Monday, April 6, 2026

మండే ఎండల్లో మల్లెల సౌరభాలు !


            ~ యం. ధరిత్రీ దేవి ~
************************
వేసవి  వచ్చింది 
ఎండల్ని తెచ్చింది 
మల్లెల్ని ఇచ్చింది !
ముడుచుకున్న ఆకులన్నీ  
విప్పారినవి 
పండుటాకులు రాలి 
పచ్చని చివుళ్లు 
పలుకరిస్తున్నాయి 🙂
ఇన్నాళ్లూ ఎక్కడ 
దాక్కున్నాయో మరి !!
నిద్రించిన కొమ్మలు 
ఒక్కసారిగా మేల్కొన్నాయి !
అదిగో, మొదటి మొగ్గ  !!
విచ్చుకుంది మరునాటికి !
కనురెప్ప పాటులో 
కనువిందు చేస్తూ... 
కొమ్మకొమ్మనా చిట్టి మొగ్గలు !
చిరు నవ్వులు చిందిస్తూ... 
చెట్టంతా...విరిసిన మల్లెలు 
వారం గడిచేసరికి  !
నింగిని పరుచుకున్న 
నక్షత్రాల మాదిరి !!
పరిమళభరితాలు 
మల్లెలు...సన్నజాజులు 😊
ఋతురాగాలకు స్పందించే 
శ్వేతవర్ణ కుసుమాలు !
మండే ఎండల్లోనే కదా 
ఈ మల్లెల గుభాళింపులు !
ఆస్వాదించాలంటే
స్వాగతించాలి మరి 
వేసవి వడగాడ్పుల్ని  !! 
అందుకే...
వేసవి రావాలి 
ఎండల్ని తేవాలి 
మల్లెల్ని మనకివ్వాలి  🙂🙂
**************************
                 
                

Friday, April 3, 2026

పుట్టినరోజు బహుమతి (కథ )

 
'సంచిక ' అంతర్జాల మాసపత్రిక... ఫిబ్రవరి 2026 లో నా రచన ( కథ )

" పుట్టినరోజు బహుమతి " ప్రచురింపబడినది 🙏

Wednesday, April 1, 2026

మహిళలు.. మహారాణులు... కవిత


 ' సంచిక ' అంతర్జాల వార పత్రిక  ( 8.3.26 ) లో 
" మహిళలు.. మహారాణులు.. " అన్న కవిత ప్రచురింపబడినది 🙏

Wednesday, March 25, 2026

ప్రశ్నించు...ప్రశ్నిస్తూనే ఉండు... (కవిత)

 'సంచిక ' ఆన్లైన్ వార పత్రిక  1.2.26 లో నా కవిత...

" ప్రశ్నించు.. ప్రశ్నిస్తూనే ఉండు... " ప్రచురింపబడినది 🙏

Tuesday, March 24, 2026

అమ్మకు వందనం.. కథ

 'విహంగ ' ఆన్లైన్ మాసపత్రిక..మే 2025 సంచికలో నా కథ..

" అమ్మకు వందనం " ప్రచురింపబడినది 🙏

Saturday, March 21, 2026

రైతు బజార్.. కథ

 

'విహంగ ' ఆన్లైన్ మహిళా సాహిత్య మాస పత్రిక సెప్టెంబర్2025 సంచికలో నా కథ 

' రైతు బజార్ ' ప్రచురింపబడినది.. 🙏

Friday, March 20, 2026

విషాదం వద్దు... వెలుగులు కావాలి... కథ

 

'విహంగ ' ఆన్లైన్ మహిళా సాహిత్య మాసపత్రిక... నవంబర్ 2025 లో నా కథ 

" విషాదం వద్దు... వెలుగులు కావాలి " ప్రచురింపబడినది.. 🙏

కల్మషమెరుగని పసిపాప...'కవిత

 'విహంగ ' ఆన్లైన్ మాసపత్రిక.. ఫిబ్రవరి 2026 లో నా కవిత 

" కల్మషమెరుగని పసిపాప " ప్రచురింపబడినది. 🙏

Friday, March 6, 2026

హోమ్ మినిస్టర్....కథ

  🌷                                         ~~యం.ధరిత్రీ దేవి~~
   
    కిటికీలోంచి సూర్యకిరణాలు చురుక్కుమని తగిలేసరికి కళ్ళు నులుముకుంటూ బద్ధకంగా లేచి కూర్చున్నాడు సాంబశివరావు. అప్రయత్నంగా గోడకేసి చూసిన అతనికి గడియారం ఎనిమిది గంటలు చూపించింది. 'మై గాడ్' అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి హాలు లోకెళ్ళిన అతనికి అడ్డదిడ్డంగా పడి ఇంకా లేవని ఇంటర్, డిగ్రీ చదువుతున్న సుపుత్రులు వంశీ, వరుణ్ దర్శనమిచ్చారు. తండ్రి అరుపులకు దిగ్గున లేచి బాత్రూంలోకి దూరిపోయారిద్దరూ. 
   హడావుడిగా కిచెన్ లో అడుగుపెట్టిన అతనికి రాత్రి తిని పడేసిన ఎంగిలి కంచాలు, అంట్లగిన్నెలు వాసన కొడుతూ కనిపించేసరికి ఒక్కసారిగా నీరసం కమ్ముకొచ్చి ఠక్కున ఇల్లాలు గుర్తొచ్చింది.
    నిన్న ఉదయం వాళ్ళనాన్న బాత్రూంలో జారిపడి కాలు ఫ్రాక్చర్ అయిందనీ, హాస్పిటల్లో ఉన్నాడు అర్జెంటుగా రమ్మని వాళ్ళ అమ్మ ఫోన్ ! అంతే!గబగబా వంట చేసేసి, రెండు చీరలు ఓ  సంచీలో కుక్కుకుని ముక్కు చీదుకుంటూ నాలుగైదు రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్లిపోయింది జానకి...అతని అర్ధాంగి. ప్రస్తుతం ఇంటి  దీన పరిస్థితికి అదీ కారణం...
   అరగంటలో స్నానాలు, గీనాలు ముగించేసి బయటపడ్డారు ముగ్గురూ.అలా అలా నాలుగు రోజులు గడిచాయి. సాయంత్రం ఇంట్లో అడుగు పెట్టాలంటే భయం భయంగా ఉంటోంది సాంబశివరావుకి... ఇల్లంతా దుమ్ము...! ఎక్కడి  సామాన్లు అక్కడే! విడిచి బట్టలన్నీ మంచాల మీద !! వంటిల్లయితే చెప్పనలవికానట్లుంది... ఇంటి బయట ఎండిన ఆకులు, దుమ్ము ధూళి.. అంతా పరుచుకొని కంపరంగా అనిపిస్తోంది. వాటి కింద నుండి జానకి వెళ్లే రోజు ఉదయం వేసిన ముగ్గు దీనంగా తొంగి చూస్తూ కనిపిస్తోంది. ప్చ్ ! ఎలా ఉంచేది ఇల్లు!! అద్దంలా... ముట్టుకుంటే మాసిపోతుందా అన్నట్లు..!
    వారం దాటింది. జానకి జాడలేదు. ఫోన్ చేస్తే... "వయసు బాగా మీద పడింది కదా... నాలుగైదుచోట్ల కాలి  ఎముకలు విరిగాయట...రెండు ఆపరేషన్లు అయ్యాయి. మరో వారం దాకా హాస్పిటల్లోనే ఉండాలట... మా అమ్మ ఒక్కతే ఇంట్లో, హాస్పిటల్లో చూసుకోలేకపోతోంది. వచ్చేవారం మా అన్నా,   వదిన వస్తామన్నారు. అందాక నేను రాలేను... ఎలాగోలా మీరే సర్దుకోండి..."
 అంటూ చెప్పేసింది జానకి. గుండెల్లో రాయి పడింది సాంబశివరావుకి. ఇద్దరు  కొడుకులు తల వేలాడేసుకుని, మౌనంగా ఉండి పోయారు. చేసేదేముంది... అనుకుంటూ.. ఉదయం కాఫీలు మాత్రమే ఇంట్లో... టిఫిన్లు, మధ్యాహ్న భోజనం... బయట. రాత్రి మాత్రం ఏ ఉప్మానో, చపాతీనో చేసుకుని చట్నీలతో, కారంపొడులతో కానిచ్చేస్తున్నారు. 
    సాంబశివరావుకి వంట బొత్తిగా రాదు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిసి రూమ్  తీసుకొని ఉండేవారు. అప్పుడు కాస్త అలవాటు అయినవే..ఈ ఉప్మా, చపాతీ ప్రిపరేషన్లు... భార్య వచ్చాక, ఇక వంటింట్లో అడుగు పెట్టే అవసరం నాకేంటి.... అన్న ఫీలింగుతో కాలర్ ఎగరేసి తిరిగాడు.అంతేనా !  ఇద్దరూ కొడుకులే పుట్టారని తెగ మురిసిపోయాడింతవరకూ. కానీ.. ఇప్పుడు తెలిసి వస్తోందతనికి... ఆడపిల్ల లేని లోటు..! దేవుడా! నిజంగా ఆడది లేని ఇల్లు ఇంత దారుణంగా ఉంటుందా..! ఇంటికి దూరంగా ఎప్పుడూ ఇన్ని రోజులు ఉండలేదు జానకి... కాన్పుల సమయంలో కూడా వాళ్ల ఊర్లో వైద్య సౌకర్యం సరిగా ఉండదని ఇక్కడే ఉండిపోయింది మరి... నిస్సహాయ స్థితిలో పడిపోయిన సాంబశివరావుకి పదేపదే పెళ్ళాం గుర్తుకు రావడంలో ఆశ్చర్యమేముంది...!
    ఎలా ఉండేది ఇల్లు జానకి చేతిలో! ఉదయం ఎప్పుడు నిద్ర లేచేదో ఏమిటో... ఎనిమిదింటికంతా ఒంటిచేత్తో అన్నీ  సిద్ధం చేసి ఉంచేది. పనిమనిషి కూడా వద్దని సర్వం తనే చేసుకునేది. అందరి బట్టలూ ఉతికి ఇస్త్రీ చేసి టైంకు రెడీగా ఉంచేది. సాయంత్రం ఇంట్లో అడుగు  పెట్టేసరికి.... ఇల్లంతా ఆహ్లాదకరంగా. హాయిగొల్పుతూ ఉండేది. ఇప్పుడు..! తను లేని ఇల్లు బావురుమంటూ భారంగా అనిపించింది సాంబశివరావుకి! ఉన్నప్పుడు తెలియలేదు గానీ తన విలువ...ఎంతైనా ఆడవాళ్లు గ్రేట్ !! అనుకోకుండా ఉండలేకపోయాడు. ఆ క్షణంలో 'ఇల్లాలు', 'ఇల్లాలే దేవత ', 'ఇంటికి దీపం ఇల్లాలు '...లాంటి సినిమా టైటిల్స్ అన్నీ గుర్తొచ్చాయి. దాంతోపాటు... 
"ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, 
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి  "
"ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం "
లాంటి సినిమా పాటలు కూడా గుర్తొచ్చి, గుచ్చి గుచ్చి మరీ వేధించాయి. 
   ఆ సాయంత్రం వంటింట్లో అడుగు పెట్టిన అతని చూపు అప్రయత్నంగా ఆ పక్కనే ఉన్న దేవుని గూడుపై పడింది. జానకి వెళ్లేరోజు పూజ చేస్తూ పెట్టిన పూలు, వాడి ఎండిపోయాయి. అగరొత్తుల తాలూకు ఆనవాళ్లు అక్కడ గూటినిండా పరుచుకుని ఉన్నాయి. అతని మనసంతా కలచివేసినట్లయింది. వెంటనే చీపురు తీసుకుని ముందు వంటిల్లంతా  శుభ్రం చేశాడు.అలవాటు లేని పని !దేహం మొరాయించింది. అయినా,  అలాగే మిగతా రూములూ అయిందనిపించాడు. .. కొడుకులు అది  చూసి లేచారు. పక్క బట్టలన్నీ సర్దేశారు.
    లోపల ఎలాగోలా అయిపోయింది... మరి గేటు బయట సంగతి! ఊడ్చడానికి నామోషీ ఒకటి! తల పట్టుకుని, "ఈ  ఇల్లు అద్దెకిస్తారా " అని ఎవరూ  అడగకముందే జానకి వచ్చేస్తే బాగుండు అనుకున్నాడు లోలోపల సాంబశివరావు. పోనీ, ఎవరైనా పనిమనిషిని చూద్దామా అనుకుంటే అంత అర్జెంటుగా దొరకడం గగన కుసుమమే! ఫోన్ చేసి భార్యను రమ్మనేద్దామా అనుకున్నాడో క్షణం. అత్తింటి వాళ్ళు ఎన్నడూ తన సహాయం కోరింది లేదు ఇప్పటివరకూ. లేక లేక అవసరమొస్తే తానలా చేయడం నచ్చక ఆ ఆలోచన విరమించుకున్నాడు వెంటనే..వారం అన్న జానకి మరో వారం దాకా రాలేదు. వాళ్ళ అన్నకు సెలవు దొరకలేదట..డీలా పడిపోయి జ్వరం వచ్చినంత పనయింది సాంబశివరావుకి.
   ఆరోజు ఉదయం తెలతెలవారుతుండగా గేటు చప్పుడయింది. జానకి రెండు సంచులతో ఇంట్లో అడుగు పెట్టింది. వంటింట్లో పాలు మరగబెట్టే పనిలో ఉన్న సాంబశివరావు అది గమనించి, అకస్మాత్తుగా దేవత ప్రత్యక్షమైనట్లు సంబరపడిపోయాడు..
" జానకీ, వచ్చేశావా...! ఫోనయినా చేయలేదే!.."
 అంటూ సంచులు అందుకున్నాడు.
" అవునండీ, అన్న, వదిన నిన్న సాయంత్రం వచ్చేశారు. ఇప్పటికే లేటయిందని నేను రాత్రి బస్సుకే బయలుదేరాను...ఏమిటీ, వీళ్ళింకా లేవలేదా..!"
అంటూ పిల్లల గదిలోకి తొంగి చూసింది. తల్లి గొంతు వినిపించి ఇద్దరూ గబగబా లేచి వచ్చారు వంశీ, వరుణ్. ఇల్లంతా ఓసారి పరికించి చూసిన జానకికి అంతా అర్ధమైపోయింది. అప్పటికప్పుడు ఏమీ  అనాలనిపించలేదామెకు. చీర కొంగు బిగించి, చీపురు అందుకుంది. అరగంటలో ఇల్లంతా ఓ కొలిక్కి తీసుకొచ్చింది. ఆ క్రమంలో ఇన్నేళ్లుగా తాను చేస్తున్న తప్పిదం బాగా తెలిసి వచ్చిందామెకు. దాంతోపాటు తన కర్తవ్యం కూడా బోధపడింది. ఇదంతా ఏమీ పట్టని సాంబశివరావు ఊపిరి పీల్చుకొని ఈజీ చైర్ లో రిలాక్స్ అయ్యాడు. 
    ఆ సాయంత్రం...
" రేయ్ఎక్కడికి బయల్దేరారు?... "
 కాలేజీ నుండి వచ్చి బ్యాట్లు పుచ్చుకుని బయటకు దారి తీయబోతున్న వంశీ, వరుణ్ తల్లి వైపు బ్యాట్లు  చూపిస్తూ, 
" క్రికెట్ ప్రాక్టీస్ కు మమ్మీ.."
 అన్నారు ఒకేసారి.
" అవన్నీ తర్వాత. ముందు అవి పక్కన పెట్టి ఇలా రండి, మీతో మాట్లాడాలి"
" అబ్బా,మమ్మీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రాక్టీస్ కు లేట్ అవుతుంది..."
"కుదరదు, నోరు మూసుకుని రండి."
 గద్దించేసరికి అలాగే బ్యాట్లు పట్టుకొని వచ్చి సణుగుతూ కూర్చున్నారు..
" జాగ్రత్తగా వినండి. ఈరోజు నుండీ కొన్ని అలవాట్లు మార్చుకోండి ఇద్దరూ . మీ పనులు మీరే చేసుకోవాలి.అంటే మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి. మీ పుస్తకాలు అన్నీ మీరే సర్దుకోవాలి. ఇంటిపనులతోపాటు చిన్న చిన్న వంటపనులూ చేయాలి.... "
"...................."
"...రేపేదో మీ పెళ్ళాలకు చేసిపెట్టాలని కాదు, ఇదిగో, ఇప్పుడొచ్చిపడిందే గడ్డు పరిస్థితి...!అలాంటపుడు ఇబ్బంది పడకూడదని....! కనీసం కొంతలోకొంతైనా ఎవరికోసం చూడకుండా చేసుకోగలగాలని... అంతే.."
తలెత్తి చూశారిద్దరూ. 
"...అయినా మీ తప్పేమీ లేదులే. అంతా నాదే నాదే. మీకు మొయ్యకుండా ప్రతీదీ అమర్చిపెడుతున్నా చూడండీ... నాదీ.. నాదీ తప్పు. మగపిల్లలు మహారాజులూ... వాళ్ళు ఆడపనులు చేయకూడదూ అని మా అవ్వ, ముత్తవ్వ కాలం నాటి చాదస్తాలన్నీ నేనూ పాటించాను చూడూ...నాదీ..నాదే తప్పంతా. బుద్దొచ్చింది. ఉదయం మీఇద్దర్నీ చూశాక బాగా బుద్ధొచ్చింది. నాన్న వంటింట్లో ఒక్కడే అవస్థ పడుతుంటే మీరేమో హాయిగా గుర్రుపెట్టి నిద్దరోతున్నారు. సిగ్గుగా లేదురా మీకు !.."
"మమ్మీ, అదీ... "
" ముయ్యండి నోరు. ఇకనుంచీ నేను చెప్పినట్టు చేసితీరాల్సిందే.. "
"సరే మమ్మీ, ఈరోజు ప్రాక్టీస్ కెళతాం. రేపటినుండీ... "
"...కుదరదు. ఈరోజే ఇప్పుడే. మొదలెట్టాలి. మిగతావన్నీ తర్వాత.. "
తల్లి గొంతులో, ప్రవర్తనలో ఇదివరకెన్నడూ చూడని కాఠిన్యం చూశారిద్దరూ. మెల్లిగా బ్యాట్లు మూలన పెట్టి మాసిన బట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు నడిచారు. టీ తాగుతున్న సాంబశివరావుకు భార్య ఏమిటో కొత్తగా కనిపించిందా క్షణంలో.
 " మొక్కై వంగనిది మానై వంగదండీ. అలవాటు పడాలి వీళ్ళు, తప్పదు. కొద్ది రోజులు నేను లేకపోయేసరికి ఇల్లు చూడండి ఎలా తయారైందో... !"
భార్య పరోక్షంగా తననూ అంటోందా అనిపించింది సాంబశివరావుకు. అయినా,సబబుగానే తోచింది అతనికి. ఈ మూడు వారాలూ తను పడ్డ కష్టం తలుచుకుంటే...! ప్రతీ ఇంట్లో చిన్నప్పట్నుంచీ మగపిల్లలకు తల్లో, అమ్మమ్మో, నాయనమ్మో లేకుంటే అక్కో, చెల్లో... ప్రతిదీ అందిస్తూ, అన్నీ అమరుస్తూ వాళ్ళను సోమరులుగా, ఏపనీ చేతగానివాళ్ళలా తయారుచేస్తున్నారు. ఇది ఆడపని..మేమెలా చేస్తాం అన్న ధోరణిలో పెరుగుతున్నారు. డిపెండెంట్ నేచర్ డెవలప్ అవుతోందని వాళ్ళకర్థం కావడం లేదు. వాళ్ళ మైండ్ సెట్ మారాలంటే ముందు తల్లులు మారాలి.. ఇదిగో...ఇలా...జానకిలా...! మనసులోనే భార్యను అభినందించాడు. కానీ, పైకి మాత్రం, 
" అది సరే వింటారంటావా... !"
అంటూ తటపటాయిస్తూనే సందేహం వెలిబుచ్చాడు. 
" తమరు వీళ్లకు వత్తాసు పలక్కుండా ఉండండి చాలు.. "
దండం పెట్టింది జానకి. 
" ఓకే ఓకే. హోమ్ మినిస్టర్ ఆదేశించాక తప్పుతుందా మరి !"
నవ్వుతూ, మరి ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అని మెల్లిగా లేచి,అలా బయటికెళ్ళొస్తా... అంటూ గేటు దాటాడు. అక్కడ ఇంటి ముందు ముచ్చటగా ఓ కొత్త ముగ్గు..! మురిపెంగా కనిపించింది. అక్కడ నిన్న పరుచుకున్న చెత్త ఇప్పుడు మచ్చుకైనా లేదు.
"ఆహా ! ఆడది  ఉన్న ఇంటికీ లేని ఇంటికీ ఎంత తేడా! ఇదంతా ఇల్లాలి మహిమే కదా!"
 భార్యపై ప్రేమతో పాటు గౌరవమూ కలిగింది సాంబశివరావుకి.అంతలో ఠక్కున ఏదో స్ఫురించింది. బాపురే !ఈరోజు ఏదో విశేషమున్నట్లుందే !ఏమిటబ్బా!
బుర్ర గోక్కున్నాడు. మార్చ్, 8. Women's Day. మహిళాదినోత్సవం..! మరిచేపోయా... ఈ సందర్భంగా నా ప్రియమైన శ్రీమతికి ఓ చక్కటి బహుమతి ఇచ్చి తీరాల్సిందే... తృప్తిగా,  సంతోషంగా ముందుకు కదిలాడు సాంబశివరావు.
🌷💐🌹🌷💐🌹🌷🌹💐🌷🌹💐🌷🌹💐🌷🌹💐

 




      

Friday, February 20, 2026

ప్రశ్నించు..ప్రశ్నిస్తూనే ఉండు...

                                        ~యం. ధరిత్రీ దేవి

నాల్గు గోడల నడుమ ఉన్నా...
నాకెందుకులే అని సరిపెట్టుకుందామన్నా...
వర్తమానభారతం వార్తల భారంతో.. 
చెలరేగే ఆలోచనాసంద్రపు సుడిగుండాల్లో చిక్కి...
మునిగిపోతూ..నలిగి నలిగీ..కడకు తేలి..
రూపుదిద్దుకుని..నా మస్తిష్కపుపొరలు 
చీల్చుకుని..అక్షరాలై కాగితాన బారులై 
పరుచుకున్న నా భావజాలమా...!!

అడగవా ఈ సమాజాన్ని...కులమతాల అడ్డు గోడలు
రేపుతున్న విద్వేషాల ఆరని అగ్నకీలలు..ఎందుకని ?
ఉగ్రవాదం విషపుకోరలు సాచి విషం చిమ్ముతూ...
అమాయకుల్ని విగతజీవులుగా మార్చి మరుభూమిని
తలపిస్తున్న తీవ్ర సంక్షోభాల్ని..ఖండించవా...
ఈ మారణహోమాలు ఎందుకూ..ఎందుకని ?

తరతరాలుగా..ప్రతీతరాన్ని తీరని వేదనలో ముంచెత్తుతూ 
నిర్వీర్యంచేస్తూ.. ప్రగతిరథాన్ని ముందుకు కాదు...
వెనుకకు మళ్ళిస్తూ..దుస్సాంప్రదాయాల పడగనీడలో 
పాతుకుపోయి..కుళ్ళిపోతున్న ఈ మారని మనస్తత్వాల్ని 
ప్రశ్నించవా..ఎందులకీ అనాగరిక మూఢత్వపు ముసుగులని...!?

ఆత్మాభిమానం మృగ్యమై..మానవీయ విలువలు శూన్యమై...
అర్ధాంగి ఆస్తులకు అర్రులు చాస్తూ..మూడుముళ్ల బంధం 
మూన్నాళ్ళ ముచ్చటగా మారుస్తూ..నవ వధువుల్ని కాటికి 
పయనం కట్టిస్తున్న ఆత్మ విమర్శ ఎరుగని నేటి 
సంస్కారహీనుల్ని నిలదీయవా..తగునా ఇది మీకని...!!

ఏ మూల వెతికినా..ఏ వార్త చదివినా..ఏమున్నది గర్వకారణం..! 
తీరని మానసిక సంఘర్షణల క్షోభ దప్ప..
అటనుండి ఆవిర్భవించే వేదనాభరిత స్పందన దప్ప...!
అయినా సరే..మదిని కలవరపరిచే నా భావజాలమా..
అక్షరసైన్యమై మరోసారి..మరోసారి.. మరీ మరీ... 
ప్రశ్నించి చూడు..ప్రశ్నార్థకంగా మారుతున్న దేశ భవిత గురించి...
భావితరాల అగమ్యగోచర  ప్రస్థానం గురించి...!!

['సంచిక ' ఆన్లైన్ వార పత్రిక ( 1.2.26 ) లో ప్రచురింపబడ్డ నా కవిత ]


 


Friday, February 13, 2026

కట్టుబాట్లు

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦 
                        కట్టుబాట్లు 
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

 ప్రేమించుకున్నామంటారు... 
 ప్రేమికులం మేం అంటారు...!
 పెళ్లంటే వద్దూ వద్దంటారు... !
 సహజీవనం ముద్దంటారు...!!
 స్వేచ్ఛాజీవనం కావాలంటారు...
 కొత్తదనంలోనే ఆనందమంటారు...
 రోజులు గడుస్తాయి....
 మోజులు తీరతాయి...
 'మైనస్ ' లు  బయటపడి...
'ప్లస్ '  లు మరుగునబడి... 
కలహాలు మొదలై... కష్టాలపాలై... 
కలల సౌధం కూలిపోయి...
విషాదం మూటగట్టుకుని...విడిపోయి... 
వీధినిబడుతున్న ఆధునిక యువత...!
ప్రశ్నార్ధకమవుతున్న బంగరు భవిత !
కన్ను మిన్ను గానక చరించిన ఫలితమిది  !!
గతి తప్పిన దారుల వెంట ...
గమ్యం లేని బ్రతుకులివి .... ! 
సజావుగా సాగాలంటే జీవితాలు... 
ఉండాలిగా మరి నీతినియమాలు.... !!
కట్టుబాట్లతో కూడిన ఆ పెట్టని గోడలు.. 
నిరంతరం హెచ్చరించే లక్ష్మణరేఖలు !!
నిత్యం ఆదుకునే రక్షణకవచాలు...!!

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦



Wednesday, February 11, 2026

నడయాడే వెన్నెలకెరటం...

 *****************************************
తెలతెలవారుతోంది..తలుపు తీసింది...
సూర్యోదయం పలకరించింది చిరునవ్వుతో..
ముంగిలి ఊడ్చింది...కల్లాపి జల్లింది..
భూమాత పరవశించింది..
ముత్యాలముగ్గు పెట్టింది..
మహలక్ష్మి గడపలో అడుగు పెట్టింది...
దేవుని ముందు దీపం వెలిగించింది.. 
గంటలు మ్రోగాయి...పనులు మొదలయ్యాయి..
గోడ మీద గడియారం ముల్లు సాగుతూ ఉంది..
తోడుగా పరుగులు తీస్తూ ఆమె !! 
అందర్నీ సిద్ధపరిచి సాగనంపింది..ఎవరామె ?
ఆ ఇంటి ఇల్లాలు..అలా అలా..
ఉదయం..మధ్యాహ్నం..సాయంత్రం..
దాటిపోయాయి..పనులకు కొదవలేదు ..
తీరిక..!క్షణం లేదు..! రాత్రీ గడిచింది..
తెల్లారింది..మళ్లీ మొదలు ! 
ఇది గృహిణి దినచర్య !!
" ఏం చేస్తావు నువ్వు? " అనడిగితే.. 
ఏమీ చేయనంటుంది...ఎదురు ప్రశ్నించదు..
"గడప దాటి పని చేస్తేనే ఉద్యోగమా?"అనదు...
ఆ తలపే రాదు మరి !!
సంపాదన నోచుకోని..పదవీ విరమణ ఎరుగని 
జీవితకాల 'ఉద్యోగం!'…వెల కట్టలేము...
ధర చెల్లించలేము...అది అమూల్యం!!  
అలసట దరిజేరినా..చిరునవ్వుతో తరిమేస్తుంది..
విసుగొచ్చినా ఓపిక కొని తెచ్చుకుంటుంది ! 
స్వార్థ చింతన..స్వీయ రక్షణ...
తలవని తరుణి...! తనకు మారుగా దైవం
ఇలకు పంపిన దైవ స్వరూపిణి !!
గృహాన్ని స్వర్గసీమగా మార్చి...
అలవోకగా నడిపే మంత్రిణి !!
ప్రతి ఇంటా తిరుగాడే ఆ ఇంటి దీపం...
అనునిత్యం నడయాడే వెన్నెల కెరటం !!
*********************************              
         ఆగస్ట్ 2025' విహంగ' మహిళా 
              మాసపత్రికలో  ' తెలతెలవారుతోంది'
                పేరుతో ప్రచురితం            
*********************************






   

Sunday, February 8, 2026

కళ్ళతో మాత్రమే ఆస్వాదించే దృశ్య మాలికలివి...





ఎన్నెన్నో వర్ణాలు..
చూడాలంటే చాలవు 
రెండు నయనాలు 
చిత్రకారుని కుంచెకు 
చిక్కని చిత్రాలు
చిత్రంగా అమరి 
కొలువుదీరిన పుష్పరాజాలు  
ప్రకృతి ప్రసాదితవరాలు..
ప్రకృతికే వన్నెలొసగే 
వన్నె వన్నెల పూబాలలు..
తోటలో విరబూశాయా..
ఆ తోటకే తలమానికాలు..
ఇంటి ముంగిట విరిశాయా..
ఇల్లాలి మది నిండా సంబరాలు..
చిరుగాలికి అల్లనల్లన కదిలే 
ఆ కొమ్మలు పంచే ఆహ్లాదాలు..
పరిమళ సుగంధాలు గుప్పిస్తూ..
అవి అందించే సుస్వరాలు..
తేనియలు గ్రోలుతూ..
రంగురంగుల తుమ్మెదలు..
కనుల విందుగా పచ్చపచ్చగా
కదిలే క్రోటన్ అందాలు..
కళ్లతో మాత్రమే ఆస్వాదించే 
దృశ్యమాలికలివి..
ఎన్ని కాసుల రాశులు 
పోసినా కొనలేనివి...




 

Thursday, February 5, 2026

పాఠశాల గేయం....

సాగాలీ సాగాలీ నిరంతరం...
చేరాలీ చేరాలీ మన గమ్యం...


నవ్వుల పువ్వుల రవ్వల 
నడుమ మనం మనం 
ఆడుతు పాడుతు 
జీవించాలి క్షణం క్షణం 
సాగాలీ సాగాలీ నిరంతరం 
చేరాలీ చేరాలీ మన గమ్యం          //నవ్వుల//

మా బడియే మా ప్రియమైన మా ఇల్లు 
మమతకు మారు రూపాలు 
చదువులు చెప్పే గురువులు 
శుభోదయం నేడే పట్టండీ కుసుమాలు 
వేడుకమీర చెప్పండీ జేజేలు 
ఆ గుడిలాంటి ఈ బడిలో 
వెలసిన ఈ దేవుల నడుమ 
కలిసి మెలిసీ కన్నులవిందుగ      //నవ్వుల//

నిచ్చెనలోని మొదటి మెట్టు నువు ఎక్కకనే 
చేరగలేవు ఆఖరిమెట్టు ఎన్నటికీ 
ఆ మొదటి మెట్టు నీ ఉపాధ్యాయుడు మరవద్దూ
జీవనపథమున పైన నిలిచిన ఆ పొద్దూ 
ఆ గుడి లాంటి ఈ బడిలో 
వెలసిన ఈ దేవుల నడుమ 
కలిసి మెలిసి కన్నులవిందుగ     //నవ్వుల//

Monday, February 2, 2026

నది... కథ

 *****************************************


☀️నిండుగా ప్రవహించే నది తనలోని సుడిగుండాల్ని, ఆటుపోట్లని  తనలోనే దాచుకొని ఎంతో గంభీరంగా, మరెంతో  ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. యమున కూడా ఈరోజు దాకా అందరి చేత ఓ నిండునది లాంటిది అనిపించుకొంది. జీవితాంతం అలాగే ఉండేదే కానీ... అనుకోకుండా ఆమెలో ఈరోజు అలజడి చెలరేగుతోంది. అందుకు కారణభూతమైన క్షణాలు ఎంత వద్దనుకున్నా ఆమెను మరీ మరీ కమ్ముకుంటున్నాయి.
    కన్నతల్లికి కన్నబిడ్డలంతా సమానమే అని అంటారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగడం తల్లి హృదయం భరించలేదంటారు. మరి ఇదెలా సంభవించింది ! 
   యమున ఇంటర్లో ఉండగానే ఆమె తండ్రి పెరాలసిస్ తో మంచం పట్టాడు. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆదాయం మరీ సన్నగిల్లింది. ఇంటికి పెద్ద కూతురు తనే. ముగ్గురు చెల్లెళ్లు, తమ్ముడు. యమున చదువు సాగడం దుర్లభమయింది. విధిలేని పరిస్థితి. కుటుంబ పోషణకై తనూ ఓచేయి వేయక తప్పలేదు. యమునకు తండ్రి కోలుకుని సంసారరధాన్ని యధా ప్రకారం మోస్తాడనీ, తన చదువు మళ్లీ కొనసాగుతుందనీ కొండంత ఆశ పెట్టుకుంది. కానీ త్వరలోనే అవి అడియాశలే అని కొద్ది కాలానికే తెలుసుకుంది. తండ్రి జబ్బు  ఆయనని మామూలు మనిషిని చేయలేదు కానీ, జీవచ్ఛవంగా మార్చి వదిలి వేసింది. 
      ఇక యమున నడుం బిగించక తప్పలేదు. తండ్రి అనారోగ్యం ఒకవైపు,ఎన్నడూ గడప దాటి  ఎరుగని తల్లి మరోవైపు..!అది చాదన్నట్లు ఇంకా బాధ్యతలు తెలియని తోబుట్టువులు...!! ఇవన్నీ యమునకు అనూహ్యంగా ఆశించని పెద్దరికాన్ని అంటగట్టాయి. చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి, దగ్గరలోని కాన్వెంట్ లో టీచర్ గా చేరింది. అంతే..! ఆ క్షణం నుండే ఆమె జీవన పోరాటం మొదలైంది. క్షణం తీరిక లేకుండా ఇంటా బయటా చేసి ఏదో ఒకలాగా నాలుగు రాళ్లు సంపాదించడమే ఆమె ధ్యేయమైపోయింది. అలుపెరుగని ఆ ప్రయాణంలో తీరా కాస్త సమయం దొరికి వెనక్కి తిరిగేసరికి...ఇంకేముంది !! తను ఎక్కడ ఉందో తనకే తెలియని అయోమయ స్థితి!
      ఇంట్లో ఉండే కష్టపడి క్వాలిఫికేషన్ పెంచుకుంది. జీతం పెరిగింది. ఉద్యోగ స్థాయీ పెరిగింది. ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి తన కష్టార్జితంతోనే  జరిపించింది. తమ్ముడి చదువు కూడా ఓ కొలిక్కి వచ్చింది. ఈరోజో రేపో వాడూ ఓ ఉద్యోగి అవుతాడు. ఇక చిన్న చెల్లెలు ఒక్కతి ఉంది. దానికి కూడా త్వరలోనే ఏదో ఒక సంబంధం చూసే ప్రయత్నంలో ఉంది. అంతా స్థిరపడినట్లే.. కానీ, తనకే..ఎందుకో ఇన్నేళ్ల తర్వాత తనూ ఓ ఆడపిల్లనే అనీ,  తనకూ ఓ మనసనేది ఉందనీ గుర్తుకొస్తోంది. దానికి కారణమూ లేకపోలేదు. కొద్దికాలంగా చిన్ననాటి నుండీ తనతో సన్నిహితంగా  మెలిగే స్నేహితురాలు సంధ్య తనతో అంటున్న మాటలు...
" ఎంతకాలం ఇలా ఉంటావు యమునా.. నీ వాళ్ళ బాగోగులు చూడాలి సరే.. కానీ నీ గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత  వాళ్లకు లేదంటావా!? అప్పుడే నీకు ముప్పై దాటిపోయాయి. తమ్ముడు, చెల్లెళ్లు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇకనుంచి అయినా నీ గురించి నీవు ఆలోచించుకోరాదా..."
     ఒక్కసారి కాదు యమున కలిసిన ప్రతిసారీ ఈ ప్రసక్తి తీసుకురాకుండా ఉండలేకపోయేది సంధ్య. అప్పట్లో ఆమె మాటలు తేలిగ్గా కొట్టి పారేసేది యమున. కానీ ఈ మధ్య ఎందుకో ఏదో తెలియని దిగులు..,వెలితి ఆమెను చిన్నగా వేధించడం మొదలు పెట్టాయి. క్రమక్రమంగా ఆమె ఆలోచనలు ఆ కోణంలో సాగడం మొదలైంది.
      సరిగ్గా అప్పుడే ఆమెకు తట్టింది.. అవునూ... సంధ్యకు వచ్చిన ఆలోచనలు కన్నతల్లిగా నా తల్లికీ వచ్చి ఉండాలి కదా..! కానీ ఎందుకో అమ్మ నా పెళ్లి గురించి ప్రస్తావించడం గానీ బాధపడడం కానీ చూడలేదు తను. అయినా పైకి ఎలా చెప్పుకోవాలో తెలియక లోలోపల ఆమె నా గురించి ఎంత కుమిలిపోతూ ఉందో ఎవరికి తెలుసు!! అనుకుందామె అంతరంగం.
" ఏది ఏమైనా నేనూ స్థిరపడాలి జీవితంలో... "
 ఎంతో అంతర్మధనం తర్వాత ఓ స్థిర నిశ్చయానికి వచ్చింది యమున.
                       **           **             **
     ఆ తర్వాత కొద్ది రోజులకే సంధ్య నుండే ఆమెకో ప్రపోజల్ వచ్చింది.
" యమునా, నీ పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఈ సంబంధం గురించి చెప్తున్నానని దయచేసి నీవు అనుకోవద్దు. అతను వరుసకు నాకు కజిన్ అవుతాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇద్దరు పాపలున్నారు.ఆరేళ్లు, నాలుగేళ్లు ఉంటాయి.భార్య జబ్బుతో కొద్దికాలం క్రితం చనిపోయింది. నేను చెప్పడం కాదు గానీ మనిషి చాలా మంచివాడు. సర్దుకుపోయే మనస్తత్వం. నీ గురించి చెప్పాను. నీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడమన్నాడు. అతనికి తన పిల్లలంటే ప్రాణం. మళ్లీ పెళ్లి చేసుకుంటే వారికి అన్యాయం జరుగుతుందని ఆ ఊసే లేకుండా ఉన్నాడు ఇంతకాలం. మొన్న నీ గురించి నేను చెప్పాక, సరే అన్నాడు. నీవు గనక ఒప్పుకుంటే నీ జీవితం ఓ దారిలో పడినట్లే... యమునా, ఇంక ఏమీ ఆలోచించకు... "
     యమున భుజం మీద చేతులు వేస్తూ అనునయంగా చెప్పింది సంధ్య. ఆ తర్వాత కొద్ది రోజులు ఆ సంబంధం గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది యమున. మరుసటి వారం అతను రానే వచ్చాడు యమునను చూడటానికి. పెళ్లిచూపుల తతంగమేమీ లేకుండా ముందుగా అనుకున్న విధంగా ఓ పార్కులో కలిశాడు.
" మళ్లీ వివాహం చేసుకోవాలన్న ఆకాంక్ష నాకు లేదు. కానీ సంధ్య మీ గురించి మరీ మరీ చెప్పింది. మీ సహనం, ఓర్పు, త్యాగగుణం... ఇవన్నీ నాకు నచ్చాయి. నా పిల్లలకి మళ్ళీ తల్లి దొరికితే చాలని నేను కోరుకుంటున్న తరుణంలో మీరు తటస్థపడటం నా పిల్లల అదృష్టంగా భావిస్తున్నాను... "
 యమున ఏమీ మాట్లాడలేదు. పది నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు,ఆలోచించుకుని ఏ సంగతీ తెలియజేస్తే త్వరలో ముహూర్తాలు  పెట్టిస్తాను అంటూ. యమునకూ అభ్యంతరం చెప్పడానికి ఏ కారణం కనిపించలేదు. తనను వెతుక్కుంటూ సంబంధం రావడమే గొప్ప. పిల్లలుంటేనేం.. నాకూ ఓ ఇల్లంటూ ఏర్పడుతుంది అనుకుంది.
    ఇంతవరకూ జరిగిన విషయాలు ఇంట్లో ఎవరికీ తెలియదు. ఈరోజు చెప్పాలనుకుంటూ లేచి ఇంటి దారి పట్టింది.
                        **           **           **
"  యమున పెళ్లికి ఇప్పుడు ఏం తొందర అన్నయ్య? చిన్నదాని పెళ్లయిపోతే, అబ్బాయి గురించి దిగులు ఏముంటుంది గనక!అందుకే... ఇప్పుడు యమునకు మీరు తెచ్చిన సంబంధాన్ని చిన్న దానికి చూద్దాము. ఇక యమున అంటారా... దాన్ని ఎప్పుడూ మేము కూతురుగా చూడలేదు. ఈ ఇంటి పెద్ద కొడుకు గానే భావించాము. పైగా దానికి పెళ్లీడు కూడా  దాటిపోయింది. ఎలాగూ ఉద్యోగం ఉంది కాబట్టి దాని జరుగుబాటు గురించి ఆలోచన లేదు. అలాగని దానికి పెళ్లి వద్దని అనడం లేదు. కాకపోతే ఈ చిన్న పిల్ల బాధ్యత తీరిపోతే నాకు నిశ్చింతగా ఉంటుంది..ఆతర్వాత...యమున రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది...ఏమీ అనుకోక ముందు చిన్నదాని సంగతి చూడండి అన్నయ్యా... "
     అప్పుడే గుమ్మంలో కాలు పెట్టబోతున్న యమున చెవిలో తల్లి మాటలు పడనే పడ్డాయి. ఆమెలో ఒక్క సారిగా భూమి,ఆకాశం బద్దలౌతున్న అనుభూతి!!
                    **         **             **
   సమయం రాత్రి పదకొండు దాటింది. యమునకు కంటిమీద కునుకు పట్టడం లేదు.. పదేపదే తల్లి మాటలు చెవుల్లో మార్మోగుతూ ఆమె గుండెల్ని పిండి వేస్తున్నాయి. కన్నతల్లిలో ఇంతటి స్వార్థమా! కూతురు గురించి ఇంత కఠినంగా ఆలోచించే మాతృ హృదయం కూడా ఉంటుందా! ఇంతకాలం కేవలం నన్ను  మిగతా పిల్లల అభివృద్ధికే చేయూతగా వాడుకున్నారా!! ఆమె మెదడు మొద్దు బారి పోయింది.
   ప్రస్తుతం ఆమెలో చెలరేగుతున్న అలజడికి అదే కారణం. మునుపెన్నడూ స్పందించని రీతిలో ఆమె హృదయం   తల్లడిల్లిపోసాగింది. ఆ స్థితిలో కొద్ది రోజులపాటు వేదనతో ఊగిసలాడిన ఆమెలో ఓ నిర్ణయం రూపు దిద్దుకుంది. ఆతర్వాత కాగితం, కలం తీసుకుని రాయడం మొదలెట్టింది.
డియర్ సంధ్యా,
         నా గురించి నీవు పడిన తపన రక్తం పంచుకు పుట్టిన నా తోబుట్టువుల్లో నేనెన్నడూ చూడలేదు. నా సంపాదనలో ప్రతి పైసా వారి కోసమే ఖర్చు చేశాను. కానీ ఎన్నడూ వారి కళ్ళలో నా పట్ల కృతజ్ఞతగానీ, ప్రేమ భావంగానీ నేను ఎరుగను. మా అక్క తమ అందరికోసం ఆహుతైపోతోందన్న ఆలోచన, బాధ వారిలో ఏ కోశానా ఎప్పుడూ నాకు కనిపించలేదు. ఇప్పుడు నన్ను పెళ్లాడాలనుకున్న  వ్యక్తి నన్ను తన పిల్లల కోసమే తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు తప్ప నన్ను నన్నుగా కాదు. అతను నాతో మాట్లాడిన కొద్ది నిమిషాలు తన పిల్లల గురించి తను ఎంతగా ఆరాటపడుతున్నాడో చెప్పాడే గానీ నా గురించి, నా జీవితం గురించీ అతనికి ఏ ధ్యాస ఉన్నట్లు నేను గుర్తించలేదు. ఇంతవరకూ నా జీవితం, జీతం నా వాళ్ళు అనుకున్నవాళ్ల కోసం  ఖర్చుచేశాను. ఇకనుంచీ అతని సంబంధీకుల కోసం చేయాలి. వద్దు సంధ్యా, నన్ను ఇలా బ్రతకనివ్వు. ఇలా మాట్లాడుతున్నందుకు అన్యధా భావించకు. నేను చాలా అలసిపోయాను. ఇక మీదటైనా నా జీవితం నా కోసమే అనుకుంటున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను చాలా ఆలోచించాను సంధ్యా. నా ఆలోచనలకు సరిపడే వ్యక్తి తటస్థిస్తే తప్ప పెళ్లి గురించి ఆలోచించను. జీవితంలో పెళ్లి ఒక భాగమే. పెళ్లే జీవితం కాదు. జీవిత పరమార్ధమూ కాదు. నా వ్యక్తిత్వం నిలబడాలి. నా జీవితం కేవలం నాదే కావాలి. మరెవరికోసమో కాదు..సహనం, ఓర్పు ఉండాలి, నిజమే.. కానీ, అది హద్దుల్లో ఉంటేనే బాగుంటుందని స్వానుభవంతో తెలిసొచ్చింది.కాస్త ఆలస్యం అయిందంతే.అంతో ఇంతో స్వార్థమన్నది మనిషికి అవసరంకూడా.నదిలో ఎన్ని లొసుగులున్నా నిండుగానే ప్రవహిస్తూ ఉంటుంది. కానీ, ఉప్పొంగితేనో !! ఈ యమున కూడా అంతే ! నా కోసం నీవు ఎంతో ఆలోచించావు. కానీ నన్ను అర్థం చేసుకుంటావన్న నమ్మకంతో ఉన్నాను.బాధనిపిస్తే క్షమించు.నా నిర్ణయం నీవు హర్షిస్తావని ఆశిస్తూ...
                                                  స్నేహమయి 
                                                     నీ యమున 
*****************************************
       [ వనితా జ్యోతి మాసపత్రికలో ప్రచురితం ]
*****************************************





Thursday, January 29, 2026

ఆశావాదం ఆయుధంగా...

                             యం. ధరిత్రీ దేవి

ముచ్చట్ల తో మైమరిపించి 
కడగండ్లతో కన్నీటి ధారలు కురిపించి
మూడు వందల అరవై ఐదు  రోజులు 
మరో విధంగా పన్నెండు నెలలు...
పరుగుడి పరుగిడి...
సెలవు పుచ్చుకొంటున్నది 
పాతబడ్డ కొత్త సంవత్సరం..

ప్రతినెలా దేనికదే ప్రత్యేకం 
పరవశింపజేస్తూ ఒకసారి..
విషాదంలో ముంచేస్తూ మరోసారి..
జీవితమంటే పరిమళాలు వెదజల్లే 
పూల తోట మాత్రమే కాదు..
గుచ్చుకునే పదునైన ముళ్ళు 
పరచుకున్న రాళ్లబాట కూడా...
అంటూ గుణపాఠాలు నేర్పి 
తీపి చేదు అనుభవాల జ్ఞాపకాల 
దొంతరలను మదిని పేర్చి..
గతంలోకి జారుకుంటూ 
కదిలి వెళుతూ చెప్తోంది వీడ్కోలు...

అదిగో..అడుగిడుతోంది 
మరో నూతన సంవత్సరం.. 
వినూత్న రీతిని...!
తెలతెలవారుతుండగా..
మంచు తెరలను చీల్చుకుని..
మల్లెల సౌరభాలు వెదజల్లుతూ...
మన కోసమే..మనందరి కోసమే...
నడిచి నడిచి వస్తూ..అదిగో..అదిగో.!
కష్ట సుఖాలు కావడికుండలన్న నిజం 
నమ్మేద్దాం..ఆశావాదంతో అడుగులు వేస్తూ 
సాగుదాం..గతానికి వీడ్కోలు పలుకుతూ..
వర్తమానానికి చేతులు చాస్తూ..
మనసారా స్వాగతిద్దాం...

[ 'సంచిక'  11.1.26 వార పత్రికలో ప్రచురితమైన నా కవిత..]



  

Tuesday, January 27, 2026

చిన్నారులతో సాధనా టీచర్

 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

                     

                 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

                                       ~ యం.ధరిత్రీ దేవి                  
      ఆరోజు శనివారం. అలవాటు ప్రకారం మధ్యాహ్నం చివరి పీరియడ్ కోసం ఎదురుచూస్తున్నారు ఐదవ తరగతి పిల్లలంతా. ఈరోజు టీచర్ ఏ విషయం గురించి చెబుతుందో, ఏ కొత్త కథ చెబుతుందో అని అంతా ఆసక్తిగా ఉన్నారు. అంతలో బెల్ మోగింది. ఎదురుచూస్తున్న చివరి పీరియడ్  రానే వచ్చింది. సాధన టీచర్ క్లాస్ లోకి అడుగు పెట్టింది. అందరి మొహాల్లో సంతోషం...! నిలబడ్డారంతా.
" హాయ్, పిల్లలూ! ఈరోజు ఓ చక్కటి విషయం చెప్పబోతున్నాను... "
 అందరూ చిరునవ్వుతో టీచర్ వంక చూశారు.
"... రేపటి దినం ప్రత్యేకత తెలుసు కదా అందరికీ.."
" రిపబ్లిక్ డే టీచర్ "
 ముక్తకంఠంతో అన్నారంతా.
 " అది సరే, ఇంతకీ రిపబ్లిక్ డే అంటే ఏమిటో తెలుసా ? "
 అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. 
" ఆరోజు జెండా ఎగరేస్తాం టీచర్ "
 శివ లేచి చెప్పాడు,
" ఎందుకు ఎగరేస్తామో చెప్పు  "
 టీచర్ ప్రశ్న. తల గోక్కున్నాడు వాడు.
" ఆ. మనకు స్వాతంత్ర్యం వచ్చింది  కాబట్టి.. "
 గోపీకి గుర్తొచ్చింది చెప్పాడు.
" అది స్వాతంత్ర్య దినం కదా!"
 అది కాదురా అన్నట్లు గోపీ వైపు చూశాడు శివ.
 అలా అలా మరో ఇద్దరు ఏవేవో చెప్పాక,
" అవేవీ కాదు. చెబుతాను వినండి శ్రద్ధగా... "
 సాధన పిల్లల వైపు చూస్తూ చెప్పసాగింది.         
"బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్రం పొందిన రోజును స్వాతంత్ర్యదినంగా జరుపుకుంటాము మనము. ఇక రిపబ్లిక్ డేను భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటాము. రెండింటికి వ్యత్యాసం అదే.  రిపబ్లిక్ డే ను తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటారు..."
" ఓ, అలాగా..!"
 అన్నట్లు తలూపుతూ చూశారంతా టీచర్ వైపు. కొనసాగించింది సాధన.
"... గణతంత్ర రాజ్యం అనేది ఒక పరిపాలనా విధానం. ఇందులో రాజ్యాధికారం ప్రజలది, వారు ఎన్నుకున్న ప్రతినిధులది. గణతంత్ర రాజ్యంలో దేశం పరిపాలకులది కాకుండా ప్రజలందరి సొత్తు.." 
"................."
"...ఈ పద్ధతిలో ఏ కుటుంబానికో లేక సమూహానికో పరిపాలన మీద అధికారాలు ఉండవు. ప్రజా ప్రతినిధులు దేశ ప్రజలచే ఎన్నుకోబడినందున భారతదేశాన్ని రిపబ్లిక్ అంటారు..." 
"................"
"... దేశ ప్రజలచే ఎన్నుకోబడడం అంటే... ఈ మధ్య ఎలక్షన్లు.. అదే ఎన్నికలు జరిగాయి కదా.. మీ ఇళ్లల్లో పెద్దవాళ్లు అంతా వెళ్లి ఓట్లు వేశారు కదా... అదన్నమాట. ఎవరికి మెజారిటీ వస్తే వాళ్లు ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడతారు....ఇప్పుడు అర్థమైందా రిపబ్లిక్ అంటే ఏమిటో.."
 అందరూ తలలూపారు.
".. ఈ వయసులో మీకు ఈ మాత్రం అర్ధమైతే చాలు. మరింత వివరంగా పై క్లాసులకు వెళ్లే కొద్దీ తెలుసుకుంటారు.సరే మరి. రేపు రిపబ్లిక్ డే కదా. మరి స్పీచ్ ఎవరు ఇస్తారు?  "
" నేను ఇస్తా టీచర్ "
" టీచర్ నేను కూడా.. " 
 ఇద్దరు ముగ్గురు చేతులెత్తారు.
" వెరీ గుడ్. పాయింట్స్ అన్నీ బాగా గుర్తు పెట్టుకోండి. సరేనా "
" అలాగే టీచర్ "
 లాంగ్ బెల్ మోగింది. అంతా లేచి నిలబడి,
" థాంక్యూ టీచర్, గుడీవినింగ్ టీచర్  "
 చెప్పేసి, బిలబిలమంటూ టీచర్ వెంటే బయటికి దారితీశారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


 
                   


Sunday, January 25, 2026

ప్రయత్నం మొదలెట్టు...

<><><><><><><><><><><><><><><><><><>>
                                       యం. ధరిత్రీ దేవి 
                                       ***********
టిక్.. టిక్.. టిక్.. టిక్...!
గోడన గడియారం బ్దం...
లయబద్ధంగా...
శృతి ఏమాత్రం తప్పక...
సెకండ్లు.. నిమిషాలు..గంటలు...
దొర్లి పోతున్నాయి...విరామం ఎరుగక..! 
భ్రమణం సాగుతోంది...
కాలం కదిలిపోతోంది...!
మరోవైపు...
బిడ్డ ఎదుగుతోంది...
ప్రతీ పుట్టినరోజు జరుపుకుంటోంది...
పాపం! ఆయువు తరుగుతోంది !!
అదేమిటో !ఆ తలంపే రాదెవ్వరికీ !!
కన్ను మూసి తెరిచేలోగా 
ముసలితనం పలుకరిస్తుంది...
మరణానికి సిద్ధం కమ్మంటూ  !!
అందుకే...త్వరపడు...
జారుతున్న క్షణాల్ని ఒడిసిపట్టు...
ప్రతీక్షణం విలువ లెక్కపెట్టు...
సద్వినియోగం చేసుకునే 
ప్రయత్నం మొదలెట్టు...👍

<><><><><><><><><><><><><><><><><><>>




 



Sunday, January 18, 2026

మౌన సందేశం

 ప్రభాతవేళ...
 నులివెచ్చని ఉషాకిరణాల
 అనిర్వచనీయ స్పర్శ నాస్వాదిస్తూ...
 పాదచారినై సాగుతున్న క్షణాన...
 తుషార బిందువుల తడిసి 
 అరవిచ్చిన ఎర్రని ఓ గులాబి  
 నిండుగ నవ్వింది ననుజూసి...

 "జీవితం పరిమళభరితం...
 అవగతమైతే అద్వితీయం..!"
 ఆ నవ్వు రువ్వింది... 
 ఓ మౌనసంకేతం..!
 మరుక్షణమే అయింది 
 నా మానసం సంతోషతరంగం !!

 పొద్దు వాలింది...
 గులాబీ వాడింది...
 తల్లిని వీడి..నేలతల్లి 
 పాదాల వాలింది..!

 "జీవితం క్షణభంగురం 
 వేదనతో రోదనతో 
 బలి పెట్టకు నేస్తం...
 ఉన్నంతకాలం..ఉన్నంతలో 
 తృప్తిగా మనుగడ సాగించు.."

 అందింది మరో సంకేతం..!
 ఉదయం అందంతో మురిపించింది..
 సాయంసంధ్య.. పోతూ పోతూ..
 మైమరపిస్తూ..మదిని కదిలిస్తూ... 
 హృదయాన్ని తాకింది...
 మూల్యం లేని మౌనసందేశం..🌹

['సంచిక' అంతర్జాల వారపత్రికలో ప్రచురింపబడ్డ నా కవిత  ]

Wednesday, January 14, 2026

ఈ గమనం...ఈ పయనం...అనివార్యం..

🌄🌞🌄🌞🌄🌞🌅🌞🌄🌞🌄🌞🌄🌞🌄🌞

                               ~~ యం.ధరిత్రీ దేవి ~~

తెల్లవారింది...
సూరీడు పలకరించాడు...
మది...పులకరించలేదు...
పక్క వదలనంది...
తట్టిలేపింది నీరెండ...!
తప్పుతుందా...!
మెదిలింది కర్తవ్యపాలన... 
పారిపోయాయి బద్ధకం..బడలిక...
మొదలయ్యాయి పరుగులు...
అంతే ! దినచర్య ఆరంభం...
ఆగమన్నా ఆగదే సమయం !
నేనాగుదామన్నా...కుదరదుగా.. 
కదలక తప్పదే...ప్రతీక్షణం !
అలసిపోతూ ఈ దేహం...
అడగనైనా అడగదే విరామం !
అడిగితేమాత్రం....
అందుతుందా ప్రియనేస్తం...!
ఆందోళనలు...అలజడులు...
ఆపసోపాలు...అన్నింటి నడుమ 
నలుగుతూ...నలుగుతూ...
పూర్తయింది...విద్యుక్తధర్మం... 
పొద్దువాలింది...
సూరీడు నిద్దరోయాడు... 
అందర్నీ నిద్రబుచ్చాడు...
రోజు గడిచింది...ఆ రోజుకి...
మళ్ళీ తెల్లారింది..సూరీడొచ్చాడు..
మళ్ళీ మొదలైంది రోజు !! 
రోజూలాగే..!అయినా...
ప్రతీరోజూ సరికొత్తగానే.. !!
అలా అలా..గడుస్తూనే ఉంటుంది..
మళ్ళీ...మళ్ళీ మళ్ళీ....
తెల్లవారుతూనే ఉంటుంది... 
కదిలిపోతూనే ఉంటుంది..కాలగమనం.....
దానితోపాటు జీవనరథం... 
ఉరుకులూ పరుగులతో సహజీవనం !
వద్దూవద్దంటూనే అందిస్తాం ఆహ్వానం...
అందులోని ఆనందం అనిర్వచనీయం !!
ఏదో ఒక దినం...ఏదో ఒక క్షణం... 
అనుకోని కుదుపులు...
ఊహించని మలుపులు..!!
అవుతాయి ప్రత్యక్షం... 
ఎదురై విసురుతాయి సవాళ్లు..!!
విషాదవీచికలతో కొన్ని... 
వినూత్న ఆనందకెరటాలతో కొన్ని...!
అన్నింటి కలబోతతో.. 
సాగుతూ...సాగుతూ... 
ఈ గమనం...ఈ పయనం.. 
అనివార్యం !పిలుపు అందేదాకా... 
కొనఊపిరి ఆగేదాకా...!!

🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦









Tuesday, January 13, 2026

భోగి మంటలు వేద్దాం

 🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

              అదిగో వచ్చేసింది సంక్రాతి...
              మామిడి తోరణాలతో
              చెప్పేద్దాం స్వాగతాలు...💐
              అల్లదిగో...బసవన్నలు...
              హరిదాసుల  ఆగమనాలు...
              ఎగిరే గాలిపటాలు...
              ఎల్లలెరుగని కేరింతలు 
              ఇదిగిదిగో భోగి...!
              రంగవల్లుల సందడి..
              ఆ నడుమ గొబ్బెమ్మల 
              హడావుడి ...!! రండి..
              భోగిమంటలు వేద్దాం
              వ్యర్థాలన్నీ వదిలిద్దాం..
              చేదునంతా చెరిపేద్దాం..
              నూతన సంవత్సరం 
              వినూత్నంగా పయనిద్దాం..
              స్వాగతాలు పలికేద్దాం... 
              సంబరాలు చేసుకుందాం
              సంతోషంగా గడిపేద్దాం...🙂

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

 
    

             🌹 HAPPY SANKRANTHI 🌹

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀


Monday, January 12, 2026

ఊరంతా సంక్రాతి...సందడే సందడి...

సంక్రాంతి శుభాకాంక్షలు 

🦋🥀🦋🥀🦋🥀🦋🥀🦋🥀🦋🥀🦋🥀🦋🥀🦋

భోగి...సంక్రాతి... కనుమ...
ముచ్చటగా మూడురోజులు...
మురిపిస్తాయి...మైమరపిస్తాయి... 
మగువలు..ముద్దుగుమ్మలు... 
మెచ్చే సంబరాల  సంక్రాతి...
ఇంటి ముంగిట మెరిసే రంగోళి... 
ముద్దబంతులతో పోటీ...!
గొబ్బెమ్మల అందాలు... 
నట్టింట ధాన్యరాశులు... 
రైతన్నల కళ్ళలో కోటి ఆశలు !!
వంటలు.. పిండివంటలు... 
హడావుడి చేసే అమ్మలక్కలు... 
అల్లరి చేసే చిన్నారులు ...!!
బంధువుల అచ్చట్లు ముచ్చట్లు... 
లోకాభిరామాయణాలు.... 
సందడే సందడి....!!అంతేనా !
గణగణ గంటల బసవన్నలు.. 
హరిదాసుల ఆగమనాలు... 
నూతనవస్త్రాల గరగరలు.. 
అదిగో...!కొత్త సంవత్సరంలో తొలి పండగ !
తియ్యతియ్యని పలకరింపులు...
అందరినీ అలరించ సరికొత్త ముస్తాబులు 
చేసుకుని విచ్చేసిందిగా...సంక్రాతి  !
అందుకోండి  అందరూ శుభాకాంక్షలు🌷
తిరిగి అందరికీ అందించండి ఆప్యాయతలు 🙂
ఇంతులార ! పూబంతులార !!
రారండీ..రారండీ....
గొబ్బీయల్లో...గొబ్బీయల్లో...
పాడుదాం... ఆడుదాం ... 🤗
🦋🥀🦋🥀🦋🥀🦋🥀🦋🥀🦋🥀🦋🥀🦋🥀🦋




Sunday, January 11, 2026

ప్రశ్నలు... ప్రశంసలూ...


      
*****************************************

      అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఓ ఆహ్లాదకరమైన అంశం గురించి చెప్పాలనుకుంటున్నాను. ముద్దబంతి పూల గురించి మనందరికీ బాగా తెలుసు కదా.. వీటిని తలుచుకుంటే చాలు...మన తెలుగు సినిమాల్లో చాలా చాలా పాటలు గుర్తొస్తాయి కూడా..


--- ముద్దబంతిపువ్వులో మూగకళ్ల ఊసులో...
--- బంతిపూల రథాలు మా ఆడపడుచులు...
--- భామా భామా బంతీపువ్వా...
--- బంతిపూల జానకీ జానకీ...

ఇలా చాలా చాలా పాటలే ఉన్నాయి బంతిపూల మీద...
---- ఈవిధంగా సినీకవుల కలం  బంతిపూల మీదకు మళ్ళడానికి ఆ పువ్వు యొక్క ముగ్ధమనోహర అందమేనంటే అతిశయోక్తి కాదేమో!
   కన్నెపిల్లల వాలుజడల్లో ఒక్క పువ్వు పెట్టినా చాలు ఆ జడకే కొత్త అందాన్నిచ్చి అలరించే ఈ ముద్దబంతి పువ్వు ఇంతులందరికీ ఇష్టసఖి అంటే వింతేముంది!!
 ఒక్క సిగ సింగారానికేనా...! పండగపబ్బాలొస్తే చాలు...వీధుల్లో రాశులుగా దర్శనమిచ్చే ఈ పసుపు,ఎరుపు వర్ణాల బంతిపూలు మన గుమ్మాలకు తోరణాలుగా, సంప్రదాయానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఏ శుభకార్యం జరిగినా  అలంకరణలో ముందుగా కనిపించేదీ ఈ సుమబాలలే...!
   ఓ సంక్రాంతి పర్వదినాన బుట్ట నిండుగా మా ఇంటికొచ్చిన ఈ పరిమళభరిత బంతి పూలను చూడగానే...వెంటనే వాటితో మాట కలిపి,ఏవేవో ప్రశ్నలు అడగాలనిపించింది నాకు... వాటిలో మరీ ముద్దొస్తున్న ఓ పువ్వును అందుకుని మొదలెట్టాను ఇలా...🙂




ఏ తోటలోన..ఏ కొమ్మ పైన..విరబూసినావే...
ఏ దోసిలి నిండి...ఎన్నెన్ని దూరాలు నడిచొచ్చినావే 
మాకోసం విరిసీ...మాముంగిట నిలిచి 
మా ఇంట వెలుగులే వెదజల్లినావే 
బంతిపువ్వా...ఓ బంతిపువ్వా...        /ఏతోటలోన /

మా ఇంటి గడపకు పసుపునే అద్దినావు 
మామిడాకు పచ్చదనం నీకు జంట కాగా 
గుదిగుచ్చిన మాలవై గుభాలిస్తు నువ్వు 
మాఇంటి గుమ్మానికి తోరణం అయ్యావు...
బంతిపువ్వా... ఓ బంతిపువ్వా...     /ఏ తోట లోన /

ముంగిట్లో ముత్యాల ముగ్గులు 
ఆనడుమ గొబ్బెమ్మల మెరుపులు 
ఆపైని ఠీవిగ  నీ సోయగాలు 
వర్ణించ నా తరమా...ఓ పుష్పరాజమా...
బంతిపువ్వా... ఓ బంతిపువ్వా...    /ఏ తోట లోన /

వాలుజడల వయ్యారి భామలు 
ఆ సిగలో ఒదిగిన పూబంతులు 
వేయిరేకులొక్కపరి విచ్చుకున్న రీతి గనీ 
చందమామ చిన్నబోయి దాగింది చూడు మరీ...!

ముద్దరాలి ముద్దుమోము నీముందది ఏపాటి..!
నిజం నిజం... నిజం'సుమా'.. నీకు నీవె సాటి..
బంతిపువ్వా... ఓ బంతిపువ్వా...  /ఏ తోట లోన /

  🙂 
అలా చూడచక్కని ఆ ముద్దబంతి పూలపై ప్రశ్నలూ, ప్రశంసలు కురిపించాను. బదులుగా అవి ఏమివ్వగలవు చెప్పండి...! వాటి అందచందాలతో పరిమళాలు వెదజల్లుతూ మనల్ని అలరించడం, మన గృహాలకు అలంకారాలుగా మారడం తప్ప...!!
   అదండీ... ముద్దబంతి పూల ముచ్చట.. 🙂🤗

           🌺 అందరికీ ధన్యవాదాలు 🌺

Wednesday, January 7, 2026

ఆమె జవాబు..!

ఆడపిల్ల వద్దూ వద్దంటావు.. 
నిను గన్న 'అమ్మ' ఆడపిల్ల గాదా..!
పెంచిందీ ఆ ఆడది గాదా!
కడుపున మోసింది ఆడది గాదా !
ఆకలేస్తే కడుపు నింపింది 
అమ్మాయి అయిన ఆ ఆడదే గాదా!
ఆడది లేక నీ పుట్టుక ఉండునా!
మరెందుకు ఆడపిల్ల వద్దూ వద్దంటావు?

ఆశ్చర్యం!!
ఈ ప్రశ్నలన్నీ వేసింది 
ఓ మగవాడికి కాదు...
అమ్మ అయిన ఓ స్త్రీకే...!!
"ఆడపిల్ల వద్దు బాబూ"
అంటున్నది స్వయానా ఓ ఆడదే! 
ఎందుకని అడిగితే...
"నేను పడ్డ కష్టాలన్నీ 
నా కడుపున పుట్టి..
మళ్లీ మరో ఆడదీ 
పడాలా ఏమిటి!? "
అదీ ఆమె జవాబు...!!




Sunday, January 4, 2026

ఏ బడి నేర్పెనమ్మా....

                                                     
                                                     ~యం. ధరిత్రీ దేవి
జనని లేని జగతి జనం ఊహకందునా
అతివలేక అవనికంటు అర్థమొకటి ఉండునా 
ఇలకు దిగిన ఆ దైవం మరో రూపు మగువ కదా 
తాను కరిగి కాంతులొసగు కర్పూరమె కాంత కదా
ఇంతులార ఇల వెలిసిన వేల్పులార
వందనం ఇదె మీకు వందనం 
గైకొనుమా అభివందనం             //జనని//

గృహమే ఒక స్వర్గసీమ ఇల్లాలే సృష్టికర్త 
జగమెరిగిన నిజమిది కాదా 
మగనికి తను కుడి భుజమై నడిపించే నాయికగా 
బ్రతుకున సహభాగినియై పయనించే సహచరిగా 
తనయుల తగురీతిని తీర్చిదిద్దు మాతగా
తన బాగు తను కోరని..నిరతం తనవారల 
తలచు తరుణీమణి తానె గదా
పలుపాత్రల పోషణతో అలరించే ప్రమదలార 
ఇంతులార ఇల వెలిసిన వేల్పులారా 
వందనం ఇదె మీకు వందనం 
గైకొనుమా అభివందనం              //జనని//

అలనాటి ఝాన్సీరాణి రుద్రమల ధీరత్వం
ఇందిరమ్మ నాయకత్వ పటిమ సకలలోక విదితం 
భారత కోకిల సరోజినీ కవితావల్లరి కమనీయమే
ఆదినుండి నేటిదాక నెలతలకెదురేమున్నది ఈ భువిపైని
సబలలం మేమంటూ మాతో సరి మేమంటూ 
మహిని చాటుతున్న మహిమాన్విత మహిళలారా
ఇల వెలిసిన వేల్పులారా 
వందనం ఇదె మీకు వందనం 
గైకొనుమా  అభివందనం                //జనని//

అమ్మచాటు పసికూన ఆ అల్లరి పిల్ల 
కుందనాలబొమ్మ ఎపుడాయెనే 
మూడు ముళ్ళు పడగానే మగని మాయలో 
పడిపోయెనదిఏమి వింతోయమ్మ
ఇంటిపేరు మారి ఈ ఇంటిని మరిచి  
ఆ ఇంటి దీపమై అలరారే భామినీ ఓ భాగ్యశాలినీ
ఇంతులార ఇల వెలిసిన వేల్పులారా 
వందనం ఇదె మీకు వందనం గైకొనుమా                         //జనని //

ఇంతలో అంతలా అంతోటి పనితనం 
ఎలా వచ్చిచేరెనో మునుపెరుగని ఆ పెద్దరికం 
ఏ బడి నేర్పెనమ్మ ఆ లౌక్యమాలోకజ్ఞానం
ఏ గురువు నూరిపోసి తీర్చిదిద్దె నిన్నిట్లా కడుమేటిగా
ఆరిందావై..ఇల్లంతా నీవై..ఇంటి బయట నీవై..
అంతటా నీవై.. సర్వమూ నీవై...
ధరణికి సరితూగు సులక్షణాల ఓ ధన్యజీవీ
ఇంతులార ఇల వెలిసిన వేల్పులారా 
వందనం ఇదే మీకు వందనం గైకొనుమా                     //జనని //

( 'విహంగ' అంతర్జాల మహిళా మాసపత్రిక డిసెంబర్ 2025 సంచికలో ప్రచురింపబడ్డ నా పాట)






Thursday, January 1, 2026

అదిగో అదిగో అడుగిడుతోంది నూతన సంవత్సరం..



🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

 పచ్చదనాల కొత్త కోక గట్టి
 పసిడి వర్ణం మేనిలో నింపి
 పరిమళాల పూదోట నుండి 
 పల్లవించే రాగాల తోడి 
 పరుగు పరుగున వస్తోంది 
 మన  కోసమే మన  కోసమే  !

  దోసిలి నిండా పూరేకులు
  దోబూచులాడే కొత్త ఊసులు
  కళ్ళ నిండా కోటి కాంతులు
  ఎదనిండా ప్రేమానురాగాలు
  ఒడి నిండా వరాల మూటలు
  మోస్తూ మోస్తూ వస్తోంది 
  మన  కోసమే మన  కోసమే !

   తెలతెలవారుతుండగా  
   పొగమంచు చీల్చుకుంటూ 
   వెలుగులు  వెదజల్లుతూ
   నిన్నటి చేదును మరిపిస్తూ
   రేపటి 'ఆశ 'కు పునాది వేస్తూ
   అదిగో అదిగో! అడుగిడుతోంది 
   నూతన సంవత్సరం! మన కోసమే!

 " విషాదాలెన్నుంటే నేమిగాక ! లెక్క చేయకు!
   మూసేయ్  గతాన్ని! ముందుకు కదులు !
   వర్తమానం నీ చేతిలోనే! ఆలోచించు"
   అంటూ ప్రగతి దారి పట్టమంటోంది !
   అదిగో అదిగో ! అడుగిడుతోంది 
      🌺నూతన సంవత్సరం 🌺
  స్వాగతిద్దాం సంబరాలు చేసుకుందాం
  నిరాశా నిస్పృహలు వదిలేద్దాం
  నీరసం నిశ్శబ్దం పక్కకునెడదాం !
  నవ్వుతూ నవ్విస్తూ జీవనయానం సాగిద్దాం !
  అదిగో అదిగో !నూతన సంవత్సరం!
  అడుగిడుతోంది మనందరికోసం 
  స్వాగతిద్దాం సంబరాలు చేసుకుందాం !!💐🌷

🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺

              🌹💐Happy New Year💐🌹
                                     2026