Monday, September 14, 2020

చీమను చూసి నేర్చుకో.... ' చిన్నారి కథ '

   రాధాకృష్ణ మనసంతా అల్లకల్లోలంగా ఉందాక్షణంలో. ఆ విషయం తెలిసినపుడు ముందుగా ఊహించిందే అయినా వాడి మనసు ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇంతకీ ఆవిషయమేమి టంటే ఆ అబ్బాయి పదోతరగతి రెండోసారి కూడా తప్పాడు. 
   మొదటిసారి తప్పినప్పుడు పెద్దగా వాడికి ఏమీ అనిపించలేదు. కానీ ఇంట్లో తండ్రి చేత తెగ చీవాట్లు తిన్నాడు. వాళ్ళమ్మయితే ఆ రోజంతా ముఖం తిప్పుకొని, రెండు రోజుల దాకా వాడితో మాట్లాడనేలేదు. పరీక్ష పోయినందుకు కాదు గానీ, ఈ చిరాకంతా భరించడం వాడికి పెద్ద తలనొప్పి అయింది. 
  అన్నింటినీ మించి వాడు భరించలేని విషయం, వాళ్ళ పక్కింటి వనజ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురావడం ! తన నెంబర్ పేపర్లో లేదని తెలిశాక ఆ పిల్ల తన వైపు చూసిన చూపు, ఎగతాళిగా నవ్విన నవ్వు పదేపదే వాడికి గుర్తొచ్చి ఉక్రోషం ముంచుకొచ్చింది. 
  ఏదేమైతేనేం, తప్పిన రెండు సబ్జెక్టులూ మళ్లీ కట్టాడు. కానీ, వాడి దురదృష్టం! రెండింట్లోనూ మళ్లీ తప్పాడు. ఫలితాలు చూసుకుని కాళ్ళీడ్చుకుంటూ వస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఎదురుగా జూనియర్ కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్న వనజ! మళ్లీ అదే చూపు, అదే నవ్వు! తల కొట్టేసినట్లయింది రాధాకృష్ణ కి. అంతే! గిర్రున వెనక్కి తిరిగి ఊరిబయటి కాలువగట్టుకు దారితీశాడు. ప్రస్తుతం వాడి మన స్థితికి కారణం అదే. రాత్రి యథాప్రకారం ఇంట్లో తిట్లు, శాపనార్థాలు! 
   " ఇక వీడు లాభం లేదే, ఊర్లో ఏ పెద్దకాపు ఇంట్లోనో పాలేరుగా కుదిరిస్తే తిక్క కుదురుతుంది.... "
 తల్లితో వాళ్ళ నాన్న అంటున్న మాటలు వింటుంటే రాధాకృష్ణ రక్తం ఉడికిపోయింది. తల్లి చాటు గా కళ్ళు ఒత్తుకోవడం చూసి ఓ పక్క బాధ కలిగింది. పట్టువదలని విక్రమార్కునిలా మళ్లీ పరీక్షకు కట్టాడు ఉక్రోషంతో. 
    దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగుచేయలేరన్నట్లుగా రాధాకృష్ణను ఈసారీ విధి వెక్కిరించింది. తల బాదుకుని చద్దామన్నంత విసుగు పుట్టింది వాడికి. ఈసారి అమ్మా నాన్నల్ని ఎలా ఎదుర్కోవాలన్న తలంపు వాణ్ణి మరింత కుంగదీసింది. ఓ క్షణం ఏ రైలు పట్టాల మీదో తల పెట్టేద్దామా అన్న ఆలోచన కూడా వాడి బుర్రలో దూరక పోలేదు. మరుక్షణమే రైలు బండిచప్పుడు గుర్తొచ్చి భయంతో వాడి గుండె దడదడ లాడింది. ఇక చేసేదేమీలేక, గుండె బరువెక్కి ఇంటికి వెళ్ళడానికి మోహం చెల్లక, తన అలవాటు ప్రకారం ఊరి బయట కాలవ గట్టు కేసి దారితీశాడు. 
   గట్టుమీద కూర్చుని కాలువలోని నీటి ప్రవాహాన్ని తదేకంగా చూస్తోన్న వాడి మస్తిష్కంలో నిరాశ పేరుకొని పోసాగింది. అందరూ ఎంతో సునాయాసంగా పాస్ అయిపోతుంటే తను ఎందుకు ఇలా ప్రతిసారీ ఫెయిల్ అయిపోతున్నాడో వాడికి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అలా ఆలోచిస్తున్న వాడి దృష్టి ఉన్నట్టుండి కాలువ దిగువ భాగాన గడ్డి మీద పాకుతున్న ఓ గండు చీమ మీద పడింది. రెల్లు గడ్డి మీదనుండి అది మాటిమాటికీ కిందకి జారుతూ ఉంది. పైకి పాకి ఒడ్డు చేరడానికి ఎంతో శ్రమ పడుతోంది కానీ, చేరలేక పోతోంది. గడ్డి మీద నుండి ఏమాత్రం జారి కింద పడినా నీటి ప్రవాహం లో పడి కొట్టుకుపోతుంది. 
  తన మనస్థాపం తాత్కాలికంగా కాస్త పక్కకు పెట్టి, ఒకింత ఉత్కంఠగా రాధాకృష్ణ దాన్నే గమనించసాగాడు. అలా అలా ప్రయత్నిస్తూ అది చూస్తోండగానే చిట్టచివరకు ఒడ్డుపైకి చేరి పోయింది. అమితాశ్చర్యం కలిగింది రాధాకృష్ణకి. సరిగ్గా అప్పుడే తలతిప్పి చూసిన వాడికి ఎప్పుడు వచ్చిందో ఏమో గానీ వెనగ్గా నిలబడి ఈ తతంగమంతా గమనిస్తున్న వనజ కనిపించింది. మళ్లీ అదే చూపు, అదే నవ్వు ! అంతే! వాడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పట్టరాని కోపంతో ఆ అమ్మాయి వైపువిసవిసా రెండడుగులు వేశాడు. 
' ఆగు '
అంటూ ఒకింత హెచ్చుస్థాయిలో చేయి చాపుతూ వారించింది వనజ. మంత్రం వేసినట్లు ఠక్కున ఆగిపోయాడు రాధాకృష్ణ !
".... ప్రస్తుతం నీవున్న మానసిక స్థితి నేను అర్థం చేసుకోగలను. ఈ రోజెందుకో నీతో రెండు మాటలు చెప్పాలనిపించి నీ వెనకే వచ్చాను.... "
విస్తుబోతూ చూస్తోన్న రాధాకృష్ణ నే చూస్తూ కొనసాగించింది వనజ. 
".... నా మీద కోపం తెచ్చుకోవడం లో అర్థం లేదు. నిన్ను నీవు ఓసారి పరీక్షించుకో. ప్రతిసారీ ఇంట్లో మీ నాన్న కోప్పడతాడనో, అమ్మ బాధపడుతుందనో పరీక్ష ఫీజు కడుతున్నావు గానీ ఒక్కనాడన్నా పాస్ అవ్వాలన్న కోరికతో పుస్తకం పట్టి చదివావా? పరీక్షలయితే రాసి వస్తున్నావు గానీ, పాసవుతానన్న ధీమా నీలో ఎప్పుడైనా కలిగిందా?  చిన్న చీమ నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పదే పదే పడిపోతూఉన్నా ప్రయత్నం మాత్రం మానుకోలేదది ! పట్టుబట్టి శ్రమించి గట్టు చేరుకుంది చూడు. దానికున్నపాటి పట్టుదల నీకూ ఉండి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పాస్ అయిపోయి ఉండేవాడివి. నీలో తెలివితేటలు, జ్ఞాపకశక్తి, ఆలోచన, అవగాహన--- అన్నీ ఉన్నాయి. లేనిదల్లా పట్టుదలే! పాస్ అయి తీరాలన్న పట్టుదల!.... "
 స్థిర కంఠంతో వనజ తీక్షణంగా అంది. ఆ క్షణంలో కళ్ళను కమ్ముకున్న తెర ఏదో మెల్లిగా జారిపోతున్న భావన రాధాకృష్ణ లో! 
  నిజమే! పరీక్ష ఫీజు కట్టడం తో తన పని అయిపోయింది అనుకునే వాడు. తండ్రి పోరు పడలేక ఆ తతంగం కాస్తా పూర్తి చేస్తున్నాడే గానీ నిజానికి చదివి పాసవ్వాలన్న కోరిక తనలో ఎక్కడుండేది? వనజ ను చూసి ఉక్రోషంతో కోపగించుకున్నాడు గానీ ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పేముంది? వాస్తవమే మాట్లాడింది. ఈసారైనా పట్టుబట్టి విజయం సాధించాలి. తన నిర్ణయం కళ్ళలో ప్రతిఫలిస్తూ ఉండగా వనజ వైపు సంభ్రమంగా చూసాడు రాధాకృష్ణ. మళ్లీ అదే చూపు! అదే నవ్వు! కానీ ఈ సారి రాధాకృష్ణకు ఆ పిల్ల పై కోపం రాలేదు సరికదా చెప్పలేనంత ఉత్సాహం మరింత సంతోషం కలిగింది!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

                🌺🌺'భువి' భావనలు 🌺🌺

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment