Wednesday, May 6, 2020

అవనిలో వనిత... రాతికత్తులు... బలిపశువులు

సంప్రదాయాలను పాటించడంలో మహిళలు ముందువరుసలో ఉంటారెప్పుడూ. అంతవరకూ మంచిదే. అందరూ అంగీకరించేదే. కానీ విచారించాల్సిన విషయమేమిటంటే దుస్సాంప్రదాయాల విషయంలో కూడా మహిళల్నే ముందుకు నెట్టడం సమాజంలో ఆదినుండీ వస్తున్న అనాచారం. దానికి ఓ ప్రత్యక్ష నిదర్శనం చదవండి...... 

     "... అయినవారు, ఆత్మీయులు కన్నుమూస్తే..... ఎవరి హృదయాలైనా బద్దలవుతాయి. అంతులేని వేదనతో కళ్ళు ధారాపాతాలవుతాయి. మనసుకు అయిన గాయాలకు కాలమే మందుగా మారి.... కొన్నాళ్ళకు ఆ బాధను మరిపిస్తుంది...... "
    కొద్ది రోజుల క్రితం ఓ ప్రముఖ దినపత్రికలో ఓ అమానవీయ దురాచారాన్ని ఉటంకిస్తూ వ్రాయబడ్డ వాక్యాలివి. 
    విషయంలోకెళ్తే --- ఇండోనేషియా దేశంలోని' డానీ ' అనబడే తెగకు చెందిన మహిళల పట్ల జరుగుతున్న ఓ అమానుష చర్యను వింటే ఎలాంటి వారికైనా హృదయం ద్రవించక మానదు. అదేమిటంటే---
   ఎంతగానో ప్రేమిస్తూ ఆప్యాయతను పంచే కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే--- ఆ మరణించిన వారి ఆత్మలకు ఎలాంటి కీడు కలుగకుండా శాంతి చేకూరేందుకు ఆ కుటుంబంలోని మహిళలు తమ చేతి వేళ్ళ భాగాలను అర్పిస్తారట ! గమనార్హం ఏమిటంటే--- ఈ సంప్రదాయం ఆ తెగలోని మహిళలకే పరిమితం కావడం!
    ఇంతకీ ఆ వేళ్ళు నరికే పద్ధతి విన్నామంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అందులకై రాతి కత్తులను వినియోగిస్తారట ! ముందుగా వేలి మధ్యభాగంలో చిన్నపాటి తాడుతో గట్టిగా బిగించి కట్టడంవల్ల క్రమంగా పైభాగానికి రక్తసరఫరా నిలిచిపోయి కొద్దిసేపటికి నొప్పి తెలిసే అవకాశం ఉండదట! ఆ స్థితిలో రాతి కత్తితో ఆ భాగాన్ని నరికి అంత్యక్రియల సందర్భంలో నిర్వహించే పూజలో ఉంచుతారట ! గాయమైన వేలి భాగంలో ఇన్ఫెక్షన్ రాకుండా అక్కడ కలుస్తారట!
     ఇంతకీ, ఈ తతంగమంతా ఆ మహిళ తాలూకు తోబుట్టువులే నిర్వహిస్తారట ! కుటుంబ సభ్యుల మరణాలు పెరిగేకొద్దీ చేతి వేళ్ళ భాగాలు ఇలా నరికివేతకు గురవుతూ ఉండడం వలన వయసు మళ్ళిన స్త్రీల అరచేతులు సగం వేళ్ళు కోల్పోయి మొండిగా కనిపిస్తుండటం గుండెల్ని పిండి వేస్తుందని వారి అత్యంత దయనీయ స్థితిని ఆ వార్తలో ప్రస్తావించడం జరిగింది. 
    ఇండోనేషియా ప్రభుత్వం ఈ దురాచారాన్ని కొన్నేళ్ల కిందటే నిషేధించినా, ఆ తెగ ప్రజల్లో ఎన్నో చైతన్య కార్యక్రమాల్ని నిర్వహించినా గుట్టుచప్పుడు కాకుండా ఈ అమానవీయ విశ్వాసం అక్కడి చాలా కుటుంబాల్లో కొన సాగుతూనే ఉందట!
   పూర్వపు రోజుల్లో' ' సతీసహగమనం ' అనే దురాచారం వేళ్ళూనుకుని ఉండేదనివిన్నాం. భర్త చనిపోతే బ్రతికున్న భార్యను కూడా ఆ చితి పైనే దహనం చేసే అమానుష చర్య అది! ఆ చితి మంటలు ఆమె సజీవ శరీరాన్ని ఆక్రమిస్తోంటే ఆ బాధ భరించలేక ఆమె చేసే ఆర్తనాదాలు మిన్నంటే దృశ్యం మన ఊహాశక్తికి అందనిదేమీకాదు. కొన్ని సందర్భాల్లో ఆ అగ్నికీలల ధాటికి తాళలేక చితి నుండి దూకి పరుగులు తీస్తుంటే కర్రల తోటి తిరిగి ఆ చితిలోకి తోసేవారట ! ఎంతటి పైశాచిక కాండ ! 
       అత్యంత హేయమైన ఈ దురాచారం ప్రబలంగా ఉండే ఆ రోజుల్లో మహామహులైన సంఘసంస్కర్తలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, పోరాడి ఆ  దుష్ట సాంప్రదాయాన్ని రూపుమాపి, మహిళా లోకానికి కొండంత అండగా నిలిచి, చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. అయినా అడపాదడపా ఇప్పటికీ ఒకటీ అరా జరుగుతూనే ఉన్నాయని వార్తల్లో చదువుతూనే ఉంటాం. 
   ఇంతకీ--- ఇక్కడ కొసమెరుపు--- అంతా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పై రెండు దుస్సాంప్రదాయాల్లోను అభాగ్య సోదరీమణులు మహిళలే బలిపశువులు కావడం!!

******************************************
 చిన్న మనవి  :  నిన్న పోస్టులో ఉంచిన ' బాలగేయం ' రెండో చరణం నాల్గవ లైనులో  ఊర్వశినీ  కి బదులు ఉర్వశినీ అని తప్పు దొర్లింది. అచ్చు తప్పుకు క్షంతవ్యురాలిని. 
******************************************
మళ్ళీ కలుద్దాం 
******************************************

No comments:

Post a Comment