Wednesday, October 16, 2024

దానగుణం మంచిది కాదా !


  🌺గేటు దగ్గర అలికిడి వినిపించి వంటింట్లోంచి అరుంధతి ముందు గదిలోకి వచ్చి తొంగి చూసింది. గేటు  అవతల ఓ ఆడ  మనిషి!  పొట్టిగా, ఓ మోస్తరు లావుగా, నేత చీరలో ,  జుట్టు ముడి వేసుకుని ఉన్న యాభై ఏళ్ళు పైబడ్డ ఆవిడ నిలబడి చూస్తోంది. వెంటనే గుర్తుపట్టింది అరుంధతి ఆవిణ్ణి చూడగానే. అంతలోనే ఒక్కసారిగా ఆమెలో విసుగు తలెత్తింది. 
    దాదాపు రెండు సంవత్సరాలవుతుందేమో, మూడు నాలుగు నెలలకోసారి వస్తుంది. ఏదైనా వస్త్రం ఇవ్వమని అడుగుతుంది. వస్త్రం అంటే  ఆమె భాషలో చీర అని అర్థం. మొదట్లో అడగంగానే వెంటనే లోనికెళ్లి ఓచీర  తెచ్చి ఇచ్చేసింది అరుంధతి. అంతే! అలా అలా అలవాటయిందామెకు. ఈమే  కాదు, మరొక ఆవిడ కూడా ఇలాగే రెగ్యులర్ గా  రావడం, వచ్చినప్పుడల్లా చీర అడగడం -- అరుంధతి ఇవ్వడం మామూలైపోయింది రాన్రానూ. ఎవరైనా ఇలా ఇంటికి వచ్చి  ఏదైనా అడిగితే లేదన లేకపోవడం అరుంధతి బలహీనత. పైగా ఆమెకున్న దయాగుణం దీన స్థితిలో ఉన్న వాళ్ళకి దానం చేయాలని ప్రేరేపిస్తుంది కూడా. అదామె స్వభావం! అంతవరకూ బాగానే ఉంది, కానీ ఈ మధ్య ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఆమెకు అదో విధమైన అసహనం, చిరాకు కలుగుతోంది. కారణం -- అరుంధతి బలహీనతను బాగా కనిపెట్టారేమో, ముఖ్యంగా ఆ ఇద్దరు ఆడవాళ్లు! అడపాదడపా రావడం, తప్పనిసరిగా చీర అన్నది ఇచ్చేదాకా వదలక పోవడం, మొండికి  పడడం చేస్తుంటే, రాన్రాను అరుంధతిలో సహనం నశించి పోతోంది. ఏమిటి వీళ్ళు ! ఇస్తే తీసుకోవాలి, అంతేగానీ ఇలా విసిగించడంఏమిటీ !  పైగా ఓ వేళా పాళా ఉండదు వీళ్ళరాకకి ! ఒక్కోసారి ఉదయమే ఇంటి పనుల్లో మునిగిపోయి  ఉన్నప్పుడు, మరోసారి భోజనాలయిపోయి, అలసిపోయి కాస్త నడుం వాల్చి విశ్రాంతిగా కునుకు  తీస్తున్నప్పుడు దబ్బున  గేటు చప్పుడు చేయడం, పిలవడం! లేచి వచ్చేదాకా పిలుస్తూనే ఉండడం,  ఏదో ఒకటి చేతిలోపెట్టేదాకా కదలకపోవడం ! క్రమంగా ఈ వ్యవహారం ఆమెకు తలనొప్పిగా పరిణమించి పోయింది. ఇంట్లో ఉన్న పాత చీరలు ఏం చేసుకుంటాం, ఇలా ఇస్తేనన్నా మరొకరికి ఉపయోగపడతాయి కదా అన్న ఆలోచనతో తానిలా  చేస్తే వీళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని, అలవాటు  చేసుకుని తననిలా బాధపెడతారని  ఆమె ఊహించలేకపోయింది పాపం! అందుకే బాగా ఆలోచించి, ఈమధ్యే  ఓ నిర్ణయం తీసుకుంది,  ఇకపై ఇలా ఇంటి వద్దకొచ్చి అడిగే వాళ్ళకి చీరలు గీరలు అసలు ఇవ్వకూడదని! ఎలాగైనా ఆ మాటకు కట్టుబడి ఉండాలని స్థిరంగా అనుకుంది కూడా. ఈరోజు గేటు వద్ద ఆవిణ్ణి చూడగానే ఆ నిర్ణయం గుర్తొచ్చి, వెంటనే బయటికొచ్చేసి, చెప్పేసింది, 
" చూడమ్మా, చాలా ఇచ్చాను నీకు, వచ్చిన ప్రతిసారీ ఇవ్వాలన్నా, ఇచ్చే తీరాలన్నా కుదిరేపనిగాదు. పైగా నీవు ఒక్కత్తివే కాదు, ఇంకా ఇలా వస్తూనే ఉంటారు, ఎందరికని  ఇవ్వను!... ఇక నీవు వెళ్ళవచ్చు.. " 
 గట్టిగానే చెప్పేసి, లోనికి వెళ్ళిపోయింది. కానీ ఆమె వింటేగా! అలాగే నిలబడి మళ్లీమళ్లీ అడగడం మొదలెట్టింది. అరుంధతి లోపల్నుండే  మళ్ళీ గట్టిగా చెప్పింది, వెళ్లిపొమ్మని. కానీ ఆమె మాత్రం వినిపించుకోకుండా అలాగే నిలబడింది యథాప్రకారంగా. అరుంధతిలో కోపం కట్టలు తెంచుకుంది, అయినా తమాయించుకుని, 
" ఎన్ని సార్లు చెప్పాలి, వినిపించదా?... " అంటూ బయటకొచ్చేసింది. అంతే! ఆమె కోపంగా చూస్తూ మెట్లు దిగుతూ, 
" ఏ, పోయేప్పుడు కట్టుకుని పోతావా?....... "
 అంటూ అంతకంటే కోపంగా గట్టిగా  అరుస్తూ గొణు క్కుంటూ  విసవిసా వెళ్ళిపోయింది. ఒక్కసారిగా అరుంధతి అవాక్కై స్థాణువై నిలబడిపోయింది. 
" ఏమిటి! ఇన్నాళ్ళూ నేను ఇచ్చిందంతా ఏమైపోయింది? అదేమీ పట్టదా ఇలాంటి వాళ్ళకి! ఒక్కసారి లేదు పొమ్మంటే చాలు ఇలా అనేయడమేనా!"
  మదనపడుతూ మెల్లిగా లోనికి కదిలింది. ఇదంతా లోపల్నుండి గమనిస్తూన్న ఆమె భర్త ఈశ్వరరావు, అరుంధతి మ్లానవదనం చూస్తూ, 
" ఏమిటీ, ఫీలవుతున్నావా ! అసలు పొరపాటు నీది. వాళ్లకు అలవాటు చేసింది నువ్వు! ఏదో అపర దానకర్ణుడి  చెల్లెల్లా ఇలా అడిగినోళ్లందరికీ  దానాలు చేస్తూ పోతే ఇలాగే ఉంటుంది మరి!..."
 అసలే బాధలో ఉన్న అరుంధతికి ఈ మాటలు ముల్లులా గుచ్చుకున్నాయి. 
" అంటే దానం చేయడం తప్పా? "
" దానం చేయడం తప్పు కాదు, అపాత్రదానం తప్పు. నీవు గమనించినట్లు లేదుగానీ ఆ ఇద్దరు ఆడవాళ్ళ తీరు చూస్తే వాళ్లు  మరీ అంత దయనీయస్థితిలో ఉన్నట్లుగా అనిపించలేదు నాకు. మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే వాళ్ల స్థితిగతుల్ని కూడా గమనించాలి మరి!.."
 అంటూ చిన్న సైజు క్లాసు పీకాడు. అంతలోనే అరుంధతి చిన్నబు చ్చుకున్నట్లు గమనించి, 
"చూడు, జరిగిందేదో జరిగింది, ఇకపై ఇలాంటి వాళ్ల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే, ఇచ్చి చెడ్డ గావడం కంటే ఇవ్వకుండా చెడ్డ కావడం మేలనుకుంటా... "
 చిన్నగా నవ్వుతూ, వాతావరణాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశాడు.మళ్ళీ అందుకుని, 
"... నీకు అంతగా ఇవ్వాలనిపిస్తే ఏదైనా వృద్ధాశ్రమానికి అప్పుడప్పుడూ వెళ్లి వాళ్లకి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ పద్ధతి బాగుంటుంది, నీకు సంతృప్తి, సంతోషం దక్కుతాయి, " 
 అంటూ ఓ సలహా ఇచ్చాడు. అదేదో బాగున్నట్లు అనిపించింది అరుంధతికి. అయినా  రాను రాను మనిషిలో మంచితనం ఉండడం కూడా తప్పేమో అనిపించిందామెకి ఆ క్షణాన  ! ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చి, ' దేవుడా' అనుకుంటూ తల పట్టుకుని కుర్చీలో కూల బడింది.
               **    **     **     **    **
    ఇది అరుంధతి అనుభవమే కాదు, నా  అనుభవం కూడా.అంతే కాదు, ఇంకా మరికొందరు కూడా ఇలాంటివి ఎదుర్కొనే  ఉంటారు. ఇలా జరిగినప్పుడు నిజంగానే అనిపిస్తుంది, దాన గుణం మంచిది కాదా అని! 
   ఈ సందర్భంగా చిన్నతనంలో బళ్ళో  చదువుకునేటప్పుడు మా తెలుగు మాస్టారు చెప్పిన ఓ పిట్ట కథ గుర్తొస్తోంది  నాకు. ఓ ఊర్లో ఓ  యాచకుడు ఉండేవాడట. అతను ప్రతి రోజూ  ఆ ఊర్లోని అన్ని వీధులు తిరిగి ముష్టి ఎత్తుకునే వాడట. ఎవరు పెట్టినా పెట్టకపోయినా ఓ ఇల్లాలు మాత్రం ఖచ్చితంగా అతనికి బిక్షం వేసేదట ! ఓ రోజు పాపం, ఆమెకు చేయి ఖాళీ  లేకనో, లేక సమయానికి  పెట్టడానికి ఏమీ లేకనో అతనికి ఏమీ  పెట్టకనే  పొమ్మందట! అంతే! ఆ యాచ కుడు వెంటనే, 
"  రోజూవేసే..... దీనికే మాయ రోగం వచ్చిందోఇయ్యాళ !...." 
 అంటూ పైకే అనేసి గొణుక్కుంటూ  వెళ్ళిపోయాడట! ఆ మాటలు ఆ ఇల్లాలి చెవిని పడనే పడ్డాయి. హతాశురాలైపోయిందటావిడ, ఆ బిచ్చగాడి ప్రవర్తన చూసి ! 
 అదే మాస్టారు మరోసారి మరో యాచకుని  గురించి చెప్పారు. అతను ఆ  ఊర్లో ప్రతిరోజూ మూడే మూడు ఇళ్లకు యాచనకు వెళ్తాడట ! ఆ మూడిళ్ల వాళ్ళు ఏదైనా పెడితే తింటాడు, అంతే! మరుసటిరోజు మరో మూడిళ్లకు వెళ్తాడట. ఆ రోజు వాళ్ళు ఏమీ పెట్ట లేదనుకోండి, తలవంచుకుని మౌనంగా వెళ్ళి పోయి, ఖాళీ కడుపుతో పడుకుండి పోతాడట ! అది  అతని అలవాటు, స్వభావం! ఇంకా చెప్పాలంటే, ఓ రకమైన'పాలసీ' కి కట్టుబడి ఉండడం! అప్పట్లో  ఏమీ తెలియలేదు గానీ, తర్వాత్తర్వాత కొన్ని ఉదంతాలు జరిగాక తెలిసొచ్చింది ఇలా యాచకుల్లోనూ రకాలుంటారని ! 
   ఇంతకీ దానగుణం మంచిదా కాదా?  మంచిదే, కానీ ఏదీ  మితిమీరి ఉండకూడదు. విజ్ఞులు ఏమంటారో ఏమో గానీ, ఆయా మనుషుల్ని బట్టి కూడా మనం  మారుతూ ఉండాలి అన్నది స్వానుభవంతో తెలుసుకున్న నా అభిప్రాయం ! కాదంటారా !

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
                   




Friday, October 4, 2024

అమ్మ గురించి పాప...

         

   🌺🌺 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

   పసిపాపకు పాలిచ్చి జోకొడుతూ నిద్రబుచ్చుతుంది తల్లి.అది పాలు తాగే పసిపాపల వరకే వర్తిస్తుంది. అందులో ఆ అమ్మ శ్రమ ఉంటుంది, కానీ... కొంతవరకే...! అయితే... రెండు నుండి ఐదేళ్ల పిల్లల విషయంలో  అది మాత్రమే సరిపోదు. వాళ్లకి అన్నం తినిపించడమన్నది ఆ తల్లికి...అబ్బో!! చాలా కష్టంతో కూడుకున్న తతంగమే...! ఒకచోట కూర్చోరు... ఒకచోట నిలబడరు... అటూ ఇటూ పరుగులు! దాక్కోవడాలు !! అంతేనా.. ఇంకా ఎన్నో ఎన్నెన్నో... చిలిపి చేష్టలు...! అలాగని బుజ్జి తల్లి కడుపు నింపకుండా ఆ తల్లి ఉండగలదా !

    ఎన్నో ఊసులు చెప్తుంది... ఏవేవో కబుర్లు చెప్తుంది... ఉన్నవీ లేనివీ కల్పించి కాసేపు మైమరపిస్తుంది. ఏదైతేనేం... ఆకాస్త  బువ్వ బుజ్జిదాని కడుపులోకి వెళ్లేదాక ఊరుకోదుగా...! ఆ సహనమూర్తికి జోహార్లు అర్పించాల్సిందే..!
   ప్రతి స్త్రీ తన జీవితంలో ఎదుర్కొనే ఓ తీపి అనుభవం ఇది...కాదంటారా!ఆ బుజ్జితల్లి రేపు తానూ తల్లిగా మారినపుడు..తన పాపకు అలాగే తినిపించాల్సి వచ్చినప్పుడు...ఆ తల్లికి  ఒకనాటి తన తల్లి పాట్లు, పాటలు గుర్తుకు రాక మానవు.ఒకనాటి తన అల్లరి, తల్లి మురిపెం ఆమె పెదాలపై చిరునవ్వు చిందించక మానదు.తనలో నిక్షిప్తమై దాగివున్న ఆ జ్ఞాపకాల దొంతర..అలా అలా కదిలి...ఇలా ఓ పాటగా ఎలా మారిందో వినండి... 🙂





       అమ్మ నాకు తినిపించే 
       అల్లిబిల్లి కబుర్లతో 
       ఆకాశం చూపిస్తూ 
       అపరంజిని నేనంటూ    //అమ్మ//👧

        ఇలకు దిగిన ఇలవేల్పునట 
        ఈశ్వరవరప్రసాదినట 
        ఉన్నదంత నాదంటూ 
        ఊర్వశినీ నేనంటూ        //అమ్మ//🤱

        ఎన్నడూ లేదంట 
        ఏలోటూ నాకంట 
        ఐశ్వర్యం నాదంటూ         
        ఐశ్వర్యను నేనంటూ       //అమ్మ//👧

        ఒరులెవరూ సాటిరారంట 
        ఓనాటికి నేనవనికి 
        ఔతానట మహారాణిని 👧
        అందలాలు ఎక్కేనట 
        అః !అహహ !! 
        నేనే ఒక నియంతనట !!  //అమ్మ//


🤗

   ఎప్పుడూ పాప గురించి అమ్మ చెప్పే కబుర్లేనా...! ఓసారి అమ్మ గురించి పాప చెప్పే కబుర్లు వింటే ఎలా ఉంటుంది...! ఆ ఆలోచనతో ఓ చిన్న ప్రయత్నం చేశానంతే 🙂
    తల్లి అయిన ప్రతి స్త్రీకి ఇది తప్పనిసరిగా ఎదురయ్యే అనుభవమే... మరపురాని జ్ఞాపకమే...! బిడ్డకు జోల పాడి నిద్ర బుచ్చడానికి ఆ తల్లి గొప్ప సింగరే అయి ఉండాల్సిన అవసరం లేదు కదండీ..! అమ్మ ఎలా పాడినా పాపకు ఇష్టమే. హాయిగా కళ్ళు మూసుకుని  నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటుంది. అదండీ...🙂🤱
         .
    మరొక విషయం... ఈ బాల గేయాన్ని గమనిస్తే, ప్రతి లైన్  లోని మొదటి పదంలోని మొదటి అక్షరం మన తెలుగు వర్ణమాలలోని అచ్చులు... అ నుండి అః వరకు కనిపిస్తాయి. చాలా కాలం క్రితం చిన్నపిల్లల కోసం నేను రాసుకున్న పాట ఇది. ఈ పాట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ తరగతుల విద్యార్థులకు నేర్పించడానికి అనువుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాను. 
 అందరికీ ధన్యవాదాలు.
*******************************
 

Saturday, September 28, 2024

అక్షరాలా ప్రగతికి మెట్లు...

🌴🌲🌴🌲🌴🌲🌴🌲🌴🌲🌴🌲🌴🌲🌴🌲

 
                                      ~యం. ధరిత్రీ దేవి 

     పలురకాల హరితవర్ణ వృక్షజాలం...
     నీలాల నింగిని తాకాలని ఆశపడుతున్నదా!
     పక్కపక్కనే ఉంటూ పోటీ పడుతున్నట్టు...
     అంతలోనే.. ఆత్మబంధువుల్లా 
     పలకరించుకుంటున్నట్లు...
     చల్లనిగాలులు వింజామరలు 
     వీస్తున్నట్టు కాసేపు...
     ఎవరిమీదో కోపంతో ఊగిపోతున్నట్టు 
     మరికాసేపు.. ఉగ్రరూపం దాల్చిందా ప్రకృతి..!
     అన్న రీతిని బీభత్సంగా.. భయంగొల్పుతూ 
     మరోసారి..! ఏమా వింత వింత విన్యాసాలు!!
     గొడుగులా విచ్చుకుని నీడనిస్తూ...
     గుబురుగా అల్లుకొని పక్షులకావాసమవుతూ
     ప్రాణవాయువుతో ప్రాణం పోస్తూ...
     మరోపక్క శబ్ద కాలుష్యంతో పోరాడుతూ...
     ఋతువులకనుగుణంగా రూపం మారుస్తూ..
     ప్రతీక్షణం స్పందిస్తూ..ప్రకృతితో మమేకమౌతూ
     సేవాగుణంతో తరించిపోయే ఈ చెట్లు
     అక్షరాలా ప్రగతికి మెట్లు...!
🌲🌴🌲🌴🌲🌴🌲🌴🌲🌴🌲🌴🌲🌴🌲🌴
 





Tuesday, September 24, 2024

అందంగా లేనా.. అసలేం బాలేనా...!

   
                  

    మల్లెకన్నా, మందారకన్నా,గులాబీకన్నా, లిల్లీకన్నా నేనేమి తక్కువ! రూపం లేదా! ఆకృతి లేదా! కనులకింపైన రంగు లేదా! 'సువాసన' అంటారా! అయితే నేమి? అదొక్కటే కదా లేనిది! అంత మాత్రాన అన్నింటికీ నన్ను దూరం చేస్తారా! అంటోందీ చిన్ని పువ్వు...!
   మొగ్గగా ఉన్నప్పుడు ముడుచుకుపోయినట్లున్నా... పువ్వై విచ్చుకున్న పిదప ఎంచక్కా  కొమ్మల మాటు నుండి ముందుకొచ్చి, ఆకాశంలో చందమామలా ఎర్రగా మెరిసిపోతూ, ఆకుపచ్చని ఆకుల నడుమ తల్లి చాటు బిడ్డలా గారాలుపోతూ దర్పంగా నిలబడ్డ ఈ చిన్నారి పుష్పం ముందు కాస్త అలిగినా, సర్దుకుని, " అందంగా లేనా... అస్సలేం బాలేనా.." అని  పాడుతున్నట్లుగా లేదూ!!
    సృష్టిలో రకరకాల పూల మొక్కలు... అవి అందించే లెక్కలేనన్ని అందమైన పుష్పాలు.. నిత్యం మనం ప్రకృతిలో చూస్తూ ఉంటాం. దేని అందం దానిదే.. దేని ప్రత్యేకత దానిదే. కళాత్మక హృదయం ఉంటే అన్నీ కన్నులవిందు చేసేవే...
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Monday, September 16, 2024

విపత్తు ముంచెత్తిన వేళ...


                                ~ యం. ధరిత్రీ దేవి 

 ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు 
 అరక్షణం ఆగక కురుస్తున్న వానలు...   పొంగిపొర్లుతున్న వాగులు వంకలు..
 వరదలు.. బీభత్సాలతో 
 అతలాకుతలమవుతూ జనాలు...
 కూలుతున్న గుడిసెలు...
 కారుతున్న మట్టి మిద్దెలు...
 విరిగి పడుతున్న కొండచరియలు...
 సమాధి అవుతూ సజీవ దేహాలు !!
 భవంతులు సైతం జలమయం!
 పంటలన్నీ నీటిపాలై 
 కడగండ్ల నడుమ రైతన్నలు...!
 సెలఏర్లను తలపిస్తూ రహదారులు...
 దిక్కుతోచని దయనీయ కథనాలు!!
 ఏమిటీ వైపరీత్యాలు!!
 వేసవి వీడ్కోలు పలికి...
 చిరుజల్లులు కురిసిన క్షణాన.. 
 ముత్యాల జల్లని మురిసిపోయితిమే...!
 ఆనందం అంతలోనే 
 మటుమాయమైపోయెనా !
 వరుణుడా!ఆగిపోవా!
 ప్రకృతి మాతా!కరుణించి శాంతించవా !!
 విపత్తు ముంచెత్తిన వేళ...
 చీకట్లో చిరుదీపాల్లా...
 మానవత్వం పరిమళిస్తూ...
 కదిలాయి కదా ఆపన్నహస్తాలు!! 🫲
 వందనాలు. వారికి...
 శతకోటి వందనాలు...
*****************************


Wednesday, September 11, 2024

వర్షం ఆగింది ...కథ

                                           ~ యం.ధరిత్రీ దేవి 

  ఫెళఫెళమంటూ ఉరుము ఉరిమిన శబ్దం. ఎక్కడో పిడుగు పడినట్టుంది. ఆకాశం విరిగి మీద పడుతుందా అన్నట్లు అనిపించి ఒక్క ఉదుటున లేచి కూర్చుంది కమల. 

  వారం నుండీ ఎడతెరిపిలేని వర్షం! అదో పాత ఇల్లు. రెండు గదులు ఉంటుంది. చిన్న వంటిల్లు, ముందు ఓ చిన్న వరండా. అందులోనే ఓ పక్క టాయిలెట్స్. వంటగది రెండు చోట్ల, రెండోది ఓవేపున, ఇంకా వరండా అంతా కారుతూనే ఉంది. ఇల్లంతా ఒకలాంటి బూజు వాసన! బొట్లు బొట్లుగా కారుతున్న చోట సత్తు గిన్నెలు పెట్టేసింది కమల. గదిలో కారనివేపు మంచం మీద పిల్లలిద్దర్నీ పడుకోబెట్టి, అక్కడే వారగా కింద దంపతులిద్దరూ సర్దుకున్నారు. 

     పడుకున్న కృష్ణమూర్తికి నిద్రన్నది పట్టడం లేదు. ఆరు సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఉంటున్నారు. అద్దె పన్నెండు వందలు. ఓనరు మంచివాడే! అద్దె పెంచమని అడగట్లేదు. అన్నింటికీ అనువుగా ఉంది. అతనా చిరుద్యోగి. చేతికొచ్చే ఎనిమిది వేల తోనే అన్నీ సరిపుచ్చాలి. పెరుగుతున్న పిల్లలు, అంతకంటే వేగంగా పెరిగే ధరలు-- ఇవన్నీ ఆలోచించి ఇల్లు మారే ఆలోచన చేయటం లేదు కమలా, తనూ. కానీ రెండు సంవత్సరాలుగా వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఈ చికాకు భరించడం శక్యం కావడం లేదు. పోనీ మరో మంచి ఇంటికి మారి పోదామా అంటే బొటాబొటిగా సరిపోయే జీతం వెక్కిరిస్తోంది. కానీ పరిస్థితి చూస్తుంటే ఇక్కడ ఉండలేమనిపిస్తోంది. ఆలోచనలతో తలమున్కలౌతూన్నాడతను. 

   ఇవతల కమల ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. వెనక వీధిలోని ఇళ్లు ఎంత అందంగా ఉంటాయి! చూడచక్కటి రంగులతో, ఇంటి ముందు పూల మొక్కలతో ఎంత బాగుంటుందా వీధంతా! నిజంగా అలాంటి ఇంట్లో ఎప్పటికైనా తాము ఉండగలరా? వెంటనే ఆమెకు భర్త సంపాదన గుర్తొచ్చి నీరసం కమ్ముకు వచ్చేసింది. రెండేళ్లుగా కలలు కంటూ ఉంది అలాంటి ఇంట్లో ఉండాలని. కానీ సాధ్యమా! ఈసారి విపరీతమైన వానలతో ఈ ఇల్లు మరీ పాడైపోయింది. ఇంటి ముందు మట్టిరోడ్డు అంతా బురదమయం. నడవాలంటేనే జారి పడే పరిస్థితి! ఎలాగైనా భర్త నొప్పించి కాస్త అద్దె ఎక్కువైనా దీని కన్నా మెరుగ్గా ఉండే ఇంట్లోకి మారితే బావుంటుంది. ఇలా  -- నిద్రకు దూరమైపోయి ఆ ఇద్దరి ఆలోచనలూ ఓ పట్టాన తెగడం లేదు. 

                       **    **     **

    తెల్లారింది. వర్షం సన్నగా కురుస్తూనే ఉంది. పిల్లలింకా నిద్ర లేవ లేదు. కమల కూడా రాత్రంతా నిద్ర లేక అలసి పోయిందేమో, పడుకునే ఉంది. పైగా రోజు ఆదివారం. కృష్ణమూర్తే ముందుగా లేచాడు. 

" కమలా, లే, లేచి త్వరగా కానివ్వు. మా ఫ్యాక్టరీ కి దగ్గర్లో ఏమైనా అద్దె ఇళ్ళు ఉన్నాయేమో చూసొద్దాం...... " 

 ఒక్కసారిగా నిద్ర మత్తు వదిలి సంభ్రమంగా లేచి కూర్చుంది కమల. రోగి పాలే కోరాడు, డాక్టరూ పాలే తాగమన్నాడు అన్నట్లుగా ఆమె మనసంతా సంతోషం అలుముకుంది. లేచి, గబగబా పనుల్లో జొరబడింది. పదింటికల్లా వంట పూర్తి చేసుకుని, పిల్లలకు జాగ్రత్తలు చెప్పి బయట పడ్డారిద్దరూ. ఆ టైంలో బురద రోడ్డు మరింత దరిద్రంగా తోచింది ఇద్దరికీ. ఎలాగోలా నడిచి, రోడ్డెక్కి ఆటోలో కూర్చున్నారు. కృష్ణమూర్తి ఫ్యాక్టరీ కి దగ్గర్లో ఉన్న మూడు వీధులూ మధ్యాహ్నం దాకా తెగ తిరిగితే, రెండిళ్ళు అద్దెకున్నాయని తెలిసింది. ఒకటి మూడు వేలు చెప్పారు. వెంటనే వద్దనుకుని వెనుదిరిగారు. మరోటిరెండువేల మూడు వందలు చెప్పారు. కరెంటుతో కలిపి రెండు వేల అయిదు వందల దాకా అవుతుంది. తమకు భారమే. కానీ ఇల్లు నీట్ గా, సౌకర్యంగా ఉంది. పిల్లలను చేర్చడానికి ఇంకో స్కూల్ కూడా దగ్గర్లోనే ఉన్నట్టుంది. తను కాస్త ఓవర్ టైం చేస్తే సరిపోతుంది. ఈ వానాకాలం బాధలన్నీ ఇకమీదట ఉండవు, అనుకుంటూ కమలకూ అదే చెప్పాడు. అప్పుడే కమల ఊహల్లో తేలి పోసాగింది. వెంటనే నిర్ణయం తీసుకుని, అంతో ఇంతో అడ్వాన్స్ ఇచ్చేద్దామనుకుని ఓనర్ కోసం అడిగారు. ఓనర్ ఊరికి వెళ్ళాడని, రేపు వస్తాడనీ, తాళం చెవి ఇచ్చి ఎవరైనా వస్తే చూపించమని చెప్పారని పక్క పోర్షన్ వాళ్ళు చెప్పారు. సరే, రేపు ఉదయం వచ్చి మాట్లాడతానని చెప్పి, కృష్ణమూర్తి కమల తో పాటు తిరుగు ముఖం పట్టాడు. 

   వాన వెలిసింది. రోడ్డు దాకా నడిచి రావడానికి పది నిమిషాలు పైనే పట్టింది వాళ్లకి. ఆటో కోసం నిలబడ్డారిద్దరూ. పావుగంట గడిచినా ఒక్కటీ రాలేదు. తర్వాత ఒకటి వచ్చి నిలబడింది. కానీ అతనడిగింది చూస్తే తల తిరిగింది ఇద్దరికీ. మరో పావుగంట వేచి చూసి, ఎలాగోలా ఓ ఆటో ఎక్కేశారు. అమ్మో! ఇక్కడ ఆటో సౌకర్యం అంతంత మాత్రమే నన్నమాట! అదీ ఎంతెంత అడుగుతున్నారు! అలా పోతూ పోతూ ఉంటే ఓవైపు ఓ స్కూలు కనబడింది. ఆరోజు ఆదివారమైనా కాంపౌండ్ లోపల యూనిఫాం తో ఉన్న కొందరు పిల్లలు ఆట్లాడుకుంటూ ఉన్నారు. పెద్ద బిల్డింగ్, చుట్టూ పెద్ద కాంపౌండ్, అందంగా కనిపించే చెట్లు. కచ్చితంగా గవర్నమెంటు బడి అయితే కాదు. ఫ్యాక్టరీకి దగ్గర్లోనే స్కూల్ ఒకటుందని విన్నాడు కానీ ఎప్పుడూ చూడలేదు. ఇదేనన్నమాట! దీంట్లో తన పిల్లల్ని చేరిస్తే ఫీజులు, డ్రెస్సులు, ఇతర ఖర్చులు తడిసి మోపెడై తన నడుం విరగడం ఖాయం. ఇంటద్దె ఓ వెయ్యి ఎక్కువ అవుతుంది లే అనుకున్నాడు గానీ ఈ లెక్కన మూడు వేలకు తక్కువ కాదు. కృష్ణమూర్తికి గాభరా మొదలైంది. అవతల కమల పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏదో కొత్త ఇంటికి మారదాంలే అన్న ఆనందం ఆమెలో నెమ్మదిగా ఆవిరై పోసాగింది. తన కోరిక తీర్చుకోవడానికి భర్త ఆరోగ్యం ఫణంగా పెట్టాలా? ఆమె గుండె బరువెక్కుతూ ఉంది. ఇదేమీ పట్టని ఆటో దూసుకు పోతోంది. ఆలోచనల్లో పడి ఇద్దరూ గమనించలేదు గానీ తగ్గిపోయిన వర్షం ఎప్పుడు మొదలైందో మరి, మళ్లీ మెల్లిగా విజృంభించడం ఆరంభించింది. ఆటో వెళ్తూ వెళ్తూ రద్దీగా ఉన్న ఓ చోట ఆగింది. వర్షం నీళ్లతో రోడ్డంతా ప్రవాహంలా ఉండి, వాహనాలన్నీ మెల్లిగా కదుల్తూ ట్రాఫిక్ స్తంభించిపోయి ఉంది. అనుకోకుండా వారి దృష్టి అటుపక్కగా రోడ్డు కింది భాగాన ఉన్న గుడిసెల మీద పడింది. వచ్చేటప్పుడు గమనించలేదు గానీ, ఆచివర నుండి ఈ చివర వరకూ పూరి గుడిసెలే ! పూర్తిగా తడిసిపోయి ఉన్నాయి ! వాటి ముందు బురద నీరు ప్రవహిస్తూ ఉంది. కొందరు ఆడా మగా గుడిసెల ముందు నిలబడి ఉన్నారు. పిల్లలు మాసిన బట్టలతో, చింపిరి జుట్లతో ఆ నీళ్లలోనే ఉల్లాసంగా ఆడుతున్నారు. ఆ దృశ్యం చూసేసరికి ఇద్దరికీ మతులు పోయినట్లయింది. దేవుడా ! ఇలాంటి చోట్ల, ఈ గుడిసెల్లో, ఈ వర్షంలో ఈ మనుషులు ఎలా ఉండగలుగుతున్నారు?!  హఠాత్తుగా కమల లో ఏదో అలజడి ! తాముంటున్న ఇల్లు గుర్తొచ్చి, వీళ్ల కన్నా తామెంత మెరుగ్గా జీవిస్తున్నారు! వర్షాకాలం కొద్దిరోజులు మాత్రమే ఇబ్బంది. తర్వాత అంతా మామూలే. మూడు పూట్లా తిండికి లోటు లేదు, పిల్లల్ని ఎంచక్కా చదివించు కుంటున్నారు. ఇంతకన్నా కావలసిందేముంది? అనవసరంగా స్థాయికి మించిన కోరికలతో మనసంతా పాడు చేసుకుంటున్నాను గానీ --- అనుకుంటూ భర్త వైపు చూసింది. అతనూ తదేకంగా అటే చూస్తున్నాడు. వర్షం జోరు కాస్త తగ్గినట్లుంది, ఆటో మెల్లగా దారి చేసుకుంటా కదిలి కాసేపట్లో ఇంటి దరిదాపుల్లోకి వచ్చేసింది. చిత్రంగా అక్కడ వర్షం జాడ లేనే లేదు. ఉదయం బురదగా ఉన్న దారంతా ఆరిపోయి నడవడానికి వీలుగా తయారయింది. ఇద్దరూ ఆటో దిగి, ఆ దారెంట నడుచుకుంటూ ఇల్లు సమీపించారు. ఉదయం బయలుదేరేటప్పుడు ఎంతో దరిద్రంగా అనిపించిన ఈ మట్టి రోడ్డు ఇప్పుడు పర్వాలేదు, సౌకర్యం గానే ఉందనిపించింది వాళ్లకి! ఇంటి బయటే బాబు, పాప ఇద్దరూ చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటున్నారు. అమ్మ నాన్నల్ని చూడగానే పరిగెత్తుకుంటూ ఎదురొచ్చారు. 

   లోపలకి వెళ్లి ఇల్లంతా శుభ్రంగా తుడిచేసింది కమల. ఇల్లు ఇప్పుడెంతో ఆహ్లాదంగా కనిపించిందామెకు. సాయంత్రం వరండాలో ఎదురెదురుగా కూర్చున్నారిద్దరూ. పిల్లలు పుస్తకాల సంచులు ముందేసుకుని కబుర్లాడుకుంటున్నారు. 

" నాన్నా, నిన్న ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు. నేనే క్లాస్ ఫస్ట్. మా టీచర్లంతా నన్నెంత మెచ్చుకున్నారో తెలుసా!... " బాబు చాలా ఆనందంగా చెప్పాడు. 

" అమ్మా, నేను రన్నింగ్ రేస్ లో, స్కిప్పింగ్ లో ఫస్ట్ వచ్చా. రిపబ్లిక్ డే రోజు నాకు బోలెడు ప్రైజులొస్తాయి, అన్న కంటే కూడా.. "  పాప మరింత సంతోషంగా చెప్తూ అమ్మ పక్కలో కొచ్చి కూర్చుంది. 

" అమ్మా, మా టీచర్లంతా ఎంత మంచివాళ్ళో తెలుసా?.. " బాబు రెట్టించిన ఉత్సాహంతో చెప్పాడు. వాళ్ల సంతోషం అవధులు దాటుతోంది. కమలా, కృష్ణమూర్తి -- ఇద్దరూ ముచ్చటగా పిల్లలిద్దరినీ చూస్తూ ఉండిపోయారు. 

" గవర్నమెంటు స్కూళ్లలో చదువు రాదన్నదెవరు? వేలకు వేలు గుమ్మరిస్తేనే మంచి చదువొస్తుందా? పిల్లల బుర్రల్లో 'స్టఫ్ ' అన్నదుండాలి గానీ"...అనిపించిందిద్దరికీ. ఇద్దరూ ఓ విధమైన భావోద్వేగంతో పిల్లలిద్దర్నీ అక్కున చేర్చుకున్నారు. 

   ఇందాక చూసొచ్చిన ఇల్లు, ఇల్లు మాత్రమే బాగుంది, మిగతా సౌకర్యాలన్నీ అంతంత మాత్రమే. ఖర్చు కూడా తమ స్థాయికి చాలా ఎక్కువ! ఇక్కడ -- ఇల్లొక్కటే అసౌకర్యం! తతిమ్మావన్నీ తమకు అందుబాటులో ఉన్నాయి. కృష్ణమూర్తి మెల్లిగా లేచి లోపలికి వెళ్ళాడు.

 అరగంట తర్వాత బయటికి వచ్చి,  " కమలా, నేనలా వెళ్లి మన ఇంటి ఓనర్ ను కలిసి వస్తాను. ఇంటికి కొన్ని మరమ్మతులు చేయించమని రిక్వెస్ట్ చేస్తాను. కావాలంటే ఖర్చు మనమే పెట్టుకుందాం. ఆపాటి దానికి ఇల్లు మారడం దేనికి? ఇక్కడ మనకు అన్నిటికీ సౌకర్యంగా ఉంది.... " అన్నాడు కృష్ణమూర్తి. 

 కమల వదనంలో చిరు దరహాసం! ఆమె అభిప్రాయమూ అదే మరి! ఇప్పుడామెకు వెనక వీధిలోని పెద్ద పెద్ద బిల్డింగులు గుర్తుకు రావడం లేదు. ఇందాక వస్తూ వస్తూ చూసిన గుడిసె వాసులే కనిపిస్తున్నారామె కళ్ళముందు! 

" ఎప్పుడైనా సరే మన స్థితిగతుల్ని మనకంటే తక్కువ స్థాయి వారితోనే పోల్చి చూసుకోవాలి " అన్న సత్యం ఇందాకే ఆమెకు బోధపడింది.

" మన స్థాయిని బట్టి మన మానసిక స్థితి కూడా మారుతూ దానికి తగ్గ మనస్తత్వం అలవరచుకుంటే మనశ్శాంతికి కొదవ ఉండదు కదా! ",  అన్న ఆలోచన ఆమెలో పొడసూపి ఎంతో తృప్తిగా నిట్టూర్చింది. 

  లేచి బయటకు నడిచింది కమల. కృష్ణమూర్తి రోడ్డు దాకా నడిచి వెళ్లడం, వెంటనే వచ్చిన ఆటో ఎక్కడం చూసి వెనుదిరుగుతూ యధాలాపంగా పైకి చూసింది. ఆకాశం నిర్మలంగా ఉంది. వర్షం పూర్తిగా తగ్గిపోయింది.

******************************************

Thursday, September 5, 2024

గురువే దైవం... ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా...

ఆచార్యదేవోభవ 

గురుబ్రహ్మ గురువిష్ణు

గురువే దైవం...

       అన్న మాటలు వింటూ పెరిగాం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. ఎందరో ఉపాధ్యాయుల్ని ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి సత్కరిస్తున్న శుభదినం. మనస్ఫూర్తిగా హర్షించాల్సిన విషయం. కొందరు ఉపాధ్యాయులు వృత్తినే దైవంలా భావిస్తూ వంద శాతం దానికే అంకితమై పనిచేస్తుంటారు. మరికొందరు సొంత ఖర్చుతో బీద విద్యార్థులను చదివిస్తుంటారు. నిజంగా అది ఎంత గొప్ప సేవ! అలాంటి ఉపాధ్యాయుల్ని ఆ విద్యార్థులు జన్మలో మరిచిపోగలరా! సేవాభావం  మూర్తీభవించిన అటువంటి గురువులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్సులు. ఇది ఎంతో సంతోషదాయకమైన విషయమైతే... 

   ఈ మధ్యకాలంలో కొందరు దుష్ట బుద్ధుల నీచ ప్రవర్తనతో ఆచార్యదేవోభవ అన్న మంచి మాట కలుషితమయ్యే ప్రమాదం ఏర్పడిందని కొద్దిగా కాలంగా వింటున్న, కంటున్న ఉదంతాలు తెలియజేస్తున్నాయి. చదువు కోసం, నాలుగు అక్షరాలు నేర్చుకుంటారన్న ఆశతో తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని  బడికి పంపితే... అక్కడ గురువులు కీచకులై పసి పిల్లలని కూడా చూడక, కనికరం లేక అకృత్యాలకు పాల్పడుతున్న వైనాలు కథనాలుగా వార్తల్లో నిలుస్తుంటే... ఎటు పోతోంది ఈ సమాజం... అనిపించక మానదు ఎవరికైనా!! ఇళ్లలో వారికి కూతుళ్లు, అక్క చెల్లెళ్లు ఉండరా! వాళ్లకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే... అన్న ఆలోచన ఇలాంటి నికృష్టులకు రానేరాదా!!

    బదిలీలు చేయడం, కొద్దిరోజుల పాటు సస్పెండ్ చేయడం... మాత్రమే వీరికి శిక్షలా! దాంతో వాళ్ళ ప్రవర్తన మారిపోతుందా! ఆత్మ విమర్శ చేసుకుంటూ తమని తాము మార్చుకుంటే తప్ప వారిలో మార్పు అన్నది రావడం అసాధ్యం.ఇలాంటి ఏ కొద్ది మంది వల్లనో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం వచ్చే పెను ప్రమాదం పొంచి ఉందనిపిస్తుంది తలచుకుంటూ ఉంటే... అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డల్ని పాఠశాలలకు పంపించాలంటేనే భయపడాల్సి వస్తోంది రాను రానూ ఇలాంటి గురువుల వల్ల. విలువలు బోధిస్తూ మంచిని పెంచాల్సిన గురువులే ఇలా దిగజారి ప్రవర్తించడం తగునా!! అలాంటి దుష్టబుద్ధులు ఆలోచించాలి మరి..! అతి కొద్ది శాతమే ఇలాంటి ప్రబుద్ధులు అడపా దడపా కనిపిస్తున్నా... పవిత్రమైన వృత్తికి ద్రోహం చేస్తున్న  వీరి స్వభావం జుగుప్సాకరంగా తోయక మానదు. ఉపాధ్యాయ దినోత్సవాల సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మాన సత్కారాలు అందుకుంటున్న తోటి ఉపాధ్యాయులను చూసైనా ఇలాంటి వారిలో మార్పు కలిగితే ఎంత బాగుంటుంది!!

*****************************************