Friday, February 3, 2023

😊 వసంత 😔

🌷

   ఆరోజు ఆదివారం. ఇల్లంతా కలయదిరిగి అన్నీ సరిగా ఉన్నాయో లేదోనని మరోసారి సరి చూసుకుంది వసంత. ఆ విధంగా ఆమె చేయటం పదోసారి.
    స్వతహాగా వసంత చాలా బద్ధకస్తురాలు. ఎప్పుడు చూసినా ఆమె ఇంటిని ఓ అడవిలా ఉంచుతూ ఉంటుంది. కానీ రెండు రోజుల నుండీ ప్రత్యేక శ్రద్ధతో ఇంటిని తీర్చిదిద్దుతూ  ఉంది. ఇల్లంతా బూజులు దులిపింది. మాసిన బట్టలన్నీ కుదురుగా ఓ మూల స్టాండ్ మీద వేసింది. షోకేస్ లోని అలంకరణ సామాగ్రి నంతా చక్కగా తుడిచి నీట్ గా అమర్చింది. అన్ని గదుల్లోనూ మూల మూలలా ఉన్న కసవు, చెత్తకాగితాలు వగైరా అంతా ఊడ్చేసింది. ఇలాంటివే ఇంకా మరెన్నో చేసి, మొత్తానికి ఇంటినో అద్దంలా, ఆహ్లాదకరంగా తయారుచేసింది. 
    సరే... అంతా బాగానే ఉంది. కానీ అంత బద్ధకస్తురాలికి ఉన్నట్టుండి ఇంటి మీద ఇంత దయ ఎందుకు పుట్టుకొచ్చిందయ్యా అంటే... దానికి బలమైన కారణమే ఉంది. వసంత ఓ ఎలిమెంటరీ స్కూల్లో టీచరు. ఆమెకు ఇటీవలే MEO ... అదే... మండల విద్యాధికారి వసుంధరాదేవితో పరిచయభాగ్యం కలిగింది. MEO వంటి ఉన్నతోద్యోగిని పైగా తన పైఅధికారిణితో పరిచయం పెరిగితే వృత్తిరీత్యా తనకు ముందు ముందు ప్రయోజనం ఉండొచ్చన్న ఆశ (ముందుచూపు అయినా కావొచ్చు!)వసంతలో తలెత్తింది. సదరు ఎంఈఓ గారితో ఏదో దూరపు బంధుత్వం కలిగిన రామేశ్వరి టీచర్ వసంత కొలీగ్. రామేశ్వరి తలపుకు రాగానే వసంత లో ఆశలు మొగ్గలు తొడిగాయి. ఇంకేముంది..! తన ద్వారా వసుంధరా దేవి గారి ఇష్టాఇష్టాలు, రుచులు, అభిరుచులు అన్నీ  సేకరించడంతోపాటు ఆమె ఇంటికి కూడా వెళ్లి పరిచయాన్ని మరికాస్త సాగదీసింది. ఆ ప్రయత్నంలోనే ఆవిడని తన ఇంటికి ఓసారి రమ్మంటూ ఆహ్వానించింది. స్వతహాగా ఫ్రెండ్లీ నేచర్ గలది  కాబట్టి
మొదట మొహమాట పడ్డా, సమ్మతించి, వీలు చూసుకుని వస్తానంటూ చెప్పింది ఆవిడ. .ఇక  అల్పసంతోషి అయిన వసంత ఆనందానికి పట్ట పగ్గాల్లేకుండా పోయాయి. 
    వసుంధరాదేవికి శుభ్రత అంటే తగని ప్రీతి. ఆమె ఇంటికి వెళ్ళగానే ఓ నందనవనంలో అడుగుపెట్టినట్లు ఫీలయింది  వసంత. వెనువెంటనే తన ఇల్లు మదిలో మెదిలింది. అబ్బ! ఎంత తేడా ! అనుకుంది. కోరి కోరి ఆవిడను ఇంటికి పిలిచి అరణ్యంలా  ఉండే తన ఇంటిని ప్రదర్శించడమా ! ఆ క్షణమే నిశ్చయించుకుంది... ముందు ఇంటిని ఓ కొలిక్కి  తేవాలి. ఎంఈఓ గారిని మెప్పించి ఆవిడ ఇంప్రెషన్ సాధించాలంటే ముందు ఆమెకు నచ్చే విధంగా ఉండాలి. అప్పటినుంచీ వసంత ఆ ప్రయత్నాల్లో పడిపోయింది. ఈరోజు ఆ అధికారిణి రాబోతోంది మరి! అదండీ,  అసలు సంగతి ! 
    సాయంత్రం నాలుగింటికి వసుంధరా  దేవి ఫోన్ కాల్ అందుకుని,  ఇంటి నుండి బయలుదేరి వెళ్ళింది వసంత. ఆవిడకు అడ్రస్ ఇచ్చే వచ్చింది. కానీ, తన ఇల్లు రోడ్డుకు కాస్త లోపలికి ఉంటుంది. ఆటో వాళ్ళు కనుక్కోవాలంటే కాస్త టైం పడుతుంది. ఆ విధంగా ఆమె ఇబ్బంది పడకుండా తనే వెళ్లి రిసీవ్ చేసుకుంటే సబబుగా ఉంటుందని అనుకుంది వసంత. మరో పది నిమిషాల్లో రోడ్డు దాకా వచ్చిన వసంతకు  ఆటోలో కూర్చున్న వసుంధరా దేవి కనిపించింది. 
  ఇద్దరూ కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆవిడ కబుర్ల ప్రోగు. ఆమె మాట్లాడుతూ ఉంటే ఎదుటివారు వింటూ ఉండాల్సిందే కానీ.. తిరిగి మాట్లాడే అవకాశం వాళ్లకివ్వదామె. వసంత అన్నింటికీ తలూపుతూ, ఊకొడుతూ ఆమెను అనుసరిస్తోంది. దాదాపు ఇల్లు సమీపించారు. ఉన్నట్టుండి వసుంధరా దేవి  నడక ఆగిపోయింది.
" అటు చూడు వసంతా.. ఆ ఇంటి ముందు చెత్తాచెదారం ఎలా గుట్టలుగా పడి ఉందో ! ఆ కాలువ చూశావా ! అబ్బ ! అసలు అంత డర్టీ ఇంటి ముందు భరిస్తూ ఎలా ఉంటారో బాబూ ! నాకయితే ఓక్షణం నిల్చోబుద్ధి కూడా కాదు. ఇంతకీ ఏ మహాతల్లో ఈ ఇంటి ఇల్లాలు !! "
అనేసింది గుక్క తిప్పుకోకుండా. వసంత ఒక్కసారిగా అప్రతిభురాలైపోయింది.ఛ ఛ ! ఎంత పొరపాటు చేసింది! ఇంటిని బాగు చేసే ప్రయత్నంలో ఇంట్లోని కుళ్ళునంతా ఇంటి బయటకు చేర్చేసింది. కాలువ గట్టునా, మురికి నీళ్లలో పరుచుకున్న ఇంట్లో మిగిలిన అన్నం మెతుకులు ! వాటి చుట్టూ జుయ్యి జుయ్యిమని ముసురుతున్న ఈగలు !! అంతేనా ! ఇంటి ముందు రోడ్డంతా దుమ్ము ధూళితో, చెత్త కాగితాల్తో నిండిపోయి పరమ అసహ్యంగా కనిపిస్తోంది.  ఆ దృశ్యం చూసేసరికి ఆమెకే కడుపులో దేవినట్లయింది ఇన్నాళ్లుగా ఇంటిముందున్న  ఇంత చండాలాన్ని గమనించని తన అవివేకాన్ని తలుచుకుని సిగ్గుతో చితికిపోయింది.
" ఈ ఇంటి ఇల్లాలిని నేనేనని ఈవిడకు తెలియడానికి మరెన్నో క్షణాలు పట్టవు...మైగాడ్ !! "
తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లు తయారైంది వసంత పరిస్థితి. 
నోట మాట రాని  ఆమె  నడక అప్రయత్నంగానే ఆగిపోయింది.

**************************************






 

5 comments:

  1. వసంత వెంటనే ఆలోచించింది ఏమి చెయ్యాలో అని. తన ఇంటికి తీసుకు వెళ్ళటం ఇష్టం లేదు. చూసి ఏమంటుందో అనే సందేహం. నడుస్తూ పక్కనున్న హోటల్ కి తీసుకువెళ్ళింది. చక్కగా ఒక గంట మాట్లాడుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు.

    ReplyDelete
    Replies
    1. 🙂..ఇంటికి కదా ఆహ్వానించింది... హోటల్ కెందుకు అని ఆవిడ అంటే ఎలా! ? 🙂

      Delete
  2. ఇంట్లో ఎదో గొడవ అయ్యిందని చెప్పాలేమో. ఏది ఏమయినా కధ చివర్లు గాలిలో వదిలెయ్యటం నచ్చలేదు.

    ReplyDelete
    Replies
    1. ఆవిడో matured person.తీరా ఇంటి ముందర కొచ్చాక ఇంట్లోకి దారి తీయడం తప్ప... ఏవో కారణాలు చెప్పి దారి మళ్లించడం అసంబద్ధంగా ఉంటుంది కదా.. !
      * లోపలికి వెళ్ళాక ఇల్లు పొందిగ్గా ఉండడం చూసి ఆవిడ సంతోషించవచ్చు.
      * వయసులో పెద్దది కాబట్టి, చనువుగా బయట కూడా కాస్త శ్రద్ధ పెట్టొచ్చు కదా అని నవ్వుతూనే సలహా ఇవ్వచ్చు.
      * తద్భిన్నంగా.. లోపల ఈసడించుకున్నా పైకి మాత్రం ముఖాన నవ్వుపులుముకోనూ వచ్చు.
      ---- ఇవన్నీ చదువరుల ఊహా శక్తికే వదిలివేస్తూ కొన్ని కథలకు ముగింపు నివ్వడం బాగుంటుందని నా అభిప్రాయం. ఏకీభవిస్తారనుకుంటాను.

      Delete