🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅
ఉషోదయాన...రవికిరణాలు తొలిసారి
నేలతల్లిని తాకుతున్న క్షణాన..
కొమ్మల చాటున కనిపించక
వినిపిస్తూ కోయిల గానం !!
పులకరించిన ప్రకృతిమాత పలకరింపుతో...
స్వచ్ఛమైన చిరుగాలి lస్వాగత గీతికలతో.
కన్నాను సూర్యోదయం మైమరచి...!
నీలాకాశం...పులుముకుంది శ్వేతవర్ణం
చల్లగాలి సోకి పరుగులు తీస్తూ
వెండి మబ్బు జల్లై...కురిసింది మల్లెల వర్షం!
ఎండిన నేల తడిసి...మట్టి సువాసన ఎగసి
నను చుట్టేసిన అపరాహ్నవేళ...పరవశించింది
నా మది ప్రకృతి స్పర్శతో మరోసారి..!
పగలంతా మానవాళిని జాగృతి చేసి
అలసి సొలసినాడేమో దినకరుడు...!
దిగిపోతున్నాడు పడమటి దిక్కున
సంధ్యారాగం వినిపిస్తూ...
ఈరోజుకి సెలవంటూ...నింగిని
అద్భుత వర్ణ చిత్రమొకటి
ప్రకృతికి కానుకగా ఇస్తూ...
నల్లటి తివాసీపై మెరిసే చుక్కల సందడి..
పండు వెన్నెల కురిపిస్తూ రేరాజు...!
అద్భుతం! ఆ దృశ్య సోయగం !!
పగలంతా ఏమాయెనో మరి..ఈ మాయ..!
రేయి ఆగమనంతో నిదరోయింది జగతి...
నిదురమ్మ ఒడిలో నిశ్చింతగా సేదదీరింది !
రోజు గడిచింది...మళ్లీ తెల్లారింది...
అదిగో భానుడు..! తూర్పున ఉదయిస్తూ...
మరో రోజుకు ప్రాణం పోస్తూ....
🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄
No comments:
Post a Comment