Friday, October 23, 2026

బాల కార్మికులు కారు.. నవభారత నిర్మాతలు..

బడిఈడు బాలల్లారా..
చిన్నారి యోధుల్లారా..
బడిబాట పట్టాలి కదరా..!
పలుగూ.. పారా మీకెందుకురా!!
పలకా.. బలపం చేతబట్టండిరా ..
ఆటలతో పాటలతో ఆడీ పాడే 
వయసు మీది కదా..!
కేరింతలతో  కళకళలాడుతూ 
సాగాలీ మీ పయనం కాదా..!
మరలిరాని బాల్యమిదీ వినండీ..
అమూల్యమైనది బాబూ మరువకండి..

 అమ్మలూ.. నాన్నలూ..
 వింటారా ఓ మాట!
 కనంగానే పిల్లల్ని సరిపోయేనా !
 కలలు కూడా కనాలనీ 
 తెలియకుంటే ఎలాగా !?
 అవి నిజమయ్యేదారులు 
 వెతకకుండ లేవంటే ఎలా!
 మీరు కన్న ఈ బిడ్డలు.. మీ కంటిపాపలు..
 మీ బాధలు.. మీ బరువులు. 
 దాటనీయొద్దు మీ పరిధులు..
 వసివాడని పువ్వులండి..
 పసివారిని చేయకండి
 వాటిలోన భాగస్వాములు. 

 ఆ నవ్వులు చిదమకండి. 
 ఆ వెలుగులు ఆరిపోనీయకండి..
 వారి భవిత మీ బాధ్యత
 ప్రతి అడుగున ఇవ్వండీ చేయూత!
 మరలిరానిది బాల్యమన్నది..
 మరల మరల అనుభవించలేనిది..
 మధురమైన జ్ఞాపకాలు ప్రోగుపడే 
 తరుణమదీ.. తలచి తలచి..
 సంబరపడు తరిగిపోని పెన్నిధి..
 కట్టలేరు వెల అన్నది..
 పొందలేరు తిరిగి.. ధర చెల్లించి..

 తెలుసుకోండి పెద్దలారా.. ప్రేమ మూర్తులారా..!
 చిట్టి చిట్టి చేతులు.. లేలేత పాదాలు .
 కందిపోనివ్వకండి.. మొద్దుబారనీయకండి..
 పలక బలపం.. చేతబట్టనీయండి..
 పుస్తకాల బహుమతులు అందించి చూడండి..
 ఈనాటి చిన్నారులు వీరు..
 అవుతారు రేపటి ప్రపంచ పౌరులు   
 కాదు వారు బాల కార్మికులు 
 వెట్టి చాకిరీకి వారసులు అసలే కాదు 
 భావితరం దూతలు.. నవభారత నిర్మాతలు 
 వెలిగించాలి వారి మదిని విజ్ఞాన జ్యోతులు..
 సృష్టించి చూపుతారు ఎన్నెన్నో అద్భుతాలు..!!

 బడి ఈడు బాలల్లారా.. వింటున్నారా..
 బడిబాట పట్టండీ.. కదలండీ..
పలుగూ.. పారా వదలండి
పలకా.. బలపం ఇదిగో పుచ్చుకోండి 
 ఆటలతో పాటలతో ఆడి పాడే వయసు మీది   
 కిలకిల నవ్వులతో సాగాలీ మీ పయనం..
 మరలిరాని బాల్యమిది  ముమ్మాటికిది మీది..
 వాడిపోనియ్యకండి.. పదిలంగా వాడండి..
 మధురమైన జ్ఞాపకాలు.. నిక్షిప్తం చేసుకోండి..
 చిన్నారి బాలల్లారా.. రేపటి ప్రపంచ పౌరుల్లారా..
 బడిసంచీ ఇదిగో.. బడిబాట పట్టండీ..
 బడి గంట మోగుతోంది అదిగో..
 కదలండీ.. కదలండీ.. 

['సంచిక ' ఆన్లైన్ వారపత్రికలో(19.7.26) ప్రచురింపబడ్డ నా రచన🙏]

Monday, October 5, 2026

' చిన్నారి' పజిల్స్...

 



[ ఈనాడు దినపత్రిక.. " హాయ్ బుజ్జీ " శీర్షికన ప్రచురింపబడ్డ పజిల్..🙏]

Friday, October 2, 2026

జాతిపిత ఒక్కడే....


 🙏                                       ~~ యం.ధరిత్రీ దేవి ~~  
   
🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🌹🥀🥀🌹🥀🥀

ఈ ధరణిపై ఇప్పటిదాకా
ఎందరో పుట్టారు... 
సామాన్యులు...అసామాన్యులు...
కొందరు మహానుభావులయ్యారు...
కొందరు అమరజీవులయ్యారు...
మరికొందరు....
చిరస్మరణీయులయ్యారు...
మహాత్ములూ... జాతిపితలూ మాత్రం 
ఎవరూ అవలేదు...
ఒక్క గాంధీజీ తప్ప...!!

                                                           
🥀🌷🌹🥀🌷🥀🌷🥀🌷🥀🌹🥀🌷🌹🥀🌷🥀