Monday, December 12, 2022

నువ్వు నాకు నచ్చలేదు...

🌷

      సాయంత్రం నాలుగు గంటలకు ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని,ఇల్లు చేరుకున్నాడు నూతన్ కుమార్  . ఇంట్లో అంతా అప్పటికే రెడీ అయి ఉన్నారు. అతను రాగానే పది నిమిషాల్లో బయటపడి కారెక్కి  బయలుదేరారు. మరో పావు గంటలో ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంతకీ ఆ ఇల్లు నూతన్ కుమార్  కోసం పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళిన ఇల్లు.
    అతనికి ఇదేమీ  కొత్త కాదు.మొదటిదీ కాదు. పదిహేనవది ! అతనో  సాఫ్ట్ వేర్  ఇంజనీర్. మంచి పేరున్న కంపెనీలో లక్ష పైగానే అందుకుంటున్నాడు.  పైగా  ఒక్కడే కొడుకు. ఆస్తిపాస్తులూ దండిగానే ఉన్నాయి. ఇక చెప్పేదేముంది! అతని చూపులు నేల మీద ఉండడం లేదు. extraordinary expectations  ! పోనీ... ఏమైనా గొప్ప అందగాడా అంటే... జస్ట్.. యావరేజ్..! పొడవు అంతంత మాత్రమే. చామన ఛాయ..చిరుబొజ్జ! పల్చని జుట్టు! ఇదీ అతని పర్సనాలిటీ !
   ఉద్యోగంలో చేరి, సంవత్సరం గడిచాక, మొదటిసారి ఓ సంబంధం తెలిసిన వాళ్ల ద్వారా వస్తే చూడడానికి వెళ్లారు. అమ్మాయి చక్కగా ఉంది. తనూ సాఫ్ట్ వేర్ ఇంజనీరే. మంచి రంగు, ఒడ్డు పొడుగూ...సుపర్బ్ గా ఉంది. కానీ, వెంటనే నచ్చింది అని చెప్పడానికి అహం అన్నది అడ్డొచ్చి... ఇంటికి వెళ్లి కబురు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. మొదటి సంబంధమే చక్కగా ఉన్నందుకు కొడుకు అదృష్టానికి మురిసిపోయారు తల్లిదండ్రీ. తీరా.. అతని 'రెస్పాన్స్' చూడగానే ఆలోచనలో పడ్డారు.  
" ఏమిటో నాన్నా, అంతా బాగుంది కానీ, ఇల్లే నాకంతగా  నచ్చలేదు. ఆ మర్యాదలూ అంతంత మాత్రమే..మనకొద్దమ్మా..."
 సరే అనుకొని మౌనంగా ఉండి పోయారు తల్లిదండ్రులు. అలా అలా.. మరో నాలుగు సంబంధాలు తెలిసిన వాళ్ల ద్వారానే వచ్చాయి. బ్యాంకు ఉద్యోగిని కలర్ తక్కువ అన్నాడు. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ ను మరీ లావుగా ఉందన్నాడు. మరొకరేమో 'ముదురు' అన్నాడు. అతని వాలకం కనిపెట్టిన బంధుమిత్ర వర్గం చేతులెత్తేశారు. మరో సంవత్సరం ఖాళీ. 
 ఇక లాభం లేదనుకుని, మ్యారేజి బ్యూరోలను సంప్రదించారు. వాళ్ల దగ్గర కొదవేముంటుంది సంబంధాలకి...! కదిలిస్తే చాలు.. కోకొల్లలుగా గుప్పిస్తారు. వాళ్లకు కావాల్సింది 'కమిషన్' ! అంతే. లెక్కకుమిక్కుటంగా చూపించిన మ్యాచెస్ లో ఏది ఎన్నుకోవాలో తెలియక, తల్లిదండ్రుల్నీ, తన కజిన్ సిస్టర్స్ ఇద్దర్ని కూర్చోబెట్టుకుని ఎట్టకేలకు అందరి సూచనల మేరకు  ఓ నాలుగైదు సెలెక్ట్ చేశాడు నూతన్.  వరుసగా మొదలెట్టి ఓ నెలలోపు అన్నీ చుట్టబెట్టేశారు. 
    అప్పుడైనా ఓకే అన్నాడా..! ఒకరు పొట్టి అన్నాడు, ఒకరేమో... ఫోటోలో ఉన్నట్టుగా లేదన్నాడు. ఇంకో అమ్మాయి...అంతా బాగుంది కానీ.. పళ్ళు ఎత్తు అన్నాడు. మంచి ఉద్యోగాలు. స్థితిమంతులు, సంస్కారం కలిగిన కుటుంబాల వాళ్లే...  అయినా... అతని కంటికి మాత్రం ఆనలేదు. అతని విపరీత ధోరణికి అతని ఇద్దరు కజిన్స్ తన పట్టుకొని గుడ్ బై చెప్పేశారు. తమ 'అన్న' అన్నవాడి అందచందాలు, శక్తి సామర్ధ్యాలు తామెరుగనివేమీ  కాదు. వాళ్లకు విచిత్రంగా తోచిందేమిటంటే... చూసిన అమ్మాయిలందరినీ ఇతనే వద్దంటున్నాడు... అమ్మాయిలు అన్ని క్వాలిఫికేషన్ లు  ఉండి కూడా కిమ్మనకుండా ఉంటున్నారు. మరోవైపు... సర్వేలేమో.. అమ్మాయిల సంఖ్య తక్కువ అయిపోయింది.. అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదంటూ ఒకటే ఘోషిస్తున్నాయి..!! దానికీ, ప్రస్తుతం జరుగుతున్న తతంగానికీ లంకె అసలు కుదరడం లేదు..పాపం ! ఇద్దరూ అమ్మాయిలేగా.. ! పైగా పెళ్లి కావలసిన వాళ్ళు!అర్థం గాక ( దిక్కు తోచక )ఆలోచనలో పడిపోయారు !
 తల్లికి,  తండ్రికీ కూడా విసుగొచ్చి చేతులు ముడుచుక్కూర్చున్నారు. ఎవరికితప్పినా బ్యూరో అతనికి తప్పదు కదా ! ఇంకా లోతుగా వెతికి వెతికి... ఓ సంబంధం చూపించాడు. 
    పరవాలేదు, మరీ అంత అందగత్తె కాకపోయినా, అమ్మాయి లక్షణంగానే ఉంది. సాఫ్ట్ వేర్ కంపెనీలో చేస్తోంది. మంచి జీతం. మంచి కుటుంబం! ఇద్దరూ ఒకే ఫీల్డు. బాగుంటుందని తల్లీ దండ్రీ మొగ్గు చూపారు. ఈసారైనా ఇది కుదురుతుందన్న ఆశతో వెళ్లి చూసొచ్చారు. 
" అమ్మా, అంతా బాగుంది.. కానీ, నాకంటే నెలరోజులే చిన్నది.ఎలాగమ్మా... !"
" ఒక్కరోజైనా చిన్నదే కదరా.. అంతా బాగుంది. ఎన్ని చూశాము! అన్నింటిలోనూ ఇది మాకు బాగా నచ్చింది.ఓకే చెప్పేద్దాము... "
అన్నారు ఇద్దరూ. 
" సరే, నాక్కాస్త టైం ఇవ్వండి.. ఆలోచిస్తాను.. "
అంటూ బయటికెళ్లిపోయాడు  నూతన్. అతనాలోచించటానికి నెల పట్టింది. అయినా, గుంజాటన తెగలేదు. ఈలోగా అమ్మాయి తండ్రి ఏ సంగతీ చెప్పండని ఫోన్ చేశాడు. సరిగ్గా అప్పుడే బ్యూరో అతను 'మరోటి' చూపించాడు. సరే.. ఏముంది... చూసొద్దాం.. ఏది బాగుంటే అదే ఓకే చేద్దాం .. అనుకుంటూ ముగ్గురూ వెళ్లారు. తీరా చూస్తే మునుపటివే బెటర్ అనిపించి ఉసూరుమంటూ  తిరుగు ముఖం పట్టారు.
   సరే..క్రితం చూసిన అమ్మాయి తండ్రికి ఫోన్ చేద్దామనుకుంటుండగా... అనుకోని విధంగా బాగా దగ్గరి చుట్టం వచ్చి ఓ సంబంధం చెప్పాడు. తెలిసినవాళ్లయితే బాగుంటుంది కదా అని బిలబిలమంటూ వెళ్లారు. ఇదిగో.. ఈరోజు వెళ్ళింది ఆ సంబంధం కోసమే..! ఇది పదిహేనోది.
    ఫలహారాలు, కాఫీలు పూర్తయ్యాక, అమ్మాయిని చూపించారు. కళ్ళు తిరిగాయి ముగ్గురికీ. పొట్టిగా, నల్లగా,  బాగా బొద్దుగా ఉండి... 'బాబోయ్' అనుకున్న వాళ్ళ మొహాలు ఒక్కసారిగా వాడిపోయాయి. గతంలో చూసిన సంబంధాల తాలూకు అమ్మాయిలంతా కళ్ళముందు కదిలి, వెక్కిరించినట్లయింది  వాళ్లకి ! 
     చివరాఖరికి... వాళ్లకు బోధపడిన నగ్న సత్యం.. అబ్బాయికి గానీ, అమ్మాయికి గానీ, మొదట్లో వచ్చే సంబంధాలే భేషైనవి... సరైనవి.. ఇంకా ఇంకా చూద్దామనుకుంటే, కాలం గడిచే కొద్దీ, వయసు పెరిగిపోయి, తమ ప్రమేయం లేకుండానే శరీర ఆకృతులు మారిపోయి, ఇదిగో ఇలా... ఏదో ఒకటిలే అని సర్దుకుపోయే పరిస్థితి దాపురిస్తుంది...!
 ముగ్గురి కళ్ళు తెరిపినబడి, ఇంటికి వచ్చి చతికిలబడ్డారు. అప్పుడు జ్ఞానోదయమై, తీర్మానించుకుని,  క్రితంచూసిన  పదమూడవ సంబంధం..అదే.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని తండ్రికి ఫోన్ చేశారు.
" మీ అమ్మాయి మాకు నచ్చిందండీ.  ఓ మంచి రోజు చూసుకుని మీ ఇంటికి వచ్చి, అన్ని విషయాలూ మాట్లాడుకుందాం అనుకుంటున్నాం.."
 పెళ్ళికొడుకు తండ్రి గొంతులో ధీమా గమనించిన అమ్మాయి తండ్రి, 
" అలాగాండీ, సంతోషం. ఒక్క నిమిషం.. మీ అబ్బాయి అక్కడే ఉండి ఉంటే, ఓసారి ఫోన్ అతనికివ్వండి. మా అమ్మాయి మాట్లాడుతుందట..."
అన్నాడు. ఓసారి అయోమయంగా చూసి, కొడుక్కి ఫోన్ ఇచ్చాడాయన. 
" హలో.. నూతన్ కుమార్  గారూ.. నేను మీకు నచ్చినందుకు చాలా సంతోషమండీ. ఈ మాట చెప్పడానికి రెండు నెలల సమయం కావాల్సొచ్చింది  మీకు..! కానీ...for your information... sorry to say... మీరు నాకు నచ్చలేదు..."
 ఓ క్షణం ఆగి, 
"...ఒక్కమాట.. ! ఏమీ అనుకోకండి. అడక్కపోయినా ఓ చిన్న సలహా.. పెళ్లిచూపులకి వెళ్ళే ముందు.. మీ ఇంట్లో నిలువుటద్దాలు ఉండే ఉంటాయి..వెళ్లి దాని ముందు నిలబడి, ఓసారి మిమ్మల్ని మీరు పరీక్షగా, తదేకంగా, పరకాయించి చూసుకోండి.."
"..................."
"... అమ్మాయి నా పక్కన నిలబడితే బాగుంటుందా లేదా అని కాదండీ... అమ్మాయి పక్కన నిలబడ్డప్పుడు
నేను బాగుంటానా లేదా అని ఆలోచించుకుంటే మంచిది..."
 ఊహించని ఉత్పాతానికి బుర్ర గిర్రున  తిరుగుతుండగా...
"... బై ది బై... నా పెళ్లి సెటిల్ అయిపోయిందండీ.. రెండు వారాల్లో ముహూర్తం..! once again..నేను మీకు నచ్చినందుకు సంతోషం.. కానీ..too late  !మీరే నాకు నచ్చలేదు. Bye.. bye forever.. "
ఫోన్ కట్ అయింది. మ్రాన్పడిపోయి, సోఫాలో కూలబడిపోయాడు నూతన్ కుమార్. మాటిమాటికీ అతని చెవుల్లో.. నువ్వు నాకు నచ్చలేదు... నువ్వు నాకు నచ్చలేదు.. అన్న ఆ అమ్మాయి మాటలే ప్రతిధ్వనించసాగాయి.'ఆలస్యం అమృతం విషం' అన్న చందాన అయిందాతని పరిస్థితి ! అదే క్షణంలో, ఎందరు అమ్మాయిల్ని ఇదే విధంగా తాను  క్షోభ  పెట్టి ఉంటాడో తలపుకొచ్చి, అతని తల వాలిపోయింది. 

**************************************.






     


4 comments:

  1. ఈ యువకుడి ప్రవర్తన కాస్త అతిగానే ఉంది లెండి. మీరన్నట్లు ఇంకా మంచిది, ఇంకా గొప్పది అనుకుంటూ వెతుకుతుంటే వయసు పెరిగి పోతుంది, సంబంధాల విషయంలో చాయిస్ తగ్గిపోతూ ఉంటుంది. రూపురేఖలలో యవ్వనపు ఛాయలు, కళ మెల్లిగా మసకబారతాయి - దీన్నే మొహంలో "నేవళం" తగ్గిపోతుంది అంటుండేది మా అమ్మగారు. అయినా అటువంటి లక్షణాలు కలిగిన అమ్మాయి ఎటువంటివాడి కోసం చూస్తోందో, నిన్నెందుకు చేసుకుంటుందయ్యా అంటుంటాను నేను అటువంటి కుర్రాళ్లు తగిలితే గనక 🙂.

    అయితే ఏ మాటకామాట - ఈ కాలపు అమ్మాయిలు కూడా గొంతెమ్మ కోర్కెలు కోరడంలో మితిమీరి పోతున్నారనే అనాలి. తన కొడుకు కోసం సంబంధాలు వెతుకుతున్న మా చుట్టం ఒకతను ఓ లిస్ట్ లో కనిపించిన ఓ 24 యేళ్ళ అమ్మాయి సంబంధం వారి కోరికలు ఎలా ఉన్నాయో చూడమంటూ పంపించాడు. BCA చదివిందట. ఉద్యోగం చెయ్యడం లేదట. LIC Agent గా చేస్తోందట. సరే ఇక ఇదిగో ఇలాంటి లక్షణాలు కలిగిన వరుడు మాత్రం కావాలిట ఆ అమ్మాయికి 🙂👇.
    ------------------
    Quote
    "Package above 24LPA and car compulsory Must have 3 flats building compulsory.

    And Foreign visits once in a year and 2 housea should be in Hyderabad or Bangalore."
    Unquote
    ------------------
    అదీ సంగతి మేడమ్. అటువంటి సంబంధం మన ఎవరి ఎరికలోనైనా ఉంటే గనక ఆ అమ్మాయికి చెప్పవచ్చు, పాపం?

    ReplyDelete
  2. ☺️☺️☺️ అందుకే అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ముందుగా తమకున్న అర్హతలేవో తరచి చూసుకోవడం మంచిది అని నా అభిప్రాయం 🙏

    ReplyDelete
  3. VNR గారు, వాళ్ళు caste గురించి మెన్షన్ చేయలేదు. ఎవరో ఒకరు దొరుకుతారులెండి. ఉద్యోగం లేకుండా అన్ని అడిగారు అంటే బీభత్సంగా అందంగా ఉండి ఉంటుంది.

    ReplyDelete
  4. “నీహారిక” గారు,
    అ అమ్మాయి కులం ఏమిటో నాకు తెలుసు గానీ నేనే ఇక్కడ ప్రస్తావించ లేదు.

    ఇక ఆవిడ గారు అతిలోక సుందరా కాదా అని చెప్పడానికి ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఏదో పెళ్ళిసంబంధాల లిస్టులో కనిపించిన ప్రొఫైల్.

    “ఎవరో ఒకరు దొరుకుతారు లెండి” అని గంతకు తగ్గ బొంత అనే పద్ధతిలో అనకండి. ఆవిడకు అట్టాంటిట్టాంటి సంబంధం నచ్చేస్తుందనే సూచనలేమీ కనబడడం లేదు.

    అయినా మనకెందుకు పోనిద్దురూ 🙂.

    ReplyDelete