు.ఛైర్స్  లేక కొందరు నిలబడ్డారు. ఒక్కొక్కరికి... పది నిమిషాల నుండి పావుగంట.. బయట ఉన్న వాళ్ళకి ఒకటే ఆదుర్దా.. ! తమ వంతు కోసం.. బయటకు వస్తున్న వాళ్లలో చాలావరకు చీటీలు తీసుకుని పక్కనే ఉన్న ల్యాబ్ లోకి దూరుతున్నారు పరీక్షల కోసం..! ఇంకొందరు రాసిచ్చిన మందుల కోసం ఆ పక్కనే ఉన్న షాపు వద్ద నిలబడ్డారు. 
" మనల్నే పద "
 అంటూ లేచాడు మోహన్ రావు. అమ్మయ్య అనుకుని, మరోపక్క ఏం చెబుతాడో ఏమో అని టెన్షన్ పడుతూ తనూ  లేచింది వైదేహి. లోపల అడుగుపెట్టగానే, డాక్టర్ గారు సెల్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో నవ్వుతున్నాడు. వీళ్ళిద్దరూ వెళ్లి ఎదురుగా కూర్చున్న రెండు నిమిషాలకు ఫోన్ పెట్టేసి, చెప్పండి అన్నట్టు చూశాడు.
    వైదేహి తన సమస్య చెప్పింది. మధ్య మధ్యలో మోహన్ రావు అందుకుని తనూ  కొన్ని చెప్పాడు. డాక్టర్ తల పంకించి, స్టెత్  తీసుకుని, ముందుకొచ్చి వైదేహిని పరీక్షించాడు. అతని మొహంలో ఏ భావమూ కనిపించలేదు ఇద్దరికీ. వెళ్లి కూర్చుని, పెన్ తీసి, గబగబా నాలుగు రకాల టాబ్లెట్స్ రాసి, సర్రున చింపి, 
" ఇవి వాడమ్మా.. సెట్  అయిపోతుంది. నెల తర్వాత ఓసారి కలవండి, "
అని నెక్స్ట్ పేషెంట్ ను రమ్మనమంటూ సైగ  చేశాడు అటెండర్ కు. ఇద్దరికీ ఏమిటో నోట మాట రాలేదు. అసంతృప్తిగా అనిపించింది. రెండు నెలల బాధ!  అసలు కారణమేంటో చెప్పలేదు. మరో రెండు నిమిషాలు సమస్య గురించి విని ఉంటే బాగుండు కదా.. అనిపించింది మోహన్ రావుకు. వైదేహి కైతే తను చెప్పడం ఇంకా పూర్తి కాకముందే  డాక్టర్ అలా  మందులు రాసేయడం... ఆ తొందరలో తను చెప్పదలుచుకున్నది బుర్రకు తట్టక తడబడిపోయింది. మోహన్ రావు కైతే ఒకప్పటి డాక్టర్లు గుర్తొచ్చారు ఓక్షణం ! వైద్యునికి పేషంట్ తో ఉండాల్సిన 'రిలేషన్' ఇంతగా దిగజారిందా! అని ఆశ్చర్యం కలిగిందతనికి. అయినా ఉండబట్టలేక,   "
"సర్, ఇలా ఎందుకవుతోందంటారు? "
 అనడిగాడు.
" మరేమీ లేదండీ, వయస్సు పైపడుతోంది కదా.. ఇలాంటివి వస్తూ ఉంటాయి... మందులు వాడితే తగ్గిపోతుంది..."
అని అంటూ ఉండగానే  ఇద్దరు ప్రవేశించారు. ఇక వీరిద్దరికీ లేవక తప్పలేదు. అయోమయంలోంచి తేరుకుని, చీటీ పుచ్చుకుని బయట పడ్డారు ఉసూరుమంటూ. గంట నిరీక్షణ ! పది నిమిషాలు కూడా పట్టలేదు పరీక్షించడానికి...! చేసేదేమీ లేక, రాసిన టాబ్లెట్స్ అన్నీ కొనుక్కుని, ఎలా వాడాలో షాప్ అతన్ని కనుక్కొని, తిరుగు ముఖం పట్టారు. ఫీజు 200, మందులు 1200, రాను పోను ఖర్చు 100... మొత్తం బిల్లు 1500 రూపాయలు..!!       
                 ***              ***            ***
      ఆ రాత్రి నుండే మొదలెట్టింది వైదేహి. రెండు రోజులయ్యాక సమస్య తగ్గకపోగా ఏమిటో కడుపులో  మరీ  వికారంగా, వాంతికొస్తున్నట్లుగా అనిపించ సాగిందామెకు. మరో నాలుగు రోజులు అలాగే భరించింది. కానీ... నెల తర్వాత రమ్మన్న డాక్టర్ దగ్గరకు పది రోజులు దాటకముందే వెళ్ళక తప్పలేదు.
" మొదట అలాగే ఉంటుంది. తర్వాత సర్దుకుంటుంది. అయినా... ఓ రకం మారుస్తాను."
 అంటూ క్యాప్సూల్ బదులుగా మరో టాబ్లెట్ రాశాడు.
 ఎలాగోలా నెల గడిపేసి మళ్లీ దర్శించుకున్నారు.
" తగ్గినట్లే ఉంది సార్... కానీ పూర్తిగా కాదు..."
 అంటూ నసిగింది వైదేహి. షరా  మామూలే.. ! ఆయన ముఖంలో ఏ భావమూ  కనిపించలేదు. నోరు తెరిచి మాట్లాడనూ  లేదు. మౌనంగా మరో చీటీ మీద ఏదో బరబరా రాసి, 
" ఈ టెస్టులు చేయించండి...."
అంటూ చేతిలో పెట్టాడు. వైదేహి అయోమయంగా చూసింది. మోహన్ రావు అదోలా మొహం పెట్టి, 
" టెస్టులు అవసరమా డాక్టర్ ? "
 సందేహంగా అడిగాడు.
" అవసరమనేగా  రాశాను...!"
వెంటనే అనేశాడాయన. 
ఇంకేమంటాడు.. మోహన్ రావు..! ఓ గంట తర్వాత, రిపోర్టు చూసి, 
" కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. క్యాల్షియం తక్కువ ఉంది.."
అంటూ, పాత చీటీ మీదే మరో రెండు రకాల టాబ్లెట్స్ రాసి, 
"... ఇవి వాడండి, నెల తర్వాత రండి..."
అన్నాడు. అంతా కలిసి ₹ 2000 బిల్లు..! తప్పేదేముంది! సమర్పించుకుని బయటపడ్డారు.
           ***            ***              ***
     ఉస్సురనుకుంటూ ఇల్లు చేరుకుని, గేటు తీస్తుండగా, కింది వాటాలోంచి, 
" సూర్యం ఇంటికొచ్చానే... చాలా రోజులయింది కదా.. నిన్నూ చూసిపోదామని ఇలా వచ్చా. మీరేమో... "
అంటూ జానకమ్మ ఎదురొచ్చింది. ఆవిడ్ని పలకరిస్తూ పైకి దారితీశారు. ఆవిడ వైదేహికి స్వయానా పెద్దమ్మ. కలివిడి మనిషి. వైదేహి అంటే ప్రత్యేక అభిమానం. ఆ చనువుతో రెండు నెలలుగా వేధిస్తున్న  తన అవస్థ ఏకరువు పెట్టి ఆవిణ్ణి కొద్దిరోజులు ఉండమని కోరుకుంది వైదేహి.
    రెండు మూడు రోజులు గడిచేసరికి జానకమ్మకు బాగా అర్థమైపోయింది వైదేహి అనారోగ్యానికి కారణం. రెండేళ్ల క్రితం వరకూ తీరిక లేకుండా గడిపిన వైదేహి ఇప్పుడు బాగా 'ఫ్రీ' అయిపోయింది. డబ్బుకుకొదవే లేదు.  ! ఇదివరకు పనిమనిషి మాత్రమే ఉండేది. ఇప్పుడు వంటమనిషినీ కుదుర్చుకున్నారు. ఇక తనకు ఒళ్ళు వంచే అవసరమేముంది ! ఉదయం ఏడు దాటాక లేవడం,  ఎంచక్కా  రెడీగా ఉన్న టిఫిన్ ఆరగించడం, టీవీ చూడ్డం, ఆ తర్వాత హాయిగా విశ్రాంతిగా బెడ్ మీద వాలిపోవడం ! ఒంటి గంట తర్వాత డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న లంచ్ తినే యడం.. మళ్లీ టీవీ ముందు బైఠాయించి సీరియల్స్ ఓ రెండు వరుసగా వీక్షించడం!! ఆతర్వాత పనేముంది... మళ్లీ నిద్ర !!
 ఐదింటికి లేచి ఏవో  స్నాక్స్ లాగించి టీ  సేవించడం ! తొమ్మిది దాటాక తినేసి, మళ్లీ టీవీ వీక్షణం ! లేదా సెల్ లో వీడియోలు చూడ్డం ! ప్రస్తుతం ఇదీ ఆమె దినచర్య! కనీసం గేటు దాటి నాలుగడుగులు నడవాలన్నా బద్ధకించడం.. ! షాపింగ్ లకు కార్లో  వెళ్లడం, రావడం! ఇక తిన్నది అరగడం ఎలా? ! కొన్నేళ్ల క్రితం కారు ఉండేది కాదు. ఇప్పుడు అన్ని వసతులూ అమరాయి మరి ! గతంలో ఒకటి రెండు సార్లు వచ్చినప్పటి కంటే ఇప్పుడు బాగా బరువు పెరిగిపోయింది. నాలుగైదు రోజులపాటు గమనించిన జానకమ్మ ఇక ఉండబట్ట లేక ఓ మధ్యాహ్నం భోంచేశాక టాబ్లెట్స్ వేసుకోబోతున్న వైదేహిని వారించి, 
" వాటి వల్ల ప్రయోజనం శూన్యం వైదేహీ.. ఓ వారం పాటు వాటన్నింటినీ పక్కన పెట్టేసి, నేను చెప్పినట్లు చెయ్యి. ఫలితం లేకుంటే మళ్ళీ అవే వాడుదువు గానీ... "
అంది. చిత్రంగా చూసిన వైదేహి పక్కనే కూర్చుని, నెమ్మదిగా ఏం చేయాలో వివరించింది.
"... కష్టమే.. కొద్దికాలంగా సుఖజీవనానికి బాగా అలవాటు పడ్డావు. మళ్లీ శ్రమించాలంటే శరీరం సహకరించదు. కానీ ప్రయత్నం తప్పదు.."
 ఆ మాటలు వైదేహిలో ఆలోచన రేపాయి. పెద్దమ్మ డెబ్బైకి చేరువలో ఉంది. జరుగుబాటుకు లోటు ఏమీ లేదు. అయినా బొంగరంలా ఎప్పుడూ తిరుగుతూ ఏదో ఒక పనిలోనే కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచీ పెద్దమ్మ దగ్గర తనకు చనువెక్కువ. ఆ చొరవ తోనే జానకమ్మ ఇంకా ఇలా అంది, 
"... ఎలా ఉండే దానివే  చిన్నప్పుడు...! గట్టిగా గాలి వీస్తే కొట్టుకపోయేదానిలా ! పెళ్లప్పుడు సన్నజాజి తీగలా ఎంచక్కా ఉన్నావు ! ఇప్పుడు అలా ఎలా ఉంటాను అంటావేమో ! మనం లావుగా ఉన్నామా, సన్నగా ఉన్నామా అని  కాదే... ఆరోగ్యంగా ఉన్నామా, అనారోగ్యంగా ఉన్నామా.. అన్నది ముఖ్యం..."
ఆవిడ చెప్పుకుంటూ పోతున్నది. వైదేహి ఆలోచనలో పడింది. 
" ఛ ఛ ! ఇంత చదువుకున్నాను, పెద్దమ్మ కున్నంత జ్ఞానం నాకు లేకపోయింది కదా...!"
సిగ్గు పడిపోయింది. చిన్నప్పటినుంచీ అంతే. అమ్మ చెప్పినా  వినని తను పెద్దమ్మ చెబితే వెంటనే వినేది. ఆలోచించేది. ఇప్పుడూ అదే జరిగింది. అసలిప్పుడు తన వయసెంతని ! చిన్న వయసులోనే పెళ్లి కావడం, వెంటనే పిల్లలు ! యాభై అయిదు నిండుతున్నాయి అంతేగా..! అప్పుడే ఇంత డీలా పడిపోతోంది మరి ! వెంటనే తేరుకుని, జానకమ్మను మరి కొద్ది రోజుల పాటు ఉండమని కోరింది.
    మరుసటి రోజు ---పెద్దమ్మ సలహా ప్రకారం, కొద్ది రోజుల వరకు వంట మనిషిని రావద్దని చెప్పింది. ఉదయం ఆరింటికే లేచి, టెర్రస్ మీద అరగంట సేపు వాకింగ్ మొదలెట్టింది. టిఫిన్, వంట మునపటిలా  తనే చేయసాగింది. చీటికిమాటికీ అవీ  ఇవీ నమలడం మానేసింది. సాయంత్రాలు ఇంటి ముందు అంతా ఊడ్చి శుభ్రం చేయడం మొదలెట్టింది. మొదట్లో అలవాటు తప్పిన దేహం మొరాయించినా క్రమంగా వారం రోజుల్లో దారిలోకొచ్చింది.
     వారం గడిచాక... ఏమిటో, వైదేహికి నిజంగానే హుషారుగా అనిపించింది. కడుపులో అసౌకర్యం తగ్గుముఖం పట్టింది. మార్పు స్పష్టంగా కనిపించే సరికి, జానకమ్మ కూడా మెచ్చుకుంది.
" ఇదిగో... నేనున్నానని ఇదంతా చేస్తున్నావేమో...! రేపు వెళ్ళిపోతున్నా. మళ్లీ మొదటికి  రాకు.."
నవ్వుతూనే హెచ్చరించిందావిడ.
           ***            ***          ***
   మూడు వారాలు గడిచాయి. పెద్దమ్మ మాటలు మంత్రంలా పనిచేసినట్టున్నాయి. వైదేహి హుషారుగా తయారైంది. 
"నాకు ఏదో అయింది, ఏదో పెద్ద రోగమే నన్ను ఆవహించినట్లు ఉంది.. "
అన్న ఫీలింగ్ తొలగించుకుని, 
" నాకేమీ లేదు, అంతా ఓకే..."
అనుకున్న క్షణం నుండీ ఏదో తెలియని ధైర్యం ఆమెలో వచ్చి చేరింది. పనిమనిషిని మాత్రం ఉంచుకుని, వంట మనిషిని అవసరమైతే పిలుస్తానని సున్నితంగా చెప్పి మాన్పించేసింది. ఇంతకీ ఈ కొద్ది రోజుల్లో  ఆమె గ్రహించిన ఓ జీవితసత్యం..  "చిన్నచిన్న అనారోగ్యాల్ని మనకు మనమే బాగుచేసుకోవచ్చు" అన్నది. అలా అలా నెల గడిచిపోయింది.
ఆ మధ్యాహ్నం భోంచేశాక, 
" నెల అయిపోయిందిగా, రేపు డాక్టర్ దగ్గరికెళ్దామా? "
 అంటూ వైదేహి టాబ్లెట్స్ బాక్స్ తెరచిన మోహన్ రావు
 విస్తుపోయి, 
"... ఇదేమిటి ? ! అన్నీ  ఇలాగే ఉన్నాయి !"
అన్నాడు.వెంటనే వైదేహి అందులోని టాబ్లెట్స్ అన్నీ తీసుకుని, 
" ఇక వీటి అవసరం లేదులెండి.."
అంటూ డస్ట్ బిన్ వేపు నడిచింది. చిత్రంగా చూస్తూ ఉండిపోయాడు మోహన్ రావు !!
అందులో వాటిని పడేస్తుంటే, 
" ఈ మందులు వాడండి. నెల తర్వాత రండి... "
అన్న డాక్టర్ మాటలు గుర్తొచ్చి నవ్వుకుంది వైదేహి. 

**************************************












Friday, February 10, 2023

చిట్టితల్లీ !!

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

             😔
చెత్త కుప్పలో విసిరేయబడ్డ చిన్నిపాప
చెదలు పట్టిన విషసంస్కృతికి ప్రతీక
వెర్రి తలలు వేస్తున్న పురుషాధిక్య భావన ! 
ఏ దేవుడాలకిస్తాడీ పసికందుల ఆక్రందన !!

పొత్తిళ్ల  నుండి ప్రాయం దాక ప్రాణప్రదమై
పదిలంగానున్న అపరంజి బొమ్మ...
పెళ్లి పీటలెక్కి పెద్దరికం వచ్చి
చిరునవ్వు మరిచి చింతలపాలైపోతోందమ్మ !

అత్తిల్లు కాదది... ఆరళ్లకు పుట్టిల్లు... 
రక్షకుడు కాదామగడు... భక్షకుడు !!
ఆడబ్రతుకెప్పుడూ అరిటాకే... మగువా... 
మారని ఈ నానుడి ఎన్నడూ మరువబోకు !

ఈ చేదు నిజం జీర్ణించుకున్నదేమో నీ తల్లి... 
చిట్టితల్లీ  ! నిను  కడుపులోనే కాలరాసి... 
'హంతకి'  అనిపించుకుంటేనేమి గాక... !
నూరేళ్ల బ్రతుకు భారం నీకు దించేసింది  సుమీ !!

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

Friday, February 3, 2023

😊 వసంత 😔

🌷

   ఆరోజు ఆదివారం. ఇల్లంతా కలయదిరిగి అన్నీ సరిగా ఉన్నాయో లేదోనని మరోసారి సరి చూసుకుంది వసంత. ఆ విధంగా ఆమె చేయటం పదోసారి.
    స్వతహాగా వసంత చాలా బద్ధకస్తురాలు. ఎప్పుడు చూసినా ఆమె ఇంటిని ఓ అడవిలా ఉంచుతూ ఉంటుంది. కానీ రెండు రోజుల నుండీ ప్రత్యేక శ్రద్ధతో ఇంటిని తీర్చిదిద్దుతూ  ఉంది. ఇల్లంతా బూజులు దులిపింది. మాసిన బట్టలన్నీ కుదురుగా ఓ మూల స్టాండ్ మీద వేసింది. షోకేస్ లోని అలంకరణ సామాగ్రి నంతా చక్కగా తుడిచి నీట్ గా అమర్చింది. అన్ని గదుల్లోనూ మూల మూలలా ఉన్న కసవు, చెత్తకాగితాలు వగైరా అంతా ఊడ్చేసింది. ఇలాంటివే ఇంకా మరెన్నో చేసి, మొత్తానికి ఇంటినో అద్దంలా, ఆహ్లాదకరంగా తయారుచేసింది. 
    సరే... అంతా బాగానే ఉంది. కానీ అంత బద్ధకస్తురాలికి ఉన్నట్టుండి ఇంటి మీద ఇంత దయ ఎందుకు పుట్టుకొచ్చిందయ్యా అంటే... దానికి బలమైన కారణమే ఉంది. వసంత ఓ ఎలిమెంటరీ స్కూల్లో టీచరు. ఆమెకు ఇటీవలే MEO ... అదే... మండల విద్యాధికారి వసుంధరాదేవితో పరిచయభాగ్యం కలిగింది. MEO వంటి ఉన్నతోద్యోగిని పైగా తన పైఅధికారిణితో పరిచయం పెరిగితే వృత్తిరీత్యా తనకు ముందు ముందు ప్రయోజనం ఉండొచ్చన్న ఆశ (ముందుచూపు అయినా కావొచ్చు!)వసంతలో తలెత్తింది. సదరు ఎంఈఓ గారితో ఏదో దూరపు బంధుత్వం కలిగిన రామేశ్వరి టీచర్ వసంత కొలీగ్. రామేశ్వరి తలపుకు రాగానే వసంత లో ఆశలు మొగ్గలు తొడిగాయి. ఇంకేముంది..! తన ద్వారా వసుంధరా దేవి గారి ఇష్టాఇష్టాలు, రుచులు, అభిరుచులు అన్నీ  సేకరించడంతోపాటు ఆమె ఇంటికి కూడా వెళ్లి పరిచయాన్ని మరికాస్త సాగదీసింది. ఆ ప్రయత్నంలోనే ఆవిడని తన ఇంటికి ఓసారి రమ్మంటూ ఆహ్వానించింది. స్వతహాగా ఫ్రెండ్లీ నేచర్ గలది  కాబట్టి
మొదట మొహమాట పడ్డా, సమ్మతించి, వీలు చూసుకుని వస్తానంటూ చెప్పింది ఆవిడ. .ఇక  అల్పసంతోషి అయిన వసంత ఆనందానికి పట్ట పగ్గాల్లేకుండా పోయాయి. 
    వసుంధరాదేవికి శుభ్రత అంటే తగని ప్రీతి. ఆమె ఇంటికి వెళ్ళగానే ఓ నందనవనంలో అడుగుపెట్టినట్లు ఫీలయింది  వసంత. వెనువెంటనే తన ఇల్లు మదిలో మెదిలింది. అబ్బ! ఎంత తేడా ! అనుకుంది. కోరి కోరి ఆవిడను ఇంటికి పిలిచి అరణ్యంలా  ఉండే తన ఇంటిని ప్రదర్శించడమా ! ఆ క్షణమే నిశ్చయించుకుంది... ముందు ఇంటిని ఓ కొలిక్కి  తేవాలి. ఎంఈఓ గారిని మెప్పించి ఆవిడ ఇంప్రెషన్ సాధించాలంటే ముందు ఆమెకు నచ్చే విధంగా ఉండాలి. అప్పటినుంచీ వసంత ఆ ప్రయత్నాల్లో పడిపోయింది. ఈరోజు ఆ అధికారిణి రాబోతోంది మరి! అదండీ,  అసలు సంగతి ! 
    సాయంత్రం నాలుగింటికి వసుంధరా  దేవి ఫోన్ కాల్ అందుకుని,  ఇంటి నుండి బయలుదేరి వెళ్ళింది వసంత. ఆవిడకు అడ్రస్ ఇచ్చే వచ్చింది. కానీ, తన ఇల్లు రోడ్డుకు కాస్త లోపలికి ఉంటుంది. ఆటో వాళ్ళు కనుక్కోవాలంటే కాస్త టైం పడుతుంది. ఆ విధంగా ఆమె ఇబ్బంది పడకుండా తనే వెళ్లి రిసీవ్ చేసుకుంటే సబబుగా ఉంటుందని అనుకుంది వసంత. మరో పది నిమిషాల్లో రోడ్డు దాకా వచ్చిన వసంతకు  ఆటోలో కూర్చున్న వసుంధరా దేవి కనిపించింది. 
  ఇద్దరూ కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆవిడ కబుర్ల ప్రోగు. ఆమె మాట్లాడుతూ ఉంటే ఎదుటివారు వింటూ ఉండాల్సిందే కానీ.. తిరిగి మాట్లాడే అవకాశం వాళ్లకివ్వదామె. వసంత అన్నింటికీ తలూపుతూ, ఊకొడుతూ ఆమెను అనుసరిస్తోంది. దాదాపు ఇల్లు సమీపించారు. ఉన్నట్టుండి వసుంధరా దేవి  నడక ఆగిపోయింది.
" అటు చూడు వసంతా.. ఆ ఇంటి ముందు చెత్తాచెదారం ఎలా గుట్టలుగా పడి ఉందో ! ఆ కాలువ చూశావా ! అబ్బ ! అసలు అంత డర్టీ ఇంటి ముందు భరిస్తూ ఎలా ఉంటారో బాబూ ! నాకయితే ఓక్షణం నిల్చోబుద్ధి కూడా కాదు. ఇంతకీ ఏ మహాతల్లో ఈ ఇంటి ఇల్లాలు !! "
అనేసింది గుక్క తిప్పుకోకుండా. వసంత ఒక్కసారిగా అప్రతిభురాలైపోయింది.ఛ ఛ ! ఎంత పొరపాటు చేసింది! ఇంటిని బాగు చేసే ప్రయత్నంలో ఇంట్లోని కుళ్ళునంతా ఇంటి బయటకు చేర్చేసింది. కాలువ గట్టునా, మురికి నీళ్లలో పరుచుకున్న ఇంట్లో మిగిలిన అన్నం మెతుకులు ! వాటి చుట్టూ జుయ్యి జుయ్యిమని ముసురుతున్న ఈగలు !! అంతేనా ! ఇంటి ముందు రోడ్డంతా దుమ్ము ధూళితో, చెత్త కాగితాల్తో నిండిపోయి పరమ అసహ్యంగా కనిపిస్తోంది.  ఆ దృశ్యం చూసేసరికి ఆమెకే కడుపులో దేవినట్లయింది ఇన్నాళ్లుగా ఇంటిముందున్న  ఇంత చండాలాన్ని గమనించని తన అవివేకాన్ని తలుచుకుని సిగ్గుతో చితికిపోయింది.
" ఈ ఇంటి ఇల్లాలిని నేనేనని ఈవిడకు తెలియడానికి మరెన్నో క్షణాలు పట్టవు...మైగాడ్ !! "
తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లు తయారైంది వసంత పరిస్థితి. 
నోట మాట రాని  ఆమె  నడక అప్రయత్నంగానే ఆగిపోయింది.

**************************************






 

Thursday, January 19, 2023

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే... 13... జీవన ప్రమాణ పత్రం...

🌺

      సమయం ఉదయం 11.30 కావొస్తోంది. గబగబా రెడీ అయి, బయటపడి, పది నిమిషాలు రోడ్డు పక్కన నిలబడి, ఆటో కోసం నిరీక్షించి ఎట్టకేలకు ఎక్కేశాను. మరో పది నిమిషాల్లో దిగి, ఓసారి పరకాయించి చూసి, నిర్ధారించుకుని ముందుకు నడుస్తూ గేటు లోపల ప్రవేశించాను.
   అది....STO కార్యాలయం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సంవత్సరానికి ఓసారి తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన అతి  ముఖ్యమైన ప్రదేశం. నెలనెలా పెన్షన్ డబ్బులు అందాలంటే జీవన ప్రమాణ పత్రం.. అదే... life certificate ! సమర్పించాలి మరి!(ఇటీవల కొన్ని కంప్యూటర్ సెంటర్ లు  కూడా కాస్త డబ్బు పుచ్చుకుని ఆ సేవలు అందిస్తున్నాయనుకోండి.)
   బాగా పాతబడ్డ ఓ చిన్న భవనంలో సదరు ఆఫీసు కార్యకలాపాలు సాగుతున్నాయి. గేటు దాటి లోపల అడుగుపెట్టిన నాకు... అక్కడ గుంపులు  గుంపులుగా జనం కనిపించారు. అంతా వయసు మీద పడ్డవాళ్ళు, వాళ్లకు సహాయంగా వచ్చిన వాళ్లూను. గత కొన్నేళ్ళుగా ఈ దృశ్యం నాకు అలవాటైపోయింది. సరే అనుకుంటూ కదిలాను. ఎదురుగా ఒకాయన వస్తూ, దూరం నుండే విష్ చేస్తూ పలకరించాడు. అతను ఒకప్పుడు నా కొలీగ్. కుశల ప్రశ్నల తర్వాత అతను వెళ్ళిపోయాడు. చాలా రోజులకు కలిసినందుకు ఓ క్షణం అప్పటి రోజులు మెదిలాయి. 
    అక్కడున్న పది, పదిహేను కుర్చీల్లో అంతా బైఠాయించి ఉన్నారు. రెండు మూడు సిమెంట్ బెంచీలూ ఆక్రమించబడి ఉన్నాయి. నేరుగా వెళ్లి నా వివరాలున్న ఆధార్ జిరాక్స్ కాపీ అందించాను అక్కడున్న సిబ్బందికి. అది అందుకుని, 
 "కూర్చోండి, టైం పడుతుంది.. "
 అంటూ బిజీ అయిపోయాడతను. 
" ఎక్కడ కూర్చోను...! "
అనుకుంటూ కళ్ళతోనే వెతుకుతూ లాభం లేక కాస్త దూరంగా వెళ్లి నిలుచుండిపోయాను, ఎవరైనా లేస్తే కూర్చుందాంలే అనుకుంటూ. 
 ఇంతలో గేటు బయట ఓ ఆటో ఆగింది. అందులో నుండి ఓ వృద్ధురాలు, ఆమెతోపాటు మరొకామె... కూతురు అనుకుంటా.. దిగారు. ఇద్దరూ కలిసి ఓ పెద్దాయన్ని జాగ్రత్తగా పట్టుకుని దింపారు. లోపల ఉన్న వాకర్ తీసి ఆయనకందించి, మెల్లిగా నడిపించుకుంటూ రాసాగారు. దగ్గరకు వచ్చాక తెలిసింది... ఆవిడ నాకు బాగా తెలిసినావిడ! నేను టీచరుగా పనిచేసే రోజుల్లో ఒకే బస్టాప్ దగ్గర కలిసేవాళ్ళం. నన్ను చూసి ఆవిడా గుర్తుపట్టి, చాలా సంతోషించింది. ఆ పెద్దాయన తన భర్త అని చెప్పింది. కాసేపు కష్టసుఖాలు వెళ్ళబోసుకుంది. మంచి మాటకారి. బస్ స్టాప్ వద్ద కలిసే టీచర్లందరితో కలివిడిగా ఉంటూ ఎప్పుడూ నాన్ స్టాప్ గా గలగలా మాట్లాడుతూ సందడి చేసేది. అందుకేనేమో... అంత బాగా గుర్తుండిపోయింది. 
   ప్రతీసారీ ఇలా ఇక్కడ ఈ ఆఫీసువద్ద తెలిసినవాళ్ళు ఒకరిద్దరైనా కనిపిస్తూ ఉంటారు. ఏమిటో ! అదో ఆనందం ! 
    ఇంతలో మరొకామె ఆటో దిగింది. వాకింగ్ స్టిక్ పట్టుకొని అతి ప్రయాసగా నడుస్తూ నెమ్మదిగా వస్తోంది. వెంట ఎవరూ లేరు. బాధగా అనిపించింది. సాధారణంగా నిస్సహాయులైన ఇలాంటి పెన్షనర్ల వెంట ఎవరో ఒకరు తోడుగా వస్తుంటారు. ఈమధ్య మరీ కదలలేని వాళ్ళకోసం ఇంటివద్దకే వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ తీసుకునే సౌకర్యం కల్పించారట ! కొంతలో కొంత మేలు. 
    " Thank God ! నాకింకా అలాంటి పరిస్థితి రాలేదు. ఒక్కదాన్నే రాగలుగుతున్నాను ", 
అనుకుంటూ ఓ నిట్టూర్పు విడిచాను. ఇంతలో ఓ ఛెయిర్ ఖాళీ అయితే వెళ్లి కూర్చున్నాను. ఇలా 'వెయిటింగ్' చేయలేనివాళ్ళు డబ్బు పోతేపోయిందని కంప్యూటర్ సెంటర్ లను ఆశ్రయిస్తున్నారు. రాన్రానూ నేనూ అదే దారి పట్టాల్సివస్తుందేమో ! లోలోపల నవ్వుకుంటూ... పిలుపు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను.
 ఇంకాసేపటి తరువాత... మరో దృశ్యం కంటబడి, ననాకర్షించింది.  ఓ టీనేజ్ కుర్రాడు ఓ పెద్దాయనను నడిపించుకుంటూ వస్తున్నాడు. దగ్గరగా వచ్చేకొద్దీ... గ్రహించగలిగాను...ఎనభైకి పైగానే ఉంటుంది వయస్సు! సన్నగా, పొడుగ్గా ఉండి  వంగిపోయి నడుస్తున్నా.... అతని కళ్ళు చురుగ్గా అటూ  ఇటూ కదుల్తూ అందర్నీ చూస్తున్నాయి. అంతేకాదు.. అక్కడ ఎవరూ  అతనికి తెలియకున్నా అందరివేపూ చిరునవ్వుతో చూస్తూ ముందుకు సాగడం గమనించాను. అలా నా వైపూ చూడగానే అప్రయత్నంగా నా ముఖంలోనూ చిరునవ్వు ! పెదవి దాటి మాట రాకపోయినా... ఆ పెదవులపై విరిసే మౌన దరహాసానికి ఎంత మహత్తో  కదా !! అనిపించింది.
    ఎందుకో  ఈ వాతావరణంలో కాసేపు కూర్చునే సరికి ఆలోచనలు  గతంలోకి పరిగెడతాయి. జీవనయానంలో అత్యధిక భాగం. దాదాపు 30 నుండి 40 సంవత్సరాలు వ్యక్తిగత జీవితంతో పాటు ఉద్యోగ జీవితానికి కూడా అంకితమై మమేకమైపోతాం. ఉత్సాహభరితమూ, అత్యంత శక్తివంతమూ అయిన ఆ 'పీరియడ్' ఎన్నెన్నో అనుభవాల సమాహారం... వీళ్లంతా ఆ రోజుల్లో క్షణం తీరిక లేక గడిపిన వాళ్లే ! రవంత  విరామం కోసం ఎదురుచూసిన వాళ్లే ! ఇప్పుడేమో... అంతా విరామమే ! అంతా విశ్రాంతే !!
     చివరి దశలో జవసత్వాలుడిగిపోయి...కన్నూ, కాలూ పనిచేయక శరీరం బొత్తిగా  సహకరించక మొరాయిస్తున్న ఈ తరుణాన 'నేనున్నా' నంటూ నెల తిరిగేసరికి చేతికందే  'పింఛను' అలాంటి వారందరికీ ఇచ్చే ఆసరా,  భరోసా మాటల్లో వర్ణించలేనిది! అదే లేకుంటే సగం జనాభా జీవచ్ఛవాలుగా బ్రతుకీడ్వాల్సిన దుర్భర పరిస్థితి! ఊహించుకోవడానికే శక్యం  కానిది..!
   ఇంతలో ఏదో కలకలం ! ఓ ఐదారుగురు లోపలి నుండి వస్తూ,
 " సర్వర్ పని చేయట్లేదట ! బయట చేయించుకో మంటున్నారు.."
అంటూ వెళ్లిపోయారు. కూర్చున్న వాళ్ళలో  సగం మంది లేచి బయటికి నడిచారు. రెండు నిమిషాలాగి నేనూ లేచాను. బయటికి దారి తీసేలోగా... లోపల నుండి ఒకతను, 
" పని చేస్తోంది.... రావచ్చు.. "
 అన్నాడు . మరో నిమిషంలో నా పేరు వినబడింది.

****************************************
      

Thursday, January 12, 2023

నేను మైనపు బొమ్మను కాను... కథ


   "చూడమ్మా , అబ్బాయి డాక్టర్. గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు ప్రైవేటు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. నీవు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు... "
   సోమసుందరం గారు చెప్పుకుంటూ పోతున్నారు. తలవంచుకొని అనిత ఊకొడుతోంది. ఆమెలో అప్పుడే సంతోషతరంగాలు మొదలైనాయి. ఓ డాక్టర్ భార్యగా తన్ను తాను ఊహించుకొని మురిసిపోసాగింది. ఆ రాత్రంతా ఆమెకు అవే ఆలోచనలు. ఆ రాత్రే  కాకుండా వరుసగా మూడు రోజుల పాటు అదే తంతు కొనసాగింది. 
" ఆ అబ్బాయి డాక్టర్నే చేసుకోవాలని నిర్ణయించు కున్నాడటమ్మా... పోనీలే.. మీ మేనమామ రాఘవరావు మరోసంబంధం  గురించి చెప్పాడు. అతను ఇక్కడే ఓ స్కూల్లో టీచరట... "  
   కొండ అంచు మీద నుండి దబ్బున  కింద పడినట్లు అయింది అనితకి. కానీ త్వరలోనే ఆ నైరాశ్యం  నుండి బయట పడగలిగింది. తర్వాత షరా మామూలే..! ఓ మాస్టారుతో తన కాపురం ఎలా ఉంటుంది...! అన్న భావనలో కొద్దికాలం ఊగిసలాడుతూ ఉండిపోయింది.
" చేసేది పంతులు ఉద్యోగమైనా అతని తల్లిదండ్రుల ఆశకు మాత్రం కొదవ లేనట్టుంది.. ఈ సంబంధానికి నేను తూగలేను...".
  ఉస్సురంటూ... ఓ సాయంత్రవేళ తండ్రి నుండి వచ్చిన నిట్టూర్పులకి భావ రహితంగా ఉండిపోయింది అనిత. రాత్రి వెంట పగలు, పగలు వెంట రాత్రి... గడిచిపోతూనే ఉన్నాయి. ఆ పరంపరలో ఒకరోజు....
" అబ్బాయి ఇంటర్ దాకా చదివాడట. ఆస్తి బోలెడుంది. ఒక్కడే కొడుకు. ఆ కుటుంబం కూడా నాకు తెలిసినదే. కట్నాల వద్ద ఏ పేచీ  ఉండదు. పువ్వుల్లో పెట్టి  చూసుకుంటారు నిన్ను. కాకపోతే... పల్లెటూర్లో ఉండాల్సి వస్తుంది.ఐతేనేం...  మహారాణి లాగా బతకొచ్చు. ఈ సంబంధం నాకన్ని విధాలా నచ్చింది. ఇదే ఖాయం చేసేస్తాను..."
   తండ్రి ముఖంలో ఆనందం చూసి ఆమె హృదయం తేలికపడినా... అంతరంగం మాత్రం బాధగా మూలిగింది.
                     **            **            **
   " నీకు బుద్ధుందా అసలు...! ఎవరేం చెప్తే దానికి గంగిరెద్దులా తలాడించడం తప్ప నీకంటూ ఓ అభిప్రాయం ఉండాలని నీకనిపించదా? అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా నీవు ఎలా నెట్టుకొచ్చావో  చచ్చినా నాకర్థంకాదు.నాకో అనుమానం...నీవో పోస్టుగ్రాడ్యుయేట్ అన్న సంగతన్నా నీకు గుర్తుందా అని.. !"
  అనిత చెప్పినదంతా విని, ఇంతెత్తున  ఎగిరిపడింది తన చిన్ననాటి స్నేహితురాలు అనంత.
".................... "
"...మొన్నో డాక్టర్.. నిన్నో మాస్టారు... ! ఈరోజు మరొకడు...! అసలు వీళ్లలో ఒక్కరన్నా నీకు నచ్చారా..?  వాళ్లకు అనుగుణంగా నీవు ఉండాలని కాదు... నీకు తగినట్లుగా వాళ్లున్నారా అని ఒకసారన్నా ఆలోచించావా? ఈ పెళ్లి జరిగితే, అయ్యేదేమిటో తెలుసా..? నీ డిగ్రీలు ఎందుకూ  పనికిరాని చిత్తు  కాగితాలు కావడమే...! నీ తెలివితేటలు, నీ చదువు... అన్నీ  బూడిదలో పోసిన పన్నీరే. జీవితాంతం ఆ పల్లెటూర్లో జీవశ్చవంలా మగ్గి పోతావు తెలుసా..!"
    చివ్వున  తలెత్తిన అనిత కళ్ళల్లో తడి చూసి చలించిపోయింది అనంత. దగ్గరగా తీసుకుని, 
" మీ నాన్న బాధపడతాడని నీవు నీ మనసుని చంపుకుంటున్నావు. ఆత్మవంచన పనికిరాదు అనితా. ఆయన ధోరణి చూస్తుంటే... ఎలాగైనా సరే... తన తల మీద భారం దించుకోవాలి అన్నట్లుగా ఉంది... ఆయన్ని నేను తప్పు పట్టడం లేదు. ఓ తండ్రిగా ఆయన మానసిక స్థితి అర్థం చేసుకోగలను. కానీ.. ఓ విద్యాధికురాలిగా... నీ వ్యక్తిత్వం వదులుకోవద్దు అంటున్నాను..."
"..................... "
" నీ చదువుకో సార్ధకత కలిగించు. నాలాగా ఏ చిన్నపాటి ఉద్యోగమో చేస్తూ ఉండు. నీకు అన్ని విధాలా  నచ్చినవాడు తారసపడిన నాడు పెళ్లి మాట తలపెట్టు. నీకో చిరుద్యోగం చూసే పూచీ  నాది..."
   అనంత వైపు దిగ్భ్రమగా చూసింది అనిత. ఆమె భుజం మీద చేయి వేసి, పక్కనే కూర్చుంటూ, 
" తండ్రి మాట లక్ష్యపెట్టవద్దని నేను అనటం లేదు. కానీ, సొంత అభిప్రాయం అంటూ లేకుండా మైనపు బొమ్మ లాగా ఎటు ఉంచితే అటు వంగరాదని చెప్తున్నాను. ఆడపిల్లకు పెళ్లి ముఖ్యమే.. కానీ.. 'ఏదో అయిందిలే' అనిపించే పెళ్లి మాత్రం కాకుండా ఆగిపోతేనే నయమని అనుకుంటున్నాను. నా మాటలు కటువుగా  ఉన్నా కఠోర సత్యాలు సుమా..!"
    వాతావరణాన్ని తేలిక చేయడానికన్నట్లు నవ్వేసింది అనంత.
" ఇంతకీ నా మాటలు నీమీద ఏమైనా ప్రభావం కలిగించి ఉంటే.... రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా నావద్దకొస్తావు... సరేనా...!"
 అంటూ ఆప్యాయంగా చేయి నొక్కి, నిష్క్రమించింది.
                    **                   **                 **
   అనితలో చలనం మొదలైంది. 
" నిజమే ! ఇంతవరకూ నాకా ఆలోచనే కలగలేదేమిటి! ఎంతసేపూ... తండ్రి కోణం నుంచే చూసింది గానీ... తన స్పందన పూర్తిగా పక్కకు నెట్టేసింది. అనంతకు థాంక్స్ చెప్పితీరాలి. ఇకపై ఎవరేం చెప్పినా మైనపు బొమ్మ లాగా కరిగిపోతూ సొంత అభిప్రాయాల్ని మార్చుకోవడం మానేయాలి".
    ఆమెలో స్థిరనిర్ణయం రూపుదాల్చుకుంది. 
             **                 **              **
   మర్నాడుదయం తొమ్మిది గంట కొట్టడానికి ఐదు నిముషాలు ముందే అనిత తన ఇంటి గుమ్మంలో ప్రత్యక్షమవడం చూసి అనంత కళ్ళు సంతోషంతో  విప్పారాయి. 

*****************************************   వనితాజ్యోతి' మాసపత్రిక, ఫిబ్రవరి,'95 లో                                       ప్రచురితం 
******************************************





Saturday, January 7, 2023

గులాబి నవ్వినవేళ !!


🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

***************
                                        

ఓ ప్రభాతవేళ... 
ననుజూసి నవ్విందో పూబాల  !
నా ఇంటి ముంగిట విరిసి... 
మెరిసిన కుసుమ కోమలి   !
శ్వేత వర్ణ గులాబి అది... 
స్వచ్ఛతకు మారుపేరేమో మరి !
పలువర్ణాలకు దీటుగా నిలబడి... 
గెలిచింది నా మదిని.. !
ఓ శుభవేళ... నాచే నాటబడ్డ ఓ చిన్ని మొక్క...
అది నాకందించిన తొలి కాన్క !
అరచేత ఆణిముత్యమా అన్న చందాన
అలరిస్తూ... నను మురిపిస్తూ... ఏమందును !
అల్లనల్లన కదిలే కొమ్మన...
ఊయల ఊగుతూ... రా రమ్మంటూ...
నను  పిలిచింది చిరునవ్వులు చిందిస్తూ...
ఆ పుష్పవిలాసం... ఆ సుగంధపరిమళం...!
అచ్చెరువొందించే అద్భుతసోయగం !
అదో వెలుగులు వెదజల్లే వెన్నెల దీపం !
ముగ్ధ  మనోహర సౌందర్యానికి
నిలువెత్తు నిర్వచనం..!
'నాకోసమే పూసిందా...!'
అవ్యక్తభావం నాలో ఓ క్షణం...!
అబ్బురపడి.. చెంతజేరి.. చేయి వేసితి... 
తుంచను మనసు రాక నిలిచిన క్షణాన...
మొదలైంది వాన... మాటల జడివాన..!
అది..ఆ లేలేత కుసుమం మూగ భాష...!
ఆ సైగలు..వినిపించని రాగాలేవో పలికిస్తూ...
తట్టి లేపి నాలోని  భావుకతను... 
కురిపించాయి ఒక్కుమ్మడిగా  అక్షర గీతాలు...!
" నీకోసమే విరబూశా...
నీ దోసిట ఒదిగి ఓ నక్షత్రాన్నవుతా... 
నీ సిగను నెలవంకనై మెరిసిపోతా...!
ఒక్క రోజు చాలు నీ సన్నిధి...
నాకది ఎనలేని పెన్నిధి...! "
అంటూ గారాలు ఒలికినట్లు 
వినిపించిన  తేనెపలుకులకు 
పరవశిస్తూ పరుగున దరిజేరి... 
సందిట బంధిస్తూ... 
ప్రేమతో ముద్దులిడి... ఆపై... 
గులాబి 'తల్లి' ని తడిమి తడిమి...
హత్తుకుని పరవశించితి 
అరమోడ్పు  కన్నులతో...! ఆ క్షణం... 
నాలో  ప్రతిధ్వనిస్తూ  హృదయరాగాలు !!
వినిపించాయి నాకు సుమధుర స్వరాలు !!


🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🐦🌷










Sunday, January 1, 2023

వచ్చేసింది... 2023

 🌷   

   ఎన్ని సుడిగుండాలు ! ఎన్నెన్ని ఎత్తుపల్లాలు! కొండలు,లోయలు,  బండరాళ్లు! అడ్డుపడినా అదరక బెదరక,  వెనుదిరగక, మిన్ను విరిగి మీద పడ్డా భీతిల్లక... ప్రశాంతంగా,  గంభీరంగా సాగిపోయే నదీమతల్లి ప్రవాహంలా కదులుతూ పోయేదే కాలం!! క్షణం ఆగని ఆ పయనం యుగయుగాలుగా, తరతరాలుగా సాగుతోంది. ఆ గమనంలో ఆనందమే కాదు.. విషాదాన్నీ చవిచూస్తుంది. ఎన్నెన్నో అనుభవాల్ని  మూటగట్టుకుంటుంది. మనిషికి సందేశాలను ఇస్తుంది, గుణపాఠాలనూ నేర్పిస్తుంది. 

   అప్పుడప్పుడూ... పరవశిస్తూ, వినూత్నంగా వెల్లివిరుస్తుంది... అదే.. ! కొత్త సంవత్సరాన్నంటూ.. ! కొత్త పేరుతో నవ్యతనద్దుకుంటుంది. 🙂

" గతంలో జీవించకండి "

" వర్తమానం విలువ తెలుసుకోండి "

" రేపటి కలల్ని నిజం చేసుకోండి "

-- అంటుంది. భుజం తడుతూ ముందుకు నడవమంటుంది. తనలాగే... అచ్చం తనలాగే.. తడబడక సాగమంటుంది కాలం. కాలగమనమది ! ఎప్పటికీ ఆగని నిరంతర ప్రవాహమది ! 

   ఆ గమనంలో... అదిగో.. ! ప్రవేశిస్తున్నది ముస్తాబౌతున్న మరో కొత్త సంవత్సరంలోకి. కొత్త ఆలోచనలతో, కొత్త తీర్మానాలతో సరికొత్తగా సిద్ధం కమ్మంటున్నది. అందర్నీ తనతో కదిలి రారమ్మంటున్నది.  

   అదిగో... అదిగదిగో.. !😊 వచ్చేసిందిగా... 2023 నూతన సంవత్సరం ! ముక్తకంఠంతో స్వాగతిద్దాం...  🙂

                   🌷💐💐💐🌷💐💐💐🌷