***************
ఓ ప్రభాతవేళ...
ననుజూసి నవ్విందో పూబాల !
నా ఇంటి ముంగిట విరిసి...
మెరిసిన కుసుమ కోమలి !
శ్వేత వర్ణ గులాబి అది...
స్వచ్ఛతకు మారుపేరేమో మరి !
పలువర్ణాలకు దీటుగా నిలబడి...
గెలిచింది నా మదిని.. !
ఓ శుభవేళ... నాచే నాటబడ్డ ఓ చిన్ని మొక్క...
అది నాకందించిన తొలి కాన్క !
అరచేత ఆణిముత్యమా అన్న చందాన
అలరిస్తూ... నను మురిపిస్తూ... ఏమందును !
అల్లనల్లన కదిలే కొమ్మన...
ఊయల ఊగుతూ... రా రమ్మంటూ...
నను పిలిచింది చిరునవ్వులు చిందిస్తూ...
ఆ పుష్పవిలాసం... ఆ సుగంధపరిమళం...!
అచ్చెరువొందించే అద్భుతసోయగం !
అదో వెలుగులు వెదజల్లే వెన్నెల దీపం !
ముగ్ధ మనోహర సౌందర్యానికి
నిలువెత్తు నిర్వచనం..!
'నాకోసమే పూసిందా...!'
అవ్యక్తభావం నాలో ఓ క్షణం...!
అబ్బురపడి.. చెంతజేరి.. చేయి వేసితి...
తుంచను మనసు రాక నిలిచిన క్షణాన...
మొదలైంది వాన... మాటల జడివాన..!
అది..ఆ లేలేత కుసుమం మూగ భాష...!
ఆ సైగలు..వినిపించని రాగాలేవో పలికిస్తూ...
తట్టి లేపి నాలోని భావుకతను...
కురిపించాయి ఒక్కుమ్మడిగా అక్షర గీతాలు...!
" నీకోసమే విరబూశా...
నీ దోసిట ఒదిగి ఓ నక్షత్రాన్నవుతా...
నీ సిగను నెలవంకనై మెరిసిపోతా...!
ఒక్క రోజు చాలు నీ సన్నిధి...
నాకది ఎనలేని పెన్నిధి...! "
అంటూ గారాలు ఒలికినట్లు
వినిపించిన తేనెపలుకులకు
పరవశిస్తూ పరుగున దరిజేరి...
సందిట బంధిస్తూ...
ప్రేమతో ముద్దులిడి... ఆపై...
గులాబి 'తల్లి' ని తడిమి తడిమి...
హత్తుకుని పరవశించితి
అరమోడ్పు కన్నులతో...! ఆ క్షణం...
నాలో ప్రతిధ్వనిస్తూ హృదయరాగాలు !!
వినిపించాయి నాకు సుమధుర స్వరాలు !!
🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🐦🌷
No comments:
Post a Comment