Thursday, January 19, 2023

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే... 13... జీవన ప్రమాణ పత్రం...

🌺

      సమయం ఉదయం 11.30 కావొస్తోంది. గబగబా రెడీ అయి, బయటపడి, పది నిమిషాలు రోడ్డు పక్కన నిలబడి, ఆటో కోసం నిరీక్షించి ఎట్టకేలకు ఎక్కేశాను. మరో పది నిమిషాల్లో దిగి, ఓసారి పరకాయించి చూసి, నిర్ధారించుకుని ముందుకు నడుస్తూ గేటు లోపల ప్రవేశించాను.
   అది....STO కార్యాలయం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సంవత్సరానికి ఓసారి తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన అతి  ముఖ్యమైన ప్రదేశం. నెలనెలా పెన్షన్ డబ్బులు అందాలంటే జీవన ప్రమాణ పత్రం.. అదే... life certificate ! సమర్పించాలి మరి!(ఇటీవల కొన్ని కంప్యూటర్ సెంటర్ లు  కూడా కాస్త డబ్బు పుచ్చుకుని ఆ సేవలు అందిస్తున్నాయనుకోండి.)
   బాగా పాతబడ్డ ఓ చిన్న భవనంలో సదరు ఆఫీసు కార్యకలాపాలు సాగుతున్నాయి. గేటు దాటి లోపల అడుగుపెట్టిన నాకు... అక్కడ గుంపులు  గుంపులుగా జనం కనిపించారు. అంతా వయసు మీద పడ్డవాళ్ళు, వాళ్లకు సహాయంగా వచ్చిన వాళ్లూను. గత కొన్నేళ్ళుగా ఈ దృశ్యం నాకు అలవాటైపోయింది. సరే అనుకుంటూ కదిలాను. ఎదురుగా ఒకాయన వస్తూ, దూరం నుండే విష్ చేస్తూ పలకరించాడు. అతను ఒకప్పుడు నా కొలీగ్. కుశల ప్రశ్నల తర్వాత అతను వెళ్ళిపోయాడు. చాలా రోజులకు కలిసినందుకు ఓ క్షణం అప్పటి రోజులు మెదిలాయి. 
    అక్కడున్న పది, పదిహేను కుర్చీల్లో అంతా బైఠాయించి ఉన్నారు. రెండు మూడు సిమెంట్ బెంచీలూ ఆక్రమించబడి ఉన్నాయి. నేరుగా వెళ్లి నా వివరాలున్న ఆధార్ జిరాక్స్ కాపీ అందించాను అక్కడున్న సిబ్బందికి. అది అందుకుని, 
 "కూర్చోండి, టైం పడుతుంది.. "
 అంటూ బిజీ అయిపోయాడతను. 
" ఎక్కడ కూర్చోను...! "
అనుకుంటూ కళ్ళతోనే వెతుకుతూ లాభం లేక కాస్త దూరంగా వెళ్లి నిలుచుండిపోయాను, ఎవరైనా లేస్తే కూర్చుందాంలే అనుకుంటూ. 
 ఇంతలో గేటు బయట ఓ ఆటో ఆగింది. అందులో నుండి ఓ వృద్ధురాలు, ఆమెతోపాటు మరొకామె... కూతురు అనుకుంటా.. దిగారు. ఇద్దరూ కలిసి ఓ పెద్దాయన్ని జాగ్రత్తగా పట్టుకుని దింపారు. లోపల ఉన్న వాకర్ తీసి ఆయనకందించి, మెల్లిగా నడిపించుకుంటూ రాసాగారు. దగ్గరకు వచ్చాక తెలిసింది... ఆవిడ నాకు బాగా తెలిసినావిడ! నేను టీచరుగా పనిచేసే రోజుల్లో ఒకే బస్టాప్ దగ్గర కలిసేవాళ్ళం. నన్ను చూసి ఆవిడా గుర్తుపట్టి, చాలా సంతోషించింది. ఆ పెద్దాయన తన భర్త అని చెప్పింది. కాసేపు కష్టసుఖాలు వెళ్ళబోసుకుంది. మంచి మాటకారి. బస్ స్టాప్ వద్ద కలిసే టీచర్లందరితో కలివిడిగా ఉంటూ ఎప్పుడూ నాన్ స్టాప్ గా గలగలా మాట్లాడుతూ సందడి చేసేది. అందుకేనేమో... అంత బాగా గుర్తుండిపోయింది. 
   ప్రతీసారీ ఇలా ఇక్కడ ఈ ఆఫీసువద్ద తెలిసినవాళ్ళు ఒకరిద్దరైనా కనిపిస్తూ ఉంటారు. ఏమిటో ! అదో ఆనందం ! 
    ఇంతలో మరొకామె ఆటో దిగింది. వాకింగ్ స్టిక్ పట్టుకొని అతి ప్రయాసగా నడుస్తూ నెమ్మదిగా వస్తోంది. వెంట ఎవరూ లేరు. బాధగా అనిపించింది. సాధారణంగా నిస్సహాయులైన ఇలాంటి పెన్షనర్ల వెంట ఎవరో ఒకరు తోడుగా వస్తుంటారు. ఈమధ్య మరీ కదలలేని వాళ్ళకోసం ఇంటివద్దకే వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ తీసుకునే సౌకర్యం కల్పించారట ! కొంతలో కొంత మేలు. 
    " Thank God ! నాకింకా అలాంటి పరిస్థితి రాలేదు. ఒక్కదాన్నే రాగలుగుతున్నాను ", 
అనుకుంటూ ఓ నిట్టూర్పు విడిచాను. ఇంతలో ఓ ఛెయిర్ ఖాళీ అయితే వెళ్లి కూర్చున్నాను. ఇలా 'వెయిటింగ్' చేయలేనివాళ్ళు డబ్బు పోతేపోయిందని కంప్యూటర్ సెంటర్ లను ఆశ్రయిస్తున్నారు. రాన్రానూ నేనూ అదే దారి పట్టాల్సివస్తుందేమో ! లోలోపల నవ్వుకుంటూ... పిలుపు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను.
 ఇంకాసేపటి తరువాత... మరో దృశ్యం కంటబడి, ననాకర్షించింది.  ఓ టీనేజ్ కుర్రాడు ఓ పెద్దాయనను నడిపించుకుంటూ వస్తున్నాడు. దగ్గరగా వచ్చేకొద్దీ... గ్రహించగలిగాను...ఎనభైకి పైగానే ఉంటుంది వయస్సు! సన్నగా, పొడుగ్గా ఉండి  వంగిపోయి నడుస్తున్నా.... అతని కళ్ళు చురుగ్గా అటూ  ఇటూ కదుల్తూ అందర్నీ చూస్తున్నాయి. అంతేకాదు.. అక్కడ ఎవరూ  అతనికి తెలియకున్నా అందరివేపూ చిరునవ్వుతో చూస్తూ ముందుకు సాగడం గమనించాను. అలా నా వైపూ చూడగానే అప్రయత్నంగా నా ముఖంలోనూ చిరునవ్వు ! పెదవి దాటి మాట రాకపోయినా... ఆ పెదవులపై విరిసే మౌన దరహాసానికి ఎంత మహత్తో  కదా !! అనిపించింది.
    ఎందుకో  ఈ వాతావరణంలో కాసేపు కూర్చునే సరికి ఆలోచనలు  గతంలోకి పరిగెడతాయి. జీవనయానంలో అత్యధిక భాగం. దాదాపు 30 నుండి 40 సంవత్సరాలు వ్యక్తిగత జీవితంతో పాటు ఉద్యోగ జీవితానికి కూడా అంకితమై మమేకమైపోతాం. ఉత్సాహభరితమూ, అత్యంత శక్తివంతమూ అయిన ఆ 'పీరియడ్' ఎన్నెన్నో అనుభవాల సమాహారం... వీళ్లంతా ఆ రోజుల్లో క్షణం తీరిక లేక గడిపిన వాళ్లే ! రవంత  విరామం కోసం ఎదురుచూసిన వాళ్లే ! ఇప్పుడేమో... అంతా విరామమే ! అంతా విశ్రాంతే !!
     చివరి దశలో జవసత్వాలుడిగిపోయి...కన్నూ, కాలూ పనిచేయక శరీరం బొత్తిగా  సహకరించక మొరాయిస్తున్న ఈ తరుణాన 'నేనున్నా' నంటూ నెల తిరిగేసరికి చేతికందే  'పింఛను' అలాంటి వారందరికీ ఇచ్చే ఆసరా,  భరోసా మాటల్లో వర్ణించలేనిది! అదే లేకుంటే సగం జనాభా జీవచ్ఛవాలుగా బ్రతుకీడ్వాల్సిన దుర్భర పరిస్థితి! ఊహించుకోవడానికే శక్యం  కానిది..!
   ఇంతలో ఏదో కలకలం ! ఓ ఐదారుగురు లోపలి నుండి వస్తూ,
 " సర్వర్ పని చేయట్లేదట ! బయట చేయించుకో మంటున్నారు.."
అంటూ వెళ్లిపోయారు. కూర్చున్న వాళ్ళలో  సగం మంది లేచి బయటికి నడిచారు. రెండు నిమిషాలాగి నేనూ లేచాను. బయటికి దారి తీసేలోగా... లోపల నుండి ఒకతను, 
" పని చేస్తోంది.... రావచ్చు.. "
 అన్నాడు . మరో నిమిషంలో నా పేరు వినబడింది.

****************************************
      

No comments:

Post a Comment