Monday, November 30, 2020

వర్షం ఆగింది

             ఫెళఫెళమంటూ ఉరుము ఉరిమిన శబ్దం. ఎక్కడో పిడుగు పడినట్టుంది. ఆకాశం విరిగి మీద పడుతుందా అన్నట్లు అనిపించి ఒక్క ఉదుటున లేచి కూర్చుంది కమల. 

  వారం నుండీ ఎడతెరిపిలేని వర్షం! అదో పాత ఇల్లు. రెండు గదులు ఉంటుంది. చిన్న వంటిల్లు, ముందు ఓ చిన్న వరండా. అందులోనే ఓ పక్క టాయిలెట్స్. వంటగది రెండు చోట్ల, రెండోది ఓవేపున, ఇంకా వరండా అంతా కారుతూనే ఉంది. ఇల్లంతా ఒకలాంటి బూజు వాసన! బొట్లు బొట్లుగా కారుతున్న చోట సత్తు గిన్నెలు పెట్టేసింది కమల. గదిలో కారనివేపు మంచం మీద పిల్లలిద్దర్నీ పడుకోబెట్టి, అక్కడే వారగా కింద దంపతులిద్దరూ సర్దుకున్నారు. 

     పడుకున్న కృష్ణమూర్తికి నిద్రన్నది పట్టడం లేదు. ఆరు సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఉంటున్నారు. అద్దె పన్నెండు వందలు. ఓనరు మంచివాడే! అద్దె పెంచమని అడగట్లేదు. అన్నింటికీ అనువుగా ఉంది. అతనా చిరుద్యోగి. చేతికొచ్చే ఎనిమిది వేల తోనే అన్నీ సరిపుచ్చాలి. పెరుగుతున్న పిల్లలు, అంతకంటే వేగంగా పెరిగే ధరలు-- ఇవన్నీ ఆలోచించి ఇల్లు మారే ఆలోచన చేయటం లేదు కమలా, తనూ. కానీ రెండు సంవత్సరాలుగా వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఈ చికాకు భరించడం శక్యం కావడం లేదు. పోనీ మరో మంచి ఇంటికి మారి పోదామా అంటే బొటాబొటిగా సరిపోయే జీతం వెక్కిరిస్తోంది. కానీ పరిస్థితి చూస్తుంటే ఇక్కడ ఉండలేమనిపిస్తోంది. ఆలోచనలతో తలమున్కలౌతూన్నాడతను. 

   ఇవతల కమల ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. వెనక వీధిలోని ఇళ్లు ఎంత అందంగా ఉంటాయి! చూడచక్కటి రంగులతో, ఇంటి ముందు పూల మొక్కలతో ఎంత బాగుంటుందా వీధంతా! నిజంగా అలాంటి ఇంట్లో ఎప్పటికైనా తాము ఉండగలరా? వెంటనే ఆమెకు భర్త సంపాదన గుర్తొచ్చి నీరసం కమ్ముకు వచ్చేసింది. రెండేళ్లుగా కలలు కంటూ ఉంది అలాంటి ఇంట్లో ఉండాలని. కానీ సాధ్యమా! ఈసారి విపరీతమైన వానలతో ఈ ఇల్లు మరీ పాడైపోయింది. ఇంటి ముందు మట్టిరోడ్డు అంతా బురదమయం. నడవాలంటేనే జారి పడే పరిస్థితి! ఎలాగైనా భర్త నొప్పించి కాస్త అద్దె ఎక్కువైనా దీని కన్నా మెరుగ్గా ఉండే ఇంట్లోకి మారితే బావుంటుంది. ఇలా  -- నిద్రకు దూరమైపోయి ఆ ఇద్దరి ఆలోచనలూ ఓ పట్టాన తెగడం లేదు. 

                       ********************

    తెల్లారింది. వర్షం సన్నగా కురుస్తూనే ఉంది. పిల్లలింకా నిద్ర లేవ లేదు. కమల కూడా రాత్రంతా నిద్ర లేక అలసి పోయిందేమో, పడుకునే ఉంది. పైగా రోజు ఆదివారం. కృష్ణమూర్తే ముందుగా లేచాడు. 

" కమలా, లే, లేచి త్వరగా కానివ్వు. మా ఫ్యాక్టరీ కి దగ్గర్లో ఏమైనా అద్దె ఇళ్ళు ఉన్నాయేమో చూసొద్దాం...... " 

 ఒక్కసారిగా నిద్ర మత్తు వదిలి సంభ్రమంగా లేచి కూర్చుంది కమల. రోగి పాలే కోరాడు, డాక్టరూ పాలే తాగమన్నాడు అన్నట్లుగా ఆమె మనసంతా సంతోషం అలుముకుంది. లేచి, గబగబా పనుల్లో జొరబడింది. పదింటికల్లా వంట పూర్తి చేసుకుని, పిల్లలకు జాగ్రత్తలు చెప్పి బయట పడ్డారిద్దరూ. ఆ టైంలో బురద రోడ్డు మరింత దరిద్రంగా తోచింది ఇద్దరికీ. ఎలాగోలా నడిచి, రోడ్డెక్కి ఆటోలో కూర్చున్నారు. కృష్ణమూర్తి ఫ్యాక్టరీ కి దగ్గర్లో ఉన్న మూడు వీధులూ మధ్యాహ్నం దాకా తెగ తిరిగితే, రెండిళ్ళు అద్దెకున్నాయని తెలిసింది. ఒకటి మూడు వేలు చెప్పారు. వెంటనే వద్దనుకుని వెనుదిరిగారు. మరోటిరెండువేల మూడు వందలు చెప్పారు. కరెంటుతో కలిపి రెండు వేల అయిదు వందల దాకా అవుతుంది. తమకు భారమే. కానీ ఇల్లు నీట్ గా, సౌకర్యంగా ఉంది. పిల్లలను చేర్చడానికి ఇంకో స్కూల్ కూడా దగ్గర్లోనే ఉన్నట్టుంది. తను కాస్త ఓవర్ టైం చేస్తే సరిపోతుంది. ఈ వానాకాలం బాధలన్నీ ఇకమీదట ఉండవు, అనుకుంటూ కమలకూ అదే చెప్పాడు. అప్పుడే కమల ఊహల్లో తేలి పోసాగింది. వెంటనే నిర్ణయం తీసుకుని, అంతో ఇంతో అడ్వాన్స్ ఇచ్చేద్దామనుకుని ఓనర్ కోసం అడిగారు. ఓనర్ ఊరికి వెళ్ళాడని, రేపు వస్తాడనీ, తాళం చెవి ఇచ్చి ఎవరైనా వస్తే చూపించమని చెప్పారని పక్క పోర్షన్ వాళ్ళు చెప్పారు. సరే, రేపు ఉదయం వచ్చి మాట్లాడతానని చెప్పి, కృష్ణమూర్తి కమల తో పాటు తిరుగు ముఖం పట్టాడు. 

   వాన వెలిసింది. రోడ్డు దాకా నడిచి రావడానికి పది నిమిషాలు పైనే పట్టింది వాళ్లకి. ఆటో కోసం నిలబడ్డారిద్దరూ. పావుగంట గడిచినా ఒకటీ రాలేదు. తర్వాత ఒకటి వచ్చి నిలబడింది. కానీ అతనడిగింది చూస్తే తల తిరిగింది ఇద్దరికీ. మరో పావుగంట వేచి చూసి, ఎలాగోలా ఓ ఆటో ఎక్కేశారు. అమ్మో! ఇక్కడ ఆటో సౌకర్యం అంతంత మాత్రమే నన్నమాట! అదీ ఎంతెంత అడుగుతున్నారు! అలా పోతూ పోతూ ఉంటే ఓవైపు ఓ స్కూలు కనబడింది. ఆరోజు ఆదివారమైనా కాంపౌండ్ లోపల యూనిఫాం తో ఉన్న కొందరు పిల్లలుఅట్లాడుకుంటూ ఉన్నారు. పెద్ద బిల్డింగ్, చుట్టూ పెద్ద కాంపౌండ్, అందంగా కనిపించే చెట్లు. కచ్చితంగా గవర్నమెంటు బడి అయితే కాదు. ఫ్యాక్టరీకి దగ్గర్లోనే స్కూల్ ఒకటుందని విన్నాడు కానీ ఎప్పుడూ చూడలేదు. ఇదేనన్నమాట! దీంట్లో తన పిల్లల్ని చేరిస్తే ఫీజులు, డ్రెస్సులు, ఇతర ఖర్చులు తడిసి మోపెడై తన నడుం విరగడం ఖాయం. ఇంటద్దె ఓ వెయ్యి ఎక్కువ అవుతుంది లే అనుకున్నాడు గానీ ఈ లెక్కన మూడు వేలకు తక్కువ కాదు. కృష్ణమూర్తికి గాభరా మొదలైంది. అవతల కమల పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏదో కొత్త ఇంటికి మారదాం లే అన్న ఆనందం ఆమెలో నెమ్మదిగా ఆవిరై పోసాగింది. తన కోరిక తీర్చుకోవడానికి భర్త ఆరోగ్యం ఫణంగా పెట్టాలా? ఆమె గుండె బరువెక్కుతూ ఉంది. ఇదేమీ పట్టని ఆటో దూసుకు పోతోంది. ఆలోచనల్లో పడి ఇద్దరూ గమనించలేదు గానీ తగ్గిపోయిన వర్షం ఎప్పుడు మొదలైందో మరి మళ్లీ మెల్లిగా విజృంభించడం ఆరంభించింది. ఆటో వెళ్తూ వెళ్తూ రద్దీగా ఉన్న ఓ చోట ఆగింది. వర్షం నీళ్లతో రోడ్డంతా ప్రవాహంలా ఉండి, వాహనాలన్నీ మెల్లిగా కదుల్తూ ట్రాఫిక్ స్తంభించిపోయిఉంది. అనుకోకుండా వారి దృష్టి అటుపక్కగా రోడ్డు కింది భాగాన ఉన్న గుడిసెల మీద పడింది. వచ్చేటప్పుడు గమనించలేదు గానీ, ఆచివర నుండి ఈ చివర వరకూ పూరి గుడిసెలే ! పూర్తిగా తడిసిపోయి ఉన్నాయి ! వాటి ముందు బురద నీరు ప్రవహిస్తూ ఉంది. కొందరు ఆడా మగా గుడిసెల ముందు నిలబడి ఉన్నారు. పిల్లలు మాసిన బట్టలతో, చింపిరి జుట్లతో ఆ నీళ్లలోనే ఉల్లాసంగా ఆడుతున్నారు. ఆ దృశ్యం చూసేసరికి ఇద్దరికీ మతులు పోయినట్లయింది. దేవుడా ! ఇలాంటి చోట్ల, ఈ గుడిసెల్లో, ఈ వర్షంలో ఈ మనుషులు ఎలా ఉండగలుగుతున్నారు?  హఠాత్తుగా కమల లో ఏదో అలజడి ! తాముంటున్న ఇల్లు గుర్తొచ్చి, వీళ్ల కన్నా తామెంత మెరుగ్గా జీవిస్తున్నారు! వర్షాకాలం కొద్దిరోజులు మాత్రమే ఇబ్బంది. తర్వాత అంతా మామూలే. మూడు పూట్లా తిండికి లోటు లేదు, పిల్లల్ని ఎంచక్కా చదివించు కుంటున్నారు. ఇంతకన్నా కావలసిందేముంది? అనవసరంగా స్థాయికి మించిన కోరికలతో మనసంతా పాడు చేసుకుంటున్నాను గానీ --- అనుకుంటూ భర్త వైపు చూసింది. అతనూ తదేకంగా అటే చూస్తున్నాడు. వర్షం జోరు కాస్త తగ్గినట్లుంది, ఆటో మెల్లగా దారి చేసుకుంటా కదిలి కాసేపట్లో ఇంటి దరిదాపుల్లోకి వచ్చేసింది. చిత్రంగా అక్కడ వర్షం జాడ లేనే లేదు. ఉదయం బురదగా ఉన్న దారంతా ఆరిపోయి నడవడానికి వీలుగా తయారయింది. ఇద్దరూ ఆటో దిగి, ఆ దారెంట నడుచుకుంటూ ఇల్లు సమీపించారు. ఉదయం బయలుదేరేటప్పుడు ఎంతో దరిద్రంగా అనిపించిన ఈ మట్టి రోడ్డు ఇప్పుడు పర్వాలేదు, సౌకర్యం గానే ఉందనిపించింది వాళ్లకి! ఇంటి బయటే బాబు, పాప ఇద్దరూ చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటున్నారు. అమ్మ నాన్నల్ని చూడగానే పరిగెత్తుకుంటూ ఎదురొచ్చారు. 

   లోపలకి వెళ్లి ఇల్లంతా శుభ్రంగా తుడిచేసింది కమల. ఇల్లు ఇప్పుడెంతో ఆహ్లాదంగా కనిపించిందామెకు. సాయంత్రం వరండాలో ఎదురెదురుగా కూర్చున్నారిద్దరూ. పిల్లలు పుస్తకాల సంచులు ముందేసుకుని కబుర్లాడుకుంటున్నారు. 

" నాన్నా, నిన్న ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు. నేనే క్లాస్ ఫస్ట్. మా టీచర్లంతా నన్నెంత మెచ్చుకున్నారో తెలుసా!... " బాబు చాలా ఆనందంగా చెప్పాడు. 

" అమ్మా, నేను రన్నింగ్ రేస్ లో, స్కిప్పింగ్ లో ఫస్ట్ వచ్చా. రిపబ్లిక్ డే రోజు నాకు బోలెడు ప్రైజులొస్తాయి, అన్న కంటే కూడా.. "  పాప మరింత సంతోషంగా చెప్తూ అమ్మ పక్కలో కొచ్చి కూర్చుంది. 

" అమ్మా, మా టీచర్లంతా ఎంత మంచివాళ్ళో తెలుసా?.. " బాబు రెట్టించిన ఉత్సాహంతో చెప్పాడు. వాళ్ల సంతోషం అవధులు దాటుతోంది. కమలా, కృష్ణమూర్తి -- ఇద్దరూ ముచ్చటగా పిల్లలిద్దరినీ చూస్తూ ఉండిపోయారు. 

" గవర్నమెంటు స్కూళ్లలో చదువు రాదన్నదెవరు? వేలకు వేలు గుమ్మరిస్తేనే మంచి చదువొస్తుందా? పిల్లల బుర్రల్లో 'స్టఫ్ ' అన్నదుండాలి గానీ " అనిపించిందిద్దరికీ. ఇద్దరూ ఓ విధమైన భావోద్వేగంతో పిల్లలిద్దర్నీ అక్కున చేర్చుకున్నారు. 

   ఇందాక చూసొచ్చిన ఇల్లు, ఇల్లు మాత్రమే బాగుంది, మిగతా సౌకర్యాలన్నీ అంతంత మాత్రమే. ఖర్చు కూడా తమ స్థాయికి చాలా ఎక్కువ! ఇక్కడ -- ఇల్లొక్కటే అసౌకర్యం! తతిమ్మావన్నీ తమకు అందుబాటులో ఉన్నాయి. 

 అరగంట తర్వాత బయటికి వచ్చి,  " కమలా, నేనలా వెళ్లి మన ఇంటి ఓనర్ ను కలిసి వస్తాను. ఇంటికి కొన్ని మరమ్మతులు చేయించమని రిక్వెస్ట్ చేస్తాను. కావాలంటే ఖర్చు మనమే పెట్టుకుందాం. ఆపాటి దానికి ఇల్లు మారడం దేనికి? ఇక్కడ మనకు అన్నిటికీ సౌకర్యంగా ఉంది.... " అన్నాడు కృష్ణమూర్తి. 

 కమల వదనం లో చిరు దరహాసం! ఆమె అభిప్రాయమూ అదే మరి! ఇప్పుడామెకు వెనక వీధిలోని పెద్ద పెద్ద బిల్డింగులు గుర్తుకు రావడం లేదు. ఇందాక వస్తూ వస్తూ చూసిన గుడిసె వాసులే కనిపిస్తున్నారామె కళ్ళముందు! 

" ఎప్పుడైనా సరే మన స్థితిగతుల్ని మనకంటే తక్కువ స్థాయి వారితోనే పోల్చి చూసుకోవాలి " అన్న సత్యం ఇందాకే ఆమెకు బోధపడింది.

" మన స్థాయిని బట్టి మన మానసిక స్థితి కూడా మారుతూ దానికి తగ్గ మనస్తత్వం అలవరచుకుంటే మనశ్శాంతికి కొదవ ఉండదు కదా! ",  అన్న ఆలోచన ఆమెలో పొడసూపి ఎంతో తృప్తిగా నిట్టూర్చింది. 

  లేచి బయటకు నడిచింది కమల. కృష్ణమూర్తి రోడ్డు దాకా నడిచి వెళ్లడం, వెంటనే వచ్చిన ఆటో ఎక్కడం చూసి వెనుదిరుగుతూ ఎందుకో పైకి చూసింది. ఆకాశం నిర్మలంగా ఉంది. వర్షం పూర్తిగా తగ్గిపోయింది. 

*************************************************

                        🌷భువి భావనలు 🌷

*************************************************

3 comments:

  1. nice article... నేను కూడ జంతువులు వాటి జీవితం గురించీ వ్రాస్తున్న sir please support me
    http://tganimalstelugu.blogspot.com

    ReplyDelete
  2. daadapu kamala krishnamurthy la kate maa jeevitam kuda , bagundi

    ReplyDelete
  3. మధ్యతరగతి ఆలోచనలు, కోరికలు --అవి తీరనప్పుడు సర్దుబాటు ధోరణులు--ఇంకా చిన్న చిన్న సరదాలు, ఆనందాలువారి విషయంలో అత్యంత సహజమే కదా. Thanks for the comment.

    ReplyDelete