Tuesday, December 31, 2024

కష్టమైనా ప్రయత్నిద్దాం...

 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐    


                కొత్త సంవత్సరం వచ్చేస్తోంది...
                క్యాలెండర్ మారుతుంది...
                వీడ్కోలు చెప్పేద్దాం...
                నిన్నటి చేదు తుడిచేద్దాం 
                కష్టమైనా ప్రయత్నిద్దాం 
                కొన్ని కష్టాలు అధిగమిస్తేనే 
                సొంతమవుతుంది సంతోషం🙂
                తీపిని మరీ మరీ 
                నెమరేసుకుందాం..
                అదే కదా మనల్ని 
                ముందుకు నడిపించే 
                దివ్య ఔషధం !! 
                అదిగో..!!🌹
                వచ్చేసింది కొత్త సంవత్సరం..🌷
                స్వాగతిద్దాం... 🌺
                సంబరాలు చేసుకుందాం 
                నవ్వుతూ.. నవ్విస్తూ..
                జీవనయానం సాగిద్దాం...🙂🙏
    

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Monday, December 23, 2024

చీమను చూసి నేర్చుకో.... ' చిన్నారి కథ '

  
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
                             యం. ధరిత్రీ దేవి 
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️

 రాధాకృష్ణ మనసంతా అల్లకల్లోలంగా ఉందాక్షణంలో. ఆ విషయం తెలిసినపుడు, ముందుగా ఊహించిందే అయినా వాడి మనసు ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇంతకీ ఆవిషయమేమిటంటే ఆ అబ్బాయి పదోతరగతి రెండోసారి కూడా తప్పాడు. 
   మొదటిసారి తప్పినప్పుడు పెద్దగా వాడికి ఏమీ అనిపించలేదు. కానీ ఇంట్లో తండ్రి చేత తెగ చీవాట్లు తిన్నాడు. వాళ్ళమ్మయితే ఆ రోజంతా ముఖం తిప్పుకొని, రెండు రోజుల దాకా వాడితో మాట్లాడనేలేదు. పరీక్ష పోయినందుకు కాదు గానీ, ఈ చిరాకంతా భరించడం వాడికి పెద్ద తలనొప్పి అయింది. 
  అన్నింటినీ మించి వాడు భరించలేని విషయం, వాళ్ళ పక్కింటి వనజ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలవడం ! తన నెంబర్ పేపర్లో లేదని తెలిశాక ఆ పిల్ల తన వైపు చూసిన చూపు, ఎగతాళిగా నవ్విన నవ్వు పదేపదే వాడికి గుర్తొచ్చి ఉక్రోషం ముంచుకొచ్చింది. 
  ఏదేమైతేనేం, తప్పిన రెండు సబ్జెక్టులూ మళ్లీ కట్టాడు. కానీ, వాడి దురదృష్టం! రెండింట్లోనూ మళ్లీ తప్పాడు. ఫలితాలు చూసుకుని కాళ్ళీడ్చుకుంటూ వస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఎదురుగా జూనియర్ కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్న వనజ! మళ్లీ అదే చూపు, అదే నవ్వు! తల కొట్టేసినట్లయింది రాధాకృష్ణకి. అంతే! గిర్రున వెనక్కి తిరిగి ఊరిబయటి కాలువగట్టుకు దారితీశాడు. ప్రస్తుతం వాడి మన స్థితికి కారణం అదే. రాత్రి యథాప్రకారం ఇంట్లో తిట్లు, శాపనార్థాలు! 
   " ఇక వీడు లాభం లేదే, ఊర్లో ఏ పెద్దకాపు ఇంట్లోనో పాలేరుగా కుదిరిస్తే తిక్క కుదురుతుంది.... "
 తల్లితో వాళ్ళ నాన్న అంటున్న మాటలు వింటుంటే రాధాకృష్ణ రక్తం ఉడికిపోయింది. తల్లి చాటుగా కళ్ళు ఒత్తుకోవడం చూసి ఓ పక్క బాధ కలిగింది. పట్టువదలని విక్రమార్కునిలా మళ్లీ పరీక్షకు కట్టాడు ఉక్రోషంతో. 
    దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగుచేయలేరన్నట్లుగా రాధాకృష్ణను ఈసారీ విధి వెక్కిరించింది. తల బాదుకుని చద్దామన్నంత విసుగు పుట్టింది వాడికి. ఈసారి అమ్మా నాన్నల్ని ఎలా ఎదుర్కోవాలన్న తలంపు వాణ్ణి మరింత కుంగదీసింది. ఓ క్షణం ఏ రైలు పట్టాల మీదో తల పెట్టేద్దామా అన్న ఆలోచన కూడా వాడి బుర్రలో దూరక పోలేదు. మరుక్షణమే రైలు బండి చప్పుడు గుర్తొచ్చి భయంతో వాడి గుండె దడదడ లాడింది. ఇక చేసేదేమీలేక, గుండె బరువెక్కి ఇంటికి వెళ్ళడానికి మోహం చెల్లక, తన అలవాటు ప్రకారం ఊరి బయట కాలవ గట్టు కేసి దారితీశాడు. 
   గట్టుమీద కూర్చుని కాలువలోని నీటి ప్రవాహాన్ని తదేకంగా చూస్తోన్న వాడి మస్తిష్కంలో నిరాశ పేరుకొని పోసాగింది. అందరూ ఎంతో సునాయాసంగా పాస్ అయిపోతుంటే తను ఎందుకు ఇలా ప్రతిసారీ ఫెయిల్ అయిపోతున్నాడో వాడికి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అలా ఆలోచిస్తున్న వాడి దృష్టి ఉన్నట్టుండి కాలువ దిగువ భాగాన గడ్డి మీద పాకుతున్న ఓ గండుచీమ మీద పడింది. రెల్లు గడ్డి మీదనుండి అది మాటిమాటికీ కిందకి జారుతూ ఉంది. పైకి పాకి ఒడ్డు చేరడానికి ఎంతో శ్రమ పడుతోంది కానీ, చేరలేక పోతోంది. గడ్డి మీద నుండి ఏమాత్రం జారి కింద పడినా నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోతుంది. 
  తన మనస్థాపం తాత్కాలికంగా కాస్త పక్కకు పెట్టి, ఒకింత ఉత్కంఠగా రాధాకృష్ణ దాన్నే గమనించసాగాడు. అలా అలా ప్రయత్నిస్తూ అది చూస్తోండగానే చిట్టచివరకు ఒడ్డుపైకి చేరి పోయింది. అమితాశ్చర్యం కలిగింది రాధాకృష్ణకి. సరిగ్గా అప్పుడే తలతిప్పి చూసిన వాడికి ఎప్పుడు వచ్చిందో ఏమో గానీ వెనగ్గా నిలబడి ఈ తతంగమంతా గమనిస్తున్న వనజ కనిపించింది. మళ్లీ అదే చూపు, అదే నవ్వు ! అంతే! వాడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పట్టరాని కోపంతో ఆ అమ్మాయి వైపువిసవిసా రెండడుగులు వేశాడు. 
' ఆగు '
అంటూ ఒకింత హెచ్చుస్థాయిలో చేయి చాపుతూ వారించింది వనజ. మంత్రం వేసినట్లు ఠక్కున ఆగిపోయాడు రాధాకృష్ణ !
"....ప్రస్తుతం నీవున్న మానసిక స్థితి నేను అర్థం చేసుకోగలను. ఈ రోజెందుకో నీతో రెండు మాటలు చెప్పాలనిపించి నీ వెనకే వచ్చాను.... "
విస్తుబోతూ చూస్తోన్న రాధాకృష్ణనే చూస్తూ కొనసాగించింది వనజ. 
"....నా మీద కోపం తెచ్చుకోవడంలో అర్థం లేదు. నిన్ను నీవు ఓసారి పరీక్షించుకో. ప్రతిసారీ ఇంట్లో మీ నాన్న కోప్పడతాడనో, అమ్మ బాధపడుతుందనో పరీక్ష ఫీజు కడుతున్నావు గానీ ఒక్కనాడన్నా పాస్ అవ్వాలన్న కోరికతో పుస్తకం పట్టి చదివావా? పరీక్షలయితే రాసి వస్తున్నావు గానీ, పాసవుతానన్న ధీమా నీలో ఎప్పుడైనా కలిగిందా?  చిన్న చీమ నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పదే పదే పడిపోతూఉన్నా ప్రయత్నం మాత్రం మానుకోలేదది ! పట్టుబట్టి శ్రమించి గట్టు చేరుకుంది చూడు. దానికున్నపాటి పట్టుదల నీకూ ఉండి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పాస్ అయిపోయి ఉండేవాడివి. నీలో తెలివితేటలు, జ్ఞాపకశక్తి, ఆలోచన, అవగాహన--- అన్నీ ఉన్నాయి. లేనిదల్లా పట్టుదలే! పాస్ అయి తీరాలన్న పట్టుదల!.... "
 స్థిర కంఠంతో వనజ తీక్షణంగా అంది. ఆ క్షణంలో కళ్ళను కమ్ముకున్న తెర ఏదో మెల్లిగా జారిపోతున్న భావన రాధాకృష్ణలో ! 
  నిజమే! పరీక్ష ఫీజు కట్టడంతో తన పని అయిపోయింది అనుకునే వాడు. తండ్రి పోరు పడలేక ఆ తతంగం కాస్తా పూర్తి చేస్తున్నాడే గానీ నిజానికి చదివి పాసవ్వాలన్న కోరిక తనలో ఎక్కడుండేది? వనజ ను చూసి ఉక్రోషంతో కోపగించుకున్నాడు గానీ ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పేముంది? వాస్తవమే మాట్లాడింది. ఈసారైనా పట్టుబట్టి విజయం సాధించాలి. తన నిర్ణయం కళ్ళలో ప్రతిఫలిస్తూ ఉండగా వనజ వైపు సంభ్రమంగా చూసాడు రాధాకృష్ణ. మళ్లీ అదే చూపు! అదే నవ్వు! కానీ ఈ సారి రాధాకృష్ణకు ఆ పిల్లపై కోపం రాలేదు సరికదా చెప్పలేనంత ఉత్సాహం మరింత సంతోషం కలిగింది!
తనను కర్తవ్యం దిశగా నడిపే ప్రయత్నం చేసిన వనజ వైపు మెచ్చుకోలుగా చూస్తూ ముందుకు కదిలాడు.

☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️

Friday, December 20, 2024

ప్రయత్నం మొదలెట్టు...

<><><><><><><><><><><><><><><><><><>>
                                       యం. ధరిత్రీ దేవి 
                                       ***********
టిక్.. టిక్.. టిక్.. టిక్...!
గోడన గడియారం బ్దం...
లయబద్ధంగా...
శృతి ఏమాత్రం తప్పక...
సెకండ్లు.. నిమిషాలు..గంటలు...
దొర్లి పోతున్నాయి...విరామం ఎరుగక..! 
భ్రమణం సాగుతోంది...
కాలం కదిలిపోతోంది...!
మరోవైపు...
బిడ్డ ఎదుగుతోంది...
ప్రతీ పుట్టినరోజు జరుపుకుంటోంది...
పాపం! ఆయువు తరుగుతోంది !!
అదేమిటో !ఆ తలంపే రాదెవ్వరికీ !!
కన్ను మూసి తెరిచేలోగా 
ముసలితనం పలుకరిస్తుంది...
మరణానికి సిద్ధం కమ్మంటూ  !!
అందుకే...త్వరపడు...
జారుతున్న క్షణాల్ని ఒడిసిపట్టు...
ప్రతీక్షణం విలువ లెక్కపెట్టు...
సద్వినియోగం చేసుకునే 
ప్రయత్నం మొదలెట్టు...👍

<><><><><><><><><><><><><><><><><><>>




 



Monday, December 16, 2024

ఒక్క క్షణం ఆగండి.. ఆలోచించండి...

 😪

<><><><><><><><><><><><><><><><><><>>

 *  ప్రేమ విఫలమై ప్రేమికులిద్దరూ రైలు పట్టాలపై ఆత్మహత్య!

 * అమ్మాయి తన ప్రేమనంగీకరించలేదని వ్యధతో పురుగుమందు తాగిన యువకుడు!

* పదవ తరగతి పరీక్షలో ఒక సబ్జెక్టు తప్పినందుకు అవమాన భారం భరించలేక  అమ్మాయి ఉరేసుకుని  ప్రాణం తీసుకున్న వైనం..!

* ఉద్యోగ వేటలో విసిగిపోయి ఒకరు , ప్రేమ పెళ్లి విఫలమై ఒకరు,తండ్రి మందలించాడని మరొకరు!!...

 ఇలా రకరకాల కారణాలతో నిండు జీవితాల్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్న యువత గురించి ప్రతిరోజు వార్తాపత్రికల్లో చదువుతున్నాం... టీవీల్లోనూ చూస్తూ ఉన్నాం...ఇలాంటి ఉదంతాల్ని వింటున్నప్పుడు...మనసంతా కాసేపు బాధతో నిండిపోతూ ఉంటుంది. ఈ మధ్య మరీ చిన్న పిల్లలు...అంటే మూడు, నాలుగు తరగతులు చదువుతున్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వార్తలు మరీ విడ్డూరంగా ఉంటున్నాయి. సెల్ ఫోన్ ఎక్కువగా చూడొద్దు  అన్నందుకు ఓ పిల్లవాడు తండ్రి మీద అలిగి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడట!!

  గర్భస్థ శిశువుగా ఉన్ననాటి నుండి మొదలైన తల్లి కలలు ఆ బిడ్డ తన ఒడి చేరిన క్షణం నుండీ అలా కొనసాగుతూనే ఉంటాయి. బిడ్డ బాల్యం, అల్లరి, వారి చదువు సంధ్యలు, క్రమక్రమంగా వారు ఎదిగే తీరు, వారి ముద్దు మురిపాలు...ఓహ్! తల్లిదండ్రులు వారి చుట్టూ అల్లుకునే ఆశల పందిరి వర్ణించడానికి మాటలు చాలవు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో.. అలా నిర్మితమవుతున్న వారి స్వప్న సౌధం కళ్ళముందు సాక్షాత్కరించే తరుణం ఆసన్నమవుతున్న క్షణాల్లో ఒక్కసారిగా భయంకరమైన కుదుపు..!! వారి కలలపంట, ఆశాజ్యోతి.. కొడుకు గానీయండి.. కూతురు గానీయండి... కళ్ళముందు హఠాత్తుగా నిర్జీవమై ఓ శవంగా వారి ముందు పడి గుండెల్ని పిండివేస్తే ఆ కోలుకోలేని దెబ్బ నుండి తేరుకోవడం జన్మలో వారి తరమా!!

   కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రమైనదే కావచ్చు.. కానీ అది తాత్కాలికమైనదే అని గ్రహించలేని విజ్ఞత వారిలో లోపించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక్కోసారి కాస్త సహనం వహిస్తే సమస్య దానంతకదే  పరిష్కారమవుతూ ఉండటం కూడా చూస్తూ ఉంటాం. అప్పటికప్పుడు పరిష్కారం దొరకని సమస్యల్ని గురించి కొంతకాలం ఆలోచించకపోవడం మంచిది. కాలం అన్ని గాయాల్ని, ఇంకా చెప్పాలంటే ఎలాంటి గాయాలనయినా మానేలా చేస్తుంది అంటారు కదా... అలాగే ఈరోజు భయంకరంగా తోచిన గడ్డు సమస్య కొద్ది రోజుల వ్యవధిలోనే దూదిపింజలా తేలిపోవచ్చు. అంత ఆందోళన పడింది దీని కోసమా అని కూడా అనిపిస్తుంది. ఆమాత్రం దానికి భగవంతుడిచ్చిన అపురూపమైన ఈ బ్రతుకుని తాత్కాలిక సమస్య కోసమని  శాశ్వతంగా ముగింపజేయడం సమంజసమా!!?

     పరీక్ష ఫెయిల్ అయితే మళ్లీ రాసి పాస్ అవ్వచ్చు. ఉద్యోగం ప్రయత్నం మీద ఏదో ఒక రోజు రాకపోదు. ఒకవేళ రాకపోయినా, బ్రతికి తీరాలి అనుకుంటే బ్రతుకుతెరువుకు బోలెడు మార్గాలు.. 

   ప్రేమ విఫలమైతే  అదే జీవితమా...చెప్పండి,! తల్లిదండ్రులతో పాతికేళ్ళు పెనవేసుకున్న బంధం ముందు కొద్దిరోజుల ప్రేమ బంధం విలువ ఎంత!? మీ మీదే  అన్ని ఆశలూ పెట్టుకున్న ఆ అమాయక ప్రాణుల గురించి క్షణమైనా ఆలోచించాల్సిన అవసరం పిల్లలకు ఉండాలా లేదా!!

  చావడం పిరికితనం కాదు. ఎంతో ధైర్యం కావాలంటూ ఉంటారు. సరే, ఆ ధైర్యమేదో బ్రతకడానికే తెచ్చుకోండి. ఏమైనా, ఒక్క విషయం.. ఈ బలహీన మనస్కులంతా గుర్తుంచుకోవాలి. చచ్చి సాధించేది ఏమీ లేదు. బ్రతికే సాధించుకోవాలన్న నగ్న సత్యం... జీవితం కాస్తా ముగిసిపోయాక ఇక చేసేదేముంది!!? తల్లిదండ్రులకు జీవితకాలం  భరించలేని వేదన తప్ప !!

   ఇలాంటి సున్నిత మనస్కులు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన తీవ్రతరమైనప్పుడు.. ఒక్క క్షణం..ఒకే ఒక్క క్షణం...ఆగిపోయి...ఆలోచించడం అన్నివిధాలా శ్రేయస్కరం.ఆ సమయంలో వారికి,

         " గతంలో మీరు సాధించిన చిన్న చిన్న విజయాలు, పొందిన ప్రశంసలు, మీ ఆశలూ, ఆశయాలు... మననం చేసుకోండి. మీపై మీకు నమ్మకం కలగకపోదు. అంతకుమించి.. మిమ్మల్ని కన్న అమ్మానాన్నల గురించి... మీరు లేకుండా పోయాక వారి పరిస్థితి ఏమిటి? ఒక్కసారి..మీ నిర్జీవ దేహంపై పడి గుండెలవిసేలా వారు రోదిస్తున్న దృశ్యం ఊహించుకోండి..చాలు..ఎన్నటికీ..మరెప్పటికీ ఆ తలంపే మీ ఊహల్లోకి రాదు. అదే మిమ్మల్ని మీ కర్తవ్యం దిశగా నడిపించేలా చేస్తుంది..."

అని చెప్పాలనిపిస్తోంది.

  బాల బాలికలు, యువతీ యువకులే కాదు వయసుతో నిమిత్తం లేకుండా ఈ దుశ్చర్యకు పాల్పడుతున్న ప్రతీవారు బ్రతుకుపై తీపినీ, రేపటి పై ఆశను  పెంచుకుంటే సమస్యల్ని తేలిగ్గా అధిగమించే మానసికస్థైర్యం వచ్చి తీరుతుంది.

  అందుకే..అందుకే...అలాంటివారందరికీ విజ్ఞులిచ్చే సలహా...

" క్షణికావేశం వద్దు..కాస్త ఆగండి.. ఆలోచించండి."

<><><><><><><><><><><><><><><><><><>>

                          యం. ధరిత్రీ దేవి 

<><><><><><><><><><><><><><><><><><>>

   

Sunday, December 8, 2024

నది... కథ

 *****************************************


☀️నిండుగా ప్రవహించే నది తనలోని సుడిగుండాల్ని, ఆటుపోట్లని  తనలోనే దాచుకొని ఎంతో గంభీరంగా, మరెంతో  ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. యమున కూడా ఈరోజు దాకా అందరి చేత ఓ నిండునది లాంటిది అనిపించుకొంది. జీవితాంతం అలాగే ఉండేదే కానీ... అనుకోకుండా ఆమెలో ఈరోజు అలజడి చెలరేగుతోంది. అందుకు కారణభూతమైన క్షణాలు ఎంత వద్దనుకున్నా ఆమెను మరీ మరీ కమ్ముకుంటున్నాయి.
    కన్నతల్లికి కన్నబిడ్డలంతా సమానమే అని అంటారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగడం తల్లి హృదయం భరించలేదంటారు. మరి ఇదెలా సంభవించింది ! 
   యమున ఇంటర్లో ఉండగానే ఆమె తండ్రి పెరాలసిస్ తో మంచం పట్టాడు. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆదాయం మరీ సన్నగిల్లింది. ఇంటికి పెద్ద కూతురు తనే. ముగ్గురు చెల్లెళ్లు, తమ్ముడు. యమున చదువు సాగడం దుర్లభమయింది. విధిలేని పరిస్థితి. కుటుంబ పోషణకై తనూ ఓచేయి వేయక తప్పలేదు. యమునకు తండ్రి కోలుకుని సంసారరధాన్ని యధా ప్రకారం మోస్తాడనీ, తన చదువు మళ్లీ కొనసాగుతుందనీ కొండంత ఆశ పెట్టుకుంది. కానీ త్వరలోనే అవి అడియాశలే అని కొద్ది కాలానికే తెలుసుకుంది. తండ్రి జబ్బు  ఆయనని మామూలు మనిషిని చేయలేదు కానీ, జీవచ్ఛవంగా మార్చి వదిలి వేసింది. 
      ఇక యమున నడుం బిగించక తప్పలేదు. తండ్రి అనారోగ్యం, ఎన్నడూ గడప దాటి  ఎరుగని తల్లి.  మరోవైపు.. ఇంకా బాధ్యతలు తెలియని తోబుట్టువులు...! యమునకు అనూహ్యంగా ఆశించని పెద్దరికాన్ని అంటగట్టాయి. చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి, దగ్గరలోని కాన్వెంట్ లో టీచర్ గా చేరింది. అంతే.. ఆ క్షణం నుండే ఆమె జీవన పోరాటం మొదలైంది. క్షణం తీరిక లేకుండా ఇంటా బయటా చేసి ఏదో ఒకలాగా నాలుగు రాళ్లు సంపాదించడమే ఆమె ధ్యేయమైపోయింది. అలుపెరుగని ఆ ప్రయాణంలో తీరా కాస్త సమయం దొరికి వెనక్కి తిరిగేసరికి... ఇంకేముంది !! తను ఎక్కడ ఉందో తనకే తెలియని అయోమయ స్థితి!
      ఇంట్లో ఉండే కష్టపడి క్వాలిఫికేషన్ పెంచుకుంది. జీతం పెరిగింది. ఉద్యోగ స్థాయీ పెరిగింది. ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి తన కష్టార్జితంతోనే  జరిపించింది. తమ్ముడి చదువు కూడా ఓ కొలిక్కి వచ్చింది. ఈరోజో రేపో వాడూ ఓ ఉద్యోగి అవుతాడు. ఇక చిన్న చెల్లెలు ఒక్కతి ఉంది. దానికి కూడా త్వరలోనే ఏదో ఒక సంబంధం చూసే ప్రయత్నంలో ఉంది. అంతా స్థిరపడినట్లే.. కానీ, తనకే..ఎందుకో ఇన్నేళ్ల తర్వాత తనూ ఓ ఆడపిల్లనే అనీ,  తనకూ ఓ మనసనేది ఉందనీ గుర్తుకొస్తోంది. దానికి కారణమూ లేకపోలేదు. కొద్దికాలంగా చిన్ననాటి నుండీ తనతో సన్నిహితంగా  మెలిగే స్నేహితురాలు సంధ్య తనతో అంటున్న మాటలు...
" ఎంతకాలం ఇలా ఉంటావు యమునా.. నీ వాళ్ళ బాగోగులు చూడాలి సరే.. కానీ నీ గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత  వాళ్లకు లేదంటావా!? అప్పుడే నీకు ముప్పై దాటిపోయాయి. తమ్ముడు, చెల్లెళ్లు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇకనుంచి అయినా నీ గురించి నీవు ఆలోచించుకోరాదా..."
     ఒక్కసారి కాదు యమున కలిసిన ప్రతిసారీ ఈ ప్రసక్తి తీసుకురాకుండా ఉండలేకపోయేది సంధ్య. అప్పట్లో ఆమె మాటలు తేలిగ్గా కొట్టి పారేసేది యమున. కానీ ఈ మధ్య ఎందుకో ఏదో తెలియని దిగులు.., వెలితి ఆమెను చిన్నగా వేధించడం మొదలు పెట్టాయి. క్రమక్రమంగా ఆమె ఆలోచనలు ఆ కోణంలో సాగడం మొదలైంది.
      సరిగ్గా అప్పుడే ఆమెకు తట్టింది.. అవునూ... సంధ్యకు వచ్చిన ఆలోచనలు కన్నతల్లిగా నా తల్లికీ వచ్చి ఉండాలి కదా..! కానీ ఎందుకో అమ్మ నా పెళ్లి గురించి ప్రస్తావించడం గానీ బాధపడడం కానీ చూడలేదు తను. అయినా పైకి ఎలా చెప్పుకోవాలో తెలియక లోలోపల ఆమె నా గురించి ఎంత కుమిలిపోతూ ఉందో ఎవరికి తెలుసు!! అనుకుందామె అంతరంగం.
" ఏది ఏమైనా నేనూ స్థిరపడాలి జీవితంలో... "
 ఎంతో అంతర్మధనం తర్వాత ఓ స్థిర నిశ్చయానికి వచ్చింది యమున.
                       **           **             **
     ఆ తర్వాత కొద్ది రోజులకే సంధ్య నుండే ఆమెకో ప్రపోజల్ వచ్చింది.
" యమునా, నీ పరిస్థితిని అవకాశం గా తీసుకొని ఈ సంబంధం గురించి చెప్తున్నానని దయచేసి నీవు అనుకోవద్దు. అతను వరుసకు నాకు కజిన్ అవుతాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇద్దరు పాపలున్నారు.ఆరేళ్లు, నాలుగేళ్లు ఉంటాయి.భార్య జబ్బుతో కొద్దికాలం క్రితం చనిపోయింది. నేను చెప్పడం కాదు గానీ మనిషి చాలా మంచివాడు. సర్దుకుపోయే మనస్తత్వం. నీ గురించి చెప్పాను. నీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడమన్నాడు. అతనికి తన పిల్లలంటే ప్రాణం. మళ్లీ పెళ్లి చేసుకుంటే వారికి అన్యాయం జరుగుతుందని ఆ ఊసే లేకుండా ఉన్నాడు. కానీ నీ గురించి నేను చెప్పాక, సరే అన్నాడు. నీవు గనక ఒప్పుకుంటే నీ జీవితం ఓ దారిలో పడినట్లే... యమునా, ఇంక ఏమీ ఆలోచించకు... "
     ఆ తర్వాత కొద్ది రోజులు ఆ సంబంధం గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది యమున. మరుసటి వారం అతను రానే వచ్చాడు యమునను చూడటానికి. పెళ్లిచూపుల తతంగమేమీ లేకుండా ముందుగా అనుకున్న విధంగా ఓ పార్కులో కలిశాడు.
" మళ్లీ వివాహం చేసుకోవాలన్న ఆకాంక్ష నాకు లేదు. కానీ సంధ్య మీ గురించి మరీ మరీ చెప్పింది. మీ సహనం, ఓర్పు, త్యాగగుణం... ఇవన్నీ నాకు నచ్చాయి. నా పిల్లలకి మళ్ళీ తల్లి దొరికితే చాలని నేను కోరుకుంటున్న తరుణంలో మీరు తటస్థపడటం నా పిల్లల అదృష్టంగా భావిస్తున్నాను... "
 యమున ఏమీ మాట్లాడలేదు. పది నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు త్వరలో ముహూర్తాలు  పెట్టిస్తాను అంటూ. యమునకూ అభ్యంతరం చెప్పడానికి ఏ కారణం కనిపించలేదు. తనను వెతుక్కుంటూ సంబంధం రావడమే గొప్ప. పిల్లలుంటేనేం.. నాకూ ఓ ఇల్లంటూ ఏర్పడుతుంది అనుకుంది.
    ఇంతవరకూ జరిగిన విషయాలు ఇంట్లో ఎవరికీ తెలియదు. ఈరోజు చెప్పాలనుకుంటూ లేచి ఇంటి దారి పట్టింది.
                        **           **           **
"  యమున పెళ్లికి ఇప్పుడు ఏం తొందర అన్నయ్య? చిన్నదాని పెళ్లయిపోతే, అబ్బాయి గురించి దిగులు ఏముంటుంది గనక!అందుకే... ఇప్పుడు యమునకు మీరు తెచ్చిన సంబంధాన్ని చిన్న దానికి చూద్దాము. ఇక యమున అంటారా... దాన్ని ఎప్పుడూ మేము కూతురుగా చూడలేదు. ఈ ఇంటి పెద్ద కొడుకు గానే భావించాము. పైగా దానికి పెళ్లీడు కూడా  దాటిపోయింది. ఎలాగూ ఉద్యోగం ఉంది కాబట్టి దాని జరుగుబాటు గురించి ఆలోచన లేదు. అలాగని దానికి పెళ్లి వద్దని అనడం లేదు. కాకపోతే ఈ చిన్న పిల్ల బాధ్యత తీరిపోతే నాకు నిశ్చింతగా ఉంటుంది..ఆతర్వాత...యమున రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది...ఏమీ అనుకోక ముందు చిన్నదాని సంగతి చూడండి అన్నయ్యా... "
     అప్పుడే గుమ్మంలో కాలు పెట్టబోతున్న యమున చెవిలో తల్లి మాటలు పడనే పడ్డాయి. ఆమెలో ఒక్క సారిగా భూమి,ఆకాశం బద్దలౌతున్న అనుభూతి!!
                    **         **             **
   సమయం రాత్రి పదకొండు దాటింది. యమునకు కంటిమీద కునుకు పట్టడం లేదు.. పదేపదే తల్లి మాటలు చెవుల్లో మార్మోగుతూ ఆమె గుండెల్ని పిండి వేస్తున్నాయి. కన్నతల్లిలో ఇంతటి స్వార్థమా! కూతురు గురించి ఇంత కఠినంగా ఆలోచించే మాతృ హృదయం కూడా ఉంటుందా! ఇంతకాలం కేవలం నన్ను  మిగతా పిల్లల అభివృద్ధికే చేయూతగా వాడుకున్నారా!! ఆమె మెదడు మొద్దు బారి పోయింది.
   ప్రస్తుతం ఆమెలో చెలరేగుతున్న అలజడికి అదే కారణం. మునుపెన్నడూ స్పందించని రీతిలో ఆమె హృదయం   తల్లడిల్లి పోసాగింది. ఆ స్థితిలో కొద్ది రోజులపాటు వేదనతో ఊగిసలాడిన ఆమెలో ఓ నిర్ణయం రూపు దిద్దుకుంది. ఆతర్వాత కాగితం, కలం తీసుకుని రాయడం మొదలెట్టింది.
డియర్ సంధ్యా,
         నా గురించి నీవు పడిన తపన రక్తం పంచుకు పుట్టిన నా తోబుట్టువుల్లో నేనెన్నడూ చూడలేదు. నా సంపాదనలో ప్రతి పైసా వారి కోసమే ఖర్చు చేశాను. కానీ ఎన్నడూ వారి కళ్ళలో నా పట్ల కృతజ్ఞతగానీ, ప్రేమ భావంగానీ నేను ఎరుగను. మా అక్క తమ అందరికోసం ఆహుతైపోతోందన్న ఆలోచన, బాధ వారిలో ఏ కోశానా ఎప్పుడూ నాకు కనిపించలేదు. ఇప్పుడు నన్ను పెళ్లాడాలనుకున్న  వ్యక్తి నన్ను తన పిల్లల కోసమే తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు తప్ప నన్ను నన్నుగా కాదు. అతను నాతో మాట్లాడిన కొద్ది నిమిషాలు తన పిల్లల గురించి తను ఎంతగా ఆరాటపడుతున్నాడో చెప్పాడే గానీ నా గురించి, నా జీవితం గురించీ అతనికి ఏ ధ్యాస ఉన్నట్లు నేను గుర్తించలేదు. ఇంతవరకూ నా జీవితం, జీతం నా వాళ్ళు అనుకున్న వాళ్లకోసం  ఖర్చుచేశాను. ఇకనుంచీ అతని సంబంధీకుల కోసం చేయాలి. వద్దు సంధ్యా, నన్ను ఇలా బ్రతకనివ్వు. ఇలా మాట్లాడుతున్నందుకు అన్యధా భావించకు. నేను చాలా అలసిపోయాను. ఇక మీదటైనా నా జీవితం నా కోసమే అనుకుంటున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను చాలా ఆలోచించాను సంధ్యా. నా ఆలోచనలకు సరిపడే వ్యక్తి తటస్థిస్తే తప్ప పెళ్లి గురించి ఆలోచించను. జీవితంలో పెళ్లి ఒక భాగమే. పెళ్లే జీవితం కాదు. జీవిత పరమార్ధమూ కాదు. నా వ్యక్తిత్వం నిలబడాలి. నా జీవితం కేవలం నాదే కావాలి. మరెవరి కోసమో కాదు.సహనం, ఓర్పు ఉండాలి, నిజమే.. కానీ, అది హద్దుల్లో ఉంటేనే బాగుంటుందని స్వానుభవంతో తెలిసొచ్చింది.కాస్త ఆలస్యం అయిందంతే.అంతో ఇంతో స్వార్థమన్నది మనిషికి అవసరం కూడా.నదిలో ఎన్ని లొసుగులున్నా నిండుగానే ప్రవహిస్తూ ఉంటుంది. కానీ, ఉప్పొంగితేనో !! ఈ యమున కూడా అంతే ! నా కోసం నీవు ఎంతో ఆలోచించావు. కానీ నన్ను అర్థం చేసుకుంటావన్న నమ్మకంతో ఉన్నాను.బాధనిపిస్తే క్షమించు.నా నిర్ణయం నీవు హర్షిస్తావని ఆశిస్తూ...
                                                  స్నేహమయి 
                                                     నీ యమున 
*****************************************
       [ వనితా జ్యోతి మాసపత్రికలో ప్రచురితం ]
*****************************************





Tuesday, December 3, 2024

" చిన్నారి" మనోభావాలు..ఇష్టం..మాకిష్టం.

  ****************************************

      🙋‍♀️[ బడికి వెళ్లే బాలల మనోభావాలు ] 💁

                        యం. ధరిత్రీ దేవి 

 ****************************************

🙆‍♂️👩‍🎤🙋‍♂️🙅‍♂️🙋‍♀️🙋‍♂️👩‍🎤🙆‍♂️🙋‍♀️🙅‍♂️🧑‍🎤👨‍⚖️👩‍⚖️🧑‍💼👩‍🚀

****************************************

 ఇష్టం.. ఇష్టం.. మాకిష్టం...

 ఆదివారం మాకు చాలా చాలా ఇష్టం🧑‍💼

 ముందు రోజు శనివారం మరీ మరీ ఇష్టం...

 మరురోజు వస్తుందిగా మరి...ఆదివారం.. 🙂

 హోంవర్క్ తో కుస్తీలు..పాఠాలతో కసరత్తులు...

 బడిగంటల చప్పుళ్ళు..టీచర్ల అదిలింపులు...

 అన్నీ బంద్..! ప్రకటిస్తాం విరామచిహ్నాలు..!!

 ఉదయం లేస్తాం గంట ఆలస్యం..

 అయినా అమ్మకు రానే రాదు కోపం...🤱🧑‍🎤

 నాన్నక్కూడా...మా తర్వాతే లేస్తాడు మరి!!😄

 అదేమంటే..నాకూ ఆదివారమేగా...

 అంటాడు అమ్మతో ముసిముసిగా...

 నాకు కాదా...అంటుంది అమ్మ రుసరుసలాడ్తూ.. 

 స్పెషల్ బ్రేక్ ఫాస్ట్...ఉప్మా పెసరట్.

 లేదా..ఇడ్లీ..వడ.. సాంబార్..

 అమ్మ చేస్తే మహ టేస్ట్👌

 మధ్యాహ్నం వేడివేడి లంచ్...😋

 అదిరిపోయే డిషెస్ 🙋‍♂️...ఆపై...

 Watching TV.. Playing Video games..

 No restrictions...No orders..!!

 అంతా మా ఇష్టం...మాదే రాజ్యం..

 సాయంత్రం చిరుతిళ్ళు...🥪🥯

 మా వీధి నేస్తాల్తో...చెట్టపట్టాలు.🙅‍♂️🙆‍♂️🚴‍♂️🤽

 సందడే సందడి...అల్లరే అల్లరి...🧑‍🎤🙋‍♀️

 వారానికి సరిపడా 'రీఛార్జ్..'

 ఐపోతాంగా భేషుగ్గా...🫠

 రాత్రి 'గుడ్ బై' తో వీడ్కోలు...🙋‍♀️🙋‍♂️

 సోమవారానికి పలుకుతాం... 

 స్వాగతాలు ( అయిష్టంగానే ).. 🧑‍💼👩‍⚖️

 అందుకే...ఆదివారం మాకు 

 ఎంతో ఎంతో ఇష్టం..కానీ..

 అమ్మకే పాపం! పనులెక్కువై కష్టం..🤱

 అయినా..మా ఇష్టం అమ్మకూ ఇష్టం..

 కష్టమైనా తనకూ మహా మహా ఇష్టం...🙂

 అందుకే...అమ్మంటే మాకు అంతులేని ఇష్టం🥰🤗

💁‍♀️🙋‍♂️🙇💁🙆🙆‍♂️🤷‍♂️🙋‍♂️👩‍💼👩‍🎨👩‍🎤🧑‍💼👩‍⚖️🙋‍♂️👩‍🎤🙋‍♀️

***************************************

 


Saturday, November 30, 2024

మార్పు

••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
                           ~యం. ధరిత్రీ దేవి                    
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

పచ్చపచ్చని చెట్లగుబుర్లలో...
సాయంసంధ్యా సమయాల్లో...
తీయతీయని కబుర్లతో...
కాలం గడిపిన ఆ క్షణాల్లో...

నీ కులం ఆడ... 
నా కులం మగ...
లేదే అడ్డుగోడ 
మన ఇద్దరి నడుమ..!
అన్నాడా ప్రేమ పిపాసి...
         
ఋతువులు మారాయి...
ఆకులు రాలాయి...
సొగసులు ఉడిగాయి... 
కబుర్లు మలిగాయి...

నీదో కులం.. నాదో కులం...
నేను నింగి... నీవు నేల...
మన ఇరువురి నడుమ 
మా అమ్మా నాన్న పెట్టని గోడ!!
నీకూ నాకూ తీరిపోయె ఋణం...
గుడ్ బై నేస్తం...!
అన్నాడా కాముకుడు..!!
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
         [ వనితా జ్యోతి' మాస పత్రికలో ప్రచురితం ]
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

Sunday, November 24, 2024

'విత్తనం నేను' !!

🌳🌴🌳🌴🌳🌴☘️🌿🌲🌳🌴🌲🌳🌴🌲☘️
                                 
                                             యం. ధరిత్రీ దేవి 
                                            
'విత్తనం' నేను ! 
వింతలెన్నో సృష్టిస్తా !! 🙂
మట్టిలో పెడితే.. 
మొలకనై వస్తా !
చారెడు నీళ్లిస్తే.. 
చిగురిస్తా.. చెట్టునవుతా !
విరబూస్తా...విరులిస్తా..
నెలతల నెచ్చెలినవుతా .. 
ఫలాలిస్తా..ఆకలి తీరుస్తా..
ధాన్యమిస్తా..ధనమిస్తా..
రైతు నేస్తాన్నవుతా.. 
నీడనిస్తా..సేద దీరుస్తా..
సేవలందిస్తూ..సాయపడతా...
గాలినిస్తా...ప్రాణదాతనవుతా... 
ఔషధాన్నవుతా...
ఆయుర్వేదమై..ఆయువుపోస్తా... 
దేవతనవుతా..వరాలిస్తా..
వర్షాలూ కురిపిస్తా..
ఎండిపోతే.. కలప నవుతా..
నీ ఇంటి మూల స్తంభాన్నవుతా...
కాగితాన్నవుతా.. 
కథల పుస్తకాన్నవుతా...
రకరకాలుగా అలరిస్తా...
రాగాలూ పలికిస్తా.. 🙂
మీకోసమే జీవిస్తా.... 
మీకోసమే మరణిస్తా.... 
ప్రకృతిలో కలిసుంటా.. 
ప్రతీ చోటా ప్రత్యక్షమవుతా !
నా ఉనికి ఊరికి  అందం...
నా ఊహ  మదికి ఆహ్లాదం..!!
పచ్చదనానికి నేనే 
చిరునామా నంట !!
పరిసరాల కాలుష్యం 
పరుగో పరుగంట..🙂

[విరివిగా నాటండి విత్తనాల్ని..చక్కగా పెంచండి మొక్కల్ని.. ప్రగతికి మెట్లు చెట్లు.. మరవకండి 🙏 ]

🌳🌴🌳🌴🌳🌴🌴🌴🌳🌴🌳🌴🌳🌴🌳🌴






Monday, November 18, 2024

భూమాతా... నీకిదే వందనం 🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

                                ~ యం. ధరిత్రీ దేవి 

కొండలు తవ్వి కోటలు కడుతున్నా...

గునపాలు గాయాలు చేస్తున్నా...

గరళం గొంతులో నిండిపోతున్నా...

పెదవి విప్పదు...చలించదు...

ఆనకట్టలు కట్టి అలవికాని భారమైనా..

ఆక్రోశించదు.. అసహనం అసలుండదు...

వటవృక్షాల వేళ్ళు గుండె లోతుల్లోకి 

చొచ్చుకుని గుచ్చుకుంటున్నా.. 

చిరునవ్వులు చిందిస్తుంది...

పర్వతాల్ని భుజాలపై మోస్తుంది...

సముద్రాల్ని కడుపులో దాచేస్తుంది...

పంటలు పండిస్తుంది... 

పశుగ్రాసాన్నిస్తుంది...

అందరి కడుపులు నింపుతుంది...

అందరికీ ఆవాసాన్నిస్తుంది...

స్వార్థపూరిత మనుషుల చేష్టల్ని 

పసిపిల్లల అల్లరి అనుకుని 

నవ్వుకుంటుంది...క్షమిస్తుంది... 

అన్నీ భరిస్తుంది...అంతా సహిస్తుంది..

ధరణికి కాక మరెవరికుంటుంది..

ఇంతటి ఓరిమి...!! భూమాతా !

నీకిదే వందనం... పాదాభివందనం...🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹






Sunday, November 10, 2024

కొత్తదారి... చిన్న కథ

 [ 'వనితాజ్యోతి' మాసపత్రికలో ప్రచురింపబడ్డ నా రచన ]

" పెళ్ళై ఇన్నాళ్లవుతోంది, ఓ అచ్చటా లేదు, ముచ్చటా లేదు. అయినా ఎవర్ననుకుని ఏం లాభం? మా అదృష్టాలిలా తగలడ్డప్పుడు... "

ఆ ఉదయం రుసరుసలతో మొదలైన వర్ధనమ్మ వ్యాఖ్యానం మిట్ట మధ్యాహ్నం అయేసరికి తారస్థాయినందుకుంది.ఆ ఇంట్లో అందరి ప్రాణాలూ ఆమె వాగ్దాటిని ఆలకించటమే తప్ప ఎదుర్కోవటానికి సాహసించనివి.

   అలాంటి లోగిట్లోకి దాదాపు సంవత్సరం క్రితం విరిసిన గులాబీ లాంటి వాసంతి వచ్చిపడింది. ముగ్గురు ఆడపిల్లల తర్వాత నాలుగో ఆడపిల్లగా ఓ పేద ఇంట్లో పుట్టిన ఆ పిల్లకు సర్దుబాటు అన్నది వెన్నతో పెట్టిన విద్యే. ఆ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుండీ అడుగడుగునా అన్నింటికీ సర్దుకుపోతూనే ఉంది. వారసత్వంగా పుట్టింటి నుంచి సంక్రమించిన దరిద్రంతోపాటు సంస్కారమనే అమూల్యమైన ఆస్తి కూడా ఆమెతో బాటే వెన్నంటి ఉంది. అందుకనే అణకువతో అన్నీ భరిస్తూ వస్తోంది. అయినా ఆమెకు అర్థం కానిది ఒక్కటే... ఆ ఇంట్లో మగవాళ్ళంతా ఎందుకిలా  నోట్లో నాలుక లేని వాళ్ళలా ఉంటారు?! ఒక ఆడ మనిషి అలా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే వీళ్లంతా ఎందుకలా మౌనవ్రతం దాలుస్తారు !?

    చిలికి చిలికి గాలి వానగా మారి, ఆ రాత్రి భోజనాల వద్ద అత్తగారి నోటి నుండి మాటల తూటాలు ఎక్కుపెట్టిన విల్లు నుండి వదిలిన బాణాల్లా వచ్చి వాసంతి గుండెలు తూట్లు పొడిచాయి.

" ఇదిగోరా, నీవిలా దేభ్యంలా ఉండటం నేను చూడలేను. ఈ ఇంట్లో అంతా సంపాదించే వారే... నీవు తప్ప.. నీకు ఉద్యోగం దొరికేదెన్నడో ఏం పాడో.. నిన్ను సరే తప్పదు, నీ పెళ్ళాన్ని కూడా సాకాలంటే  కుదిరే పని కాదు. ముష్టి కట్నం ముక్కుతూ,మూల్గుతూ  ఇదిలించడానికి నీలిగారు. కనీసం ఉద్యోగానికి కావాల్సిన పైకమన్నా తెమ్మని దాన్ని పుట్టింటికి తోలడమో, లేక తన్ని తగలెయ్యడమో... ఏదో ఒకటి తేల్చేయ్... "

 తలవంచుకుని భోంచేస్తున్న భర్త శంకర్ ను తలుపు చాటు నుండి కళ్ళెత్తి చూసింది వాసంతి. దించుకున్న అతని మొహంలో భావాలేవీ ఆమె చదవలేకపోయింది. అతనితో పాటు భోంచేస్తున్న తండ్రి, అతని ఇద్దరు అన్నలు, తమ్ముడు ఇదేం పట్టించుకోవాల్సిన విషయం కానట్లు యధాలాపంగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. వంటింట్లో పాత్రలు సర్దుతున్న తోడికోడళ్ళు  " ఇదేం మాకు కొత్తా..!" అన్నట్లు నర్మగర్భంగా ఒకరిపై ఒకరు చూపులు గుప్పించుకున్నారు. వీటన్నింటికీ అతీతంగా వర్ధనమ్మ వాగ్ధాటి కొనసాగుతూనే ఉంది.

                        ***          ***          ***

   గదిలో భర్త అడుగుల చప్పుడు గ్రహించిన వాసంతి గుండె చిక్కబట్టుకొని మరింత బిగదీసుకుని పడుకుంది.జరగబోయే పరిణామం ఎలాంటిదైనా సరే... ఎదుర్కోవడానికి ఆమె మానసికంగా ఎప్పుడో సిద్ధపడేఉంది.

" వాసంతీ, "

 ఆ పిలుపులోని ఆర్ద్రత ఆమెకు కొత్తగా అనిపించింది.

" నా ప్రవర్తన నీకు బాధాకరంగా ఉందని తెలుసు. కానీ నేను నిస్సహాయుణ్ణి. అన్నలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. నాకా... చదువు పూర్తయి  ఇనేళ్ళయినా ఏ చిన్న పనీ దొరకడం లేదు. మా అమ్మకు మేము ఎవరము ఎదురు చెప్పలేము.  అట్టడుక్కుపోయిన సంసారాన్ని ఆమె తన రెక్కల కష్టంతో ఇంత ఎదిగేలా చేసింది. కొడుకులే ఆమె లోకంగా వాళ్ళ చుట్టూ ఎన్నో ఆశల్ని అల్లుకుంది.  ఫలితం! వాళ్ల మీద తనకు తప్ప మరెవ్వరికీ హక్కు ఉండరాదన్న భావం ఆమెలో పాతుకుపోయింది..." 

 మౌనంగా వింటున్న వాసంతితో చెప్పుకుంటూ పోతున్నాడు శంకర్.

"...మా అమ్మకు నేను అడ్డు చెప్పలేను... అలా అని ఆమె చర్యల్ని హర్షించనూలేను. ఈ ఇంట్లో నేను నీకు ఏ న్యాయం చేకూర్చలేను..."

 భర్త అంతరంగం ఏమిటో అర్థం కాక, బేలగా అతని కళ్ళలోకి చూసింది  వాసంతి. ఆ కళ్ళల్లో బెదురు చూసిన అతను ఆమెను దగ్గరకు తీసుకుంటూ,

"... కానీ, ఎవరికీ ఏ బాధ లేని మార్గం ఒకటి చెప్తాను. నీవు రేపే నీ పుట్టింటికి వెళ్ళు. అక్కడే ఉండి ఫైనల్ ఇయర్ తో ఆగిపోయిన నీ డిగ్రీ చదువు పూర్తి చెయ్. ఇక్కడ నుండి డబ్బు తెమ్మన్నారని మీ వాళ్ళతో నీవు చెప్పాల్సిన అవసరం లేదు. నీ కూడా వచ్చి నేను దిగబెడతాను. అదీ మా అమ్మకు తెలియకుండానే... నీవు డిగ్రీ పూర్తి చేసే లోగా నాకు ఏదైనా ఉద్యోగం దొరక్కపోదు. అంతవరకూ ఓపిక పట్టలేవా...!"

 కరడుగట్టి పోయిందనుకున్న అతని మనసులో ఇంతటి ఆర్ద్రత, అంతులేని లోతైన ఆలోచన దాగి ఉన్నాయని ఆమెకాక్షణంలోనే తెలిసింది.ఆ సంభ్రమం నుండి తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది వాసంతికి. భార్య భుజం మీద చేయి వేస్తూ కొనసాగించాడు శంకర్.

"... అటు కన్నతల్లినీ, ఇటు కట్టుకున్న భార్యనూ బాధ పెట్టడం ఇష్టం లేక మధ్యలో నలిగి పోతున్న నన్ను అర్థం చేసుకుంటావనే ఇన్నాళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఏమిటి, వాసంతీ, అంతదాకా నాకోసం సహనంతో వేచిఉండలేవా?"

ఆమెను కుదుపుతూ అడిగాడు కళ్ళలోకి చూస్తూ.

"మీ అండ నాకుంటే అంతదాకా ఏమిటి, ఈ జన్మంతా వేచి ఉండమన్నా ఉంటాను..."

 సంతోషం పట్టలేక, కన్నీళ్లు ధారగా కారుతుండగా భర్తను రెండు చేతులతోనూ చుట్టేసింది వాసంతి. ఆ సమయంలో ఆమెకు అతనో సరికొత్త దారిలో పయనిస్తూ గమ్యం వైపు సాగిపోతున్న బాటసారిలా గోచరించాడు...

******************🥀🥀🥀****************

Thursday, November 7, 2024

ప్రతిస్పందన... కథ

    మధ్యాహ్నం రెండయింది. సెల్ మోగుతోంది. అసహనంగా చూసింది  మైత్రి. విశ్వ మోహన్ ! ఈ రోజు ఇది ఐదో  ఫోన్ కాల్. విసుక్కుంటూ చేతిలో ఉన్న సెల్ తీసి  బ్యాక్ లో పడేసి కణతలు నొక్కుకుంటూ కూర్చుండిపోయింది. 
    విశ్వ  మోహన్ కూ, మైత్రికీ నిశ్చితార్థం జరిగి రెణ్ణెళ్లయింది. అతను స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో మంచి హోదా కలిగిన ఉద్యోగంలో ఉన్నాడు. చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. కూతురి పెళ్లి చేసేశారు. ఉద్యోగంలో చేరి రెండేళ్లు అవుతోంది. ఎన్నో సంబంధాలు చూసి చూసి,  చివరికి మైత్రిని ఓకే చేసి తాంబూలాలు పుచ్చేసుకున్నారు. కొన్ని నెలల వరకూ మంచి రోజులు లేవంటూ అప్పటికి నిశ్చితార్థం మాత్రం  చేసుకున్నారు.
     మైత్రి సంవత్సరం క్రితం ఓ బ్యాంకులో క్లర్క్  గా చేరింది. అమ్మానాన్నలకు తా నొక్కతే. తండ్రి ఓ ఆఫీసులో హెడ్ క్లర్క్ గా పనిచేసి ఈమధ్యే రిటైర్ అయ్యాడు. మైత్రి అందంగా ఉంటుంది. చూడగానే విశ్వమోహన్, తల్లిదండ్రులు, అక్క సంతృప్తిగా తలాడించేశారు. అంతా మైత్రి  చాలా అదృష్టవంతురాలన్నారు, అంత పెద్ద సంబంధం కుదిరి నందుకు. తల్లిదండ్రులతో పాటు తానూ సంతోషించింది. కొద్ది రోజులు ఆ సంతోషంలోనే ఉండిపోయారు ముగ్గురూ. కానీ, ఓ నెల రోజులు గడిచేసరికి మైత్రి లో చిన్నగా ఏదో అసంతృప్తి పొడసూపడం   మొదలైంది. మరో నెల గడిచేసరికి అది  రెట్టింపయింది. ఈ రెన్నెళ్ల  కాలంలో విశ్వ మోహన్ మనస్తత్వం ఆమెకు  పూర్తిగా అవగతమైపోయింది. అతను పూర్తిగా డామినేటింగ్ క్యారెక్టర్. అన్నీ తను చెప్పినట్టుగానే, తన ఇష్ట ప్రకారమే జరగాలి అనుకునే రకం. అతని ఈ ధోరణే మైత్రికి ఎంత మాత్రమూ  మింగుడు పడడం లేదు. ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళ ఇంటికి రమ్మనడం, తనకు ఈ రోజు వీలు కాదని చెప్పినా బలవంతంగా రప్పించడం. ఏ విషయంలోనైనా తన అభిప్రాయం వెలిబుచ్చితే దాన్ని  ఖండించడం, తనే రైటు  అన్నట్లు వాదించడం-- ఇలా అన్ని విషయాల్లో తనదే పైచేయిగా ఉండాలని పట్టుబట్టడం! అతని ప్రవర్తన నిశితంగా గమనించిన మైత్రి గ్రహించిన విషయం, అతనికి భార్య అంటే కేవలం భర్త చేతిలో ఓ కీలుబొమ్మ. తను చెప్పిన ప్రతిదానికీ తలాడించాలన్న వితండవాదం ! ఆమెకంటూ ఓ అభిప్రాయం, అభిరుచీ ఉంటాయన్న ఇంగితం ఏమాత్రం లేకపోవడం!  పైగా ఆమె చదువు, ఉద్యోగం -- ఇవన్నీ అతనికి చాలా అల్పంగా తో స్తున్నాయి. అది   ఆమెకు మరీ బాధాకరంగా అనిపిస్తోంది. 
    మైత్రి ఊహ తెలిసినప్పటి నుంచీ తనకంటూ ఓ వ్యక్తిత్వంతో పెరిగిన అమ్మాయి. మధ్యతరగతి కుటుంబం అయినా తల్లీ తండ్రీ  ఆమెను ఏనాడూ శాసించలేదు. అలా  అని ఆధునిక పోకడలూ ఆమెలో పెద్దగా ఏమీ లేవు. కాకపోతే ఆడపిల్ల అయినంత మాత్రాన ఆత్మాభిమానమన్నది ఎప్పుడూ కోల్పోరాదని ఆమె వాదం. ఆ మాటకొస్తే విశ్వమోహన్ వాళ్లదీ మధ్యతరగతి కుటుంబమే. కాకపోతే అతని తండ్రి ఉద్యోగ స్థాయి ప్రమోషన్ల వల్ల బాగా పెరగడం, ఆస్తులు కూడబెట్టుకోవడం, కూతురికి మంచి సంబంధం కుదరడం, దానికి తోడు చిన్న వయసులోనే విశ్వ  మోహన్ కు  గెజిటెడ్ స్థాయి ఉద్యోగం రావడం-- ఇవన్నీ వాళ్ల స్థాయిని ఇట్టే పెంచేశాయి. దాంతోపాటు వాళ్ల మనస్తత్వాలు  కూడా  దర్పాన్ని సంతరించుకున్నాయి. 
    మైత్రి  అభీష్టానికి పూర్తి వ్యతిరేకంగా విశ్వ మోహన్ ఉండడం ఆమెకు లోలోపల ముల్లు గుచ్చుతున్నట్లుగా ఉంది. రాను రాను అంతః సౌందర్యం ఎంత మాత్రమూ  లేని అతని బాహ్య  సౌందర్యం మీద ఓ రకమైన ఏవగింపు కూడా కలుగుతోందామెకు. 
    నిశ్చితార్థం అయ్యాక తను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్లింది. ఓసారి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగా లేదంటే అమ్మానాన్నలు కూడా వెళ్లి పరామర్శించి వచ్చారు. కానీ తాను మాత్రం ఒకసారి అతన్ని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే, 
" ఇప్పుడెందుకులే , పెళ్ళయ్యాక ఎలాగూ  తప్పదు కదా, " అంటూ దాటేశాడు. మరి ఈరూల్ నాకు మాత్రం వర్తించదా! అనుకుంది మైత్రి.  ఇలా ఆమె కొద్దిరోజులుగా ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే ఓ రాత్రి అనుకోని సంఘటన జరిగింది.
   ఆరోజు రాత్రి పదకొండయి ఉంటుంది. మైత్రి నాన్నగారు పడుకున్న వాడల్లా హఠాత్తుగా  గుండె పట్టుకొని లేచారు, నొప్పిగా ఉందంటూ. ఎంతకీ సర్దుకోక, తల్లీకూతుళ్లిద్దరూ భయంతో వణికి పోయారు. మైత్రే తేరుకుని, బయటికి వెళ్లి పొరుగున ఉన్నవాళ్ళ తలుపు తట్టి,విషయం చెప్పి, వాళ్ల సహాయంతో ఆ అర్ధరాత్రి ఆటోలో ఆయన్ని అతి కష్టం మీద ఓ ప్రైవేట్ హాస్పిటల్  కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. మరుసటి రోజు ఉదయం ఫోన్ చేసి, విశ్వమోహన్ కు విషయం చెప్పింది మైత్రి.
" అవునా, అలాగా... ఇప్పుడెలా ఉంది? పర్వాలేదుకదా? "
 అన్నాడతను. ఆ గొంతులో పెద్దగా ధ్వనించని ఆదుర్దా మైత్రిని కలవరపెట్టింది. రెండో రోజు సాయంత్రం వచ్చి, కాసేపు ఉండి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో మైత్రికి సహాయమేదైనా కావాలేమో అన్న యోచన అతనికి రాకపోవడం ఆమెను ఆశ్చర్యానికి లోనుచేసింది. 
   ఆయనకు హార్ట్ ఎటాక్ మొదటిసారి. ICU లో ఉంచారు. దగ్గరి బంధువులు కొందరు వచ్చి పరామర్శించారు.  మూడు రోజులు గడిచిపోయాయి. అలా ఉండగా నిన్న
 సాయంత్రం విశ్వ మోహన్ ఫోన్ చేసి చెప్పాడు, 
" మైత్రీ, రేపు సాయంత్రం మా అక్క కూతురు మొదటి పుట్టినరోజు ఫంక్షన్. చాలా గ్రాండ్ గా చేస్తున్నాం. నీవు తప్పకుండా రావాలి. మా వాళ్లందరికీ నిన్ను పరిచయం చేయాలి నేను. మర్చిపోకు, రేపు సాయంత్రం ఆరింటికల్లా వచ్చేయ్. ఇంటి దగ్గరే ఫంక్షన్..."
 మైత్రి  సమాధానం కోసం కూడా చూడకుండా పెట్టేశాడు  ఫోన్.  అతని ప్రవర్తనకు ఒక్కసారిగా మైత్రి మెదడంతా మొద్దుబారిపోయింది. ఇప్పుడు తానున్న పరిస్థితి ఏమిటి ! నాన్న కండిషన్ ఇంకా నార్మల్ కు రాలేదు. అమ్మ ఒక్కతే అన్నీ ఎలా చూసుకోగలదు ! ఈ  మనిషికి అసలు ఏ మాత్రమేనా ఆలోచన అన్నది ఉందా?  ఆమెలో సహనం నశించి, కోపం కట్టలు తెంచుకుంది. ఆ క్షణంలో ఆమెకు కొద్ది రోజుల క్రితం విశ్వ మోహన్ వాళ్ళింట్లో జరిగిన ఓ సంభాషణ తలపుకొచ్చింది. అవీ ఇవీ మాట్లాడుతూ ఉన్నట్టుండి విశ్వ  మోహన్ అమ్మగారు, 
" పెళ్లయ్యాక ఉద్యోగం చేస్తావా" అని అడిగింది. వెంటనే, పక్కనే ఉన్న అతని అక్కగారు అందుకుని, 
" ఎందుకు చేస్తుందమ్మా, తమ్ముడికి వచ్చేది చాలదా ఏమిటి! పైగా వాడికి ఇష్టం కూడా ఉండదు. పెళ్లైన వెంటనే మానిపించేస్తాడు చూడు " అనేసింది ఠపీమని. మైత్రికి గుండెల్లో రాయి పడినట్లయింది. అయినా తమాయించుకుని, 
" ఎందుకు మానేస్తా ఆంటీ, కోచింగ్ తీసుకుని సంవత్సరం పాటు కష్టపడి తెచ్చుకున్న జాబ్...." అంది వెంటనే. ఆ ఇద్దరూ మొహమొహాలు చూసుకుని మైత్రి వైపు అదోలా చూశారు. విశ్వ  మోహన్ అక్కడే ఉన్నాడు, కానీ పెదవి విప్పలేదు. మౌనంగా లేచి లోనికి వెళ్ళిపోయాడు. అది గుర్తొచ్చి ఆమె మొహం మ్లానమయింది. ఇంత సంకుచిత స్వభావం ఏమిటి వీళ్ళకి! అనిపించి తల పట్టుకుంది. తండ్రి అనారోగ్యం, తల్లి నిస్సహాయత ఓవైపు, భరించలేని మానసిక ఒత్తిడి మరోవైపు ఆ అమ్మాయిని స్థిరంగా నిలవనీయకుండా చేసేస్తున్నాయి.
   ఆరోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయమే మళ్లీ ఫోన్ చేశాడు. ఎత్తాలనిపించలేదు మైత్రికి. మళ్లీ మళ్లీ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ రింగవుతోంది. రగిలిపోతున్న మైత్రిలో ఏదో అలజడి. అందులో నుండే ఓ స్థిరమైన ఆలోచన  ! వెంటనే బ్యాగ్ నుండి సెల్ తీసింది.
" ఎన్ని సార్లు చేసినా ఫోన్ తీయ వేంటి? గుర్తుందిగా, సాయంత్రం త్వరగా వచ్చేయ్..." 
 అవతల విసుగ్గా విశ్వ మోహన్.
" సారీ, నాన్న ఇంకా కోలుకోలేదు, హాస్పిటల్ లోనే ఉన్నాం. అమ్మ ఒక్కతే చూసుకోలేదు. అయినా, ఈ పరిస్థితిలో తయారై ఫంక్షన్కు అటెండయే మూడ్  నాకు లేదు... సారీ.." గబగబా చెప్పేసింది.
"... అదేమిటి! రాకపోతే ఎలా?.. " మళ్లీ అతను
".. మరేమీ కాదు, రెండు రోజుల తర్వాత ఒకసారి కలుస్తాను.. బై.."
 ఇక అతని మాట వినిపించుకోకుండా పెట్టేసింది ఫోన్.
                          ***   ***  ***
   పార్కు దగ్గర ఆటో దిగి గేటు వైపు దారి తీసింది మైత్రి. నిశ్చితార్థం అయ్యాక మూడు నాలుగు సార్లు ఇద్దరూ ఇక్కడే కలుసుకున్నారు. ఎప్పుడూ తనే ముందుగా చెప్పిన టైం కు వచ్చి ఎదురు చూసేది. ఈరోజు విశ్వ   మోహనే ముందుగా వచ్చి కూర్చుని ఉన్నాడు. మైత్రి ని చూడగానే దిగ్గున లేచి, 
" ఏమిటి నువ్వసలు ! ఫోన్ చేస్తే పలకవు, మొన్న రానందుకు ఎంత డిసప్పాయింట్ అయ్యానో  తెలుసా,.. అందరి ముందూ అలుసైపోయేలా చేశావు.."
 కోపంగా, ఇంకా దబాయిస్తూ గట్టిగా అరిచేశాడు. 
"...ఆపుతారా,... " అతని వైపు చేయి చాపుతూ వెంటనే అడ్డుకుంది మైత్రి. ఇన్నిరోజులుగా ఆమెలో శాంతమే గానీ కోపమన్నది చూడని విశ్వమోహన్ ఠక్కున ఆగిపోయాడు. 
" ఎంతసేపూ మీ ధోరణే  గానీ ఇవతల నా గురించిన ధ్యాస ఉండదా  మీకు? మీరెక్కడికి ఎప్పుడు రమ్మంటే అప్పుడే వచ్చేయాలి, ఏమి చేయమంటే అది చేయాలి. ఏమిటి మీ వైఖరి!... నాకసలు నచ్చడం లేదు.."
".......................... "
" ఈ రెణ్ణెళ్లలో ఎన్నిసార్లు మీ ఇంటికి రమ్మన్నారో గుర్తుందా? మీ ఇష్టాలు, కోర్కెలు, అలవాట్లు పదే పదే చెప్పడమే గానీ నా అభిరుచులు చెప్తే అసలు పట్టించుకున్నారా? ఎంత సేపూ మీ అమ్మానాన్న మిమ్మల్ని ఎంత ప్రేమగా పెంచారో, ఎంత కష్టపడి చదివించారో, మీ పై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో చెపుతారు గానీ, మరి నా సంగతేమిటి? "
"....................................... "
 "చెప్తే ఒప్పుకోరు గానీ, మీ మగవాళ్ళందరి ఉద్దేశం ఏంటండీ? ఆడపిల్లల్ని  తల్లిదండ్రులు గాలికీ  ధూళికీ పెంచేసి ఉంటారనా? చెప్పాలంటే మగ పిల్లలకంటే ఆడపిల్లల్నే ఎంతో జాగ్రత్తగా, మరింత ప్రేమగా పెంచుకుంటారన్న విషయం ఎన్నడూ.. ఎన్నడూ.. మీ మనసు పొరల్లోకి కూడా దూరదు... "
 ఇన్నాళ్లూ ఎంతో మౌనంగా, అమాయకంగా కనిపించే మైత్రి లో ఈ మరో కోణం చూస్తూ విశ్వ మోహన్ చకితుడై అలా చూస్తుండిపోయాడు.  
" మీ అమ్మానాన్నల్ని గౌరవించాలి, బాగా చూసుకోవాలి అని చాలా సార్లు చెప్పారు మీరు. మరి నాకు లేరా అమ్మానాన్నలు ! వాళ్ళ సంగతేంటి?  వాళ్ళను కూడా మీరు అదే విధంగా గౌరవించాలని నేను ఆశించడం అత్యాశేమీ కాదు కదా !....."
"...................."
" మీకు సంబంధించిన ప్రతీ విషయానికీ నేను స్పందించాలని కోరుకున్నారు. మరి నేనూ అలాగే అనుకుంటానన్న ఆలోచన మీకు రాదా? హాస్పిటల్లో మా నాన్న పరిస్థితి అంత సీరియస్ గా ఉంటే నేను వదిలేసి మీ ఫంక్షన్ కు రావాలని ఎలా కోరుకుంటారు ! ఆ  సమయంలో నాకు మీ సహాయమేదైనా ఉంటే బాగుంటుందని నేను అనుకోవడం తప్పేమీ కాదు కదా! ఆ మాత్రం ప్రతిస్పందన మీనుండి నేనూ ఆశించవచ్చు కదా ! .. "
ఓక్షణకాలం ఊపిరి పీల్చుకుని, నిలబడలేక పక్కనే ఉన్న బెంచీ  మీద కూలబడింది మైత్రి.
 తేరుకున్న విశ్వమోహన్ మెల్లిగా తనూ కూర్చున్నాడు.
" అది కాదు మైత్రీ .. " అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ, మైత్రి అతని వైపు స్థిరంగా చూస్తూ, 
" ఎందుకో మన ఇద్దరికీ పొసగదనిపిస్తోంది. సారీ, ప్రతిదానికీ ఇలా వ్యక్తిత్వమన్నది లేకుండా గడపడం నాకు సాధ్యం కాని పని.."
 అతని మొహంలో రంగులు మారాయి.
".... మా అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే. వాళ్లను చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. చూసుకుంటాను కూడా. కానీ మీ వైఖరి నాకా భరోసా కల్పించడం లేదు. బ్రతుకంతా గొడవ పడుతూ భరించడం నా వల్ల కాదు...."
 లేచింది మైత్రి. వెంటనే ఏదో గుర్తొచ్చి, 
" మరో విషయం. నా జాబ్ గురించి మీకు నేను స్పష్టత నివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను జాబ్ మానేసే ప్రసక్తి అంటూ ఉండబోదు... "
" ఆగు మైత్రీ,  ఆలోచించు, మనకు నిశ్చితార్థం కూడా అయింది..."గొంతు పెగుల్చుకుని అన్నాడు విశ్వమోహన్. 
" అయింది నిశ్చితార్థమే , పెళ్లి కాదు. ఒకవేళ పెళ్లయ్యాక ఇలా జరిగినా నేనిలాగే మాట్లాడేదాన్ని.." 
స్థిరంగా అంది మైత్రి.   
" మరోసారి ఆలోచించమంటున్నానుగా.. "
" ఆపని చేయాల్సింది మీరు. ఇన్ని  రోజులుగా మీరు ప్రవర్తించిన తీరు గుర్తుకు తెచ్చుకొని ఓసారి ఆత్మవిమర్శ చేసుకొని చూడండి. మీరు కరెక్టే అని మీకు అనిపిస్తే మళ్లీ నన్ను కలిసే   ప్రయత్నం  చేయకండి ప్లీజ్.." 
 సూటిగా అతని వైపు ఓసారి చూసి, వెనుదిరిగి వడివడిగా అడుగులేస్తూ గేటు దాటి వెళ్ళిపోయింది మైత్రి. వెళ్తున్న ఆమెనే  చూస్తూ, 
"  మై గాడ్, అమ్మాయిలు ఇలా కూడా మాట్లాడతారా! "
 అనుకుని విస్తుపోవడం విశ్వమోహన్ వంతై అలా కూర్చుండిపోయాడు. ఇన్ని  రోజుల తన ప్రవర్తన తీరుకు ఇది మైత్రి ప్రతిస్పందనలా తోచిందతనికి. మరుక్షణమే అతనిలో ఎక్కడో ఏదో మూల మెల్ల మెల్లగా అంతర్మధనం మొదలైంది.

                   ****************************************

                  























నువ్వు నాకు నచ్చలేదు...

🌷

      సాయంత్రం నాలుగు గంటలకు ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని,ఇల్లు చేరుకున్నాడు నూతన్ కుమార్  . ఇంట్లో అంతా అప్పటికే రెడీ అయి ఉన్నారు. అతను రాగానే పది నిమిషాల్లో బయటపడి కారెక్కి  బయలుదేరారు. మరో పావు గంటలో ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంతకీ ఆ ఇల్లు నూతన్ కుమార్  కోసం పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళిన ఇల్లు.
    అతనికి ఇదేమీ  కొత్త కాదు.మొదటిదీ కాదు. పదిహేనవది ! అతనో  సాఫ్ట్ వేర్  ఇంజనీర్. మంచి పేరున్న కంపెనీలో లక్ష పైగానే అందుకుంటున్నాడు.  పైగా  ఒక్కడే కొడుకు. ఆస్తిపాస్తులూ దండిగానే ఉన్నాయి. ఇక చెప్పేదేముంది! అతని చూపులు నేల మీద ఉండడం లేదు. extraordinary expectations  ! పోనీ... ఏమైనా గొప్ప అందగాడా అంటే... జస్ట్.. యావరేజ్..! పొడవు అంతంత మాత్రమే. చామన ఛాయ..చిరుబొజ్జ! పల్చని జుట్టు! ఇదీ అతని పర్సనాలిటీ !
   ఉద్యోగంలో చేరి, సంవత్సరం గడిచాక, మొదటిసారి ఓ సంబంధం తెలిసిన వాళ్ల ద్వారా వస్తే చూడడానికి వెళ్లారు. అమ్మాయి చక్కగా ఉంది. తనూ సాఫ్ట్ వేర్ ఇంజనీరే. మంచి రంగు, ఒడ్డు పొడుగూ...సుపర్బ్ గా ఉంది. కానీ, వెంటనే నచ్చింది అని చెప్పడానికి అహం అన్నది అడ్డొచ్చి... ఇంటికి వెళ్లి కబురు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. మొదటి సంబంధమే చక్కగా ఉన్నందుకు కొడుకు అదృష్టానికి మురిసిపోయారు తల్లిదండ్రీ. తీరా.. అతని 'రెస్పాన్స్' చూడగానే ఆలోచనలో పడ్డారు.  
" ఏమిటో నాన్నా, అంతా బాగుంది కానీ, ఇల్లే నాకంతగా  నచ్చలేదు. ఆ మర్యాదలూ అంతంత మాత్రమే..మనకొద్దమ్మా..."
 సరే అనుకొని మౌనంగా ఉండి పోయారు తల్లిదండ్రులు. అలా అలా.. మరో నాలుగు సంబంధాలు తెలిసిన వాళ్ల ద్వారానే వచ్చాయి. బ్యాంకు ఉద్యోగిని కలర్ తక్కువ అన్నాడు. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ ను మరీ లావుగా ఉందన్నాడు. మరొకరేమో 'ముదురు' అన్నాడు. అతని వాలకం కనిపెట్టిన బంధుమిత్ర వర్గం చేతులెత్తేశారు. మరో సంవత్సరం ఖాళీ. 
 ఇక లాభం లేదనుకుని, మ్యారేజి బ్యూరోలను సంప్రదించారు. వాళ్ల దగ్గర కొదవేముంటుంది సంబంధాలకి...! కదిలిస్తే చాలు.. కోకొల్లలుగా గుప్పిస్తారు. వాళ్లకు కావాల్సింది 'కమిషన్' ! అంతే. లెక్కకుమిక్కుటంగా చూపించిన మ్యాచెస్ లో ఏది ఎన్నుకోవాలో తెలియక, తల్లిదండ్రుల్నీ, తన కజిన్ సిస్టర్స్ ఇద్దర్ని కూర్చోబెట్టుకుని ఎట్టకేలకు అందరి సూచనల మేరకు  ఓ నాలుగైదు సెలెక్ట్ చేశాడు నూతన్.  వరుసగా మొదలెట్టి ఓ నెలలోపు అన్నీ చుట్టబెట్టేశారు. 
    అప్పుడైనా ఓకే అన్నాడా..! ఒకరు పొట్టి అన్నాడు, ఒకరేమో... ఫోటోలో ఉన్నట్టుగా లేదన్నాడు. ఇంకో అమ్మాయి...అంతా బాగుంది కానీ.. పళ్ళు ఎత్తు అన్నాడు. మంచి ఉద్యోగాలు. స్థితిమంతులు, సంస్కారం కలిగిన కుటుంబాల వాళ్లే...  అయినా... అతని కంటికి మాత్రం ఆనలేదు. అతని విపరీత ధోరణికి అతని ఇద్దరు కజిన్స్ తన పట్టుకొని గుడ్ బై చెప్పేశారు. తమ 'అన్న' అన్నవాడి అందచందాలు, శక్తి సామర్ధ్యాలు తామెరుగనివేమీ  కాదు. వాళ్లకు విచిత్రంగా తోచిందేమిటంటే... చూసిన అమ్మాయిలందరినీ ఇతనే వద్దంటున్నాడు... అమ్మాయిలు అన్ని క్వాలిఫికేషన్ లు  ఉండి కూడా కిమ్మనకుండా ఉంటున్నారు. మరోవైపు... సర్వేలేమో.. అమ్మాయిల సంఖ్య తక్కువ అయిపోయింది.. అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదంటూ ఒకటే ఘోషిస్తున్నాయి..!! దానికీ, ప్రస్తుతం జరుగుతున్న తతంగానికీ లంకె అసలు కుదరడం లేదు..పాపం ! ఇద్దరూ అమ్మాయిలేగా.. ! పైగా పెళ్లి కావలసిన వాళ్ళు!అర్థం గాక ( దిక్కు తోచక )ఆలోచనలో పడిపోయారు !
 తల్లికి,  తండ్రికీ కూడా విసుగొచ్చి చేతులు ముడుచుక్కూర్చున్నారు. ఎవరికితప్పినా బ్యూరో అతనికి తప్పదు కదా ! ఇంకా లోతుగా వెతికి వెతికి... ఓ సంబంధం చూపించాడు. 
    పరవాలేదు, మరీ అంత అందగత్తె కాకపోయినా, అమ్మాయి లక్షణంగానే ఉంది. సాఫ్ట్ వేర్ కంపెనీలో చేస్తోంది. మంచి జీతం. మంచి కుటుంబం! ఇద్దరూ ఒకే ఫీల్డు. బాగుంటుందని తల్లీ దండ్రీ మొగ్గు చూపారు. ఈసారైనా ఇది కుదురుతుందన్న ఆశతో వెళ్లి చూసొచ్చారు. 
" అమ్మా, అంతా బాగుంది.. కానీ, నాకంటే నెలరోజులే చిన్నది.ఎలాగమ్మా... !"
" ఒక్కరోజైనా చిన్నదే కదరా.. అంతా బాగుంది. ఎన్ని చూశాము! అన్నింటిలోనూ ఇది మాకు బాగా నచ్చింది.ఓకే చెప్పేద్దాము... "
అన్నారు ఇద్దరూ. 
" సరే, నాక్కాస్త టైం ఇవ్వండి.. ఆలోచిస్తాను.. "
అంటూ బయటికెళ్లిపోయాడు  నూతన్. అతనాలోచించటానికి నెల పట్టింది. అయినా, గుంజాటన తెగలేదు. ఈలోగా అమ్మాయి తండ్రి ఏ సంగతీ చెప్పండని ఫోన్ చేశాడు. సరిగ్గా అప్పుడే బ్యూరో అతను 'మరోటి' చూపించాడు. సరే.. ఏముంది... చూసొద్దాం.. ఏది బాగుంటే అదే ఓకే చేద్దాం .. అనుకుంటూ ముగ్గురూ వెళ్లారు. తీరా చూస్తే మునుపటివే బెటర్ అనిపించి ఉసూరుమంటూ  తిరుగు ముఖం పట్టారు.
   సరే..క్రితం చూసిన అమ్మాయి తండ్రికి ఫోన్ చేద్దామనుకుంటుండగా... అనుకోని విధంగా బాగా దగ్గరి చుట్టం వచ్చి ఓ సంబంధం చెప్పాడు. తెలిసినవాళ్లయితే బాగుంటుంది కదా అని బిలబిలమంటూ వెళ్లారు. ఇదిగో.. ఈరోజు వెళ్ళింది ఆ సంబంధం కోసమే..! ఇది పదిహేనోది.
    ఫలహారాలు, కాఫీలు పూర్తయ్యాక, అమ్మాయిని చూపించారు. కళ్ళు తిరిగాయి ముగ్గురికీ. పొట్టిగా, నల్లగా,  బాగా బొద్దుగా ఉండి... 'బాబోయ్' అనుకున్న వాళ్ళ మొహాలు ఒక్కసారిగా వాడిపోయాయి. గతంలో చూసిన సంబంధాల తాలూకు అమ్మాయిలంతా కళ్ళముందు కదిలి, వెక్కిరించినట్లయింది  వాళ్లకి ! 
     చివరాఖరికి... వాళ్లకు బోధపడిన నగ్న సత్యం.. అబ్బాయికి గానీ, అమ్మాయికి గానీ, మొదట్లో వచ్చే సంబంధాలే భేషైనవి... సరైనవి.. ఇంకా ఇంకా చూద్దామనుకుంటే, కాలం గడిచే కొద్దీ, వయసు పెరిగిపోయి, తమ ప్రమేయం లేకుండానే శరీర ఆకృతులు మారిపోయి, ఇదిగో ఇలా... ఏదో ఒకటిలే అని సర్దుకుపోయే పరిస్థితి దాపురిస్తుంది...!
 ముగ్గురి కళ్ళు తెరిపినబడి, ఇంటికి వచ్చి చతికిలబడ్డారు. అప్పుడు జ్ఞానోదయమై, తీర్మానించుకుని,  క్రితంచూసిన  పదమూడవ సంబంధం..అదే.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని తండ్రికి ఫోన్ చేశారు.
" మీ అమ్మాయి మాకు నచ్చిందండీ.  ఓ మంచి రోజు చూసుకుని మీ ఇంటికి వచ్చి, అన్ని విషయాలూ మాట్లాడుకుందాం అనుకుంటున్నాం.."
 పెళ్ళికొడుకు తండ్రి గొంతులో ధీమా గమనించిన అమ్మాయి తండ్రి, 
" అలాగాండీ, సంతోషం. ఒక్క నిమిషం.. మీ అబ్బాయి అక్కడే ఉండి ఉంటే, ఓసారి ఫోన్ అతనికివ్వండి. మా అమ్మాయి మాట్లాడుతుందట..."
అన్నాడు. ఓసారి అయోమయంగా చూసి, కొడుక్కి ఫోన్ ఇచ్చాడాయన. 
" హలో.. నూతన్ కుమార్  గారూ.. నేను మీకు నచ్చినందుకు చాలా సంతోషమండీ. ఈ మాట చెప్పడానికి రెండు నెలల సమయం కావాల్సొచ్చింది  మీకు..! కానీ...for your information... sorry to say... మీరు నాకు నచ్చలేదు..."
 ఓ క్షణం ఆగి, 
"...ఒక్కమాట.. ! ఏమీ అనుకోకండి. అడక్కపోయినా ఓ చిన్న సలహా.. పెళ్లిచూపులకి వెళ్ళే ముందు.. మీ ఇంట్లో నిలువుటద్దాలు ఉండే ఉంటాయి..వెళ్లి దాని ముందు నిలబడి, ఓసారి మిమ్మల్ని మీరు పరీక్షగా, తదేకంగా, పరకాయించి చూసుకోండి.."
"..................."
"... అమ్మాయి నా పక్కన నిలబడితే బాగుంటుందా లేదా అని కాదండీ... అమ్మాయి పక్కన నిలబడ్డప్పుడు
నేను బాగుంటానా లేదా అని ఆలోచించుకుంటే మంచిది..."
 ఊహించని ఉత్పాతానికి బుర్ర గిర్రున  తిరుగుతుండగా...
"... బై ది బై... నా పెళ్లి సెటిల్ అయిపోయిందండీ.. రెండు వారాల్లో ముహూర్తం..! once again..నేను మీకు నచ్చినందుకు సంతోషం.. కానీ..too late  !మీరే నాకు నచ్చలేదు. Bye.. bye forever.. "
ఫోన్ కట్ అయింది. మ్రాన్పడిపోయి, సోఫాలో కూలబడిపోయాడు నూతన్ కుమార్. మాటిమాటికీ అతని చెవుల్లో.. నువ్వు నాకు నచ్చలేదు... నువ్వు నాకు నచ్చలేదు.. అన్న ఆ అమ్మాయి మాటలే ప్రతిధ్వనించసాగాయి.'ఆలస్యం అమృతం విషం' అన్న చందాన అయిందాతని పరిస్థితి ! అదే క్షణంలో, ఎందరు అమ్మాయిల్ని ఇదే విధంగా తాను  క్షోభ  పెట్టి ఉంటాడో తలపుకొచ్చి, అతని తల వాలిపోయింది. 

**************************************.






     


Friday, November 1, 2024

అందానికే నిర్వచనం నీవు...!!

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


 అందానికి అందం నీవు...
 అందానికే నిర్వచనం నీవు...
 నయనాలకు ఆహ్లాదం... 
 ఆస్వాదించే  హృదయానికి 
 అమితానందం...
 అందించే అరుదైన
 అరవిందానివి నువ్వు... 
 ఓ గులాబీ!
 కళ్ళు చెదిరేలా... 
 భానుడు ఈర్ష్య పడేలా.... 
 ఆ ఎరుపువర్ణం...!
 నీ ఆత్మ విశ్వాసానికి ప్రతీక !
 ఆకృతి చూడ అదో 
 తిరుగులేని ప్రత్యేకత !!
 ఆపై... వలయాలై...
 సుడులు తిరుగుతూ 
 ఆ పూరేకుల అమరిక...!
 పచ్చదనం సింగారించుకున్న నీ కొమ్మలు 
 చిరుగాలిని పలుకరిస్తే చాలు...
 నీలో  దాగిన సుగంధ పరిమళాలు 
 రెక్కలొచ్చి పలుకుతాయిగా స్వాగతాలు...
 ఇట్టే మూగుతాయి చుట్టూ రంగురంగుల 
 సీతాకోకచిలుకలు...!!
 పరిసరాలకు నీవో పసిడి ఆభరణం 
 చూపరులకు అద్భుతం !!
 ఎంత చూసినా..
 తరగని..తనివి  తీరని 
 సోయగం నీది కదా  !!
 అందుకే... అందానికి అందం నీవు!
 అందానికే నిర్వచనం నీవు...
 అతివలకే కాదు సఖివి...
 అవనిపై అందరికీ...!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Saturday, October 26, 2024

నా అందం నాది... నా ప్రత్యేకత నాది...!

 🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

                                              ~ యం. ధరిత్రీ దేవి 
చెత్తాచెదారం...చుట్టుముడుతూ 
పిచ్చిగా అల్లుకున్న కొమ్మలూ..రెమ్మలు..!
ఆపై కంపచెట్లు...!ఆ నడుమ నిలబడి...
బిక్కు బిక్కు మంటూ  ఔషధ మొక్క...!
ఓ తెల్లని పుష్పంతో ఒంటరిగా ...!!
'అయ్యో పాపం!' అనుకునేంతలో...
" అనాధను కాను నేను... 
ఏకాకిని అంతకన్నా కాదు...
నా చుట్టూ పచ్చని మొక్కలు...నా నేస్తాలు...
కంపచెట్లు...నాకు రక్షణ వలయాలు...!
చెత్తాచెదారమా...నన్నేమీ చేయలేదు...
నా అందం నాది...నా ప్రత్యేకత నాది...
నా ఉనికిని గుర్తించి...నాకోసం నా చుట్టూ 
పరిభ్రమించే ఈ తుమ్మెదే సాక్షి... "
అనేసింది కిలకిల నవ్వుతూ ఆ 'ఉమ్మెత్త '...!!
నిజం తెలిసి...తెల్లబోయి 
తేరుకొని శృతి కలిపా... 🙂

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

Wednesday, October 16, 2024

దానగుణం మంచిది కాదా !


  🌺గేటు దగ్గర అలికిడి వినిపించి వంటింట్లోంచి అరుంధతి ముందు గదిలోకి వచ్చి తొంగి చూసింది. గేటు  అవతల ఓ ఆడ  మనిషి!  పొట్టిగా, ఓ మోస్తరు లావుగా, నేత చీరలో ,  జుట్టు ముడి వేసుకుని ఉన్న యాభై ఏళ్ళు పైబడ్డ ఆవిడ నిలబడి చూస్తోంది. వెంటనే గుర్తుపట్టింది అరుంధతి ఆవిణ్ణి చూడగానే. అంతలోనే ఒక్కసారిగా ఆమెలో విసుగు తలెత్తింది. 
    దాదాపు రెండు సంవత్సరాలవుతుందేమో, మూడు నాలుగు నెలలకోసారి వస్తుంది. ఏదైనా వస్త్రం ఇవ్వమని అడుగుతుంది. వస్త్రం అంటే  ఆమె భాషలో చీర అని అర్థం. మొదట్లో అడగంగానే వెంటనే లోనికెళ్లి ఓచీర  తెచ్చి ఇచ్చేసింది అరుంధతి. అంతే! అలా అలా అలవాటయిందామెకు. ఈమే  కాదు, మరొక ఆవిడ కూడా ఇలాగే రెగ్యులర్ గా  రావడం, వచ్చినప్పుడల్లా చీర అడగడం -- అరుంధతి ఇవ్వడం మామూలైపోయింది రాన్రానూ. ఎవరైనా ఇలా ఇంటికి వచ్చి  ఏదైనా అడిగితే లేదన లేకపోవడం అరుంధతి బలహీనత. పైగా ఆమెకున్న దయాగుణం దీన స్థితిలో ఉన్న వాళ్ళకి దానం చేయాలని ప్రేరేపిస్తుంది కూడా. అదామె స్వభావం! అంతవరకూ బాగానే ఉంది, కానీ ఈ మధ్య ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఆమెకు అదో విధమైన అసహనం, చిరాకు కలుగుతోంది. కారణం -- అరుంధతి బలహీనతను బాగా కనిపెట్టారేమో, ముఖ్యంగా ఆ ఇద్దరు ఆడవాళ్లు! అడపాదడపా రావడం, తప్పనిసరిగా చీర అన్నది ఇచ్చేదాకా వదలక పోవడం, మొండికి  పడడం చేస్తుంటే, రాన్రాను అరుంధతిలో సహనం నశించి పోతోంది. ఏమిటి వీళ్ళు ! ఇస్తే తీసుకోవాలి, అంతేగానీ ఇలా విసిగించడంఏమిటీ !  పైగా ఓ వేళా పాళా ఉండదు వీళ్ళరాకకి ! ఒక్కోసారి ఉదయమే ఇంటి పనుల్లో మునిగిపోయి  ఉన్నప్పుడు, మరోసారి భోజనాలయిపోయి, అలసిపోయి కాస్త నడుం వాల్చి విశ్రాంతిగా కునుకు  తీస్తున్నప్పుడు దబ్బున  గేటు చప్పుడు చేయడం, పిలవడం! లేచి వచ్చేదాకా పిలుస్తూనే ఉండడం,  ఏదో ఒకటి చేతిలోపెట్టేదాకా కదలకపోవడం ! క్రమంగా ఈ వ్యవహారం ఆమెకు తలనొప్పిగా పరిణమించి పోయింది. ఇంట్లో ఉన్న పాత చీరలు ఏం చేసుకుంటాం, ఇలా ఇస్తేనన్నా మరొకరికి ఉపయోగపడతాయి కదా అన్న ఆలోచనతో తానిలా  చేస్తే వీళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని, అలవాటు  చేసుకుని తననిలా బాధపెడతారని  ఆమె ఊహించలేకపోయింది పాపం! అందుకే బాగా ఆలోచించి, ఈమధ్యే  ఓ నిర్ణయం తీసుకుంది,  ఇకపై ఇలా ఇంటి వద్దకొచ్చి అడిగే వాళ్ళకి చీరలు గీరలు అసలు ఇవ్వకూడదని! ఎలాగైనా ఆ మాటకు కట్టుబడి ఉండాలని స్థిరంగా అనుకుంది కూడా. ఈరోజు గేటు వద్ద ఆవిణ్ణి చూడగానే ఆ నిర్ణయం గుర్తొచ్చి, వెంటనే బయటికొచ్చేసి, చెప్పేసింది, 
" చూడమ్మా, చాలా ఇచ్చాను నీకు, వచ్చిన ప్రతిసారీ ఇవ్వాలన్నా, ఇచ్చే తీరాలన్నా కుదిరేపనిగాదు. పైగా నీవు ఒక్కత్తివే కాదు, ఇంకా ఇలా వస్తూనే ఉంటారు, ఎందరికని  ఇవ్వను!... ఇక నీవు వెళ్ళవచ్చు.. " 
 గట్టిగానే చెప్పేసి, లోనికి వెళ్ళిపోయింది. కానీ ఆమె వింటేగా! అలాగే నిలబడి మళ్లీమళ్లీ అడగడం మొదలెట్టింది. అరుంధతి లోపల్నుండే  మళ్ళీ గట్టిగా చెప్పింది, వెళ్లిపొమ్మని. కానీ ఆమె మాత్రం వినిపించుకోకుండా అలాగే నిలబడింది యథాప్రకారంగా. అరుంధతిలో కోపం కట్టలు తెంచుకుంది, అయినా తమాయించుకుని, 
" ఎన్ని సార్లు చెప్పాలి, వినిపించదా?... " అంటూ బయటకొచ్చేసింది. అంతే! ఆమె కోపంగా చూస్తూ మెట్లు దిగుతూ, 
" ఏ, పోయేప్పుడు కట్టుకుని పోతావా?....... "
 అంటూ అంతకంటే కోపంగా గట్టిగా  అరుస్తూ గొణు క్కుంటూ  విసవిసా వెళ్ళిపోయింది. ఒక్కసారిగా అరుంధతి అవాక్కై స్థాణువై నిలబడిపోయింది. 
" ఏమిటి! ఇన్నాళ్ళూ నేను ఇచ్చిందంతా ఏమైపోయింది? అదేమీ పట్టదా ఇలాంటి వాళ్ళకి! ఒక్కసారి లేదు పొమ్మంటే చాలు ఇలా అనేయడమేనా!"
  మదనపడుతూ మెల్లిగా లోనికి కదిలింది. ఇదంతా లోపల్నుండి గమనిస్తూన్న ఆమె భర్త ఈశ్వరరావు, అరుంధతి మ్లానవదనం చూస్తూ, 
" ఏమిటీ, ఫీలవుతున్నావా ! అసలు పొరపాటు నీది. వాళ్లకు అలవాటు చేసింది నువ్వు! ఏదో అపర దానకర్ణుడి  చెల్లెల్లా ఇలా అడిగినోళ్లందరికీ  దానాలు చేస్తూ పోతే ఇలాగే ఉంటుంది మరి!..."
 అసలే బాధలో ఉన్న అరుంధతికి ఈ మాటలు ముల్లులా గుచ్చుకున్నాయి. 
" అంటే దానం చేయడం తప్పా? "
" దానం చేయడం తప్పు కాదు, అపాత్రదానం తప్పు. నీవు గమనించినట్లు లేదుగానీ ఆ ఇద్దరు ఆడవాళ్ళ తీరు చూస్తే వాళ్లు  మరీ అంత దయనీయస్థితిలో ఉన్నట్లుగా అనిపించలేదు నాకు. మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే వాళ్ల స్థితిగతుల్ని కూడా గమనించాలి మరి!.."
 అంటూ చిన్న సైజు క్లాసు పీకాడు. అంతలోనే అరుంధతి చిన్నబు చ్చుకున్నట్లు గమనించి, 
"చూడు, జరిగిందేదో జరిగింది, ఇకపై ఇలాంటి వాళ్ల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే, ఇచ్చి చెడ్డ గావడం కంటే ఇవ్వకుండా చెడ్డ కావడం మేలనుకుంటా... "
 చిన్నగా నవ్వుతూ, వాతావరణాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశాడు.మళ్ళీ అందుకుని, 
"... నీకు అంతగా ఇవ్వాలనిపిస్తే ఏదైనా వృద్ధాశ్రమానికి అప్పుడప్పుడూ వెళ్లి వాళ్లకి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ పద్ధతి బాగుంటుంది, నీకు సంతృప్తి, సంతోషం దక్కుతాయి, " 
 అంటూ ఓ సలహా ఇచ్చాడు. అదేదో బాగున్నట్లు అనిపించింది అరుంధతికి. అయినా  రాను రాను మనిషిలో మంచితనం ఉండడం కూడా తప్పేమో అనిపించిందామెకి ఆ క్షణాన  ! ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చి, ' దేవుడా' అనుకుంటూ తల పట్టుకుని కుర్చీలో కూల బడింది.
               **    **     **     **    **
    ఇది అరుంధతి అనుభవమే కాదు, నా  అనుభవం కూడా.అంతే కాదు, ఇంకా మరికొందరు కూడా ఇలాంటివి ఎదుర్కొనే  ఉంటారు. ఇలా జరిగినప్పుడు నిజంగానే అనిపిస్తుంది, దాన గుణం మంచిది కాదా అని! 
   ఈ సందర్భంగా చిన్నతనంలో బళ్ళో  చదువుకునేటప్పుడు మా తెలుగు మాస్టారు చెప్పిన ఓ పిట్ట కథ గుర్తొస్తోంది  నాకు. ఓ ఊర్లో ఓ  యాచకుడు ఉండేవాడట. అతను ప్రతి రోజూ  ఆ ఊర్లోని అన్ని వీధులు తిరిగి ముష్టి ఎత్తుకునే వాడట. ఎవరు పెట్టినా పెట్టకపోయినా ఓ ఇల్లాలు మాత్రం ఖచ్చితంగా అతనికి బిక్షం వేసేదట ! ఓ రోజు పాపం, ఆమెకు చేయి ఖాళీ  లేకనో, లేక సమయానికి  పెట్టడానికి ఏమీ లేకనో అతనికి ఏమీ  పెట్టకనే  పొమ్మందట! అంతే! ఆ యాచ కుడు వెంటనే, 
"  రోజూవేసే..... దీనికే మాయ రోగం వచ్చిందోఇయ్యాళ !...." 
 అంటూ పైకే అనేసి గొణుక్కుంటూ  వెళ్ళిపోయాడట! ఆ మాటలు ఆ ఇల్లాలి చెవిని పడనే పడ్డాయి. హతాశురాలైపోయిందటావిడ, ఆ బిచ్చగాడి ప్రవర్తన చూసి ! 
 అదే మాస్టారు మరోసారి మరో యాచకుని  గురించి చెప్పారు. అతను ఆ  ఊర్లో ప్రతిరోజూ మూడే మూడు ఇళ్లకు యాచనకు వెళ్తాడట ! ఆ మూడిళ్ల వాళ్ళు ఏదైనా పెడితే తింటాడు, అంతే! మరుసటిరోజు మరో మూడిళ్లకు వెళ్తాడట. ఆ రోజు వాళ్ళు ఏమీ పెట్ట లేదనుకోండి, తలవంచుకుని మౌనంగా వెళ్ళి పోయి, ఖాళీ కడుపుతో పడుకుండి పోతాడట ! అది  అతని అలవాటు, స్వభావం! ఇంకా చెప్పాలంటే, ఓ రకమైన'పాలసీ' కి కట్టుబడి ఉండడం! అప్పట్లో  ఏమీ తెలియలేదు గానీ, తర్వాత్తర్వాత కొన్ని ఉదంతాలు జరిగాక తెలిసొచ్చింది ఇలా యాచకుల్లోనూ రకాలుంటారని ! 
   ఇంతకీ దానగుణం మంచిదా కాదా?  మంచిదే, కానీ ఏదీ  మితిమీరి ఉండకూడదు. విజ్ఞులు ఏమంటారో ఏమో గానీ, ఆయా మనుషుల్ని బట్టి కూడా మనం  మారుతూ ఉండాలి అన్నది స్వానుభవంతో తెలుసుకున్న నా అభిప్రాయం ! కాదంటారా !

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
                   




Sunday, October 13, 2024

పుస్తకం... నా ప్రియ నేస్తం...

.                                          
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

                                            ~ యం. ధరిత్రీ దేవి 
   పుస్తకం నా ప్రియ నేస్తం...
   నాకు ప్రాణప్రదం...
   అలసిన వేళ సేదదీర్చే ఔషధం
   ఒంటరినైన...ఊరడించే నెచ్చెలి...
   తెరిస్తే చాలు... అక్షరాలు కావవి...
   అనంత కోటి ఆలోచనలు 
   కొలువుదీరిన కూటమి...!
   మేధావుల కలం నుండి జాలువారి
   చెక్కుచెదరక నిలిచిన 
   అక్షర శిల్పాలే మరి...!!
   అలరిస్తూ..మురిపిస్తూ ఒకసారి...
   నవ్విస్తూ..విషాదంలో ముంచేస్తూ
   మరోసారి... అంతలోనే...
   ఓదారుస్తూ.. నిద్రాణమైన శక్తిని 
   తట్టిలేపుతూ.. బద్ధకాన్ని వదిలిస్తూ...
   గమ్యం చూపిస్తూ.. ఆగకుమా 
   సాగిపొమ్మంటూ..వెన్నుతడుతూ 
   ముందుకు తోసే స్ఫూర్తిప్రదాతలు 
   ఆ అక్షర దీపాలు...!!
   హస్తభూషణం కాదు పుస్తకం...
   మస్తిష్కాన్ని మధించే 
   మహిమాన్విత ఉపకరణం..
   ఉజ్వల భవితకు సోపానాలు 
   వేసే ఉత్తమోత్తమ సాధనం...!
   విజ్ఞాన వినోదాల భాండాగారం...
   కాలక్షేపం కలగలసి..లభ్యం..
   మానసికోల్లాసం...!
   పుస్తకపఠనం..మెదడును
   పదును పెట్టే ఇంధనం...
   కావాలి దినచర్యలో అదో భాగం..
   నూతనోత్తేజానికి పడుతుందపుడే బీజం!!
   అందుకే... పుస్తకం నా ప్రియనేస్తం..
   నాకు ప్రాణప్రదం...!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷








Friday, October 4, 2024

అమ్మ గురించి పాప...

         

   🌺🌺 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

   పసిపాపకు పాలిచ్చి జోకొడుతూ నిద్రబుచ్చుతుంది తల్లి.అది పాలు తాగే పసిపాపల వరకే వర్తిస్తుంది. అందులో ఆ అమ్మ శ్రమ ఉంటుంది, కానీ... కొంతవరకే...! అయితే... రెండు నుండి ఐదేళ్ల పిల్లల విషయంలో  అది మాత్రమే సరిపోదు. వాళ్లకి అన్నం తినిపించడమన్నది ఆ తల్లికి...అబ్బో!! చాలా కష్టంతో కూడుకున్న తతంగమే...! ఒకచోట కూర్చోరు... ఒకచోట నిలబడరు... అటూ ఇటూ పరుగులు! దాక్కోవడాలు !! అంతేనా.. ఇంకా ఎన్నో ఎన్నెన్నో... చిలిపి చేష్టలు...! అలాగని బుజ్జి తల్లి కడుపు నింపకుండా ఆ తల్లి ఉండగలదా !

    ఎన్నో ఊసులు చెప్తుంది... ఏవేవో కబుర్లు చెప్తుంది... ఉన్నవీ లేనివీ కల్పించి కాసేపు మైమరపిస్తుంది. ఏదైతేనేం... ఆకాస్త  బువ్వ బుజ్జిదాని కడుపులోకి వెళ్లేదాక ఊరుకోదుగా...! ఆ సహనమూర్తికి జోహార్లు అర్పించాల్సిందే..!
   ప్రతి స్త్రీ తన జీవితంలో ఎదుర్కొనే ఓ తీపి అనుభవం ఇది...కాదంటారా!ఆ బుజ్జితల్లి రేపు తానూ తల్లిగా మారినపుడు..తన పాపకు అలాగే తినిపించాల్సి వచ్చినప్పుడు...ఆ తల్లికి  ఒకనాటి తన తల్లి పాట్లు, పాటలు గుర్తుకు రాక మానవు.ఒకనాటి తన అల్లరి, తల్లి మురిపెం ఆమె పెదాలపై చిరునవ్వు చిందించక మానదు.తనలో నిక్షిప్తమై దాగివున్న ఆ జ్ఞాపకాల దొంతర..అలా అలా కదిలి...ఇలా ఓ పాటగా ఎలా మారిందో వినండి... 🙂





       అమ్మ నాకు తినిపించే 
       అల్లిబిల్లి కబుర్లతో 
       ఆకాశం చూపిస్తూ 
       అపరంజిని నేనంటూ    //అమ్మ//👧

        ఇలకు దిగిన ఇలవేల్పునట 
        ఈశ్వరవరప్రసాదినట 
        ఉన్నదంత నాదంటూ 
        ఊర్వశినీ నేనంటూ        //అమ్మ//🤱

        ఎన్నడూ లేదంట 
        ఏలోటూ నాకంట 
        ఐశ్వర్యం నాదంటూ         
        ఐశ్వర్యను నేనంటూ       //అమ్మ//👧

        ఒరులెవరూ సాటిరారంట 
        ఓనాటికి నేనవనికి 
        ఔతానట మహారాణిని 👧
        అందలాలు ఎక్కేనట 
        అః !అహహ !! 
        నేనే ఒక నియంతనట !!  //అమ్మ//


🤗

   ఎప్పుడూ పాప గురించి అమ్మ చెప్పే కబుర్లేనా...! ఓసారి అమ్మ గురించి పాప చెప్పే కబుర్లు వింటే ఎలా ఉంటుంది...! ఆ ఆలోచనతో ఓ చిన్న ప్రయత్నం చేశానంతే 🙂
    తల్లి అయిన ప్రతి స్త్రీకి ఇది తప్పనిసరిగా ఎదురయ్యే అనుభవమే... మరపురాని జ్ఞాపకమే...! బిడ్డకు జోల పాడి నిద్ర బుచ్చడానికి ఆ తల్లి గొప్ప సింగరే అయి ఉండాల్సిన అవసరం లేదు కదండీ..! అమ్మ ఎలా పాడినా పాపకు ఇష్టమే. హాయిగా కళ్ళు మూసుకుని  నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటుంది. అదండీ...🙂🤱
         .
    మరొక విషయం... ఈ బాల గేయాన్ని గమనిస్తే, ప్రతి లైన్  లోని మొదటి పదంలోని మొదటి అక్షరం మన తెలుగు వర్ణమాలలోని అచ్చులు... అ నుండి అః వరకు కనిపిస్తాయి. చాలా కాలం క్రితం చిన్నపిల్లల కోసం నేను రాసుకున్న పాట ఇది. ఈ పాట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ తరగతుల విద్యార్థులకు నేర్పించడానికి అనువుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాను. 
 అందరికీ ధన్యవాదాలు.
*******************************
 

Wednesday, October 2, 2024

ప్రశ్నలు... ప్రశంసలూ...


      
*****************************************

      అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఓ ఆహ్లాదకరమైన అంశం గురించి చెప్పాలనుకుంటున్నాను. ముద్దబంతి పూల గురించి మనందరికీ బాగా తెలుసు కదా.. వీటిని తలుచుకుంటే చాలు...మన తెలుగు సినిమాల్లో చాలా చాలా పాటలు గుర్తొస్తాయి కూడా..


--- ముద్దబంతిపువ్వులో మూగకళ్ల ఊసులో...
--- బంతిపూల రథాలు మా ఆడపడుచులు...
--- భామా భామా బంతీపువ్వా...
--- బంతిపూల జానకీ జానకీ...

ఇలా చాలా చాలా పాటలే ఉన్నాయి బంతిపూల మీద...
---- ఈవిధంగా సినీకవుల కలం  బంతిపూల మీదకు మళ్ళడానికి ఆ పువ్వు యొక్క ముగ్ధమనోహర అందమేనంటే అతిశయోక్తి కాదేమో!
   కన్నెపిల్లల వాలుజడల్లో ఒక్క పువ్వు పెట్టినా చాలు ఆ జడకే కొత్త అందాన్నిచ్చి అలరించే ఈ ముద్దబంతి పువ్వు ఇంతులందరికీ ఇష్టసఖి అంటే వింతేముంది!!
 ఒక్క సిగ సింగారానికేనా...! పండగపబ్బాలొస్తే చాలు...వీధుల్లో రాశులుగా దర్శనమిచ్చే ఈ పసుపు,ఎరుపు వర్ణాల బంతిపూలు మన గుమ్మాలకు తోరణాలుగా, సంప్రదాయానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఏ శుభకార్యం జరిగినా  అలంకరణలో ముందుగా కనిపించేదీ ఈ సుమబాలలే...!
   ఓ సంక్రాంతి పర్వదినాన బుట్ట నిండుగా మా ఇంటికొచ్చిన ఈ పరిమళభరిత బంతి పూలను చూడగానే...వెంటనే వాటితో మాట కలిపి,ఏవేవో ప్రశ్నలు అడగాలనిపించింది నాకు... వాటిలో మరీ ముద్దొస్తున్న ఓ పువ్వును అందుకుని మొదలెట్టాను ఇలా...🙂




ఏ తోటలోన..ఏ కొమ్మ పైన..విరబూసినావే...
ఏ దోసిలి నిండి...ఎన్నెన్ని దూరాలు నడిచొచ్చినావే 
మాకోసం విరిసీ...మాముంగిట నిలిచి 
మా ఇంట వెలుగులే వెదజల్లినావే 
బంతిపువ్వా...ఓ బంతిపువ్వా...        /ఏతోటలోన /

మా ఇంటి గడపకు పసుపునే అద్దినావు 
మామిడాకు పచ్చదనం నీకు జంట కాగా 
గుదిగుచ్చిన మాలవై గుభాలిస్తు నువ్వు 
మాఇంటి గుమ్మానికి తోరణం అయ్యావు...
బంతిపువ్వా... ఓ బంతిపువ్వా...     /ఏ తోట లోన /

ముంగిట్లో ముత్యాల ముగ్గులు 
ఆనడుమ గొబ్బెమ్మల మెరుపులు 
ఆపైని ఠీవిగ  నీ సోయగాలు 
వర్ణించ నా తరమా...ఓ పుష్పరాజమా...
బంతిపువ్వా... ఓ బంతిపువ్వా...    /ఏ తోట లోన /

వాలుజడల వయ్యారి భామలు 
ఆ సిగలో ఒదిగిన పూబంతులు 
వేయిరేకులొక్కపరి విచ్చుకున్న రీతి గనీ 
చందమామ చిన్నబోయి దాగింది చూడు మరీ...!

ముద్దరాలి ముద్దుమోము నీముందది ఏపాటి..!
నిజం నిజం... నిజం'సుమా'.. నీకు నీవె సాటి..
బంతిపువ్వా... ఓ బంతిపువ్వా...  /ఏ తోట లోన /

  🙂 
అలా చూడచక్కని ఆ ముద్దబంతి పూలపై ప్రశ్నలూ, ప్రశంసలు కురిపించాను. బదులుగా అవి ఏమివ్వగలవు చెప్పండి...! వాటి అందచందాలతో పరిమళాలు వెదజల్లుతూ మనల్ని అలరించడం, మన గృహాలకు అలంకారాలుగా మారడం తప్ప...!!
   అదండీ... ముద్దబంతి పూల ముచ్చట.. 🙂🤗

           🌺 అందరికీ ధన్యవాదాలు 🌺