Tuesday, February 21, 2023

"ఈ మందులు వాడండి... నెల తర్వాత రండి... "

🌷

    క్లినిక్ కి కాస్త ఎడంగా బైక్ ఆపి, భార్య వైదేహితో పాటు ముందుకు నడిచాడు మోహన్ రావు. ఆరోజు సోమవారం అయినందువల్లేమో పేషెంట్లు చాలామంది కూర్చుని ఉన్నారు.  ఫోన్లోనే అపాయింట్మెంట్ తీసుకోవడం మేలయింది అనుకున్నారిద్దరూ. టోకెన్ నెంబర్ ఆరే కాబట్టి త్వరగానే వెళ్లొచ్చు అనుకుంటూ ఓ పక్కగా చైర్స్ లో కూర్చున్నారిద్దరూ. డాక్టర్ మాత్రం ఇంకా రాలేదు. ఏమిటో.. ! బయట బోర్డు మీదేమో సాయంత్రం 6:00 నుండి అని రాసి ఉంటుంది... వచ్చేదేమో.... ఏడున్నరకు...! 
    మోహన్ రావు ఓ గవర్నమెంట్ ఆఫీస్ లో మంచి హోదా గలిగిన ఉద్యోగమే చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. మంచి లొకాలిటీలో పెద్ద ఇల్లు... రెండంతస్తులది కట్టుకున్నాడు. కింద రెంట్    కి ఇచ్చేసి, పైన ఫ్యామిలీతో ఉంటున్నాడు. ఫ్యామిలీ అంటే.. తనూ  తన వైఫ్ అంతే... పిల్లలు ఇద్దరూ   సెటిల్ అయిపోయారు. పెన్షన్ బాగానే వస్తుంది. ఇంక కొదవేముంది ! ఇద్దరూ మలిదశలోో చక్కగా ఎంజాయ్ చేస్తూూ గడిపేస్తూ ఉన్నారు. కానీ... ఈమధ్య కొంతకాలంగా, మోహన్ రావు ఓకే గానీ... వైదేహే పాపం వయసుతో పాటు వచ్చిన కొన్ని అనారోగ్యాలతో ఇబ్బందిి పడుతోంది.
   దాదాపు రెండు నెలల నుండీ కడుపులో ఏదో అసౌకర్యం.. మలబద్ధకం... దాంతో కళ్ళు తిరగడం...! ఓ నెల దాకా చూసింది, అదే తగ్గుతుంది లే అని.!మరో నెలా చూసింది.  ఇక లాభం లేదనుకుని, రెండు రోజులు ఆలోచించి ఇదిగో ఇలా ఈ  డాక్టర్ అనుభవజ్ఞుడని తెలుసుకొని భర్తతోపాటు బయలుదేరింది. 
ఇంతలో అందరూ లేచి నిలబడ్డం చూసి, వీళ్ళిద్దరూ కూడా లేచారు. కారు లోంచి దిగి చకచకా మెట్లెక్కి  లోనికి దూరిపోయాడు  డాక్టర్. రెండు మూడు నిమిషాలయ్యాక పిలవడం మొదలైంది. ఈలోగా మరికొందరొచ్చారు.ఛైర్స్  లేక కొందరు నిలబడ్డారు. ఒక్కొక్కరికి... పది నిమిషాల నుండి పావుగంట.. బయట ఉన్న వాళ్ళకి ఒకటే ఆదుర్దా.. ! తమ వంతు కోసం.. బయటకు వస్తున్న వాళ్లలో చాలావరకు చీటీలు తీసుకుని పక్కనే ఉన్న ల్యాబ్ లోకి దూరుతున్నారు పరీక్షల కోసం..! ఇంకొందరు రాసిచ్చిన మందుల కోసం ఆ పక్కనే ఉన్న షాపు వద్ద నిలబడ్డారు. 
" మనల్నే పద "
 అంటూ లేచాడు మోహన్ రావు. అమ్మయ్య అనుకుని, మరోపక్క ఏం చెబుతాడో ఏమో అని టెన్షన్ పడుతూ తనూ  లేచింది వైదేహి. లోపల అడుగుపెట్టగానే, డాక్టర్ గారు సెల్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో నవ్వుతున్నాడు. వీళ్ళిద్దరూ వెళ్లి ఎదురుగా కూర్చున్న రెండు నిమిషాలకు ఫోన్ పెట్టేసి, చెప్పండి అన్నట్టు చూశాడు.
    వైదేహి తన సమస్య చెప్పింది. మధ్య మధ్యలో మోహన్ రావు అందుకుని తనూ  కొన్ని చెప్పాడు. డాక్టర్ తల పంకించి, స్టెత్  తీసుకుని, ముందుకొచ్చి వైదేహిని పరీక్షించాడు. అతని మొహంలో ఏ భావమూ కనిపించలేదు ఇద్దరికీ. వెళ్లి కూర్చుని, పెన్ తీసి, గబగబా నాలుగు రకాల టాబ్లెట్స్ రాసి, సర్రున చింపి, 
" ఇవి వాడమ్మా.. సెట్  అయిపోతుంది. నెల తర్వాత మళ్లీ రండి, "
అని నెక్స్ట్ పేషెంట్ ను రమ్మనమంటూ సైగ  చేశాడు అటెండర్ కు. ఇద్దరికీ ఏమిటో నోట మాట రాలేదు. అసంతృప్తిగా అనిపించింది. రెండు నెలల బాధ!  అసలు కారణమేంటో చెప్పలేదు. మరో రెండు నిమిషాలు సమస్య గురించి విని ఉంటే బాగుండు కదా.. అనిపించింది మోహన్ రావుకు. వైదేహి కైతే తను చెప్పడం ఇంకా పూర్తి కాకముందే  డాక్టర్ అలా  మందులు రాసేయడం... ఆ తొందరలో తను చెప్పదలుచుకున్నది బుర్రకు తట్టక తడబడిపోయింది. మోహన్ రావు కైతే ఒకప్పటి డాక్టర్లు గుర్తొచ్చారు ఓక్షణం ! వైద్యునికి పేషంట్ తో ఉండాల్సిన 'రిలేషన్' ఇంతగా దిగజారిందా! అని ఆశ్చర్యం కలిగిందతనికి. అయినా ఉండబట్టలేక,   "
"సర్, ఇలా ఎందుకవుతోందంటారు? "
 అనడిగాడు.
" మరేమీ లేదండీ, వయస్సు పైపడుతోంది కదా.. ఇలాంటివి వస్తూ ఉంటాయి... మందులు వాడితే తగ్గిపోతుంది..."
అని అంటూ ఉండగానే  ఇద్దరు ప్రవేశించారు. ఇక వీరిద్దరికీ లేవక తప్పలేదు. అయోమయంలోంచి తేరుకుని, చీటీ పుచ్చుకుని బయట పడ్డారు ఉసూరుమంటూ. గంట నిరీక్షణ ! పది నిమిషాలు కూడా పట్టలేదు పరీక్షించడానికి...! చేసేదేమీ లేక, రాసిన టాబ్లెట్స్ అన్నీ కొనుక్కుని, ఎలా వాడాలో షాప్ అతన్ని కనుక్కొని, తిరుగు ముఖం పట్టారు. ఫీజు 200, మందులు 1200, రాను పోను ఖర్చు 100... మొత్తం బిల్లు 1500 రూపాయలు..!!       
                 ***              ***            ***
      ఆ రాత్రి నుండే మొదలెట్టింది వైదేహి. రెండు రోజులయ్యాక సమస్య తగ్గకపోగా ఏమిటో కడుపులో  మరీ  వికారంగా, వాంతికొస్తున్నట్లుగా అనిపించ సాగిందామెకు. మరో నాలుగు రోజులు అలాగే భరించింది. కానీ... నెల తర్వాత రమ్మన్న డాక్టర్ దగ్గరకు పది రోజులు దాటకముందే వెళ్ళక తప్పలేదు.
" మొదట అలాగే ఉంటుంది. తర్వాత సర్దుకుంటుంది. అయినా... ఓ రకం మారుస్తాను."
 అంటూ క్యాప్సూల్ బదులుగా మరో టాబ్లెట్ రాశాడు.
 ఎలాగోలా నెల గడిపేసి మళ్లీ దర్శించుకున్నారు.
" తగ్గినట్లే ఉంది సార్... కానీ పూర్తిగా కాదు..."
 అంటూ నసిగింది వైదేహి. షరా  మామూలే.. ! ఆయన ముఖంలో ఏ భావమూ  కనిపించలేదు. నోరు తెరిచి మాట్లాడనూ  లేదు. మౌనంగా మరో చీటీ మీద ఏదో బరబరా రాసి, 
" ఈ టెస్టులు చేయించండి...."
అంటూ చేతిలో పెట్టాడు. వైదేహి అయోమయంగా చూసింది. మోహన్ రావు అదోలా మొహం పెట్టి, 
" టెస్టులు అవసరమా డాక్టర్ ? "
 సందేహంగా అడిగాడు.
" అవసరమనేగా  రాశాను...!"
వెంటనే అనేశాడాయన. 
ఇంకేమంటాడు.. మోహన్ రావు..! ఓ గంట తర్వాత, రిపోర్టు చూసి, 
" కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. క్యాల్షియం తక్కువ ఉంది.."
అంటూ, పాత చీటీ మీదే మరో రెండు రకాల టాబ్లెట్స్ రాసి, 
"... ఇవి వాడండి, నెల తర్వాత రండి..."
అన్నాడు. అంతా కలిసి ₹ 2000 బిల్లు..! తప్పేదేముంది! సమర్పించుకుని బయటపడ్డారు.
           ***            ***              ***
     ఉస్సురనుకుంటూ ఇల్లు చేరుకుని, గేటు తీస్తుండగా, కింది వాటాలోంచి, 
" సూర్యం ఇంటికొచ్చానే... చాలా రోజులయింది కదా.. నిన్నూ చూసిపోదామని ఇలా వచ్చా. మీరేమో... "
అంటూ జానకమ్మ ఎదురొచ్చింది. ఆవిడ్ని పలకరిస్తూ పైకి దారితీశారు. ఆవిడ వైదేహికి స్వయానా పెద్దమ్మ. కలివిడి మనిషి. వైదేహి అంటే ప్రత్యేక అభిమానం. ఆ చనువుతో రెండు నెలలుగా వేధిస్తున్న  తన అవస్థ ఏకరువు పెట్టి ఆవిణ్ణి కొద్దిరోజులు ఉండమని కోరుకుంది వైదేహి.
    రెండు మూడు రోజులు గడిచేసరికి జానకమ్మకు బాగా అర్థమైపోయింది వైదేహి అనారోగ్యానికి కారణం. రెండేళ్ల క్రితం వరకూ తీరిక లేకుండా గడిపిన వైదేహి ఇప్పుడు బాగా 'ఫ్రీ' అయిపోయింది. డబ్బుకుకొదవే లేదు.  ! ఇదివరకు పనిమనిషి మాత్రమే ఉండేది. ఇప్పుడు వంటమనిషినీ కుదుర్చుకున్నారు. ఇక తనకు ఒళ్ళు వంచే అవసరమేముంది ! ఉదయం ఏడు దాటాక లేవడం,  ఎంచక్కా  రెడీగా ఉన్న టిఫిన్ ఆరగించడం, టీవీ చూడ్డం, ఆ తర్వాత హాయిగా విశ్రాంతిగా నిద్రపోవడం!
ఐదింటికి లేచి ఏవో  స్నాక్స్ లాగించి టీ  సేవించడం ! తొమ్మిది దాటాక తినేసి, మళ్లీ టీవీ వీక్షణం ! లేదా సెల్ లో వీడియోలు చూడ్డం ! ప్రస్తుతం ఇదీ ఆమె దినచర్య! కనీసం గేటు దాటి నాలుగడుగులు నడవాలన్నా బద్ధకించడం.. ! షాపింగ్ లకు కార్లో  వెళ్లడం, రావడం! ఇక తిన్నది అరగడం ఎలా? ! కొన్నేళ్ల క్రితం కారు ఉండేది కాదు. ఇప్పుడు అన్ని వసతులూ అమరాయి మరి ! గతంలో ఒకటి రెండు సార్లు వచ్చినప్పటి కంటే ఇప్పుడు బాగా బరువు పెరిగిపోయింది. నాలుగైదు రోజులపాటు గమనించిన జానకమ్మ ఇక ఉండబట్ట లేక ఓ మధ్యాహ్నం భోంచేశాక టాబ్లెట్స్ వేసుకోబోతున్న వైదేహిని వారించి, 
" వాటి వల్ల ప్రయోజనం శూన్యం వైదేహీ.. ఓ వారం పాటు వాటన్నింటినీ పక్కన పెట్టేసి, నేను చెప్పినట్లు చెయ్యి. ఫలితం లేకుంటే మళ్ళీ అవే వాడుదువు గానీ... "
అంది. చిత్రంగా చూసిన వైదేహి పక్కనే కూర్చుని, నెమ్మదిగా ఏం చేయాలో వివరించింది.
"... కష్టమే.. కొద్దికాలంగా సుఖజీవనానికి బాగా అలవాటు పడ్డావు. మళ్లీ శ్రమించాలంటే శరీరం సహకరించదు. కానీ ప్రయత్నం తప్పదు.."
 ఆ మాటలు వైదేహిలో ఆలోచన రేపాయి. పెద్దమ్మ డెబ్బైకి చేరువలో ఉంది. జరుగుబాటుకు లోటు ఏమీ లేదు. అయినా బొంగరంలా ఎప్పుడూ తిరుగుతూ ఏదో ఒక పనిలోనే కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచీ పెద్దమ్మ దగ్గర తనకు చనువెక్కువ. ఆ చొరవ తోనే జానకమ్మ ఇంకా ఇలా అంది, 
"... ఎలా ఉండే దానివే  చిన్నప్పుడు...! గట్టిగా గాలి వీస్తే కొట్టుకపోయేదానిలా ! పెళ్లప్పుడు సన్నజాజి తీగలా ఎంచక్కా ఉన్నావు ! ఇప్పుడు అలా ఎలా ఉంటాను అంటావేమో ! మనం లావుగా ఉన్నామా, సన్నగా ఉన్నామా అని  కాదే... ఆరోగ్యంగా ఉన్నామా, అనారోగ్యంగా ఉన్నామా.. అన్నది ముఖ్యం..."
ఆవిడ చెప్పుకుంటూ పోతున్నది. వైదేహి ఆలోచనలో పడింది. 
" ఛ ఛ ! ఇంత చదువుకున్నాను, పెద్దమ్మ కున్నంత జ్ఞానం నాకు లేకపోయింది కదా...!"
సిగ్గు పడిపోయింది. చిన్నప్పటినుంచీ అంతే. అమ్మ చెప్పినా  వినని తను పెద్దమ్మ చెబితే వెంటనే వినేది. ఆలోచించేది. ఇప్పుడూ అదే జరిగింది. అసలిప్పుడు తన వయసెంతని ! చిన్న వయసులోనే పెళ్లి కావడం, వెంటనే పిల్లలు ! యాభై అయిదు నిండుతున్నాయి అంతేగా..! అప్పుడే ఇంత డీలా పడిపోతోంది మరి ! వెంటనే తేరుకుని, జానకమ్మను మరి కొద్ది రోజుల పాటు ఉండమని కోరింది.
    మరుసటి రోజు ---పెద్దమ్మ సలహా ప్రకారం, కొద్ది రోజుల వరకు వంట మనిషిని రావద్దని చెప్పింది. ఉదయం ఆరింటికే లేచి, టెర్రస్ మీద అరగంట సేపు వాకింగ్ మొదలెట్టింది. టిఫిన్, వంట మునపటిలా  తనే చేయసాగింది. చీటికిమాటికీ అవీ  ఇవీ నమలడం మానేసింది. సాయంత్రాలు ఇంటి ముందు అంతా ఊడ్చి శుభ్రం చేయడం మొదలెట్టింది. మొదట్లో అలవాటు తప్పిన దేహం మొరాయించినా క్రమంగా వారం రోజుల్లో దారిలోకొచ్చింది.
     వారం గడిచాక... ఏమిటో, వైదేహికి నిజంగానే హుషారుగా అనిపించింది. కడుపులో అసౌకర్యం తగ్గుముఖం పట్టింది. మార్పు స్పష్టంగా కనిపించే సరికి, జానకమ్మ కూడా మెచ్చుకుంది.
" ఇదిగో... నేనున్నానని ఇదంతా చేస్తున్నావేమో...! రేపు వెళ్ళిపోతున్నా. మళ్లీ మొదటికి  రాకు.."
నవ్వుతూనే హెచ్చరించిందావిడ.
           ***            ***          ***
   మూడు వారాలు గడిచాయి. పెద్దమ్మ మాటలు మంత్రంలా పనిచేసినట్టున్నాయి. వైదేహి హుషారుగా తయారైంది. 
"నాకు ఏదో అయింది, ఏదో పెద్ద రోగమే నన్ను ఆవహించినట్లు ఉంది.. "
అన్న ఫీలింగ్ తొలగించుకుని, 
" నాకేమీ లేదు, అంతా ఓకే..."
అనుకున్న క్షణం నుండీ ఏదో తెలియని ధైర్యం ఆమెలో వచ్చి చేరింది. పనిమనిషిని మాత్రం ఉంచుకుని, వంట మనిషిని అవసరమైతే పిలుస్తానని సున్నితంగా చెప్పి మాన్పించేసింది. ఇంతకీ ఆమె గ్రహించిన ఓ సత్యం... "చిన్నచిన్న అనారోగ్యాల్ని మనకు మనమే బాగుచేసుకోవచ్చు" అన్నది.
ఆ మధ్యాహ్నం భోంచేశాక, 
" నెల అయిపోయిందిగా, రేపు డాక్టర్ దగ్గరికెళ్దామా? "
 అంటూ వైదేహి టాబ్లెట్స్ బాక్స్ తెరచిన మోహన్ రావు
 విస్తుపోయి, 
"... ఇదేమిటి ? ! అన్నీ  ఇలాగే ఉన్నాయి !"
అన్నాడు.వెంటనే వైదేహి అందులోని టాబ్లెట్స్ అన్నీ తీసుకుని, 
" ఇక వీటి అవసరం లేదులెండి.."
అంటూ డస్ట్ బిన్ వేపు నడిచింది. చిత్రంగా చూస్తూ ఉండిపోయాడు మోహన్ రావు !!
అందులో వాటిని పడేస్తుంటే, 
" ఈ మందులు వాడండి. నెల తర్వాత రండి... "
అన్న డాక్టర్ మాటలు గుర్తొచ్చి నవ్వుకుంది వైదేహి. 

**************************************












No comments:

Post a Comment