🌹
" చూడమ్మా , అబ్బాయి డాక్టర్. గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు ప్రైవేటు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. నీవు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు... "
సోమసుందరం గారు చెప్పుకుంటూ పోతున్నారు. తలవంచుకొని అనిత ఊకొడుతోంది. ఆమెలో అప్పుడే సంతోషతరంగాలు మొదలైనాయి. ఓ డాక్టర్ భార్యగా తన్ను తాను ఊహించుకొని మురిసిపోసాగింది. ఆ రాత్రంతా ఆమెకు అవే ఆలోచనలు. ఆ రాత్రే కాకుండా వరుసగా మూడు రోజుల పాటు అదే తంతు కొనసాగింది.
" ఆ అబ్బాయి డాక్టర్నే చేసుకోవాలని నిర్ణయించు కున్నాడటమ్మా... పోనీలే.. మీ మేనమామ రాఘవరావు మరోసంబంధం గురించి చెప్పాడు. అతను ఇక్కడే ఓ స్కూల్లో టీచరట... "
కొండ అంచు మీద నుండి దబ్బున కింద పడినట్లు అయింది అనితకి. కానీ త్వరలోనే ఆ నైరాశ్యం నుండి బయట పడగలిగింది. తర్వాత షరా మామూలే..! ఓ మాస్టారుతో తన కాపురం ఎలా ఉంటుంది...! అన్న భావనలో కొద్దికాలం ఊగిసలాడుతూ ఉండిపోయింది.
" చేసేది పంతులు ఉద్యోగమైనా అతని తల్లిదండ్రుల ఆశకు మాత్రం కొదవ లేనట్టుంది.. ఈ సంబంధానికి నేను తూగలేను...".
ఉస్సురంటూ... ఓ సాయంత్రవేళ తండ్రి నుండి వచ్చిన నిట్టూర్పులకి భావ రహితంగా ఉండిపోయింది అనిత. రాత్రి వెంట పగలు, పగలు వెంట రాత్రి... గడిచిపోతూనే ఉన్నాయి. ఆ పరంపరలో ఒకరోజు....
" అబ్బాయి ఇంటర్ దాకా చదివాడట. ఆస్తి బోలెడుంది. ఒక్కడే కొడుకు. ఆ కుటుంబం కూడా నాకు తెలిసినదే. కట్నాల వద్ద ఏ పేచీ ఉండదు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు నిన్ను. కాకపోతే... పల్లెటూర్లో ఉండాల్సి వస్తుంది.ఐతేనేం... మహారాణి లాగా బతకొచ్చు. ఈ సంబంధం నాకన్ని విధాలా నచ్చింది. ఇదే ఖాయం చేసేస్తాను..."
తండ్రి ముఖంలో ఆనందం చూసి ఆమె హృదయం తేలికపడినా... అంతరంగం మాత్రం బాధగా మూలిగింది.
** ** **
" నీకు బుద్ధుందా అసలు...! ఎవరేం చెప్తే దానికి గంగిరెద్దులా తలాడించడం తప్ప నీకంటూ ఓ అభిప్రాయం ఉండాలని నీకనిపించదా? అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా నీవు ఎలా నెట్టుకొచ్చావో చచ్చినా నాకర్థంకాదు.నాకో అనుమానం...నీవో పోస్టుగ్రాడ్యుయేట్ అన్న సంగతన్నా నీకు గుర్తుందా అని.. !"
అనిత చెప్పినదంతా విని, ఇంతెత్తున ఎగిరిపడింది తన చిన్ననాటి స్నేహితురాలు అనంత.
".................... "
"...మొన్నో డాక్టర్.. నిన్నో మాస్టారు... ! ఈరోజు మరొకడు...! అసలు వీళ్లలో ఒక్కరన్నా నీకు నచ్చారా..? వాళ్లకు అనుగుణంగా నీవు ఉండాలని కాదు... నీకు తగినట్లుగా వాళ్లున్నారా అని ఒకసారన్నా ఆలోచించావా? ఈ పెళ్లి జరిగితే, అయ్యేదేమిటో తెలుసా..? నీ డిగ్రీలు ఎందుకూ పనికిరాని చిత్తు కాగితాలు కావడమే...! నీ తెలివితేటలు, నీ చదువు... అన్నీ బూడిదలో పోసిన పన్నీరే. జీవితాంతం ఆ పల్లెటూర్లో జీవశ్చవంలా మగ్గి పోతావు తెలుసా..!"
చివ్వున తలెత్తిన అనిత కళ్ళల్లో తడి చూసి చలించిపోయింది అనంత. దగ్గరగా తీసుకుని,
" మీ నాన్న బాధపడతాడని నీవు నీ మనసుని చంపుకుంటున్నావు. ఆత్మవంచన పనికిరాదు అనితా. ఆయన ధోరణి చూస్తుంటే... ఎలాగైనా సరే... తన తల మీద భారం దించుకోవాలి అన్నట్లుగా ఉంది... ఆయన్ని నేను తప్పు పట్టడం లేదు. ఓ తండ్రిగా ఆయన మానసిక స్థితి అర్థం చేసుకోగలను. కానీ.. ఓ విద్యాధికురాలిగా... నీ వ్యక్తిత్వం వదులుకోవద్దు అంటున్నాను..."
"..................... "
" నీ చదువుకో సార్ధకత కలిగించు. నాలాగా ఏ చిన్నపాటి ఉద్యోగమో చేస్తూ ఉండు. నీకు అన్ని విధాలా నచ్చినవాడు తారసపడిన నాడు పెళ్లి మాట తలపెట్టు. నీకో చిరుద్యోగం చూసే పూచీ నాది..."
అనంత వైపు దిగ్భ్రమగా చూసింది అనిత. ఆమె భుజం మీద చేయి వేసి, పక్కనే కూర్చుంటూ,
" తండ్రి మాట లక్ష్యపెట్టవద్దని నేను అనటం లేదు. కానీ, సొంత అభిప్రాయం అంటూ లేకుండా మైనపు బొమ్మ లాగా ఎటు ఉంచితే అటు వంగరాదని చెప్తున్నాను. ఆడపిల్లకు పెళ్లి ముఖ్యమే.. కానీ.. 'ఏదో అయిందిలే' అనిపించే పెళ్లి మాత్రం కాకుండా ఆగిపోతేనే నయమని అనుకుంటున్నాను. నా మాటలు కటువుగా ఉన్నా కఠోర సత్యాలు సుమా..!"
వాతావరణాన్ని తేలిక చేయడానికన్నట్లు నవ్వేసింది అనంత.
" ఇంతకీ నా మాటలు నీమీద ఏమైనా ప్రభావం కలిగించి ఉంటే.... రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా నావద్దకొస్తావు... సరేనా...!"
అంటూ ఆప్యాయంగా చేయి నొక్కి, నిష్క్రమించింది.
** ** **
అనితలో చలనం మొదలైంది.
" నిజమే ! ఇంతవరకూ నాకా ఆలోచనే కలగలేదేమిటి! ఎంతసేపూ... తండ్రి కోణం నుంచే చూసింది గానీ... తన స్పందన పూర్తిగా పక్కకు నెట్టేసింది. అనంతకు థాంక్స్ చెప్పితీరాలి. ఇకపై ఎవరేం చెప్పినా మైనపు బొమ్మ లాగా కరిగిపోతూ సొంత అభిప్రాయాల్ని మార్చుకోవడం మానేయాలి".
ఆమెలో స్థిరనిర్ణయం రూపుదాల్చుకుంది.
** ** **
మర్నాడుదయం తొమ్మిది గంట కొట్టడానికి ఐదు నిముషాలు ముందే అనిత తన ఇంటి గుమ్మంలో ప్రత్యక్షమవడం చూసి అనంత కళ్ళు సంతోషంతో విప్పారాయి.
******************************************
'వనితాజ్యోతి'మాసపత్రిక,ఫిబ్రవరి,'95 లో ప్రచురితం
******************************************
కథ బాగుంది.
ReplyDeleteఅయితే ఈ కథ ఇంతకు ముందోసారి ఇక్కడ పోస్టే చేసినట్లున్నరేమో అనిపిస్తోంది.
లేదండీ. ఇదే మొదటిసారి. వనితాజ్యోతి మాసపత్రికలో ఫిబ్రవరి, 95 న పబ్లిష్ అయింది. కాకపోతే.. నాదో సందేహం. బ్లాగర్ కు నచ్చినవీ, ఎక్కువ మంది చదివినవీ రీపబ్లిష్ చేయొచ్చేమో అనుకుంటున్నాను. కొందరు అలా చేయటం చూస్తున్నాను. సందేహనివృత్తి చేయగలరు. 🙏
ReplyDeleteతప్పకుండా చెయ్యండి. ఇంతకు ముందు చదవని వారు, చదివి ఆనందించిన వారు - అందరూ స్వాగతిస్తారనే నా అభిప్రాయం. ఇదివరకోసారి పోస్ట్ చేశారుగా అనే వాళ్ళూ తగలచ్చు (నాలాంటి వాళ్ళన్న మాట 🙂🙂). అయినా ఫరవాలేదు. ఆస్వాదించేవారే ఎక్కువుంటారనుకుంటాను.
ReplyDelete(ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు స్వంత బ్లాగు లేదు కాబట్టి ఇంతకన్నా ఏం చెప్పలేను 🙂).
ఆ సాంకేతిక వివరాలు నాకు తెలియవు. blogger.com వారి సైటులోనే ఈ republish facility వివరాలు దొరుకుతాయేమో మరి, ఐడియా లేదు.
ReplyDeleteపోనీ ఈ republish ఫీచర్ ను తరచూ ఉపయోగించే బ్లాగర్ భండారు శ్రీనివాసరావు గారిని సంప్రదించి చూడరాదూ ?
http://bhandarusrinivasarao.blogspot.com/2023/01/news.html?m=1
చిన్నదిగా ముక్కుకి సూటిగా వ్రాసిన కధ బాగుంది.
ReplyDeleteThank you sir
Delete