Sunday, May 3, 2020

చూసేకళ్లకు హృదయమే ఉంటే......

దేవుడు లేడూ లేడంటూ
ఏడీ, ఎక్కడున్నాడో చూపించండంటూ
ప్రశ్నలు గుప్పిస్తూ జవాబుకై దబాయించే
మనుషులందరికీ ఒక్కప్రశ్న ! ఒకేఒక్క ప్రశ్న !

భగభగ మండుతూ భూగోళమంతా
వెలుగులు విరజిమ్ముతూ
జీవకోటికి జవసత్వాలిస్తున్న భానుడు
కాడా కనిపించే భగవానుడు?

రేయంతా వెండి వెన్నెల కురిపిస్తూ
 చల్లచల్లగా జనాల్ని సేదదీరుస్తూ
హాయిగొలిపే నిండు చందురుడు
కాడా కనిపించే దేవుడు?

 గుండె గదులకు ఊపిరిలూదుతూ
 నిత్యం ప్రతినిత్యం శ్వాసలో శ్వాసగా
 నిలుస్తూ, చుట్టూ ఆవరించియున్న
 ఈ గాలి కాదా కనిపించే దేవుడు?

 ఇందరు దేవుళ్ళని కళ్ళెదురుగా చూస్తూ
 ఇంకా దేవుడెక్కడంటూ
 చూపించ మంటూ ప్రశ్నలేమిటి?
 అంతదాకా ఎందుకు?
 దేశ క్షేమం కోసం స్వార్థం వీడి
 సరిహద్దుల నిలిచి నిద్ర మరిచి
 మనల్ని నిద్రబుచ్చుతూ
 జనం కోసం తన ప్రాణాలడ్డువేస్తూ
 కాపుగాస్తున్న మన వీర సైనికులంతా
 కారా కనిపించే దేవుళ్ళు!

 నేడు యావత్ప్రపంచాన్నీ గడగడలాడిస్తున్న
' కరోనా ' రక్కసికెదురొడ్డి పోరాడుతూ
 నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా కాచుకుంటున్న
 అపరధన్వంతరులు వైద్యనారాయణులు
కారా కనిపించే దేవుళ్ళు!

 సవాల్ విసిరిన ' కరోనా ' మహమ్మారిని
 మట్టుబెట్టే మందు కోసం మానవాళి మనుగడ కోసం
 రేయింబవళ్ళు తపిస్తున్న మన ' శాస్త్రజ్ఞులు '
 కారా కనిపించే దేవుళ్ళు?

 కిరీటందాల్చి నాల్గు చేతులు శంఖు చక్రాలతో
 పట్టుపీతాంబరాలతో ధగధగా మెరుస్తూ
 దర్శనమిస్తేనే దేవుడా? చూసే కళ్ళకు
 హృదయమంటూ ఉండాలే గానీ
ఆపదలో చేయందించే ప్రతీమనిషీ కనిపించే దేవుడే
 ప్రతీ మంచి మనసూ భగవత్స్వరూపమే !!

******************************************
మళ్ళీ కలుద్దాం
************

4 comments:

  1. LRSR: దేవున్ని గురించి ఎంత అద్భుతంగా వర్ణించావు ధరిత్రీ! నాకు చాలా చాలా బాగా నచ్చింది. 🙏🙏🙏.

    ReplyDelete
  2. నీకు కూడా చాలా చాలా థాంక్స్ 🌹🌺🌹

    ధరిత్రి

    ReplyDelete
  3. Chala chakkaga vivarinchaaru. Aapada seva chEsevaari hrudayamlo devudu koluvai untadannadi akshara satyam!!!

    ReplyDelete
  4. దేవతలకోసం ఎక్కడెక్కడో వెతకడం అనవసరం అనిపించింది. శ్వేతగారు, నా బ్లాగ్ లోకి విచ్చేసినందుకు చాలా చాలా సంతోషం. 👋👃
    ధరిత్రి 🌺

    ReplyDelete