అదో పల్లెటూరు. ఆ ఊర్లో ఓ ఇంటి ముందు ఓ పదిహేను మంది దాకా విషణ్ణ వదనాలతో దూర దూరంగా నిలబడి ఉన్నారు. లోపల ఓ నలుగురు ఆడవాళ్ళు కన్నీళ్ళొత్తుకుంటున్నారు. ఇంటికి ముందు భాగంలో చాప మీద ఆ ఇంటి యజమాని విశ్వేశ్వర రెడ్డి గారి భౌతిక కాయం! ఓ పక్కగా కన్నీళ్లు ఇంకిపోయి ఆయన భార్య రుక్మిణమ్మ ! ' లాక్ డౌన్ ' పుణ్యమాని సమీప బంధువులు కూడా రాలేక ఎక్కడి వాళ్ళు అక్కడే ఇరుక్కు పోయారు. సాయంత్రం ఆరు గంటలకంతా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇంట్లో రుక్మిణమ్మ మరో నలుగురు బాగా దగ్గరి బంధువులు మిగిలారు.
++++++++++++++
ఇంతకీ, రెడ్డి గారి ఆఖరి ప్రయాణం ఎందుకింత విషాదంగా ముగిసింది? ఆయనేమన్నా ఓ అనామకుడా? ఊర్లో అందరికీ సరిపడని వాడా? లేక ఎవరికీ ఏమీ కాని వాడా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం' కాదు ' అనే!
ఆయన ఊర్లో పెద్ద మోతుబరి. అందరికీ లేదనకుండా సాయం చేసే వ్యక్తి. పైగా ఓ సారి సర్పంచి పదవి కూడా నిర్వహించిన వాడే! ఇక ఆయన సతీమణి రుక్మిణమ్మ చేతికి ఎముక లేని మనిషి! మరెందుకిలా?
రెణ్నెల్ల క్రితం రెడ్డి గారు ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ ఉన్న తన కొడుకు దగ్గరకు వెళ్లారు. తీరా అక్కడినుంచి వచ్చేద్దాం అనుకునేంతలో ' కరోనా ' వైరస్ విజృంభించి లాక్ డౌన్ ప్రకటించడంతో వెంటనే రాలేకపోవడం, ఆ తర్వాత ఎలాగోలా రకరకాల వాహనాల్ని పట్టుకుని టౌన్ దాకా చేరుకోవడం జరిగింది. కానీ అక్కడే చిక్కొచ్చిపడింది. దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్లందరినీ వెంటనే అక్కడే ఆపేసి తీసుకొనిపోయి టెస్టులు చేయించే నెపంతో క్వారంటైన్ లో ఉంచేశారు. అందులో ఈయనా ఒకరు. పధ్నాలుగు రోజుల తర్వాత మళ్లీ పరీక్షలంటూ మరికొద్ది రోజులు అక్కడే ఉంచేశారు. అటు పిమ్మట డిశ్చార్జి చేశారు, కానీ ఈ లోగా ఈ వార్త దావానలంలా ఆ పల్లెటూర్లో పాకిపోయింది.
+++++++++++++++++
చాలా రోజుల తర్వాత రెడ్డి గారు తన వెంట ఒక పెద్ద సూట్ కేసు, మరో చిన్న బ్యాగు పట్టుకుని ఊరి పొలిమేరలో దిగారు. అక్కడ దారికి అడ్డంగా పెద్ద ముళ్ళకంచె కనిపించింది, బయటి వాళ్లెవరూ ఊర్లోకి రాకుండా. రెడ్డిగారు చుట్టూ చూశారు, మనిషి జాడ లేదు. ఎలాగోలా సందు చేసుకుని కంచె దాటి, ఊర్లో అడుగుపెట్టారాయన. అక్కడక్కడా ముగ్గురు నలుగురు కనిపించారు కానీ, తన దగ్గరికి ఎవరూ రాలేదు. ఇదివరకైతే తను కనిపించగానే పదిమంది దాకా పరుగున వచ్చి, చేతిలో బరువు అందుకునేవారు. అలాగే సూట్ కేసు లాక్కుంటూ ఇల్లు చేరారాయన. ఇంట్లో భార్య ఒక్కతే పని చేసుకుంటోంది. కాసేపటికి విషయం అంతా అర్థమైందాయనకి. తనకి కరోనా సోకిందనే అనుమానం తో దగ్గరికి వస్తే వాళ్లకి ఎక్కడ అంటుకుంటుందోనని అంతా దూరంగా ఉండిపోయారన్నమాట !
ఆయన మనసంతా కకావికలమై పోయింది. ఎంత చేశాడీఊరికి ! ఎంతగా అభిమానించాడు అందర్నీ! ఇన్నాళ్ల తర్వాత వస్తే పలకరించడానికిక్కూడా ఎవరికీ మనసు రాలేదా?
+++++++++++++++
వారం రోజులు విపరీతంగా మదన పడ్డ ఆయన ఓ అర్ధరాత్రి గుండెల్లో సన్నగా నొప్పిగా ఉందంటూ భార్యను నిద్రలేపాడు. ఆమె కంగారుగా సహాయం కోసం బయటకు వెళ్లబోయింది. వద్దంటూ ఆమె చేయి పట్టుకొని ఆపి తన వద్దే కూర్చోబెట్టుకున్నారు. అంతే! తెల్లారింది. ఆయన బ్రతుకూ తెల్లారి పోయింది"
++++++++++++++++
అదీ జరిగింది! ఎక్కడో దూరాన ఉన్న కొడుకు కుటుంబంతో మూడో రోజుకుగానీ రాలేక పోయాడు. ఆరోజు రెడ్డి గారి పెద్ద దినం. కొందరు అతి దగ్గర బంధువులు వచ్చారు. తతంగమంతా జరుగుతూ ఉంది. ముఖాన కుంకుమ లేని రుక్మిణమ్మ రెడ్డి గారి ఫోటో ముందు కూర్చుని మౌనంగా రోదిస్తోంది.
ఇంతలో ఊర్లో వాళ్ళు కూడగట్టుకొని ఓ పెద్ద గుంపుగా తరలివచ్చారు. అందరి చేతుల్లో పెద్ద పెద్ద పూల దండలున్నాయి. వాటిని ఫోటోకు వేయడానికి ముందుకు కదిలారు వరుసగా. అంతవరకు మౌనంగా ఉన్న రుక్మిణమ్మ దిగ్గున లేచి గట్టిగా అరిచింది. ఎన్నడూ నోరు విప్పని ఆ ఇల్లాలు ఒక్కసారిగా అలా ఉగ్ర రూపంలో కనిపించేసరికి అక్కడందరూ శిలా ప్రతిమల్లా అయిపోయారు.
".... ఆగండక్కడే ! మీకు ఆయన ఫోటో తాకే అర్హత లేదు. ఆయన కరోనా వల్ల చచ్చిపోలేదు. మీ వల్ల, మానవత్వం లేని స్వార్థపూరిత ప్రవర్తన వల్ల.... అందువల్ల చచ్చిపోయారు. వైరస్ వల్ల అందరూ దూరం పాటించండి అన్నారంతే. అంతేగానీ మనుషుల్లో అభిమానం, ఆప్యాయతలూ దూరం చేసుకోమని దానర్థం కాదు. రేపు మీకూ ఇలాంటి మరణం వస్తే ఎలాగుంటుందో కాస్త ఆలోచించండి.... "
అక్కడంతా మ్రాన్పడి చూస్తుండగా స్థిరంగా అంది,.... "... ఇంకెప్పుడూ ఈ ఛాయలకు రావద్దు... ఆయన ఆత్మ నైనా ప్రశాంతంగా ఉండనీయండి... " అంటూ రెడ్డి గారి ఫోటోకు అడ్డంగా నిలబడింది!
అంతే! వాళ్ళ చేతుల్లోని పూల దండలు వెలవెలబోయాయి!!
******************************************
( వైరస్ తో చనిపోయిన వారి అంత్యక్రియలకు అడ్డగిస్తూన్న జనాల్ని గురించి విన్నప్పుడు---
ఎంతోమంది అనారోగ్యాల్ని బాగుపరిచి ప్రాణదానం చేసిన వైద్యుల భౌతికకాయాల్ని సైతం స్మశానం లోకి అనుమతించక తిరిగి వెళ్ళి పోయేలా చేస్తున్న వైనం చదివినప్పుడు---
మనుషుల్లో స్వార్థచింతన మరీ ఇంతగా వేళ్ళూనుకుని ఉందా! అన్న ప్రశ్న తలెత్తినపుడు కలిగిన స్పందనకు అక్షర రూపం ఈ " కరోనా మరణం ". )
************************************
LRSR: ఎవర్నని ఏం లాభం. లోకం తీరే అంత.
ReplyDelete