🌺🌺 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
పసిపాపకు పాలిచ్చి జోకొడుతూ నిద్రబుచ్చుతుంది తల్లి.అది పాలు తాగే పసిపాపల వరకే వర్తిస్తుంది. అందులో ఆ అమ్మ శ్రమ ఉంటుంది, కానీ... కొంతవరకే...! అయితే... రెండు నుండి ఐదేళ్ల పిల్లల విషయంలో అది మాత్రమే సరిపోదు. వాళ్లకి అన్నం తినిపించడమన్నది ఆ తల్లికి...అబ్బో!! చాలా కష్టంతో కూడుకున్న తతంగమే...! ఒకచోట కూర్చోరు... ఒకచోట నిలబడరు... అటూ ఇటూ పరుగులు! దాక్కోవడాలు !! అంతేనా.. ఇంకా ఎన్నో ఎన్నెన్నో... చిలిపి చేష్టలు...! అలాగని బుజ్జి తల్లి కడుపు నింపకుండా ఆ తల్లి ఉండగలదా !
ఎన్నో ఊసులు చెప్తుంది... ఏవేవో కబుర్లు చెప్తుంది... ఉన్నవీ లేనివీ కల్పించి కాసేపు మైమరపిస్తుంది. ఏదైతేనేం... ఆకాస్త బువ్వ బుజ్జిదాని కడుపులోకి వెళ్లేదాక ఊరుకోదుగా...! ఆ సహనమూర్తికి జోహార్లు అర్పించాల్సిందే..!
ప్రతి స్త్రీ తన జీవితంలో ఎదుర్కొనే ఓ తీపి అనుభవం ఇది...కాదంటారా!ఆ బుజ్జితల్లి రేపు తానూ తల్లిగా మారినపుడు..తన పాపకు అలాగే తినిపించాల్సి వచ్చినప్పుడు...ఆ తల్లికి ఒకనాటి తన తల్లి పాట్లు, పాటలు గుర్తుకు రాక మానవు.ఒకనాటి తన అల్లరి, తల్లి మురిపెం ఆమె పెదాలపై చిరునవ్వు చిందించక మానదు.తనలో నిక్షిప్తమై దాగివున్న ఆ జ్ఞాపకాల దొంతర..అలా అలా కదిలి...ఇలా ఓ పాటగా ఎలా మారిందో వినండి... 🙂
అమ్మ నాకు తినిపించే
అల్లిబిల్లి కబుర్లతో
ఆకాశం చూపిస్తూ
అపరంజిని నేనంటూ //అమ్మ//👧
ఇలకు దిగిన ఇలవేల్పునట
ఈశ్వరవరప్రసాదినట
ఉన్నదంత నాదంటూ
ఊర్వశినీ నేనంటూ //అమ్మ//🤱
ఎన్నడూ లేదంట
ఏలోటూ నాకంట
ఐశ్వర్యం నాదంటూ
ఐశ్వర్యను నేనంటూ //అమ్మ//👧
ఒరులెవరూ సాటిరారంట
ఓనాటికి నేనవనికి
ఔతానట మహారాణిని 👧
అందలాలు ఎక్కేనట
అః !అహహ !!
నేనే ఒక నియంతనట !! //అమ్మ//
🤗
ఎప్పుడూ పాప గురించి అమ్మ చెప్పే కబుర్లేనా...! ఓసారి అమ్మ గురించి పాప చెప్పే కబుర్లు వింటే ఎలా ఉంటుంది...! ఆ ఆలోచనతో ఓ చిన్న ప్రయత్నం చేశానంతే 🙂
తల్లి అయిన ప్రతి స్త్రీకి ఇది తప్పనిసరిగా ఎదురయ్యే అనుభవమే... మరపురాని జ్ఞాపకమే...! బిడ్డకు జోల పాడి నిద్ర బుచ్చడానికి ఆ తల్లి గొప్ప సింగరే అయి ఉండాల్సిన అవసరం లేదు కదండీ..! అమ్మ ఎలా పాడినా పాపకు ఇష్టమే. హాయిగా కళ్ళు మూసుకుని నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటుంది. అదండీ...🙂🤱
.
మరొక విషయం... ఈ బాల గేయాన్ని గమనిస్తే, ప్రతి లైన్ లోని మొదటి పదంలోని మొదటి అక్షరం మన తెలుగు వర్ణమాలలోని అచ్చులు... అ నుండి అః వరకు కనిపిస్తాయి. చాలా కాలం క్రితం చిన్నపిల్లల కోసం నేను రాసుకున్న పాట ఇది. ఈ పాట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ తరగతుల విద్యార్థులకు నేర్పించడానికి అనువుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాను.
అందరికీ ధన్యవాదాలు.
*******************************
No comments:
Post a Comment