Wednesday, October 21, 2020

వర్ణశోభితం

 

నల్లనల్లని మూలాలు పుడమి కడుపున

దాగెనే చల్ల చల్లగా

 ఆపైని అలరించే కొమ్మలు రెమ్మలు

 చుట్టూ విస్తరించగా

 పచ్చపచ్చగా విచ్చిన పత్ర దళాల

 చీర చుట్టుకుని నడుమ

 నిలబడింది చూడు కాండం

 ఠీవిగా గోధుమ వర్ణాన !

 అంతేనా--

అటు చూడు చూడు🌺🌹

 ఎన్ని మొక్కలు 🙂

 ఎన్నెన్ని రంగులు !

 మరెన్నెన్ని ఆకృతులు !

 పసిడి కాంతులు వెదజల్లుతూ

 పరిమళాలు విరజిమ్ముతూ

 పలు వర్ణాల సమ్మిళితమై విరాజిల్లుతూ

 తల్లి కొంగు చాటు నుండి

 తొంగి చూస్తున్న బుజ్జి పాపల్లా 

 సుమబాలలవిగో 🌹🌷🌺😊🙂

 ఎంత వర్ణ శోభితం!

మరెంత అబ్బురం !

 రవంత విత్తనమే!

 కొండంత విషయం దాచుకున్నదే !

 తరచి తరచి చూసే

 కళ్ళుండాలే గానీ 

 జగతి నిండా నలుమూలలా

 అందమే అందం 🙋

 ఆహా! ప్రకృతి ఎంత రమణీయం !

 వెరసి ఈ సృష్టియే అద్భుతం!

 మహాద్భుతం !!🙏🙏

**********************************************

                   🌷భువి భావనలు 🌷

**********************************************


Tuesday, October 20, 2020

ఆదివారం ఎంతో ఇష్టం.. ఎందుకంత ఇష్టం?

    ఆదివారం అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఎందుకని? వారంలో ఏ రోజుకూ లేని ప్రత్యేకత ఆదివారానికే ఉంది గనక! వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండీ పెద్దల దాకా ఎంతగానో ఎదురు చూస్తుంటారు ఈ రోజు కోసం. ఆరు రోజుల శ్రమ అనంతరం దొరికే ఆటవిడుపు కదా! ఇంతకీ అందరూ ఎరిగినదే అయినా ఆదివారం అన్నది ఎవరెవరికి ఎలా ఇష్టమైనదో చూద్దాం. 

* పిల్లలకు-- ప్రతీ ఉదయం నిద్రమత్తు వీడకనే త్వరగా లేవాలి. తయారవ్వాలి. బోలెడు పుస్తకాల మోత. హడావుడిగా తినడం. పరుగులు తీయడం. అక్కడేమో వరుసగా పాఠాల మోత. బుర్ర కెక్కినా ఎక్కక పోయినా క్లాసులో కూర్చోవడం అయితే తప్పనిసరి! అంతేనా! టీచర్లతో చీవాట్లు, అప్పుడప్పుడు తన్నులు, ఇంకా హోం వర్క్ లు ! తలబొప్పి కడుతుంది. ఆరు రోజుల ఈ కష్టానికి ఒకరోజు బ్రేక్! అదే ఆదివారం! ఎంచక్కా నిదానంగా నిద్రలే వచ్చు. తీరిగ్గా స్నానపానాదులు. టీవీలో ఇష్టమైనవి చూడడాలూ. వీడియో గేమ్స్ ఆట్లాడుకోడాలు. ఫ్రెండ్స్ తో ఆటలు ! ఇవన్నీ ఉంటాయి కాబట్టే మరి పిల్లలకు ఆదివారం వస్తోందంటే అంత హుషార్!  అంతటి హుషారూ సోమవారం ఉదయానికి నీరు గారి పోతుంది అనుకోండి, అది వేరే సంగతి! 

* ఇక-- ఇంట్లో ఇల్లాళ్లకు. ఇంట్లో ఉంటారన్న మాటే గానీ వాళ్లకు తీరికనేది ఉండేది ఎక్కడ? తెల్లారగట్ల లేవాలి, భర్తకూ, పిల్లలకు టిఫిన్లు, భోజనాలు సిద్ధం చేయాలి. చిన్నపిల్లలయితే వాళ్లనూ రెడీ చేయాలి. రొప్పుతూ రోజుతూ అన్నీ అమర్చి వాళ్లను బయటికి సాగనంపేసరికి వాళ్ల తలప్రాణాలు తోకకొచ్చేస్తాయి. మరి వీళ్లూ ఆదివారం కోసం ఎదురు చూస్తారు అనడంలో వింతేముంది? ఆ రోజైతే ఇంత ఉరుకులాట, టెన్షన్ అన్నది ఉండదు వాళ్ళకి. 

* ఇంటికే పరిమితమయ్యే గృహిణుల పరిస్థితే ఇలా ఉంటే ఇక ఉద్యోగినుల గురించి వేరే చెప్పాలా! రేపు ఉదయం టిఫిన్ నుండి మధ్యాహ్నం క్యారియర్, ఇంకా ఇంకా వగైరా వగైరా అన్నీ ముందురోజే ఆలోచించి సిద్ధం చేసుకోకపోతే అంతే సంగతులు! అందరికీ అన్నీ చూస్తూ తనకు తాను కూడా టైం లోపల రెడీ అవ్వాల్సిన పరిస్థితి వాళ్లది, ఇవన్నీ ప్రణాళిక ప్రకారం చేయలేకపోయారా...మరుసటి రోజు గమ్యస్థానం సమయానికి చేరడం దుర్లభమే ! ఆరు రోజుల ఈ ప్రయాస అనంతరం ఒక్కరోజు విశ్రాంతికై ఎదురు చూడడం అత్యాశ ఏమీ కాదు కదా! కొందరైతే కొన్ని పనులు ఆదివారానికి బదలాయిస్తూ ఉంటారు. బట్టలు ఉతుక్కోవడం, స్పెషల్స్ వండుకోవడం లాంటివన్నమాట! మిగతా రోజుల్లో కుదరదు కదా మరి! ఆ విధంగా చూస్తే వాళ్లకి ఆదివారం అదనపు భారమే సుమండీ! కానీ, చేసేదేముంది.. తప్పదుగా మరి...

* ఆడవాళ్ళ సంగతి అలా ఉంటే మరి మగవాళ్ల సంగతేమిటి? వీళ్ళ పని కాస్తలో కాస్త నయం. ఎందుకంటే, వంటింటి డ్యూటీలుండవు కాబట్టి! నూటికొక్క శాతం పురుషులు వంటింట్లో భార్యలకు సహాయపడటం, పిల్లల్ని రెడీ చేయడం లాంటివి చేస్తారేమో గానీ ఎక్కువ శాతం మాత్రం వాటికి దూరంగానే ఉంటారు. ఇలా అంటే మాకు బయట బోలెడు పనులు ఉంటాయి, అవి మీ ఆడవాళ్లు చేయలేనివి అంటుంటారు. వాళ్ల కోణంలో అదీ నిజమే. మిగతా ఆరు రోజులూ ఉద్యోగ బాధ్యతలతో సతమత మయ్యే వీళ్ళు ఆదివారం నాడే కాస్త రిలాక్స్ అవటానికి ఆస్కారం. అందుకే వాళ్లు కూడా ఆరోజుకై కచ్చితంగా ఎదురుచూస్తుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

* ఉద్యోగస్తులే కాదు, ఇతర పనులు అంటే వ్యాపారాలు చేసేవారు, ఇతర వ్యాపకాలతో బిజీగా ఉండేవారు కూడా ఆదివారం అన్నీ బంద్ చేసేసి విశ్రాంతి కోరుకుంటారు. 

* ఇంకా--కూలీ పనులు చేసేవారూ, భవన నిర్మాణ కార్మికులు ఆరు రోజులు మాత్రమే పని చేసి ఆదివారం సెలవు పుచ్చుకుంటూ ఉంటారు. 

 ఆదివారం( సెలవు దినం అని కూడా అనవచ్చు ) అందరికీ అందించే చిన్ని చిన్ని ఆనందాలు---

* శరీరానికీ, మెదడుకూ కాస్త విశ్రాంతి. 

* రొటీన్ గా తీసుకునే దానికంటే కాస్త స్పెషల్ గా ఉండే ఫుడ్! 

* పిల్లలతో ఏ పార్కుకో, సినిమాకో వెళ్లి సరదాగా గడిపే అవకాశం. 

* ఇవేవీ లేకపోయినా ఇంట్లోనే అంతా కలిసి హాయిగా ఓ పూట కాలక్షేపం చేసే సదవకాశం. 

😊 ఈ దేహం రీఛార్జ్ అయి మళ్లీ సక్రమంగా, హుషారుగా పని చేయాలంటే దానికి విశ్రాంతి అన్నది చాలా చాలా అవసరం. ఆ విశ్రాంతి కోసమే ఈ' ఆదివారం'. అందుకే ఆరోజంటే అందరికీ అంత ఇష్టం మరి!!🙂

******************************************

                        🌷భువి భావనలు 🌷

******************************************

Saturday, October 17, 2020

'చిన్నారి ' పజిల్స్ --ఆలోచించండి --2

1.తోడు నీడ 
2.ఆస్తి పాస్తి 
3.
4.
5.
6.
7.
8.
9.
10.

 పై పజిల్ లోని జంట పదాల్లాంటివి ఆలోచిస్తే చాలా చాలా స్ఫురిస్తాయి. మెదడుకు పెద్ద శ్రమా ఉండదు. ఆలోచించండి మరి ! 
 

Friday, October 16, 2020

ఆరనీకుమా ఆశాదీపం

కలిమి పోయిందా? 

 కలిమి పోయిందా? 

 కలవరపడకు 

 కష్టపడితే కలిసొస్తుంది


 బలిమి పోయిందా? 

 బాధపడకు

 బ్రతుకు బండేమీ ఆగిపోదు 


 ఆరోగ్యం దిగజారిందా? 

 దిగులు పడకు

 బాగయ్యే మార్గాలున్నాయి వెతుకు


 అయితే--

 ఆశ  ఆవిరై పోయిందా? 

నీవు జీవన్మృతుడవే సుమా !

ఆ దీపం ఆరిపోనీకు ఎప్పటికీ 

ఆశాజీవికి అపజయమెక్కడిది మిత్రమా !!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷  

                    🌹భువి భావనలు 🌹

Monday, October 12, 2020

ఆరోగ్యభాగ్యం

 🙂😊👌

హఠాత్తుగా దేవుడు నా ముందు నిలిచి 

ఏంకావాలో కోరుకొమ్మని అడిగితే 

క్షణమాలోచించక అడిగేస్తా 

జీవితకాలం ఏ రుగ్మతలూ 

నను దరిజేరని దివ్యమైన 

ఆరోగ్యభాగ్య మిమ్మని 🙂

అష్టైశ్వర్యాలు, అడుగడుగునా దాసదాసీలు 

అభిమానించే ఆత్మీయ బంధాలు

 ఊరు వాడా బంధుగణాలు 

ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో 

వెన్నంటి నీ నీడలా ఉన్నా 

మదినిండా ముదమన్నది కరువైన 

పైవన్నీ వ్యర్థం వ్యర్థం 😔

అనారోగ్య భూతం నిను 

కబళిస్తున్న వేళ అవేవీ 

 నిను కావలేవు సుమీ ! 

 నిండైన ఆరోగ్యం తోనే అది లభ్యం 👌

 ఆరోగ్యమే మహాభాగ్యం

 అదుంటే అన్నీ ఉన్నట్టే కదా నేస్తం  👌

***********************************************

కరోనా వైరస్ మానవ జీవితాల్లోకి ప్రవేశించాక అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది.

***********************************************

                   ' భువి ' భావనలు 

                    🌷🌷🌷🌷🌷🌷


Sunday, October 4, 2020

'చిన్నారి ' పజిల్స్


 కింది వాక్యాల్లో బంధుత్వాలు దాగి ఉన్నాయి. కని పెట్టండి. 

1. ప్రతీఏడూ మా మల్లె చెట్టు విరగగాస్తుంది. 

2.ఒరేయ్, అక్కడ నీకేమి పని? 

3. నీవిచ్చిన అత్తరు నాకు నచ్చింది. 

4. బాబా వద్ద ఆశీర్వాదం తీసుకో బాబూ. 

5. నీవే కాదంటే నాకు మరి దిక్కెవరు నాన్నా !

6. ఈ జావ దినదినం రెండు సార్లు తాగాలి. 

--------------------------------------------------------------------

1.మామ 2.అక్క 3.అత్త 4.బావ 5.మరిది 6.వదిన 

--------------------------------------------------------------------

ఆసక్తి గలవారు ఇలాంటివి ప్రయత్నించగలరు. 

--------------------------------------------------------------------

                      🌷🌷'భువి 'భావనలు 🌷🌷

--------------------------------------------------------------------

Friday, October 2, 2020

మహాత్మ.......

 

   

  అహింసే పరమాయుధంగా సాగి అసాధారణ రీతిలో దేశ ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించి భరతమాత దాస్య శృంఖలాలను పగులగొట్టి భారతీయులందరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకునే భాగ్యం కల్గించిన ఓ అతి సామాన్యుడు అసాధారణ రీతిలో జీవనయానం సాగించిన ఓ మహా పురుషుడు మోహన్్ దాస్ కరమ్ చంద్ గాంధీ. ( an ordinary man in an extraordinary way ). జాతిపితగా పేరెన్నికగన్న మహాత్మ గాంధీ నిరాడంబరత్వానికి ఓ మచ్చుతునక ఈ చిన్న సంఘటన. 

  ఓ సారి గాంధీజీ ఓ పాఠశాలను దర్శించాడట. అప్పుడు ఓ తరగతిలోని ఓ పిల్లవాడు గాంధీజీ చొక్కా లేకుండా తిరగడం చూసి, " అయ్యో, గాంధీ తాత వేసుకోవడానికి చొక్కా కూడా లేనంత బీద వాడా... " అనుకుని, ఆయన్ను సమీపించి, " మా అమ్మచొక్కాలు బాగా కుడుతుంది. ఆమెను అడిగి ఓ చొక్కా మీకోసం తెస్తాను..... " అని అన్నాడట. గాంధీజీ నవ్వి, ఆ పిల్లవాణ్ణి దగ్గరకు తీసుకుని, 

" నాకు కొన్ని కోట్ల మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్లకు కూడా చొక్కాలు లేవు. నీవు వాళ్లందరికీ కూడా చొక్కాలు తీసుకురా గలవా మీ అమ్మనడిగి.... " అన్నాడట. 

"  ... ఏమిటి, గాంధీ తాత కు అంత మంది అన్నదమ్ములా...... " అనుకుని అవాక్కై పోయాడట ఆ పిల్లవాడు!యావత్తు దేశప్రజలందర్నీ తన వాళ్ళుగా భావించి వాళ్లకు లేని సౌకర్యం తనకెందుకని చొక్కా త్యజించిన మహనీయుడాయన. ఆయన నిరాడంబరత్వాన్ని తెలిపే ఇలాంటి ఉదాహరణాలెన్నో ! 

   గాంధీజీ ఆశయాలు, పట్టుదల, దీక్ష పరాయి దేశాలను కూడా ఎంతో ఆకర్షించాయి. విదేశీయుడైనా రిచర్డ్ అటెన్ బరో గాంధీజీ జీవిత చరిత్రను సినిమాగా తీయడమే ఇందుకు గొప్ప నిదర్శనం. ఆ సినిమా తీయడానికి అటెన్ బరోకు దాదాపు 18 సంవత్సరాలు పట్టిందట ! ' గాంధీ ' అన్న పేరుతో నవంబర్, 30, 1982 లో విడుదలైన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఎనిమిది ఆస్కార్ అవార్డులను గెలుచుకొంది. 

1. Best Director 

2.  Best Actor 

3. Best Picture 

4. Best original screen play 

5. Best Film editing 

6. Best Art Direction 

7. Best cinematography 

8. Best costume Design 

   గాంధీజీ 151 వ జయంతి సందర్భంగా ఆయన సూక్తుల్లో కొన్ని ----

* అహింసను మించిన ఆయుధం లేదు. 

* ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి. 

* కంటికి కన్ను సిద్దాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. 

* ఓటు, సత్యాగ్రహం -- ఈ రెండూ ప్రజల చేతిలోని ఆయుధాలు. 

* పాముకాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది. కానీ తాగుడు వ్యసనమన్నది ఆత్మను చంపేస్తుంది.  

* మానవత్వం అనే పుస్తకం కంటే వేరే ఉత్తమ గ్రంథం ఏముంటుంది? 

ఇంకా ----

బసవరాజు అప్పారావు గారు గాంధీజీ ఆహార్యాన్నీ, వ్యక్తిత్వాన్నీ సరళమైన పదాలతో ఎంత చక్కగా వ్యక్తీకరించారో చూడండి... 

'మాలపిల్ల ' సినిమా లో ఈ గీతాన్ని సూరిబాబు గారు హృద్యంగా ఆలపించారు. 

 కొల్లాయి గట్టితే నేమీ 

మా గాంధి కోమటై పుట్టితే నేమి 

వెన్నపూస మనసు, కన్నతల్లి ప్రేమ 

పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు 


నాల్గు పరకల పిలక 

నాట్యమాడే పిలక 

నాల్గు వేదాల నాణ్యమెరిగిన పిలక 


బోసినోర్విప్పితే 

ముత్యాల తొలకరే 

చిరునవ్వు నవ్వితే 

వరహాల వర్షమే 


చకచక నడిస్తేను 

జగతి కంపించేను 

పలుకు పలికితేను 

బ్రహ్మ వాక్కేను 

 ----- ఎన్నో సంవత్సరాల నాటి పాట. వింటుంటే ఇప్పటికీ జీవం తొణికిసలాడుతూ ఉంటుంది. 

చివరగా -- ప్రఖ్యాత శాస్త్ర వేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ గాంధీజీ గురించి ఇలా అన్నారు. 

" ఇలాంటి ఒక మనిషి సజీవంగా ఈ భూమ్మీద నడయాడాడంటే భావితరాల వారు నమ్మడం కష్టం. "

                          **********

  అక్టోబర్, 2, 1869 న జన్మించిన గాంధీ మహాత్ముడు స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం జనవరి, 30, 1948 న వినాయక గాడ్సే తూటాలకు బలై నేలకొరిగాడు. చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ మహనీయుని శకం ఆవిధంగా ముగిసిపోయింది. 💐💐💐

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹       

              🌷🌷🌷' భువి ' భావనలు 🌷🌷

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹