Thursday, May 14, 2020

కూర ' గాయాలే '

    ఈమధ్య కాలంలోనే కాదు, ఇంతకుముందు కూడా టీవీల్లో, దినపత్రికల్లో తరచుగా చూసే ఓ వార్త---
 తుఫాను బీభత్సంతో కూలిపోయిన అరటి తోటలు, నేల పాలైన మామిడికాయలు, ఇంకా తమలపాకుల తోటలు వగైరా-- వాటి గురించిన ఛాయాచిత్రాలు-- ఇంకా వానకు తడిసిన ఎండుమిరపకాయలు, వడ్లు, రాశులుగా పోసిన ఇతర ధాన్యాలు! ఆరబోసిన వేరుశెనగ కాయలు-- ఇంకా ఇలాంటివే కల్లాల్లోకి చేరిన రకరకాల పంటలు-- వాటిని కాపాడుకునే ప్రయత్నాల్లో రైతు కుటుంబాలు! ఇలాంటివి చూస్తూ ఉంటే అనిపిస్తుంది-- నోటిదాకా వచ్చిన ముద్ద నోటి లోకి వెళ్ళేదాకా నమ్మకం లేదు అని. 
    ఓ పంట ఇంటికి చేరాలంటే ఆ రైతు పడే కష్టం, శ్రమ బేరీజు వేయలేం. అదొక్కటేనా! అదును లో పొలం దున్నటం మొదలు విత్తనాలు చల్లడం, నీరు పెట్టడం వర్షాధార భూములు అయితే వర్షం కోసం ఎదురు చూడడం, పంట పెరిగి కోతకు వచ్చే దాకా కంటికి రెప్పలా కాపాడుకోవడం, ఈ మధ్యలో ఏ ఆటంకం ఎదురైనా పెట్టింది అంతా వ్యర్థమే అవడం! దీనికితోడు సాగు కోసం, కూలీల కోసం అయ్యే ఖర్చు భరించడం! ఇంతా చేసి, ఆఖరికి నూర్పిళ్ళు కూడా పూర్తి చేసుకుని ఫలసాయం తృప్తిగా కళ్ల జూసుకునే తరుణాన ఇదిగో--ఈ తుఫాన్లు, అకాల వర్షాల వల్ల సర్వం నాశనమై పోవడం! ఈనగాచి నక్కలపాల్జేసినట్లు ! 
    ఈ మధ్య ఉత్పన్నమైన కొత్త సమస్య' కరోనా ' 
 వల్ల పండిన పళ్ళు, కూరగాయలు అమ్ముకోడానికి కూడా నోచుకోక కొందరు పొలాల్లో, తోటల్లోనే వాటిని వదిలివేయడం చూస్తోంటే ' అన్నదాత ' రైతు దైన్య స్థితి అవగతమవుతుంది. రైతు దేశానికి వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదు, మనిషికి పట్టెడన్నం పెట్టే వాడు రైతే అన్నది నిత్య సత్యం. కానీ ఇలా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రం రైతన్న ఎప్పుడూ బలవుతున్నాడు. 
    ఇకపోతే, వైరస్ ప్రభావం వల్ల కూరగాయల కొనుగోళ్లు బాగా తగ్గి పోయి, ఈసారికి కూరగాయలు పండించడం మానేయాలని రైతులు అనుకుంటున్నారని తాజా వార్త! అదే జరిగితే, రాబోయే రోజుల్లో కూరగాయలన్నవి ఎక్కడా దొరకక, కనిపించక జనాలందరికీ కూర ' గాయాలే ' సుమా, అనిపించడంలేదూ !!

*****************************************
మళ్ళీ కలుద్దాం !
యం. ధరిత్రీ దేవి 
*****************************************

No comments:

Post a Comment