Tuesday, July 22, 2025

రోజు గడిచిందిలా...

   🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅

 ఉషోదయాన...రవికిరణాలు తొలిసారి 
 నేలతల్లిని తాకుతున్న క్షణాన..
 కొమ్మల చాటున కనిపించక 
 వినిపిస్తూ కోయిల గానం !!
 పులకరించిన ప్రకృతిమాత పలకరింపుతో...
 స్వచ్ఛమైన చిరుగాలి lస్వాగత గీతికలతో.
 కన్నాను సూర్యోదయం  మైమరచి...!

 నీలాకాశం...పులుముకుంది శ్వేతవర్ణం 
 చల్లగాలి సోకి పరుగులు తీస్తూ 
 వెండి మబ్బు జల్లై...కురిసింది మల్లెల వర్షం!
 ఎండిన నేల తడిసి...మట్టి సువాసన ఎగసి 
 నను చుట్టేసిన అపరాహ్నవేళ...పరవశించింది 
 నా మది ప్రకృతి స్పర్శతో మరోసారి..!

 పగలంతా మానవాళిని జాగృతి చేసి 
 అలసి సొలసినాడేమో దినకరుడు...!
 దిగిపోతున్నాడు పడమటి దిక్కున 
 సంధ్యారాగం వినిపిస్తూ...
 ఈరోజుకి సెలవంటూ...నింగిని 
 అద్భుత వర్ణ చిత్రమొకటి 
 ప్రకృతికి కానుకగా ఇస్తూ...

 నల్లటి తివాసీపై మెరిసే చుక్కల సందడి..
 పండు వెన్నెల కురిపిస్తూ రేరాజు...!
 అద్భుతం! ఆ దృశ్య సోయగం !!
 పగలంతా ఏమాయెనో మరి..ఈ మాయ..!
 రేయి ఆగమనంతో నిదరోయింది జగతి...
 నిదురమ్మ ఒడిలో నిశ్చింతగా సేదదీరింది !
 రోజు గడిచింది...మళ్లీ తెల్లారింది...
 అదిగో భానుడు..! తూర్పున ఉదయిస్తూ...
 మరో రోజుకు ప్రాణం పోస్తూ....

🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄

 


Wednesday, July 9, 2025

' చిన్నారి' కథ... తానొకటి తలిస్తే...

 
    రాత్రి పన్నెండు దాటింది. నిద్రపట్టని రాజారావు పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. వారం రోజుల నుండి ఇదే వరుస! దానికి కారణం లేకపోలేదు...ఎదురింటి  రంగనాథానికి తాను  ఊహించిన దానికంటే రెట్టింపు పంట పండటమే. అదొక్కటే కాదు.. ఆ ఊర్లో మరెన్నో విషయాల్లో రాజారావు కంటే ఓ మెట్టు పైనే ఉంటున్నాడు రంగనాథం.
    చాలా ఏళ్లుగా అదంతా గమనిస్తున్న రాజారావుకు అంతకంతకూ రంగనాథం మీద ఓ విధమైన అసూయ అంతరాంతరాల్లో పేరుకుపోయింది. ఏ విధంగానైనా అతను నష్టపోతే చూడాలని ఎంతో ఆశగా ఉన్నాడు. కానీ,అలాంటిదేమీ జరగకపోగా మరింతగా దినదినాభివృద్ధి పొందటం చూసి అతని రక్తం ఉడికెత్తిపోతోంది.
    దానికి తోడు అతని కొడుకు శ్రీరామ్ తన కొడుకు సురేష్ కంటే బాగా చదువుతూ అన్నింట్లో మొదటివాడుగా ఉంటున్నాడు. అది మరో దెబ్బ రాజారావుకి. అందుకే ఈనాడిలా అసహనంగా ఉన్నాడు. ఏమైనా సరే, ఏదో ఒకటి చేసి, అతనికి తీరని నష్టం కలిగించాలని తీర్మానించుకున్నాడు. అలా అనుకున్న తర్వాతే అతని మనసు ప్రశాంతత పొంది, మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.
   ఆ క్షణం నుండి బాగా ఆలోచించి, రెండు రోజుల తర్వాత ఓ పన్నాగం పన్నాడు రాజారావు. ఆరోజు ధాన్యం బస్తాల్ని ఎడ్ల బండి మీద ఎక్కించుకొని పట్నం తీసుకుపోబోతున్నాడు రంగనాథం. అదును చూసుకొని రాజారావు ఎవరూ చూడకుండా ఆ బండి చక్రం ఒక దానికి ఆధారంగా ఉండే పెద్ద మేకును తొలగించేశాడు. అదేమీ గమనించని రంగనాథం పాలేరును తోడు తీసుకుని బండి తోలుకుంటూ పట్నం బయలుదేరి వెళ్ళాడు.
  ఆ మధ్యాహ్నం రాజారావు బంధువొకాయన రొప్పుకుంటూ వచ్చి  ఓ దుర్వార్త రాజారావుకు చేరవేశాడు.దాని సారాంశం...రాజారావు కొడుకు సురేష్ ఎడ్ల బండి మీద నుండి కింద పడి, తలకు బాగా దెబ్బ తగిలి ఆసుపత్రిలో ఉన్నాడని..! లబోదిబోమంటూ రాజారావు ఆసుపత్రికి పరుగెత్తాడు. అక్కడ రంగనాథం ఎదురుపడేసరికి ఒక్కసారిగా  అవాక్కైపోయాడు రాజారావు. తీరా విషయం తెలిసేసరికి అతనికి తల కొట్టేసినట్లయింది.
    రంగనాథం ఎడ్లబండి తోలుకొని పోతుండగా   అదే దారిన పట్నం వెళ్తున్న సురేష్ అనుకోకుండా అతని బండి ఎక్కి కూర్చున్నాడట! అంతే! కొంత దూరం వెళ్లేసరికి రాజారావు చేసిన పనికిమాలిన పని ఫలితంగా బండి చక్రం దబ్బున ఊడి, బండి కాస్తా ఉన్నట్టుండి ఒకవైపు ఒరిగిపోయింది. అటువైపే కూర్చున్న సురేష్ విసురుగా కిందపడి దొర్లుకుంటూ వెళ్లడంతో తల అక్కడున్న ఓ పెద్ద రాతికి బలంగా తగిలింది. అదృష్టవశాత్తు రంగనాధానికి, అతని పాలేరుకూ పెద్దగా దెబ్బ లేమీ తగలలేదు. వెంటనే అటువైపుగా వెళుతున్న ఓ ఆటోను ఆపి, సురేష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు రంగనాథం. విషయం అంతా వివరించి, సమయానికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పిందని డాక్టరు చెప్పాడని రంగనాథం రాజారావును ఓదార్చాడు. రాజారావు సిగ్గుతో చితికిపోయాడు.
    రంగనానికి హాని  చేయబోతే తిరిగి అతనే తనకు అనుకోని రీతిలో సాయపడడం అతనికి మింగుడు పడలేదు. తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే కాబోలు అనుకుంటూ తల పట్టుకున్నాడు.

నీతి : చెడపకురా చెడేవు.

( ఆంధ్రభూమి  వారపత్రికలో 'ఫలితం' పేరుతో ప్రచురితం )





Tuesday, July 1, 2025

కనిపించే దేవుళ్ళు...

   
" వైద్యో నారాయణో హరిః" అంటారు. డాక్టర్లు దేవుళ్ళనీ అంటారు. పోతున్న ప్రాణాలు సైతం నిలబెట్టి మనిషికి ఆయుష్షు పోసే శక్తి ఒక్క వైద్యులకే సొంతం అన్నది నిర్వివాదాంశం. కానీ.. ప్రస్తుత రోజుల్లో వైద్యులు మునుపటి గౌరవాన్ని పొందడం లేదన్నది వాస్తవ దూరమైతే కాదు. ఒకప్పటిలా డాక్టర్ల సేవాతత్పరత నేడు కానరావడం లేదు.. ఎందుకని!
   వృత్తి పట్ల అంకితభావం లోపిస్తోంది. ఎంతో కష్టపడి మెడిసిన్లో సీటు సంపాదించి ఏడెనిమిదేళ్లు శ్రమకోర్చి తెచ్చుకున్న డిగ్రీ..! అంత కష్టంతో డాక్టర్ అయ్యాక.. అసలు తానెందుకు ఆ చదువే ఏరి కోరి ఎంచుకున్నాడో మరిచిపోతే ఎలా!!
   శారీరక బాధలు,అనారోగ్యాలు వేధిస్తున్నప్పుడు ఎవరికైనా తక్షణమే గుర్తుకొచ్చేది డాక్టరే...! ఎంతో నమ్మకంతో,ధైర్యంతో వెళ్లి డాక్టర్ ముందు కూర్చున్న రోగి డాక్టర్ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేషెంట్ చెప్పే సమస్యను పూర్తిగా సహనంతో వినడం ఆ వైద్యుని కనీస ధర్మం. అలాగే ప్రసన్నంగా కనిపించడం, చిరునవ్వుతో తన ముందున్న రోగిని పలకరిస్తూ సమస్యను సందేహించక తనతో చెప్పేలా చేయడం ఓ డాక్టర్ కు ఉండాల్సిన ప్రథమ లక్షణం.
    ప్రస్తుతం ఎందరు డాక్టర్లు ఈ విధంగా ఉంటున్నారనేది ప్రశ్నార్థకమే! రోజుకు లెక్కలేనంతమంది రోగులు వస్తుంటారు.. అందరితో అలా అంత ఓర్పుగా, వ్యవహరించడం ప్రతి ఒక్కరికి అంత సమయం కేటాయించడం..సాధ్యమేనా! అన్నది ప్రశ్న! అది కొంతవరకు నిజమే అయినా.. వైద్యులకు ఉండాల్సిన ప్రాథమిక లక్ష్యాన్ని విస్మరించడం మాత్రం తగదని చెప్పాలి.
   మరో విషయం.. ఎందరో డాక్టర్లున్నా, కేవలం కొందరికి మాత్రమే మంచి డాక్టర్ అన్న పేరు వస్తూ ఉంటుంది. దానికి కారణం రోగులతో ఆ డాక్టర్స్ ప్రవర్తిస్తున్న తీరు మాత్రమే..! వైద్య రంగంలో రాణించడం, రాణించకపోవడం అన్నది ప్రధానంగా ఆ వైద్యుల చక్కటి ప్రవర్తనా తీరుపై ఆధారపడి ఉంటుంది. కొందరికి చక్కటి నైపుణ్యాలున్నా కోపం, చిరాకు,విసుక్కోవడం, వ్యంగ్య ధోరణిలో మాట్లాడటం, రోగి చెప్పేది పూర్తిగా వినకుండానే మందులు రాసేయడం, టెస్టులు చేయించమనడం.. ఇలాంటి లక్షణాల వల్ల రోగులు అలాంటి డాక్టర్ల వద్దకు వెళ్లడానికి అంతగా ఇష్టపడరు.
   ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్లుండే వారేమో గానీ.. ఇప్పుడా అవకాశం ఉండడం లేదు. ఈ సందర్భంగా..  ఓ విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను. నా చిన్నతనంలో మా గ్రామంలో ఒకాయన ఉండేవారు.యాభై ఏళ్ళు ఉంటాయి. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కాదు..అయినా ఎంతో అనుభవజ్ఞుడైన డాక్టర్ కున్న పరిజ్ఞానం ఉండేది . ఊర్లో ఎవరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆయనకు కబురు పంపేవారు. ఆయన కూడా ఏ భేషజం లేకుండా తక్షణమే వచ్చి రోగిని పరామర్శించి తన వద్ద ఉన్న టాబ్లెట్స్ ఇచ్చేవాడు. అందులో అలోపతితో పాటు హోమియోపతి, ఆయుర్వేదం కూడా ఉండేవి. ఆయన హస్తవాసి ఏమోగానీ  మరుసటి దినానికంతా సమస్య సద్దుమణిగి మనిషి నార్మల్ అయిపోయేవాడు. ఆ ఊరికి ఆయనే తిరుగులేని డాక్టర్ !! నయాపైసా ఆశించక ప్రతివారికీ అందుబాటులో ఉండేవాడు.
  అంతటి సేవాతత్పరత ఈరోజుల్లో  ఎందరు డాక్టర్లకు ఉందంటారు! ఎంతటి ప్రమాద స్థితిలో ఉన్న పేషెంట్ నైనా.. పక్క ఇంటిలోనే ఉన్న డాక్టర్ కూడా పిలిచినా రాడు..! పేషెంట్ నే అతని వద్దకు తీసుకొని పోవాల్సి వస్తోంది. అలాగే కొద్ది సంవత్సరాల క్రితం ఏదైనా అస్వస్థతకు లోనై డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షించి మందులు మాత్రం రాసిచ్చేవారు. ఇప్పుడు వెంటనే టెస్టులు కూడా రాసిస్తున్నారు.! అందరూ ఇలాగే ఉంటున్నారు అని మాత్రం చెప్పడం లేదు.. కానీ ఎక్కువ శాతం జరుగుతున్నది ఇదే! అందుకేనేమో.. చిన్న చిన్న అనారోగ్యాలకు డాక్టర్ల దగ్గరకు వెళ్లడం మానేస్తున్నారు చాలామంది.
    ఏది ఏమైనా డాక్టర్లు దేవుళ్ళు అనే పేరు ప్రజల్లో నిలిచిపోవాలంటే డాక్టర్లకు సేవాభావం, రోగుల పట్ల దయ తప్పక ఉండాల్సిందే. అప్పుడే మంచి డాక్టర్ అనిపించుకుంటాడు. ప్రస్తుతం వృత్తి పట్ల అంకితభావం లేని వాళ్ళు అసలు లేరని చెప్పడం కూడా భావ్యం కాదు. కాలాలతో నిమిత్తం లేకుండా అప్పుడూ ఇప్పుడూ మంచి డాక్టర్స్ ఉంటూనే ఉన్నారు. సంపాదనే ధ్యేయం కాకుండా ఉచిత వైద్యం చేస్తూ, మందులు కూడా ఉచితంగానే అందిస్తూ రోగులను ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకునే వారూ ఉంటున్నారు. వారు నిజంగా వైద్య నారాయణులే..! వారందరికీ హృదయపూర్వక నమస్సులు. డాక్టర్స్ ని విమర్శించరాదు. ఎందుకంటే ఏ అనారోగ్యం పొడసూపినా వారే దిక్కు మరి!! వ్యాధుల బాధలు బాపే అపరధన్వంతరులు రోగుల పట్ల శ్రద్ధ చూపడం ఎంతైనా అవసరం. అప్పుడే వారు కనిపించే దేవుళ్ళు అవుతారు...🙏 

                 ( నేడు 1.7.25 డాక్టర్స్ డే )

Thursday, June 19, 2025

స్ఫూర్తి ప్రదాత... అబ్దుల్ కలాం

 

   భారత రాష్ట్రపతిగా వినుతికెక్కిన A. P. J. అబ్దుల్ కలాం గారు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన విశిష్ట వ్యక్తి. Missile Man of India గా పిలువబడ్డ వీరి పూర్తి పేరు Avul Pakir Jainulabdeen Abdul Kalam. అక్టోబర్ 15  1931 న రామేశ్వరంలో జన్మించారు. యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చిన వీరి కీర్తి అజరామరం. 2015 జూలై 27 న ఓ సమావేశంలో విద్యార్థుల సమక్షంలో ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ మహనీయుని స్ఫూర్తిదాయకమైన సూక్తులు, మాటలు ఓసారి మననం చేసుకుందాం...

* 
మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది.   కానీ, ఏదైనా గాయమైతే  మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ... మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటకు వస్తాయి.
*
కల అంటే  నిద్రలో వచ్చేది కాదు... నిద్రపోనివ్వకుండా చేసేది. నిజమైన కల దాన్ని సాకారం చేసుకునేవరకు మిమ్మల్ని నిద్రపోనివ్వదు.
*
ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే..అది అలవాటుగా ఎదుగుతుంది.. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే...అది తలరాతగా ఎదుగుతుంది...కాబట్టి మన తలరాతను సృష్టించుకునేది మనమే...!!
*
హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు అందం వ్యక్తిత్వంలో కనబడుతుంది.

*********************************
       

Monday, June 16, 2025

కథలు కాదు వాస్తవాలు

 

 ఇటీవల ( 12.6.25 ) అహ్మదాబాదులో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం నుండి ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటం నిజంగా అద్భుతమే! మొత్తం 242 మంది ప్రయాణిస్తున్న ఆ విమానం నుండి అనూహ్యంగా స్వల్ప గాయాలతో బయటపడి మృత్యుంజయుడుగా నిలిచిన బ్రిటిష్ జాతీయుడైన నలభై ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ తాను ఎలా ప్రమాదం నుండి ప్రాణాల్ని దక్కించుకున్నాడో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెలియజేశాడని సమాచారం. తాను కూర్చున్న సీటుకు కాస్త ముందు భాగంలో అత్యవసర ద్వారం ఉండడం..ప్రమాదం జరిగే క్షణాల్లో ఆ ద్వారం తెరుచుకోవడంవల్ల సమయస్ఫూర్తితో వెంటనే స్పందించి సీటు బెల్టు తొలగించుకుని ఆ ద్వారం గుండా బయటకు దూకడం జరిగిందనీ, తన సీటుతో సహా మెడికల్ కాలేజీ వసతి గృహం మీద ఓ సురక్షిత ప్రదేశంలో పడ్డాననీ చెప్పాడట!!
    వందల మంది ప్రయాణికుల్లో ఒక్కడు మాత్రం సజీవంగా బయటపడటం ఊహకందని వాస్తవ ఘటన కాక మరేమిటి! భారతదేశ వైమానిక చరిత్రలో ఇదొక అత్యంత విషాదకరమైన  ఘట్టం అయితే... మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన మరొకటి ఈ దుస్సంఘటనతో ముడివడి ఉండడం మనసును మెలిపెట్టే మరొక బాధాకర విషయం... అదేమిటంటే....
   ఈ సంఘటనతో గానీ, ఈ విమానంతో గానీ, అందులోని ప్రయాణికులతో గానీ ఏ మాత్రం సంబంధం లేకున్నా..వైద్య కళాశాల వసతి గృహంలో యధాలాపంగా మధ్యాహ్నం భోజనం చేస్తూ అనూహ్యంగా దుర్మరణం పాలైన అమాయక వైద్య విద్యార్థులు విధి వంచితులుగా మారడం !! వారి కుటుంబాలకే గాక యావత్తు ప్రజానీకానికి ఇది తీరని వేదనను మిగిల్చింది. విధి వైపరీత్యం అంటే ఇదేనేమో!!
    --- అలాగే ఇదే విమానంలో లండన్ కు ప్రయాణించాల్సిన భూమి చౌహాన్ అనే మహిళ ఆలస్యంగా బయలుదేరడం వల్ల విమానం అందుకోలేక తనకు తెలియకుండానే మరణం బారి నుండి తప్పించుకోవడం కేవలం యాదృచ్ఛికమే.. ఇది కూడా కథ కాదు.. వాస్తవమే !

Saturday, June 14, 2025

'చిన్నారి'... అమ్మా తేవే నా పలక...బాలగేయం

🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠
                                                ~ యం. ధరిత్రీ దేవి

 బాలగేయాలు చిన్నపిల్లల్లో ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఎప్పుడూ పాఠాలే కాకుండా వారికి పాటలు కూడా నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటారు. అలాగే పాటల ద్వారా అంతర్లీనంగా చక్కటి సందేశాలనూ పిల్లలకు అందించవచ్చు.పాటలకు అభినయం జోడిస్తే అభినయ గీతాలవుతాయి కూడా. అలాగే ఉపాధ్యాయులకు పిల్లలకూ మధ్య చక్కటి అనుబంధం ఈ పాటల ద్వారా ఏర్పడుతుంది. ఈ క్రింది బాల గేయానికి చక్కటి రాగం కట్టి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నేర్పించవచ్చు...

అ ఆ ఇ ఈ అమ్మా తేవే నా పలక 
ఆడుతు పాడుతు పరుగున 
నేనూ బడికెళతా
                                                               //అఆ// 
అన్నతో నేనూ పోటీ పడతా 
చెల్లికి నేనూ పాఠం చెబుతా
బడిలో నేనూ బుద్ధిగ ఉంటా
తరగతి లీడర్ నేనే అవుతా 
                                                              //అఆ//
ఒకట్లు పదులు వందలు వేలు 
వారాలు నెలలు సంవత్సరాలూ
తెలుగు ఆంగ్లం గణితం జ్ఞానం
చకచక అన్నీ నేర్చుకుంటా

                                                              //అఆ//
గురువులు మాకు దైవాలు
భవితకు  దారులు వేస్తారు
నా తోటి పిల్లలు నా నేస్తాలు
మానేస్తాము కలహాలు
 
                                                            //అఆ// 
🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠

                                                

Thursday, June 12, 2025


      ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం 
                   Stop Child Labour
                   ````````````````
                                  ~ యం. ధరిత్రీ దేవి

    కొద్ది రోజుల క్రితం ఓ వార్త వచ్చింది. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పు తీర్చలేక తల్లిదండ్రులు తొమ్మిది సంవత్సరాల వారి కొడుకును అప్పిచ్చిన వారి వెంట పనికి పెట్టారనీ, అక్కడ పని భారం మోయలేక వారు పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ పిల్లవాడు మృతి చెందాడన్నది ఆ వార్త సారాంశం. ఇలాంటి ఉదంతాలు కొత్తేమీ కాదు..తరచూ వింటూనే ఉంటాం...
    చాలా ఏళ్ల క్రితం.. అంటే దాదాపు నాలుగైదు దశాబ్దాల క్రితం వెట్టి చాకిరీ ( bonded labour ) అనే మాట ఎక్కువగా వినవస్తూ ఉండేది. తీసుకున్న అప్పుకు వడ్డీ కింద అప్పిచ్చిన వారి వద్ద కుటుంబంలో నుంచి ఎవరో ఒకరు పనులు చేయడం..! సంవత్సరాలు గడిచినా..ఆ 'అసలు'తీరడం అన్నది ఎప్పటికీ ఉండనే ఉండదు. తరాలు మారినా ఆ అప్పు తీరదు. చేస్తున్న చాకిరీకి వడ్డీ జమ చేయడమే!! పెద్దలకు కుదరనప్పుడు చిన్నపిల్లలనే ఆ పనికి కుదిర్చేవారు. అది అసమంజసమైనా ఆ నిరుపేదలకు తప్పని దుస్థితి. ఇది బాలల హక్కుల్ని కాలరాయడం కాక మరేమిటి!?
తండ్రి చేసిన అప్పు తీర్చే మిష మీద పసివారి బాల్యాన్ని తాకట్టు పెట్టడం! ఇంతకంటే శోచనీయం ఉంటుందా !
   5 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు హాయిగా తల్లిదండ్రుల చాటున ఉంటూ ఆటపాటలతో కాలం గడిపే ఆహ్లాదకరమైన, అపురూపమైన బాల్యమది. పైగా.. చక్కగా చదువుకుని భవిష్యత్తుకు పునాదులు వేసుకునే వయసు కూడా.అది వారి జన్మ హక్కు. ప్రాథమిక హక్కు కూడా. అలాంటి వారి హక్కుల్ని అపహరిస్తూ వారి భావి జీవితాన్ని కాలరాసే హక్కు కన్న తల్లిదండ్రులకు కూడా ఉండదు గాక ఉండదు. కుటుంబం కోసం పెద్దలు చేసిన అప్పులకు అభం శుభం ఎరుగని పసివాళ్లను బలిపెట్టడం ఎంతవరకు భావ్యం!? ఇది ఖచ్చితంగా పిల్లల శ్రమను దోపిడీ చేయడమే...
   ఏళ్లుగా సాగుతున్న ఈ దుశ్చర్యల్ని అరికట్టడానికి ఆవిర్భవించినదే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. ఈరోజు కోసం ప్రతి సంవత్సరం జూన్ 12వ తారీకు నిర్ణయించబడినది. International Labour organization ( ILO ) 2002 లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది .
 ఇంతకీ... ఈ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?
* ఈ సమస్యపై శ్రద్ధ చూపడం...
* దానిని నిర్మూలించడానికి మార్గాలను కనుగొనడం..
* ప్రపంచవ్యాప్తంగా బలవంతంగా బాల కార్మికులుగా 
   పిల్లలు ఎదుర్కొంటున్న,మానసిక,శారీరక సమస్యల
   గురించి తెలియజేయడం...
* బాల కార్మికులను అరికట్టడానికి అవసరమైన
   చర్యలు చేపట్టడం...
* ఆదిశగా అభివృద్ధి సాధించడం...
---- ఇంతకీ బాల కార్మికులు అంటే ఎవరు ?
18 సంవత్సరాల లోపు పిల్లలు... వీరిని పనుల్లో పెట్టడం ద్వారా వారి శారీరక, మానసిక, సామాజిక ఇంకా విద్యాభివృద్ధికి హాని కలిగించడం జరుగుతుంది. ప్రమాదకర కార్యకలాపాల్లో వీరి శ్రమను ఉపయోగించుకోవడం వల్ల వీరి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎన్నో విధాలుగా ప్రభావితమవుతుంది. తద్వారా వారి చక్కటి భవిష్యత్తు  అగమ్య గోచరంగా మారిపోతుంది. లేత వయసులో వారి మానసిక స్థితి వక్రమార్గం పట్టే దిశగా పయనించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందరిపై అకారణ ద్వేషాలు, సమాజంపై ఒక రకమైన  కసి పెరిగిపోతాయి. ఆ విధంగా మొత్తం సమాజానికి వీరు చేటు తెచ్చే దుష్ట శక్తులుగా మారే ప్రమాదం పొంచి ఉంటుందన్నది నిర్వివాదాంశం.
   రేపటి తరం పౌరులు అలాంటి విద్రోహులుగా మారడం... దేశ భవిష్యత్తును అనూహ్యమైన సమస్యల విష వలయంలోకి నెట్టి వేయగలదనడంలో ఎలాంటి సందేహం లేదు.
   దీనికి ముఖ్య కారణం.. బాల్యంలో వారికి విద్యాబుద్ధులు అలవడకపోవడమే. హాయిగా చదువుకోవలసిన వయసులో ఆ లేత చేతులు, పాదాలు కార్ఖానాల్లో, కర్మాగారాల్లో, ఇళ్లల్లో వెట్టి చాకిరీతో సతమతమవుతూ కునారిల్లుతుంటే ఆ పసి మనసులకు సంతోషం అన్నది ఉండడం సంభవమా! ఆటపాటలతో ఉల్లాసంగా తల్లిదండ్రుల ప్రేమాదరణలో సేదదీరాల్సిన ఆ బాల్యం పనీపాటలతో బండబారిపోవలసినదేనా !! ఇలాంటి వాతావరణంలో విపరీత, విపత్కర పరిస్థితులతో రాజీపడుతూ.. బాల్యాన్ని బలి పెడుతూ, పెరుగుతూ ఆ దశ దాటిపోయాక గతాన్ని తలుచుకుంటూ కుమిలిపోతూ బ్రతుకంతా భారంగా వెళ్లదీయడానికి కారకులెవరు ? 
 --- తల్లిదండ్రులా ? బాల కార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తున్న యాజమాన్యాలా ? లేక వారిపై శ్రద్ధ చూపని ప్రభుత్వాలా  ?
 ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఆవిర్భవించినదే బాల కార్మిక వ్యతిరేక దినం. అందుకోసం నిర్ణయించబడ్డ, పాటించాల్సిన కొన్ని ముఖ్యంశాలు...
* పిల్లల హక్కుల్ని కాపాడాలి...
* పిల్లలు పని చేయకూడదు. వారితో పనులు 
   చేయించరాదు.
* బడి ఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలి.
* ప్రభుత్వాలు, వ్యాపారస్తులు, కర్మాగారాలు 
    పిల్లల హక్కుల్ని కాపాడాలి.
--- ఇందుకోసం ఆచరించవలసిన విషయాలు..
* బాల కార్మిక వ్యవస్థ యొక్క మూల కారణాలను 
   కనుగొనడం,పరిష్కరించడం, నిర్మూలించడం..
--- బడి ఈడు పిల్లలు బడి బయట కాదు.. బడిలోనే ఉండాలి అన్న భావన ముఖ్యంగా తల్లిదండ్రుల్లో కలిగించాలి. ఇందులో ఉపాధ్యాయుల పాత్ర ప్రధానమైనదిగా చెప్పవచ్చు. పెద్దలు చేసిన అప్పులకు,వారు మోయవలసిన బాధ్యతలకు కన్నబిడ్డల్ని బాధ్యులుగా చేయడం సమంజసం కాదని తల్లిదండ్రులకు నచ్చ చెప్పడం జరగాలి.
  అశాంతికి, అభద్రతకూ లోనైన పిల్లలు సంఘ విద్రోహ శక్తులుగా మారి, సమాజానికి, దేశానికి హాని కలిగించే కారకాలుగా అయ్యే అవకాశాల్ని పెద్దలకు వివరించాలి. తద్వారా వ్యక్తిగత కుటుంబాలకే కాక సమాజం, దేశం అలజడికి లోనయ్యే పరిస్థితులు వారి ముందుంచడం అతి ముఖ్యం.
 పేదరికంలో మగ్గిపోతూ, పిల్లల్ని చదివించలేకపోతున్న వారికి ఎన్నో విధాలుగా ప్రభుత్వం చేయూతనందించడం హర్షణీయం. అందులో మధ్యాహ్న భోజన పథకాలు, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, ఫీజులు రద్దు చేయడాలు, ఇంకా స్కాలర్షిప్  మంజూరు చేయడాలు మొదలైనవి పేదవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఈ సౌకర్యాలన్నీ కాలేజీ చదువుల దాకా విస్తరింప చేయడంలో ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఎంతేని అభినందనీయం..
    ఏది ఏమైనా... ఆటపాటలతో బాల్యాన్ని ఆస్వాదిస్తూ, చదువుకోవాల్సిన పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుండి కాపాడడానికి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినాన్ని ప్రవేశపెట్టి, జూన్ 12 వ తేదీని  ఆ దినోత్సవానికి కేటాయించడం ఎంతో సంతోషించాల్సిన విషయం. అలాగే ఆచరణపై కూడా అన్ని యాజమాన్యాలు దృష్టి పెట్టడం చాలా అవసరం.
   మనం గమనిస్తూ ఉంటాం.. ఇళ్లల్లో పని మనుషులుగా 10 నుండి 15 సంవత్సరాల అమ్మాయిలు చేస్తూ ఉండడం.. అదే వారి ఆర్థిక దుస్థితి కావచ్చు.. కానీ ప్రోత్సహించకపోవడం మంచిది. ఆ పిల్లల తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారిని పాఠశాలకు పంపేలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రభుత్వమే వారికి కావలసిన అవసరాలన్నీ తీరుస్తుందని తెలియజెప్పాలి.
   ఇవన్నీ అమలు చేయడం ద్వారా కొంతలో కొంతవరకైనా ఈ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించగలం. జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం గురించి అందరికీ అవగాహన కలిగిద్దాం. ప్రతి ఒక్కరం అందులో భాగస్వాములమవుదాం. అది మనందరి కనీస బాధ్యతగా పరిగణిద్దాం...
                          __________________