Sunday, November 10, 2024

కొత్తదారి... చిన్న కథ

 [ 'వనితాజ్యోతి' మాసపత్రికలో ప్రచురింపబడ్డ నా రచన ]

" పెళ్ళై ఇన్నాళ్లవుతోంది, ఓ అచ్చటా లేదు, ముచ్చటా లేదు. అయినా ఎవర్ననుకుని ఏం లాభం? మా అదృష్టాలిలా తగలడ్డప్పుడు... "

ఆ ఉదయం రుసరుసలతో మొదలైన వర్ధనమ్మ వ్యాఖ్యానం మిట్ట మధ్యాహ్నం అయేసరికి తారస్థాయినందుకుంది.ఆ ఇంట్లో అందరి ప్రాణాలూ ఆమె వాగ్దాటిని ఆలకించటమే తప్ప ఎదుర్కోవటానికి సాహసించనివి.

   అలాంటి లోగిట్లోకి దాదాపు సంవత్సరం క్రితం విరిసిన గులాబీ లాంటి వాసంతి వచ్చిపడింది. ముగ్గురు ఆడపిల్లల తర్వాత నాలుగో ఆడపిల్లగా ఓ పేద ఇంట్లో పుట్టిన ఆ పిల్లకు సర్దుబాటు అన్నది వెన్నతో పెట్టిన విద్యే. ఆ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుండీ అడుగడుగునా అన్నింటికీ సర్దుకుపోతూనే ఉంది. వారసత్వంగా పుట్టింటి నుంచి సంక్రమించిన దరిద్రంతోపాటు సంస్కారమనే అమూల్యమైన ఆస్తి కూడా ఆమెతో బాటే వెన్నంటి ఉంది. అందుకనే అణకువతో అన్నీ భరిస్తూ వస్తోంది. అయినా ఆమెకు అర్థం కానిది ఒక్కటే... ఆ ఇంట్లో మగవాళ్ళంతా ఎందుకిలా  నోట్లో నాలుక లేని వాళ్ళలా ఉంటారు?! ఒక ఆడ మనిషి అలా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే వీళ్లంతా ఎందుకలా మౌనవ్రతం దాలుస్తారు !?

    చిలికి చిలికి గాలి వానగా మారి, ఆ రాత్రి భోజనాల వద్ద అత్తగారి నోటి నుండి మాటల తూటాలు ఎక్కుపెట్టిన విల్లు నుండి వదిలిన బాణాల్లా వచ్చి వాసంతి గుండెలు తూట్లు పొడిచాయి.

" ఇదిగోరా, నీవిలా దేభ్యంలా ఉండటం నేను చూడలేను. ఈ ఇంట్లో అంతా సంపాదించే వారే... నీవు తప్ప.. నీకు ఉద్యోగం దొరికేదెన్నడో ఏం పాడో.. నిన్ను సరే తప్పదు, నీ పెళ్ళాన్ని కూడా సాకాలంటే  కుదిరే పని కాదు. ముష్టి కట్నం ముక్కుతూ,మూల్గుతూ  ఇదిలించడానికి నీలిగారు. కనీసం ఉద్యోగానికి కావాల్సిన పైకమన్నా తెమ్మని దాన్ని పుట్టింటికి తోలడమో, లేక తన్ని తగలెయ్యడమో... ఏదో ఒకటి తేల్చేయ్... "

 తలవంచుకుని భోంచేస్తున్న భర్త శంకర్ ను తలుపు చాటు నుండి కళ్ళెత్తి చూసింది వాసంతి. దించుకున్న అతని మొహంలో భావాలేవీ ఆమె చదవలేకపోయింది. అతనితో పాటు భోంచేస్తున్న తండ్రి, అతని ఇద్దరు అన్నలు, తమ్ముడు ఇదేం పట్టించుకోవాల్సిన విషయం కానట్లు యధాలాపంగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. వంటింట్లో పాత్రలు సర్దుతున్న తోడికోడళ్ళు  " ఇదేం మాకు కొత్తా..!" అన్నట్లు నర్మగర్భంగా ఒకరిపై ఒకరు చూపులు గుప్పించుకున్నారు. వీటన్నింటికీ అతీతంగా వర్ధనమ్మ వాగ్ధాటి కొనసాగుతూనే ఉంది.

                        ***          ***          ***

   గదిలో భర్త అడుగుల చప్పుడు గ్రహించిన వాసంతి గుండె చిక్కబట్టుకొని మరింత బిగదీసుకుని పడుకుంది.జరగబోయే పరిణామం ఎలాంటిదైనా సరే... ఎదుర్కోవడానికి ఆమె మానసికంగా ఎప్పుడో సిద్ధపడేఉంది.

" వాసంతీ, "

 ఆ పిలుపులోని ఆర్ద్రత ఆమెకు కొత్తగా అనిపించింది.

" నా ప్రవర్తన నీకు బాధాకరంగా ఉందని తెలుసు. కానీ నేను నిస్సహాయుణ్ణి. అన్నలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. నాకా... చదువు పూర్తయి  ఇనేళ్ళయినా ఏ చిన్న పనీ దొరకడం లేదు. మా అమ్మకు మేము ఎవరము ఎదురు చెప్పలేము.  అట్టడుక్కుపోయిన సంసారాన్ని ఆమె తన రెక్కల కష్టంతో ఇంత ఎదిగేలా చేసింది. కొడుకులే ఆమె లోకంగా వాళ్ళ చుట్టూ ఎన్నో ఆశల్ని అల్లుకుంది.  ఫలితం! వాళ్ల మీద తనకు తప్ప మరెవ్వరికీ హక్కు ఉండరాదన్న భావం ఆమెలో పాతుకుపోయింది..." 

 మౌనంగా వింటున్న వాసంతితో చెప్పుకుంటూ పోతున్నాడు శంకర్.

"...మా అమ్మకు నేను అడ్డు చెప్పలేను... అలా అని ఆమె చర్యల్ని హర్షించనూలేను. ఈ ఇంట్లో నేను నీకు ఏ న్యాయం చేకూర్చలేను..."

 భర్త అంతరంగం ఏమిటో అర్థం కాక, బేలగా అతని కళ్ళలోకి చూసింది  వాసంతి. ఆ కళ్ళల్లో బెదురు చూసిన అతను ఆమెను దగ్గరకు తీసుకుంటూ,

"... కానీ, ఎవరికీ ఏ బాధ లేని మార్గం ఒకటి చెప్తాను. నీవు రేపే నీ పుట్టింటికి వెళ్ళు. అక్కడే ఉండి ఫైనల్ ఇయర్ తో ఆగిపోయిన నీ డిగ్రీ చదువు పూర్తి చెయ్. ఇక్కడ నుండి డబ్బు తెమ్మన్నారని మీ వాళ్ళతో నీవు చెప్పాల్సిన అవసరం లేదు. నీ కూడా వచ్చి నేను దిగబెడతాను. అదీ మా అమ్మకు తెలియకుండానే... నీవు డిగ్రీ పూర్తి చేసే లోగా నాకు ఏదైనా ఉద్యోగం దొరక్కపోదు. అంతవరకూ ఓపిక పట్టలేవా...!"

 కరడుగట్టి పోయిందనుకున్న అతని మనసులో ఇంతటి ఆర్ద్రత, అంతులేని లోతైన ఆలోచన దాగి ఉన్నాయని ఆమెకాక్షణంలోనే తెలిసింది.ఆ సంభ్రమం నుండి తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది వాసంతికి. భార్య భుజం మీద చేయి వేస్తూ కొనసాగించాడు శంకర్.

"... అటు కన్నతల్లినీ, ఇటు కట్టుకున్న భార్యనూ బాధ పెట్టడం ఇష్టం లేక మధ్యలో నలిగి పోతున్న నన్ను అర్థం చేసుకుంటావనే ఇన్నాళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఏమిటి, వాసంతీ, అంతదాకా నాకోసం సహనంతో వేచిఉండలేవా?"

ఆమెను కుదుపుతూ అడిగాడు కళ్ళలోకి చూస్తూ.

"మీ అండ నాకుంటే అంతదాకా ఏమిటి, ఈ జన్మంతా వేచి ఉండమన్నా ఉంటాను..."

 సంతోషం పట్టలేక, కన్నీళ్లు ధారగా కారుతుండగా భర్తను రెండు చేతులతోనూ చుట్టేసింది వాసంతి. ఆ సమయంలో ఆమెకు అతనో సరికొత్త దారిలో పయనిస్తూ గమ్యం వైపు సాగిపోతున్న బాటసారిలా గోచరించాడు...

******************🥀🥀🥀****************

Thursday, November 7, 2024

ప్రతిస్పందన... కథ

    మధ్యాహ్నం రెండయింది. సెల్ మోగుతోంది. అసహనంగా చూసింది  మైత్రి. విశ్వ మోహన్ ! ఈ రోజు ఇది ఐదో  ఫోన్ కాల్. విసుక్కుంటూ చేతిలో ఉన్న సెల్ తీసి  బ్యాక్ లో పడేసి కణతలు నొక్కుకుంటూ కూర్చుండిపోయింది. 
    విశ్వ  మోహన్ కూ, మైత్రికీ నిశ్చితార్థం జరిగి రెణ్ణెళ్లయింది. అతను స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో మంచి హోదా కలిగిన ఉద్యోగంలో ఉన్నాడు. చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. కూతురి పెళ్లి చేసేశారు. ఉద్యోగంలో చేరి రెండేళ్లు అవుతోంది. ఎన్నో సంబంధాలు చూసి చూసి,  చివరికి మైత్రిని ఓకే చేసి తాంబూలాలు పుచ్చేసుకున్నారు. కొన్ని నెలల వరకూ మంచి రోజులు లేవంటూ అప్పటికి నిశ్చితార్థం మాత్రం  చేసుకున్నారు.
     మైత్రి సంవత్సరం క్రితం ఓ బ్యాంకులో క్లర్క్  గా చేరింది. అమ్మానాన్నలకు తా నొక్కతే. తండ్రి ఓ ఆఫీసులో హెడ్ క్లర్క్ గా పనిచేసి ఈమధ్యే రిటైర్ అయ్యాడు. మైత్రి అందంగా ఉంటుంది. చూడగానే విశ్వమోహన్, తల్లిదండ్రులు, అక్క సంతృప్తిగా తలాడించేశారు. అంతా మైత్రి  చాలా అదృష్టవంతురాలన్నారు, అంత పెద్ద సంబంధం కుదిరి నందుకు. తల్లిదండ్రులతో పాటు తానూ సంతోషించింది. కొద్ది రోజులు ఆ సంతోషంలోనే ఉండిపోయారు ముగ్గురూ. కానీ, ఓ నెల రోజులు గడిచేసరికి మైత్రి లో చిన్నగా ఏదో అసంతృప్తి పొడసూపడం   మొదలైంది. మరో నెల గడిచేసరికి అది  రెట్టింపయింది. ఈ రెన్నెళ్ల  కాలంలో విశ్వ మోహన్ మనస్తత్వం ఆమెకు  పూర్తిగా అవగతమైపోయింది. అతను పూర్తిగా డామినేటింగ్ క్యారెక్టర్. అన్నీ తను చెప్పినట్టుగానే, తన ఇష్ట ప్రకారమే జరగాలి అనుకునే రకం. అతని ఈ ధోరణే మైత్రికి ఎంత మాత్రమూ  మింగుడు పడడం లేదు. ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళ ఇంటికి రమ్మనడం, తనకు ఈ రోజు వీలు కాదని చెప్పినా బలవంతంగా రప్పించడం. ఏ విషయంలోనైనా తన అభిప్రాయం వెలిబుచ్చితే దాన్ని  ఖండించడం, తనే రైటు  అన్నట్లు వాదించడం-- ఇలా అన్ని విషయాల్లో తనదే పైచేయిగా ఉండాలని పట్టుబట్టడం! అతని ప్రవర్తన నిశితంగా గమనించిన మైత్రి గ్రహించిన విషయం, అతనికి భార్య అంటే కేవలం భర్త చేతిలో ఓ కీలుబొమ్మ. తను చెప్పిన ప్రతిదానికీ తలాడించాలన్న వితండవాదం ! ఆమెకంటూ ఓ అభిప్రాయం, అభిరుచీ ఉంటాయన్న ఇంగితం ఏమాత్రం లేకపోవడం!  పైగా ఆమె చదువు, ఉద్యోగం -- ఇవన్నీ అతనికి చాలా అల్పంగా తో స్తున్నాయి. అది   ఆమెకు మరీ బాధాకరంగా అనిపిస్తోంది. 
    మైత్రి ఊహ తెలిసినప్పటి నుంచీ తనకంటూ ఓ వ్యక్తిత్వంతో పెరిగిన అమ్మాయి. మధ్యతరగతి కుటుంబం అయినా తల్లీ తండ్రీ  ఆమెను ఏనాడూ శాసించలేదు. అలా  అని ఆధునిక పోకడలూ ఆమెలో పెద్దగా ఏమీ లేవు. కాకపోతే ఆడపిల్ల అయినంత మాత్రాన ఆత్మాభిమానమన్నది ఎప్పుడూ కోల్పోరాదని ఆమె వాదం. ఆ మాటకొస్తే విశ్వమోహన్ వాళ్లదీ మధ్యతరగతి కుటుంబమే. కాకపోతే అతని తండ్రి ఉద్యోగ స్థాయి ప్రమోషన్ల వల్ల బాగా పెరగడం, ఆస్తులు కూడబెట్టుకోవడం, కూతురికి మంచి సంబంధం కుదరడం, దానికి తోడు చిన్న వయసులోనే విశ్వ  మోహన్ కు  గెజిటెడ్ స్థాయి ఉద్యోగం రావడం-- ఇవన్నీ వాళ్ల స్థాయిని ఇట్టే పెంచేశాయి. దాంతోపాటు వాళ్ల మనస్తత్వాలు  కూడా  దర్పాన్ని సంతరించుకున్నాయి. 
    మైత్రి  అభీష్టానికి పూర్తి వ్యతిరేకంగా విశ్వ మోహన్ ఉండడం ఆమెకు లోలోపల ముల్లు గుచ్చుతున్నట్లుగా ఉంది. రాను రాను అంతః సౌందర్యం ఎంత మాత్రమూ  లేని అతని బాహ్య  సౌందర్యం మీద ఓ రకమైన ఏవగింపు కూడా కలుగుతోందామెకు. 
    నిశ్చితార్థం అయ్యాక తను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్లింది. ఓసారి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగా లేదంటే అమ్మానాన్నలు కూడా వెళ్లి పరామర్శించి వచ్చారు. కానీ తాను మాత్రం ఒకసారి అతన్ని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే, 
" ఇప్పుడెందుకులే , పెళ్ళయ్యాక ఎలాగూ  తప్పదు కదా, " అంటూ దాటేశాడు. మరి ఈరూల్ నాకు మాత్రం వర్తించదా! అనుకుంది మైత్రి.  ఇలా ఆమె కొద్దిరోజులుగా ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే ఓ రాత్రి అనుకోని సంఘటన జరిగింది.
   ఆరోజు రాత్రి పదకొండయి ఉంటుంది. మైత్రి నాన్నగారు పడుకున్న వాడల్లా హఠాత్తుగా  గుండె పట్టుకొని లేచారు, నొప్పిగా ఉందంటూ. ఎంతకీ సర్దుకోక, తల్లీకూతుళ్లిద్దరూ భయంతో వణికి పోయారు. మైత్రే తేరుకుని, బయటికి వెళ్లి పొరుగున ఉన్నవాళ్ళ తలుపు తట్టి,విషయం చెప్పి, వాళ్ల సహాయంతో ఆ అర్ధరాత్రి ఆటోలో ఆయన్ని అతి కష్టం మీద ఓ ప్రైవేట్ హాస్పిటల్  కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. మరుసటి రోజు ఉదయం ఫోన్ చేసి, విశ్వమోహన్ కు విషయం చెప్పింది మైత్రి.
" అవునా, అలాగా... ఇప్పుడెలా ఉంది? పర్వాలేదుకదా? "
 అన్నాడతను. ఆ గొంతులో పెద్దగా ధ్వనించని ఆదుర్దా మైత్రిని కలవరపెట్టింది. రెండో రోజు సాయంత్రం వచ్చి, కాసేపు ఉండి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో మైత్రికి సహాయమేదైనా కావాలేమో అన్న యోచన అతనికి రాకపోవడం ఆమెను ఆశ్చర్యానికి లోనుచేసింది. 
   ఆయనకు హార్ట్ ఎటాక్ మొదటిసారి. ICU లో ఉంచారు. దగ్గరి బంధువులు కొందరు వచ్చి పరామర్శించారు.  మూడు రోజులు గడిచిపోయాయి. అలా ఉండగా నిన్న
 సాయంత్రం విశ్వ మోహన్ ఫోన్ చేసి చెప్పాడు, 
" మైత్రీ, రేపు సాయంత్రం మా అక్క కూతురు మొదటి పుట్టినరోజు ఫంక్షన్. చాలా గ్రాండ్ గా చేస్తున్నాం. నీవు తప్పకుండా రావాలి. మా వాళ్లందరికీ నిన్ను పరిచయం చేయాలి నేను. మర్చిపోకు, రేపు సాయంత్రం ఆరింటికల్లా వచ్చేయ్. ఇంటి దగ్గరే ఫంక్షన్..."
 మైత్రి  సమాధానం కోసం కూడా చూడకుండా పెట్టేశాడు  ఫోన్.  అతని ప్రవర్తనకు ఒక్కసారిగా మైత్రి మెదడంతా మొద్దుబారిపోయింది. ఇప్పుడు తానున్న పరిస్థితి ఏమిటి ! నాన్న కండిషన్ ఇంకా నార్మల్ కు రాలేదు. అమ్మ ఒక్కతే అన్నీ ఎలా చూసుకోగలదు ! ఈ  మనిషికి అసలు ఏ మాత్రమేనా ఆలోచన అన్నది ఉందా?  ఆమెలో సహనం నశించి, కోపం కట్టలు తెంచుకుంది. ఆ క్షణంలో ఆమెకు కొద్ది రోజుల క్రితం విశ్వ మోహన్ వాళ్ళింట్లో జరిగిన ఓ సంభాషణ తలపుకొచ్చింది. అవీ ఇవీ మాట్లాడుతూ ఉన్నట్టుండి విశ్వ  మోహన్ అమ్మగారు, 
" పెళ్లయ్యాక ఉద్యోగం చేస్తావా" అని అడిగింది. వెంటనే, పక్కనే ఉన్న అతని అక్కగారు అందుకుని, 
" ఎందుకు చేస్తుందమ్మా, తమ్ముడికి వచ్చేది చాలదా ఏమిటి! పైగా వాడికి ఇష్టం కూడా ఉండదు. పెళ్లైన వెంటనే మానిపించేస్తాడు చూడు " అనేసింది ఠపీమని. మైత్రికి గుండెల్లో రాయి పడినట్లయింది. అయినా తమాయించుకుని, 
" ఎందుకు మానేస్తా ఆంటీ, కోచింగ్ తీసుకుని సంవత్సరం పాటు కష్టపడి తెచ్చుకున్న జాబ్...." అంది వెంటనే. ఆ ఇద్దరూ మొహమొహాలు చూసుకుని మైత్రి వైపు అదోలా చూశారు. విశ్వ  మోహన్ అక్కడే ఉన్నాడు, కానీ పెదవి విప్పలేదు. మౌనంగా లేచి లోనికి వెళ్ళిపోయాడు. అది గుర్తొచ్చి ఆమె మొహం మ్లానమయింది. ఇంత సంకుచిత స్వభావం ఏమిటి వీళ్ళకి! అనిపించి తల పట్టుకుంది. తండ్రి అనారోగ్యం, తల్లి నిస్సహాయత ఓవైపు, భరించలేని మానసిక ఒత్తిడి మరోవైపు ఆ అమ్మాయిని స్థిరంగా నిలవనీయకుండా చేసేస్తున్నాయి.
   ఆరోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయమే మళ్లీ ఫోన్ చేశాడు. ఎత్తాలనిపించలేదు మైత్రికి. మళ్లీ మళ్లీ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ రింగవుతోంది. రగిలిపోతున్న మైత్రిలో ఏదో అలజడి. అందులో నుండే ఓ స్థిరమైన ఆలోచన  ! వెంటనే బ్యాగ్ నుండి సెల్ తీసింది.
" ఎన్ని సార్లు చేసినా ఫోన్ తీయ వేంటి? గుర్తుందిగా, సాయంత్రం త్వరగా వచ్చేయ్..." 
 అవతల విసుగ్గా విశ్వ మోహన్.
" సారీ, నాన్న ఇంకా కోలుకోలేదు, హాస్పిటల్ లోనే ఉన్నాం. అమ్మ ఒక్కతే చూసుకోలేదు. అయినా, ఈ పరిస్థితిలో తయారై ఫంక్షన్కు అటెండయే మూడ్  నాకు లేదు... సారీ.." గబగబా చెప్పేసింది.
"... అదేమిటి! రాకపోతే ఎలా?.. " మళ్లీ అతను
".. మరేమీ కాదు, రెండు రోజుల తర్వాత ఒకసారి కలుస్తాను.. బై.."
 ఇక అతని మాట వినిపించుకోకుండా పెట్టేసింది ఫోన్.
                          ***   ***  ***
   పార్కు దగ్గర ఆటో దిగి గేటు వైపు దారి తీసింది మైత్రి. నిశ్చితార్థం అయ్యాక మూడు నాలుగు సార్లు ఇద్దరూ ఇక్కడే కలుసుకున్నారు. ఎప్పుడూ తనే ముందుగా చెప్పిన టైం కు వచ్చి ఎదురు చూసేది. ఈరోజు విశ్వ   మోహనే ముందుగా వచ్చి కూర్చుని ఉన్నాడు. మైత్రి ని చూడగానే దిగ్గున లేచి, 
" ఏమిటి నువ్వసలు ! ఫోన్ చేస్తే పలకవు, మొన్న రానందుకు ఎంత డిసప్పాయింట్ అయ్యానో  తెలుసా,.. అందరి ముందూ అలుసైపోయేలా చేశావు.."
 కోపంగా, ఇంకా దబాయిస్తూ గట్టిగా అరిచేశాడు. 
"...ఆపుతారా,... " అతని వైపు చేయి చాపుతూ వెంటనే అడ్డుకుంది మైత్రి. ఇన్నిరోజులుగా ఆమెలో శాంతమే గానీ కోపమన్నది చూడని విశ్వమోహన్ ఠక్కున ఆగిపోయాడు. 
" ఎంతసేపూ మీ ధోరణే  గానీ ఇవతల నా గురించిన ధ్యాస ఉండదా  మీకు? మీరెక్కడికి ఎప్పుడు రమ్మంటే అప్పుడే వచ్చేయాలి, ఏమి చేయమంటే అది చేయాలి. ఏమిటి మీ వైఖరి!... నాకసలు నచ్చడం లేదు.."
".......................... "
" ఈ రెణ్ణెళ్లలో ఎన్నిసార్లు మీ ఇంటికి రమ్మన్నారో గుర్తుందా? మీ ఇష్టాలు, కోర్కెలు, అలవాట్లు పదే పదే చెప్పడమే గానీ నా అభిరుచులు చెప్తే అసలు పట్టించుకున్నారా? ఎంత సేపూ మీ అమ్మానాన్న మిమ్మల్ని ఎంత ప్రేమగా పెంచారో, ఎంత కష్టపడి చదివించారో, మీ పై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో చెపుతారు గానీ, మరి నా సంగతేమిటి? "
"....................................... "
 "చెప్తే ఒప్పుకోరు గానీ, మీ మగవాళ్ళందరి ఉద్దేశం ఏంటండీ? ఆడపిల్లల్ని  తల్లిదండ్రులు గాలికీ  ధూళికీ పెంచేసి ఉంటారనా? చెప్పాలంటే మగ పిల్లలకంటే ఆడపిల్లల్నే ఎంతో జాగ్రత్తగా, మరింత ప్రేమగా పెంచుకుంటారన్న విషయం ఎన్నడూ.. ఎన్నడూ.. మీ మనసు పొరల్లోకి కూడా దూరదు... "
 ఇన్నాళ్లూ ఎంతో మౌనంగా, అమాయకంగా కనిపించే మైత్రి లో ఈ మరో కోణం చూస్తూ విశ్వ మోహన్ చకితుడై అలా చూస్తుండిపోయాడు.  
" మీ అమ్మానాన్నల్ని గౌరవించాలి, బాగా చూసుకోవాలి అని చాలా సార్లు చెప్పారు మీరు. మరి నాకు లేరా అమ్మానాన్నలు ! వాళ్ళ సంగతేంటి?  వాళ్ళను కూడా మీరు అదే విధంగా గౌరవించాలని నేను ఆశించడం అత్యాశేమీ కాదు కదా !....."
"...................."
" మీకు సంబంధించిన ప్రతీ విషయానికీ నేను స్పందించాలని కోరుకున్నారు. మరి నేనూ అలాగే అనుకుంటానన్న ఆలోచన మీకు రాదా? హాస్పిటల్లో మా నాన్న పరిస్థితి అంత సీరియస్ గా ఉంటే నేను వదిలేసి మీ ఫంక్షన్ కు రావాలని ఎలా కోరుకుంటారు ! ఆ  సమయంలో నాకు మీ సహాయమేదైనా ఉంటే బాగుంటుందని నేను అనుకోవడం తప్పేమీ కాదు కదా! ఆ మాత్రం ప్రతిస్పందన మీనుండి నేనూ ఆశించవచ్చు కదా ! .. "
ఓక్షణకాలం ఊపిరి పీల్చుకుని, నిలబడలేక పక్కనే ఉన్న బెంచీ  మీద కూలబడింది మైత్రి.
 తేరుకున్న విశ్వమోహన్ మెల్లిగా తనూ కూర్చున్నాడు.
" అది కాదు మైత్రీ .. " అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ, మైత్రి అతని వైపు స్థిరంగా చూస్తూ, 
" ఎందుకో మన ఇద్దరికీ పొసగదనిపిస్తోంది. సారీ, ప్రతిదానికీ ఇలా వ్యక్తిత్వమన్నది లేకుండా గడపడం నాకు సాధ్యం కాని పని.."
 అతని మొహంలో రంగులు మారాయి.
".... మా అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే. వాళ్లను చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. చూసుకుంటాను కూడా. కానీ మీ వైఖరి నాకా భరోసా కల్పించడం లేదు. బ్రతుకంతా గొడవ పడుతూ భరించడం నా వల్ల కాదు...."
 లేచింది మైత్రి. వెంటనే ఏదో గుర్తొచ్చి, 
" మరో విషయం. నా జాబ్ గురించి మీకు నేను స్పష్టత నివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను జాబ్ మానేసే ప్రసక్తి అంటూ ఉండబోదు... "
" ఆగు మైత్రీ,  ఆలోచించు, మనకు నిశ్చితార్థం కూడా అయింది..."గొంతు పెగుల్చుకుని అన్నాడు విశ్వమోహన్. 
" అయింది నిశ్చితార్థమే , పెళ్లి కాదు. ఒకవేళ పెళ్లయ్యాక ఇలా జరిగినా నేనిలాగే మాట్లాడేదాన్ని.." 
స్థిరంగా అంది మైత్రి.   
" మరోసారి ఆలోచించమంటున్నానుగా.. "
" ఆపని చేయాల్సింది మీరు. ఇన్ని  రోజులుగా మీరు ప్రవర్తించిన తీరు గుర్తుకు తెచ్చుకొని ఓసారి ఆత్మవిమర్శ చేసుకొని చూడండి. మీరు కరెక్టే అని మీకు అనిపిస్తే మళ్లీ నన్ను కలిసే   ప్రయత్నం  చేయకండి ప్లీజ్.." 
 సూటిగా అతని వైపు ఓసారి చూసి, వెనుదిరిగి వడివడిగా అడుగులేస్తూ గేటు దాటి వెళ్ళిపోయింది మైత్రి. వెళ్తున్న ఆమెనే  చూస్తూ, 
"  మై గాడ్, అమ్మాయిలు ఇలా కూడా మాట్లాడతారా! "
 అనుకుని విస్తుపోవడం విశ్వమోహన్ వంతై అలా కూర్చుండిపోయాడు. ఇన్ని  రోజుల తన ప్రవర్తన తీరుకు ఇది మైత్రి ప్రతిస్పందనలా తోచిందతనికి. మరుక్షణమే అతనిలో ఎక్కడో ఏదో మూల మెల్ల మెల్లగా అంతర్మధనం మొదలైంది.

                   ****************************************

                  























Friday, November 1, 2024

అందానికే నిర్వచనం నీవు...!!

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


 అందానికి అందం నీవు...
 అందానికే నిర్వచనం నీవు...
 నయనాలకు ఆహ్లాదం... 
 ఆస్వాదించే  హృదయానికి 
 అమితానందం...
 అందించే అరుదైన
 అరవిందానివి నువ్వు... 
 ఓ గులాబీ!
 కళ్ళు చెదిరేలా... 
 భానుడు ఈర్ష్య పడేలా.... 
 ఆ ఎరుపువర్ణం...!
 నీ ఆత్మ విశ్వాసానికి ప్రతీక !
 ఆకృతి చూడ అదో 
 తిరుగులేని ప్రత్యేకత !!
 ఆపై... వలయాలై...
 సుడులు తిరుగుతూ 
 ఆ పూరేకుల అమరిక...!
 పచ్చదనం సింగారించుకున్న నీ కొమ్మలు 
 చిరుగాలిని పలుకరిస్తే చాలు...
 నీలో  దాగిన సుగంధ పరిమళాలు 
 రెక్కలొచ్చి పలుకుతాయిగా స్వాగతాలు...
 ఇట్టే మూగుతాయి చుట్టూ రంగురంగుల 
 సీతాకోకచిలుకలు...!!
 పరిసరాలకు నీవో పసిడి ఆభరణం 
 చూపరులకు అద్భుతం !!
 ఎంత చూసినా..
 తరగని..తనివి  తీరని 
 సోయగం నీది కదా  !!
 అందుకే... అందానికి అందం నీవు!
 అందానికే నిర్వచనం నీవు...
 అతివలకే కాదు సఖివి...
 అవనిపై అందరికీ...!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Saturday, October 26, 2024

నా అందం నాది... నా ప్రత్యేకత నాది...!

 🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

                                              ~ యం. ధరిత్రీ దేవి 
చెత్తాచెదారం...చుట్టుముడుతూ 
పిచ్చిగా అల్లుకున్న కొమ్మలూ..రెమ్మలు..!
ఆపై కంపచెట్లు...!ఆ నడుమ నిలబడి...
బిక్కు బిక్కు మంటూ  ఔషధ మొక్క...!
ఓ తెల్లని పుష్పంతో ఒంటరిగా ...!!
'అయ్యో పాపం!' అనుకునేంతలో...
" అనాధను కాను నేను... 
ఏకాకిని అంతకన్నా కాదు...
నా చుట్టూ పచ్చని మొక్కలు...నా నేస్తాలు...
కంపచెట్లు...నాకు రక్షణ వలయాలు...!
చెత్తాచెదారమా...నన్నేమీ చేయలేదు...
నా అందం నాది...నా ప్రత్యేకత నాది...
నా ఉనికిని గుర్తించి...నాకోసం నా చుట్టూ 
పరిభ్రమించే ఈ తుమ్మెదే సాక్షి... "
అనేసింది కిలకిల నవ్వుతూ ఆ 'ఉమ్మెత్త '...!!
నిజం తెలిసి...తెల్లబోయి 
తేరుకొని శృతి కలిపా... 🙂

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

Thursday, October 24, 2024

నువ్వు నాకు నచ్చలేదు...

🌷

      సాయంత్రం నాలుగు గంటలకు ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని,ఇల్లు చేరుకున్నాడు నూతన్ కుమార్  . ఇంట్లో అంతా అప్పటికే రెడీ అయి ఉన్నారు. అతను రాగానే పది నిమిషాల్లో బయటపడి కారెక్కి  బయలుదేరారు. మరో పావు గంటలో ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంతకీ ఆ ఇల్లు నూతన్ కుమార్  కోసం పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళిన ఇల్లు.
    అతనికి ఇదేమీ  కొత్త కాదు.మొదటిదీ కాదు. పదిహేనవది ! అతనో  సాఫ్ట్ వేర్  ఇంజనీర్. మంచి పేరున్న కంపెనీలో లక్ష పైగానే అందుకుంటున్నాడు.  పైగా  ఒక్కడే కొడుకు. ఆస్తిపాస్తులూ దండిగానే ఉన్నాయి. ఇక చెప్పేదేముంది! అతని చూపులు నేల మీద ఉండడం లేదు. extraordinary expectations  ! పోనీ... ఏమైనా గొప్ప అందగాడా అంటే...జస్ట్..యావరేజ్..! పొడవు అంతంత మాత్రమే. చామన ఛాయ..చిరుబొజ్జ! పల్చని జుట్టు! ఇదీ అతని పర్సనాలిటీ !
   ఉద్యోగంలో చేరి, సంవత్సరం గడిచాక, మొదటిసారి ఓ సంబంధం తెలిసిన వాళ్ల ద్వారా వస్తే చూడడానికి వెళ్లారు. అమ్మాయి చక్కగా ఉంది. తనూ సాఫ్ట్ వేర్ ఇంజనీరే. మంచి రంగు, ఒడ్డు పొడుగూ...సుపర్బ్ గా ఉంది. కానీ, వెంటనే నచ్చింది అని చెప్పడానికి అహం అన్నది అడ్డొచ్చి... ఇంటికి వెళ్లి కబురు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. మొదటి సంబంధమే చక్కగా ఉన్నందుకు కొడుకు అదృష్టానికి మురిసిపోయారు తల్లిదండ్రీ. తీరా.. అతని 'రెస్పాన్స్' చూడగానే ఆలోచనలో పడ్డారు.  
" ఏమిటో నాన్నా, అంతా బాగుంది కానీ, ఇల్లే నాకంతగా  నచ్చలేదు. ఆ మర్యాదలూ అంతంత మాత్రమే..మనకొద్దమ్మా..."
 సరే అనుకొని మౌనంగా ఉండి పోయారు తల్లిదండ్రులు. అలా అలా..మరో నాలుగు సంబంధాలు తెలిసిన వాళ్ల ద్వారానే వచ్చాయి. బ్యాంకు ఉద్యోగిని కలర్ తక్కువ అన్నాడు. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ ను మరీ లావుగా ఉందన్నాడు. మరొకరేమో 'ముదురు' అన్నాడు. అతని వాలకం కనిపెట్టిన బంధుమిత్ర వర్గం చేతులెత్తేశారు. మరో సంవత్సరం ఖాళీ. 
 ఇక లాభం లేదనుకుని, మ్యారేజి బ్యూరోలను సంప్రదించారు. వాళ్ల దగ్గర కొదవేముంటుంది సంబంధాలకి...! కదిలిస్తే చాలు.. కోకొల్లలుగా గుప్పిస్తారు. వాళ్లకు కావాల్సింది 'కమిషన్' ! అంతే. లెక్కకుమిక్కుటంగా చూపించిన మ్యాచెస్ లో ఏది ఎన్నుకోవాలో తెలియక, తల్లిదండ్రుల్నీ, తన కజిన్ సిస్టర్స్ ఇద్దర్ని కూర్చోబెట్టుకుని ఎట్టకేలకు అందరి సూచనల మేరకు  ఓ నాలుగైదు సెలెక్ట్ చేశాడు నూతన్.  వరుసగా మొదలెట్టి ఓ నెలలోపు అన్నీ చుట్టబెట్టేశారు. 
    అప్పుడైనా ఓకే అన్నాడా..! ఒకరు పొట్టి అన్నాడు, ఒకరేమో... ఫోటోలో ఉన్నట్టుగా లేదన్నాడు. ఇంకో అమ్మాయి...అంతా బాగుంది కానీ.. పళ్ళు ఎత్తు అన్నాడు. మంచి ఉద్యోగాలు. స్థితిమంతులు, సంస్కారం కలిగిన కుటుంబాల వాళ్లే...  అయినా... అతని కంటికి మాత్రం ఆనలేదు. అతని విపరీత ధోరణికి అతని ఇద్దరు కజిన్స్ తన పట్టుకొని గుడ్ బై చెప్పేశారు. తమ 'అన్న' అన్నవాడి అందచందాలు, శక్తి సామర్ధ్యాలు తామెరుగనివేమీ  కాదు. వాళ్లకు విచిత్రంగా తోచిందేమిటంటే... చూసిన అమ్మాయిలందరినీ ఇతనే వద్దంటున్నాడు... అమ్మాయిలు అన్ని క్వాలిఫికేషన్ లు  ఉండి కూడా కిమ్మనకుండా ఉంటున్నారు. మరోవైపు... సర్వేలేమో.. అమ్మాయిల సంఖ్య తక్కువ అయిపోయింది.. అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదంటూ ఒకటే ఘోషిస్తున్నాయి..!! దానికీ, ప్రస్తుతం జరుగుతున్న తతంగానికీ లంకె అసలు కుదరడం లేదు..పాపం ! ఇద్దరూ అమ్మాయిలేగా..! పైగా పెళ్లికావలసిన వాళ్ళు! అర్థం గాక  (దిక్కుతోచక) ఆలోచనలో పడిపోయారు !
 తల్లికి,  తండ్రికీ కూడా విసుగొచ్చి చేతులు ముడుచుక్కూర్చున్నారు. ఎవరికితప్పినా బ్యూరో అతనికి తప్పదు కదా ! ఇంకా లోతుగా వెతికి వెతికి...ఓ సంబంధం చూపించాడు. 
    పరవాలేదు, మరీ అంత అందగత్తె కాకపోయినా, అమ్మాయి లక్షణంగానే ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తోంది. మంచి జీతం. మంచి కుటుంబం! ఇద్దరూ ఒకే ఫీల్డు. బాగుంటుందని తల్లీదండ్రీ మొగ్గు చూపారు. ఈసారైనా ఇది కుదురుతుందన్న ఆశతో వెళ్లి చూసొచ్చారు. 
" అమ్మా, అంతా బాగుంది.. కానీ, నాకంటే నెలరోజులే చిన్నది.ఎలాగమ్మా... !"
" ఒక్కరోజైనా చిన్నదే కదరా.. అంతా బాగుంది. ఎన్ని చూశాము! అన్నింటిలోనూ ఇది మాకు బాగా నచ్చింది.ఓకే చెప్పేద్దాము... "
అన్నారు ఇద్దరూ. 
" సరే, నాక్కాస్త టైం ఇవ్వండి.. ఆలోచిస్తాను.. "
అంటూ బయటికెళ్లిపోయాడు  నూతన్. అతనాలోచించటానికి నెల పట్టింది. అయినా, గుంజాటన తెగలేదు. ఈలోగా అమ్మాయి తండ్రి ఏ సంగతీ చెప్పండని ఫోన్ చేశాడు. సరిగ్గా అప్పుడే బ్యూరో అతను 'మరోటి' చూపించాడు. సరే.. ఏముంది...చూసొద్దాం..ఏది బాగుంటే అదే ఓకే చేద్దాం .. అనుకుంటూ ముగ్గురూ వెళ్లారు. తీరా చూస్తే మునుపటివే బెటర్ అనిపించి ఉసూరుమంటూ  తిరుగు ముఖం పట్టారు.
   సరే..క్రితం చూసిన అమ్మాయి తండ్రికి ఫోన్ చేద్దామనుకుంటుండగా...అనుకోని విధంగా బాగా దగ్గరి చుట్టం వచ్చి ఓ సంబంధం చెప్పాడు. తెలిసినవాళ్లయితే బాగుంటుంది కదా అని బిలబిలమంటూ వెళ్లారు. ఇదిగో.. ఈరోజు వెళ్ళింది ఆ సంబంధం కోసమే..! ఇది పదిహేనోది.
    ఫలహారాలు, కాఫీలు పూర్తయ్యాక, అమ్మాయిని చూపించారు. కళ్ళు తిరిగాయి ముగ్గురికీ. పొట్టిగా, నల్లగా, బాగా బొద్దుగా ఉండి... 'బాబోయ్' అనుకున్న వాళ్ళ మొహాలు ఒక్కసారిగా వాడిపోయాయి. గతంలో చూసిన సంబంధాల తాలూకు అమ్మాయిలంతా కళ్ళముందు కదిలి, వెక్కిరించినట్లయింది  వాళ్లకి ! 
     చివరాఖరికి...వాళ్లకు బోధపడిన నగ్న సత్యం.. అబ్బాయికి గానీ, అమ్మాయికి గానీ, మొదట్లో వచ్చే సంబంధాలే భేషైనవి...సరైనవి.. ఇంకా ఇంకా చూద్దామనుకుంటే, కాలం గడిచే కొద్దీ, వయసు పెరిగిపోయి, తమ ప్రమేయం లేకుండానే శరీర ఆకృతులు మారిపోయి, ఇదిగో ఇలా...ఏదో ఒకటిలే అని సర్దుకుపోయే పరిస్థితి దాపురిస్తుంది...!
 ముగ్గురి కళ్ళు తెరిపినబడి, ఇంటికి వచ్చి చతికిలబడ్డారు. అప్పుడు జ్ఞానోదయమై, తీర్మానించుకుని,  క్రితంచూసిన  పదమూడవ సంబంధం..అదే..సాఫ్ట్వేర్ ఉద్యోగిని తండ్రికి ఫోన్ చేశారు.
" మీ అమ్మాయి మాకు నచ్చిందండీ.  ఓ మంచి రోజు చూసుకుని మీ ఇంటికి వచ్చి, అన్ని విషయాలూ మాట్లాడుకుందాం అనుకుంటున్నాం.."
 పెళ్ళికొడుకు తండ్రి గొంతులో ధీమా గమనించిన అమ్మాయి తండ్రి, 
" అలాగాండీ, సంతోషం. ఒక్క నిమిషం...మీ అబ్బాయి అక్కడే ఉండి ఉంటే, ఓసారి ఫోన్ అతనికివ్వండి. మా అమ్మాయి మాట్లాడుతుందట..."
అన్నాడు. ఓసారి అయోమయంగా చూసి, కొడుక్కి ఫోన్ ఇచ్చాడాయన. 
" హలో.. నూతన్ కుమార్  గారూ.. నేను మీకు నచ్చినందుకు చాలా సంతోషమండీ. ఈ మాట చెప్పడానికి రెండు నెలల సమయం కావాల్సొచ్చింది  మీకు..! కానీ...for your information... sorry to say... మీరు నాకు నచ్చలేదు..."
 ఓ క్షణం ఆగి, 
"...ఒక్కమాట..! ఏమీ అనుకోకండి. అడక్కపోయినా ఓ చిన్న సలహా.. పెళ్లిచూపులకి వెళ్ళే ముందు.. మీ ఇంట్లో నిలువుటద్దాలు ఉండే ఉంటాయి..వెళ్లి దాని ముందు నిలబడి, ఓసారి మిమ్మల్ని మీరు పరీక్షగా, తదేకంగా, పరకాయించి చూసుకోండి.."
"..................."
"...అమ్మాయి నా పక్కన నిలబడితే బాగుంటుందా లేదా అని కాదండీ...అమ్మాయి పక్కన నిలబడ్డప్పుడప్పుడు నేను బాగుంటానా లేదా అని ఆలోచించుకుంటే మంచిది..."
 ఊహించని ఉత్పాతానికి బుర్ర గిర్రున  తిరుగుతుండగా...
"...బై ది బై...నా పెళ్లి సెటిల్ అయిపోయిందండీ.. రెండు వారాల్లో ముహూర్తం..! once again..నేను మీకు నచ్చినందుకు సంతోషం.. కానీ..too late  !మీరే నాకు నచ్చలేదు. Bye.. bye forever.. "
ఫోన్ కట్ అయింది. మ్రాన్పడిపోయి, సోఫాలో కూలబడిపోయాడు నూతన్ కుమార్. మాటిమాటికీ అతని చెవుల్లో.. నువ్వు నాకు నచ్చలేదు... నువ్వు నాకు నచ్చలేదు.. అన్న ఆ అమ్మాయి మాటలే ప్రతిధ్వనించసాగాయి.'ఆలస్యం అమృతం విషం' అన్న చందాన అయిందాతని పరిస్థితి ! అదే క్షణంలో, ఎందరు అమ్మాయిల్ని ఇదే విధంగా తాను  క్షోభ  పెట్టి ఉంటాడో తలపుకొచ్చి, అతని తల వాలిపోయింది. 

**************************************.






     


Wednesday, October 16, 2024

దానగుణం మంచిది కాదా !


  🌺గేటు దగ్గర అలికిడి వినిపించి వంటింట్లోంచి అరుంధతి ముందు గదిలోకి వచ్చి తొంగి చూసింది. గేటు  అవతల ఓ ఆడ  మనిషి!  పొట్టిగా, ఓ మోస్తరు లావుగా, నేత చీరలో ,  జుట్టు ముడి వేసుకుని ఉన్న యాభై ఏళ్ళు పైబడ్డ ఆవిడ నిలబడి చూస్తోంది. వెంటనే గుర్తుపట్టింది అరుంధతి ఆవిణ్ణి చూడగానే. అంతలోనే ఒక్కసారిగా ఆమెలో విసుగు తలెత్తింది. 
    దాదాపు రెండు సంవత్సరాలవుతుందేమో, మూడు నాలుగు నెలలకోసారి వస్తుంది. ఏదైనా వస్త్రం ఇవ్వమని అడుగుతుంది. వస్త్రం అంటే  ఆమె భాషలో చీర అని అర్థం. మొదట్లో అడగంగానే వెంటనే లోనికెళ్లి ఓచీర  తెచ్చి ఇచ్చేసింది అరుంధతి. అంతే! అలా అలా అలవాటయిందామెకు. ఈమే  కాదు, మరొక ఆవిడ కూడా ఇలాగే రెగ్యులర్ గా  రావడం, వచ్చినప్పుడల్లా చీర అడగడం -- అరుంధతి ఇవ్వడం మామూలైపోయింది రాన్రానూ. ఎవరైనా ఇలా ఇంటికి వచ్చి  ఏదైనా అడిగితే లేదన లేకపోవడం అరుంధతి బలహీనత. పైగా ఆమెకున్న దయాగుణం దీన స్థితిలో ఉన్న వాళ్ళకి దానం చేయాలని ప్రేరేపిస్తుంది కూడా. అదామె స్వభావం! అంతవరకూ బాగానే ఉంది, కానీ ఈ మధ్య ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఆమెకు అదో విధమైన అసహనం, చిరాకు కలుగుతోంది. కారణం -- అరుంధతి బలహీనతను బాగా కనిపెట్టారేమో, ముఖ్యంగా ఆ ఇద్దరు ఆడవాళ్లు! అడపాదడపా రావడం, తప్పనిసరిగా చీర అన్నది ఇచ్చేదాకా వదలక పోవడం, మొండికి  పడడం చేస్తుంటే, రాన్రాను అరుంధతిలో సహనం నశించి పోతోంది. ఏమిటి వీళ్ళు ! ఇస్తే తీసుకోవాలి, అంతేగానీ ఇలా విసిగించడంఏమిటీ !  పైగా ఓ వేళా పాళా ఉండదు వీళ్ళరాకకి ! ఒక్కోసారి ఉదయమే ఇంటి పనుల్లో మునిగిపోయి  ఉన్నప్పుడు, మరోసారి భోజనాలయిపోయి, అలసిపోయి కాస్త నడుం వాల్చి విశ్రాంతిగా కునుకు  తీస్తున్నప్పుడు దబ్బున  గేటు చప్పుడు చేయడం, పిలవడం! లేచి వచ్చేదాకా పిలుస్తూనే ఉండడం,  ఏదో ఒకటి చేతిలోపెట్టేదాకా కదలకపోవడం ! క్రమంగా ఈ వ్యవహారం ఆమెకు తలనొప్పిగా పరిణమించి పోయింది. ఇంట్లో ఉన్న పాత చీరలు ఏం చేసుకుంటాం, ఇలా ఇస్తేనన్నా మరొకరికి ఉపయోగపడతాయి కదా అన్న ఆలోచనతో తానిలా  చేస్తే వీళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని, అలవాటు  చేసుకుని తననిలా బాధపెడతారని  ఆమె ఊహించలేకపోయింది పాపం! అందుకే బాగా ఆలోచించి, ఈమధ్యే  ఓ నిర్ణయం తీసుకుంది,  ఇకపై ఇలా ఇంటి వద్దకొచ్చి అడిగే వాళ్ళకి చీరలు గీరలు అసలు ఇవ్వకూడదని! ఎలాగైనా ఆ మాటకు కట్టుబడి ఉండాలని స్థిరంగా అనుకుంది కూడా. ఈరోజు గేటు వద్ద ఆవిణ్ణి చూడగానే ఆ నిర్ణయం గుర్తొచ్చి, వెంటనే బయటికొచ్చేసి, చెప్పేసింది, 
" చూడమ్మా, చాలా ఇచ్చాను నీకు, వచ్చిన ప్రతిసారీ ఇవ్వాలన్నా, ఇచ్చే తీరాలన్నా కుదిరేపనిగాదు. పైగా నీవు ఒక్కత్తివే కాదు, ఇంకా ఇలా వస్తూనే ఉంటారు, ఎందరికని  ఇవ్వను!... ఇక నీవు వెళ్ళవచ్చు.. " 
 గట్టిగానే చెప్పేసి, లోనికి వెళ్ళిపోయింది. కానీ ఆమె వింటేగా! అలాగే నిలబడి మళ్లీమళ్లీ అడగడం మొదలెట్టింది. అరుంధతి లోపల్నుండే  మళ్ళీ గట్టిగా చెప్పింది, వెళ్లిపొమ్మని. కానీ ఆమె మాత్రం వినిపించుకోకుండా అలాగే నిలబడింది యథాప్రకారంగా. అరుంధతిలో కోపం కట్టలు తెంచుకుంది, అయినా తమాయించుకుని, 
" ఎన్ని సార్లు చెప్పాలి, వినిపించదా?... " అంటూ బయటకొచ్చేసింది. అంతే! ఆమె కోపంగా చూస్తూ మెట్లు దిగుతూ, 
" ఏ, పోయేప్పుడు కట్టుకుని పోతావా?....... "
 అంటూ అంతకంటే కోపంగా గట్టిగా  అరుస్తూ గొణు క్కుంటూ  విసవిసా వెళ్ళిపోయింది. ఒక్కసారిగా అరుంధతి అవాక్కై స్థాణువై నిలబడిపోయింది. 
" ఏమిటి! ఇన్నాళ్ళూ నేను ఇచ్చిందంతా ఏమైపోయింది? అదేమీ పట్టదా ఇలాంటి వాళ్ళకి! ఒక్కసారి లేదు పొమ్మంటే చాలు ఇలా అనేయడమేనా!"
  మదనపడుతూ మెల్లిగా లోనికి కదిలింది. ఇదంతా లోపల్నుండి గమనిస్తూన్న ఆమె భర్త ఈశ్వరరావు, అరుంధతి మ్లానవదనం చూస్తూ, 
" ఏమిటీ, ఫీలవుతున్నావా ! అసలు పొరపాటు నీది. వాళ్లకు అలవాటు చేసింది నువ్వు! ఏదో అపర దానకర్ణుడి  చెల్లెల్లా ఇలా అడిగినోళ్లందరికీ  దానాలు చేస్తూ పోతే ఇలాగే ఉంటుంది మరి!..."
 అసలే బాధలో ఉన్న అరుంధతికి ఈ మాటలు ముల్లులా గుచ్చుకున్నాయి. 
" అంటే దానం చేయడం తప్పా? "
" దానం చేయడం తప్పు కాదు, అపాత్రదానం తప్పు. నీవు గమనించినట్లు లేదుగానీ ఆ ఇద్దరు ఆడవాళ్ళ తీరు చూస్తే వాళ్లు  మరీ అంత దయనీయస్థితిలో ఉన్నట్లుగా అనిపించలేదు నాకు. మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే వాళ్ల స్థితిగతుల్ని కూడా గమనించాలి మరి!.."
 అంటూ చిన్న సైజు క్లాసు పీకాడు. అంతలోనే అరుంధతి చిన్నబు చ్చుకున్నట్లు గమనించి, 
"చూడు, జరిగిందేదో జరిగింది, ఇకపై ఇలాంటి వాళ్ల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే, ఇచ్చి చెడ్డ గావడం కంటే ఇవ్వకుండా చెడ్డ కావడం మేలనుకుంటా... "
 చిన్నగా నవ్వుతూ, వాతావరణాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశాడు.మళ్ళీ అందుకుని, 
"... నీకు అంతగా ఇవ్వాలనిపిస్తే ఏదైనా వృద్ధాశ్రమానికి అప్పుడప్పుడూ వెళ్లి వాళ్లకి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ పద్ధతి బాగుంటుంది, నీకు సంతృప్తి, సంతోషం దక్కుతాయి, " 
 అంటూ ఓ సలహా ఇచ్చాడు. అదేదో బాగున్నట్లు అనిపించింది అరుంధతికి. అయినా  రాను రాను మనిషిలో మంచితనం ఉండడం కూడా తప్పేమో అనిపించిందామెకి ఆ క్షణాన  ! ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చి, ' దేవుడా' అనుకుంటూ తల పట్టుకుని కుర్చీలో కూల బడింది.
               **    **     **     **    **
    ఇది అరుంధతి అనుభవమే కాదు, నా  అనుభవం కూడా.అంతే కాదు, ఇంకా మరికొందరు కూడా ఇలాంటివి ఎదుర్కొనే  ఉంటారు. ఇలా జరిగినప్పుడు నిజంగానే అనిపిస్తుంది, దాన గుణం మంచిది కాదా అని! 
   ఈ సందర్భంగా చిన్నతనంలో బళ్ళో  చదువుకునేటప్పుడు మా తెలుగు మాస్టారు చెప్పిన ఓ పిట్ట కథ గుర్తొస్తోంది  నాకు. ఓ ఊర్లో ఓ  యాచకుడు ఉండేవాడట. అతను ప్రతి రోజూ  ఆ ఊర్లోని అన్ని వీధులు తిరిగి ముష్టి ఎత్తుకునే వాడట. ఎవరు పెట్టినా పెట్టకపోయినా ఓ ఇల్లాలు మాత్రం ఖచ్చితంగా అతనికి బిక్షం వేసేదట ! ఓ రోజు పాపం, ఆమెకు చేయి ఖాళీ  లేకనో, లేక సమయానికి  పెట్టడానికి ఏమీ లేకనో అతనికి ఏమీ  పెట్టకనే  పొమ్మందట! అంతే! ఆ యాచ కుడు వెంటనే, 
"  రోజూవేసే..... దీనికే మాయ రోగం వచ్చిందోఇయ్యాళ !...." 
 అంటూ పైకే అనేసి గొణుక్కుంటూ  వెళ్ళిపోయాడట! ఆ మాటలు ఆ ఇల్లాలి చెవిని పడనే పడ్డాయి. హతాశురాలైపోయిందటావిడ, ఆ బిచ్చగాడి ప్రవర్తన చూసి ! 
 అదే మాస్టారు మరోసారి మరో యాచకుని  గురించి చెప్పారు. అతను ఆ  ఊర్లో ప్రతిరోజూ మూడే మూడు ఇళ్లకు యాచనకు వెళ్తాడట ! ఆ మూడిళ్ల వాళ్ళు ఏదైనా పెడితే తింటాడు, అంతే! మరుసటిరోజు మరో మూడిళ్లకు వెళ్తాడట. ఆ రోజు వాళ్ళు ఏమీ పెట్ట లేదనుకోండి, తలవంచుకుని మౌనంగా వెళ్ళి పోయి, ఖాళీ కడుపుతో పడుకుండి పోతాడట ! అది  అతని అలవాటు, స్వభావం! ఇంకా చెప్పాలంటే, ఓ రకమైన'పాలసీ' కి కట్టుబడి ఉండడం! అప్పట్లో  ఏమీ తెలియలేదు గానీ, తర్వాత్తర్వాత కొన్ని ఉదంతాలు జరిగాక తెలిసొచ్చింది ఇలా యాచకుల్లోనూ రకాలుంటారని ! 
   ఇంతకీ దానగుణం మంచిదా కాదా?  మంచిదే, కానీ ఏదీ  మితిమీరి ఉండకూడదు. విజ్ఞులు ఏమంటారో ఏమో గానీ, ఆయా మనుషుల్ని బట్టి కూడా మనం  మారుతూ ఉండాలి అన్నది స్వానుభవంతో తెలుసుకున్న నా అభిప్రాయం ! కాదంటారా !

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
                   




Friday, October 4, 2024

అమ్మ గురించి పాప...

         

   🌺🌺 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

   పసిపాపకు పాలిచ్చి జోకొడుతూ నిద్రబుచ్చుతుంది తల్లి.అది పాలు తాగే పసిపాపల వరకే వర్తిస్తుంది. అందులో ఆ అమ్మ శ్రమ ఉంటుంది, కానీ... కొంతవరకే...! అయితే... రెండు నుండి ఐదేళ్ల పిల్లల విషయంలో  అది మాత్రమే సరిపోదు. వాళ్లకి అన్నం తినిపించడమన్నది ఆ తల్లికి...అబ్బో!! చాలా కష్టంతో కూడుకున్న తతంగమే...! ఒకచోట కూర్చోరు... ఒకచోట నిలబడరు... అటూ ఇటూ పరుగులు! దాక్కోవడాలు !! అంతేనా.. ఇంకా ఎన్నో ఎన్నెన్నో... చిలిపి చేష్టలు...! అలాగని బుజ్జి తల్లి కడుపు నింపకుండా ఆ తల్లి ఉండగలదా !

    ఎన్నో ఊసులు చెప్తుంది... ఏవేవో కబుర్లు చెప్తుంది... ఉన్నవీ లేనివీ కల్పించి కాసేపు మైమరపిస్తుంది. ఏదైతేనేం... ఆకాస్త  బువ్వ బుజ్జిదాని కడుపులోకి వెళ్లేదాక ఊరుకోదుగా...! ఆ సహనమూర్తికి జోహార్లు అర్పించాల్సిందే..!
   ప్రతి స్త్రీ తన జీవితంలో ఎదుర్కొనే ఓ తీపి అనుభవం ఇది...కాదంటారా!ఆ బుజ్జితల్లి రేపు తానూ తల్లిగా మారినపుడు..తన పాపకు అలాగే తినిపించాల్సి వచ్చినప్పుడు...ఆ తల్లికి  ఒకనాటి తన తల్లి పాట్లు, పాటలు గుర్తుకు రాక మానవు.ఒకనాటి తన అల్లరి, తల్లి మురిపెం ఆమె పెదాలపై చిరునవ్వు చిందించక మానదు.తనలో నిక్షిప్తమై దాగివున్న ఆ జ్ఞాపకాల దొంతర..అలా అలా కదిలి...ఇలా ఓ పాటగా ఎలా మారిందో వినండి... 🙂





       అమ్మ నాకు తినిపించే 
       అల్లిబిల్లి కబుర్లతో 
       ఆకాశం చూపిస్తూ 
       అపరంజిని నేనంటూ    //అమ్మ//👧

        ఇలకు దిగిన ఇలవేల్పునట 
        ఈశ్వరవరప్రసాదినట 
        ఉన్నదంత నాదంటూ 
        ఊర్వశినీ నేనంటూ        //అమ్మ//🤱

        ఎన్నడూ లేదంట 
        ఏలోటూ నాకంట 
        ఐశ్వర్యం నాదంటూ         
        ఐశ్వర్యను నేనంటూ       //అమ్మ//👧

        ఒరులెవరూ సాటిరారంట 
        ఓనాటికి నేనవనికి 
        ఔతానట మహారాణిని 👧
        అందలాలు ఎక్కేనట 
        అః !అహహ !! 
        నేనే ఒక నియంతనట !!  //అమ్మ//


🤗

   ఎప్పుడూ పాప గురించి అమ్మ చెప్పే కబుర్లేనా...! ఓసారి అమ్మ గురించి పాప చెప్పే కబుర్లు వింటే ఎలా ఉంటుంది...! ఆ ఆలోచనతో ఓ చిన్న ప్రయత్నం చేశానంతే 🙂
    తల్లి అయిన ప్రతి స్త్రీకి ఇది తప్పనిసరిగా ఎదురయ్యే అనుభవమే... మరపురాని జ్ఞాపకమే...! బిడ్డకు జోల పాడి నిద్ర బుచ్చడానికి ఆ తల్లి గొప్ప సింగరే అయి ఉండాల్సిన అవసరం లేదు కదండీ..! అమ్మ ఎలా పాడినా పాపకు ఇష్టమే. హాయిగా కళ్ళు మూసుకుని  నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటుంది. అదండీ...🙂🤱
         .
    మరొక విషయం... ఈ బాల గేయాన్ని గమనిస్తే, ప్రతి లైన్  లోని మొదటి పదంలోని మొదటి అక్షరం మన తెలుగు వర్ణమాలలోని అచ్చులు... అ నుండి అః వరకు కనిపిస్తాయి. చాలా కాలం క్రితం చిన్నపిల్లల కోసం నేను రాసుకున్న పాట ఇది. ఈ పాట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ తరగతుల విద్యార్థులకు నేర్పించడానికి అనువుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాను. 
 అందరికీ ధన్యవాదాలు.
*******************************