Thursday, September 5, 2024

గురువే దైవం... ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా...

ఆచార్యదేవోభవ 

గురుబ్రహ్మ గురువిష్ణు

గురువే దైవం...

       అన్న మాటలు వింటూ పెరిగాం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. ఎందరో ఉపాధ్యాయుల్ని ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి సత్కరిస్తున్న శుభదినం. మనస్ఫూర్తిగా హర్షించాల్సిన విషయం. కొందరు ఉపాధ్యాయులు వృత్తినే దైవంలా భావిస్తూ వంద శాతం దానికే అంకితమై పనిచేస్తుంటారు. మరికొందరు సొంత ఖర్చుతో బీద విద్యార్థులను చదివిస్తుంటారు. నిజంగా అది ఎంత గొప్ప సేవ! అలాంటి ఉపాధ్యాయుల్ని ఆ విద్యార్థులు జన్మలో మరిచిపోగలరా! సేవాభావం  మూర్తీభవించిన అటువంటి గురువులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్సులు. ఇది ఎంతో సంతోషదాయకమైన విషయమైతే... 

   ఈ మధ్యకాలంలో కొందరు దుష్ట బుద్ధుల నీచ ప్రవర్తనతో ఆచార్యదేవోభవ అన్న మంచి మాట కలుషితమయ్యే ప్రమాదం ఏర్పడిందని కొద్దిగా కాలంగా వింటున్న, కంటున్న ఉదంతాలు తెలియజేస్తున్నాయి. చదువు కోసం, నాలుగు అక్షరాలు నేర్చుకుంటారన్న ఆశతో తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని  బడికి పంపితే... అక్కడ గురువులు కీచకులై పసి పిల్లలని కూడా చూడక, కనికరం లేక అకృత్యాలకు పాల్పడుతున్న వైనాలు కథనాలుగా వార్తల్లో నిలుస్తుంటే... ఎటు పోతోంది ఈ సమాజం... అనిపించక మానదు ఎవరికైనా!! ఇళ్లలో వారికి కూతుళ్లు, అక్క చెల్లెళ్లు ఉండరా! వాళ్లకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే... అన్న ఆలోచన ఇలాంటి నికృష్టులకు రానేరాదా!!

    బదిలీలు చేయడం, కొద్దిరోజుల పాటు సస్పెండ్ చేయడం... మాత్రమే వీరికి శిక్షలా! దాంతో వాళ్ళ ప్రవర్తన మారిపోతుందా! ఆత్మ విమర్శ చేసుకుంటూ తమని తాము మార్చుకుంటే తప్ప వారిలో మార్పు అన్నది రావడం అసాధ్యం.ఇలాంటి ఏ కొద్ది మంది వల్లనో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం వచ్చే పెను ప్రమాదం పొంచి ఉందనిపిస్తుంది తలచుకుంటూ ఉంటే... అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డల్ని పాఠశాలలకు పంపించాలంటేనే భయపడాల్సి వస్తోంది రాను రానూ ఇలాంటి గురువుల వల్ల. విలువలు బోధిస్తూ మంచిని పెంచాల్సిన గురువులే ఇలా దిగజారి ప్రవర్తించడం తగునా!! అలాంటి దుష్టబుద్ధులు ఆలోచించాలి మరి..! అతి కొద్ది శాతమే ఇలాంటి ప్రబుద్ధులు అడపా దడపా కనిపిస్తున్నా... పవిత్రమైన వృత్తికి ద్రోహం చేస్తున్న  వీరి స్వభావం జుగుప్సాకరంగా తోయక మానదు. ఉపాధ్యాయ దినోత్సవాల సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మాన సత్కారాలు అందుకుంటున్న తోటి ఉపాధ్యాయులను చూసైనా ఇలాంటి వారిలో మార్పు కలిగితే ఎంత బాగుంటుంది!!

*****************************************

 

No comments:

Post a Comment