రాత్రి పన్నెండు దాటింది. నిద్రపట్టని రాజారావు పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. వారం రోజుల నుండి ఇదే వరుస! దానికి కారణం లేకపోలేదు...ఎదురింటి రంగనాథానికి తాను ఊహించిన దానికంటే రెట్టింపు పంట పండటమే. అదొక్కటే కాదు.. ఆ ఊర్లో మరెన్నో విషయాల్లో రాజారావు కంటే ఓ మెట్టు పైనే ఉంటున్నాడు రంగనాథం.
చాలా ఏళ్లుగా అదంతా గమనిస్తున్న రాజారావుకు అంతకంతకూ రంగనాథం మీద ఓ విధమైన అసూయ అంతరాంతరాల్లో పేరుకుపోయింది. ఏ విధంగానైనా అతను నష్టపోతే చూడాలని ఎంతో ఆశగా ఉన్నాడు. కానీ,అలాంటిదేమీ జరగకపోగా మరింతగా దినదినాభివృద్ధి పొందటం చూసి అతని రక్తం ఉడికెత్తిపోతోంది.
దానికి తోడు అతని కొడుకు శ్రీరామ్ తన కొడుకు సురేష్ కంటే బాగా చదువుతూ అన్నింట్లో మొదటివాడుగా ఉంటున్నాడు. అది మరో దెబ్బ రాజారావుకి. అందుకే ఈనాడిలా అసహనంగా ఉన్నాడు. ఏమైనా సరే, ఏదో ఒకటి చేసి, అతనికి తీరని నష్టం కలిగించాలని తీర్మానించుకున్నాడు. అలా అనుకున్న తర్వాతే అతని మనసు ప్రశాంతత పొంది, మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.
ఆ క్షణం నుండి బాగా ఆలోచించి, రెండు రోజుల తర్వాత ఓ పన్నాగం పన్నాడు రాజారావు. ఆరోజు ధాన్యం బస్తాల్ని ఎడ్ల బండి మీద ఎక్కించుకొని పట్నం తీసుకుపోబోతున్నాడు రంగనాథం. అదును చూసుకొని రాజారావు ఎవరూ చూడకుండా ఆ బండి చక్రం ఒక దానికి ఆధారంగా ఉండే పెద్ద మేకును తొలగించేశాడు. అదేమీ గమనించని రంగనాథం పాలేరును తోడు తీసుకుని బండి తోలుకుంటూ పట్నం బయలుదేరి వెళ్ళాడు.
ఆ మధ్యాహ్నం రాజారావు బంధువొకాయన రొప్పుకుంటూ వచ్చి ఓ దుర్వార్త రాజారావుకు చేరవేశాడు.దాని సారాంశం...రాజారావు కొడుకు సురేష్ ఎడ్ల బండి మీద నుండి కింద పడి, తలకు బాగా దెబ్బ తగిలి ఆసుపత్రిలో ఉన్నాడని..! లబోదిబోమంటూ రాజారావు ఆసుపత్రికి పరుగెత్తాడు. అక్కడ రంగనాథం ఎదురుపడేసరికి ఒక్కసారిగా అవాక్కైపోయాడు రాజారావు. తీరా విషయం తెలిసేసరికి అతనికి తల కొట్టేసినట్లయింది.
రంగనాథం ఎడ్లబండి తోలుకొని పోతుండగా అదే దారిన పట్నం వెళ్తున్న సురేష్ అనుకోకుండా అతని బండి ఎక్కి కూర్చున్నాడట! అంతే! కొంత దూరం వెళ్లేసరికి రాజారావు చేసిన పనికిమాలిన పని ఫలితంగా బండి చక్రం దబ్బున ఊడి, బండి కాస్తా ఉన్నట్టుండి ఒకవైపు ఒరిగిపోయింది. అటువైపే కూర్చున్న సురేష్ విసురుగా కిందపడి దొర్లుకుంటూ వెళ్లడంతో తల అక్కడున్న ఓ పెద్ద రాతికి బలంగా తగిలింది. అదృష్టవశాత్తు రంగనాధానికి, అతని పాలేరుకూ పెద్దగా దెబ్బ లేమీ తగలలేదు. వెంటనే అటువైపుగా వెళుతున్న ఓ ఆటోను ఆపి, సురేష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు రంగనాథం. విషయం అంతా వివరించి, సమయానికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పిందని డాక్టరు చెప్పాడని రంగనాథం రాజారావును ఓదార్చాడు. రాజారావు సిగ్గుతో చితికిపోయాడు.
రంగనానికి హాని చేయబోతే తిరిగి అతనే తనకు అనుకోని రీతిలో సాయపడడం అతనికి మింగుడు పడలేదు. తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే కాబోలు అనుకుంటూ తల పట్టుకున్నాడు.
నీతి : చెడపకురా చెడేవు.
( ఆంధ్రభూమి వారపత్రిలో ప్రచురితం )
No comments:
Post a Comment